జలయజ్ఞానికి నామమాత్రపు నిధులు
సోమశిల, పెన్నా, సంగం బ్యారేజీల నిర్మాణం కష్టమే
సాక్షి, నెల్లూరు: ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి నాల్గోసారి ప్రవేశ పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంకెల గారడీ అనే విమర్శలు వెల్లువెత్తాయి. పాత లెక్కలు మార్చి మసిపూసి మారేడుకాయ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్థికమంత్రి జిల్లా వాసైనప్పటికీ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు పలు ప్రధాన అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు నామమాత్రమే. పురోగతిలేని జలయజ్ఞం నిర్మాణ పనులే ఇందుకు ఉదాహరణ. ప్రధానంగా వైఎస్సార్ హయాంలో జిల్లాలో జలయజ్ఞం పనులు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా పెన్నా, సంగం బ్యారేజీ పనులు ప్రారంభమై ఐదేళ్లు గడిచాయి. ఇప్పటికీ ఆ పనులు పూర్తి అయ్యే పరిస్థితి లేదు.
సంగం బ్యారేజీ పనులు 30 శాతం, పెన్నా బ్యారేజీ పనులు 70 శాతానికి మించి పూర్తి కాలేదు. ఇవి ఎప్పటికి పూర్తి అవుతాయో తెలియని అయోమయ పరిస్థితి. తాజాగా మెట్ట ప్రాంతాల అభివృద్ధి పేరుతో సోమశిల హైలెవల్ కెనాల్‌కు రూప కల్పన చేశారు. దాదాపు రూ.1400 కోట్ల మేర అంచనాలతో ఇటీవలే పనులకు టెండర్లు పిలిచారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి, ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కలిసి ఈ ప్రాజెక్టుకు ఆర్భాటంగా శంకుస్థాపన చేశారు. కాని నిధుల కేటాయించిన పాపాన పోలేదు. ఈ ఏడాది కొత్త బడ్జెట్‌లో పెద్ద ఎత్తున నిధుల కేటాయించి అన్ని జలయజ్ఞం పనులు పూర్తి చేస్తామని ఆనం ప్రకటించారు. ఆర్థిక మంత్రి హోదాలో నాల్గోసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆనం జలయజ్ఞం పనులకు నామమాత్రంగానే నిధులు కేటాయించడం విమర్శలకు తావిస్తోంది. సోమశిల ప్రాజెక్టుకు కేవలం రూ.400 కోట్లు మాత్రమే కేటాయించినట్టు చూపారు.
పెన్నా రివర్ కెనాల్ అభివృద్ధి పనులకు నామమాత్రంగా రూ. 150 కోట్లు, తెలుగు గంగ ప్రాజెక్టుకు రూ.154 కోట్లు మాత్రమే కేటాయిస్తున్నట్టు లెక్కలు చూపారు. ఈ లెక్కన జిల్లాలో మరో ఐదేళ్లకు కూడా జలయజ్ఞం పనులు కూడా పూర్తి అయ్యే పరిస్థితి కానరావడం లేదు. జిల్లాలో వేల కోట్ల జలయజ్ఞం పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. కేవలం నెల్లూరు నగరంతో పాటు మంత్రి సొంత నియోజక వర్గం ఆత్మకూరులో మాత్రమే వందల కోట్లు వెచ్చించి రోడ్లు నిర్మిస్తున్నారే తప్ప జిల్లా వ్యాప్తంగా ఉన్న రోడ్ల సంగతి మాత్రం ఆనం సోదరులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. తాజా బడ్జెట్‌లో రోడ్ల అభివృద్ధికి నిధుల కేటాయింపు నామమాత్రంగానే ఉండటం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో తాగునీటి సమస్య అధికంగా ఉంది. రానున్నది వేసవిలో ఈ సమస్య మరింత తీవ్రం కానుంది. ఇప్పటికే వెంకటగిరి, గూడూరు, ఆత్మకూరు మున్సిపాలిటీలతో పాటు ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో తాగునీటి సమస్య అధికంగా ఉంది. నెల్లూరు నగరంలో కూడా నీటి సమ్య తప్పడం లేదు.
