ఒక రాష్ట్రానికి సీఎం..పక్క రాష్ట్రంలో ఇలా చేయడం నీతా?
నెల్లూరు :ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేను కొనాలని చూసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నైతిక విలువలు లేవని మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి విమర్శించారు. చంద్రబాబుకు నైతిక విలువలు లేవని సాక్షాత్తూ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆరే అన్నారన్నారు. తాను పునీతుడినని చెప్పుకొనే బాబు తెలంగాణ ఎంఎల్‌సీ ఎన్నికల్లో గెలిచేందుకు ఎమ్మెల్యేను కొనాలని రేవంత్‌రెడ్డిని పంపడం సిగ్గుచేటన్నారు. నెల్లూరు జిల్లా కేంద్రంలో డీసీసీ నిర్వహించిన ప్రత్యేక హోదా, దుగ్గరాజు పట్నం పోర్టు సాధన సదస్సులో మంగళవారం ఆనం ఈ వ్యాఖ్యలు చేశారు.
తన కుమారుడు లోకేష్కు అడ్డం రాకుండా ఉండేందుకే రేవంత్‌రెడ్డిని బాబు బలిపశువును చేశాడని ఆరోపించారు. నిద్రలేస్తే నిజాయితీపరుడ్ని అని చెప్పుకొనే బాబు ఒక రాష్ట్రానికి సీఎం అయ్యి పక్క రాష్ట్రంలో ఇలా చేయించడం నీతా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఉన్న ఏపీ ఉద్యోగులను రాజధానికి రావాలని చెబుతున్న బాబు హైదరాబాద్‌లో బాడుగ ఇంటిపేరుతో ప్రజల డబ్బును దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. దుగ్గరాజపట్నం పోర్టు ఏర్పాటుకు యూపీఏ హయాంలో అంతా సిద్ధమైందని, అయితే ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీని గురించి పట్టించుకోవడం లేదన్నారు.
జిల్లాలో ఉన్న కృష్ణపట్నం పోర్టుకు లబ్ధి చేకూర్చేందుకే దుగ్గరాజపట్నం పోర్టు పనులను ప్రారంభించడం లేదని ఆరోపించారు. కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం ఇచ్చిన డబ్బుతో బాబు ప్రత్యేక విమానాల్లో విదేశాలు తిరుగుతున్నారని, వారికి నష్టం చేయడం బాబుకు ఇష్టం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షుడు ఆనం వివేకానందరెడ్డి, గంగాధరం, నాయకులు పనబాక కృష్ణయ్య, చెంచలబాబు యాదవ్, భానుశ్రీ తదితరులు పాల్గొన్నారు.