వేసవిని దృష్టిలో పెట్టుకుని శాశ్వత తాగునీటి పథకాలకు మరిన్ని నిధులు కేటాయిస్తారనుకుంటే ఈ బడ్జెట్లో కూడా నామమాత్రంగా కూడా నిధుల కేటాయించలేదు. నెల్లూరు నగరంలో భూగర్భ డ్రైనేజీ సమస్య ఇప్పట్లో పరిష్కారమయ్యేలా కనిపించడం లేదు. గతంలో రూ.440 కోట్లతో భూగర్భ డ్రైనేజీ పనులు చేపట్టనున్నట్టు ప్రభుత్వం ప్రకటించినా పనులు ప్రారంభం కాలేదు. సీఎం కిరణ్ గతంలో నెల్లూరు పర్యటన సందర్భంగా రూ.600 కోట్లతో భూగర్భ డ్రైనేజీ పూర్తి చేయనున్నట్టు ప్రకటించారు. ఇంత వరకూ అతీగతీ లేదు. తాజాగా రూ.770 కోట్లతో ప్రతి పాదనలు సిద్ధం చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ బడ్జెట్లో కూడా ఈ పథకానికి నామమాత్రంగా కూడా నిధుల కేటాయించలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే సవాలక్ష సమస్యలు న్నాయి. ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో కూడా నిధుల కేటాయింపులు లేకపోవడంతో ఈ పనులు పూర్తికావడం ప్రశ్నార్థకమైంది. ఏళ్ల కొద్ది పెండిగ్‌లో ఉన్న జలయజ్ఞం పనులు, మెడికల్ కాలేజీ, దుగరాజపట్నం ఓడరేవు తదితర వాటి గురించి పదే పదే ప్రచారం చేసుకోవడం తప్ప పూర్తి అయ్యేలా బడ్జెట్‌లో కేటాయింపులు చేయక పోవడం ఆనం మార్కు బడ్జెట్‌ను తేట తెల్లం చేసింది.
మోసపూరిత బడ్జెట్
ఇది పూర్తిగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. కార్మిక, కర్షక, రైతు వ్యతిరేక బడ్జెట్. గత ఏడాది రూ.1.61లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఈ దఫా అంకెలను మార్చి గొప్ప కోసం రూ.1.82 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. కేటాయింపులే తప్ప ఖర్చు చేయడం లేదు. గత ఏడాది ఎస్సీ సబ్‌ప్లాన్ కింద రూ.8,600 కోట్లను కేటాయించారు. ఇప్పటికి రూ.2,600 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అలాగే ఎస్టీలకు రూ.3,600 కేటాయించి కేవలం రూ.882 కోట్లు ఖర్చు చేశారు. వ్యవసాయానికి బడ్జెట్ కేటాయింపులే జరగలేదు. అందుకే ఇది మోసపూరిత బడ్జెట్. -చండ్ర రాజగోపాల్,
సీపీఎం జిల్లా కార్యదర్శి
ప్రజలకు పనికిరాని బడ్జెట్
ప్రభుత్వం పేరుకు మాత్రమే లక్షా ఎనభైవేల కోట్ల రూపాయల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో సగం ఉద్యోగుల జీత భత్యాలకే పోతుంది. ఎనిమిది వందల కోట్లను ఎన్నికల కోసం కేటాయించారు. కేవలం ప్రచారానికి పనికి వచ్చేలా ఉంది. ప్రజలను మభ్యపెడుతూ ‘ఐ’వాష్ బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం రూపొం దించింది. ఈ బడ్జెట్‌తో రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదు. ప్రాజెక్టులకు నిర్ధిష్టమైన నిధుల కేటాయింపులు జరగలేదు. తాగు, సాగు నీరు, ఉద్యోగకల్పనలకు చోటు దక్కక పోవడం శోచనీయం.
-వి.రామరాజు,
సీపీఐ జిల్లా కార్యదర్శి
ఆనం గారడీ
Published Tue, Feb 11 2014 5:59 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement