శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు ,ముత్తుకూరు : ముత్తుకూరు మండలం నేలటూరులోని దామోదరం సంజీవయ్య ఏపీ జెన్‌కో సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఏళ్లు గడుస్తున్నా కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించలేదు. చంద్రబాబు అధికారంలోకి వస్తే తమ ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయని వారంతా ఆశించగా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 3వ యూనిట్‌లో 800 మెగావాట్ల ప్రాజెక్ట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు భూమిపూజ చేశారు. ఉద్యోగుల నియామకం మాత్రం చేపట్టలేదు. ఈ ప్రాజెక్ట్‌లో 1, 2వ యూనిట్లలో 760 మంది కాంట్రాక్ట్ కార్మికులు పని చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు నాలుగేళ్ల క్రితమే జెన్‌కో యాజమాన్యం 300 పోస్టులను మంజూరు చేసింది. వీరికి జూనియర్ ప్లాంట్ అటెండర్లు (జేపీఏ)గా గుర్తింపునివ్వాలని నిర్ణయించింది. 50 శాతం ఉద్యోగాలు భూములు కోల్పోయిన కుటుంబాలకు కేటాయించాలని సంకల్పించింది.
ఇందులో ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ విభాగాల్లో 100 ఏఈ పోస్టులు, సబ్ ఇంజినీర్ల స్థాయిలో 100 పోస్టులు, ఎల్‌డీసీ, ఫోర్‌మెన్ విభాగాల్లో మరో 100 పోస్టులు భర్తీ చేయాల్సివుంది. నేటికీ జెన్‌కో యాజ మాన్యం ఈ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోకపోగా, కనీసం ఈ అంశాన్ని ప్రస్తావించే పరిస్థితి కూడా లేకుండాపోయింది. 2016 ఫిబ్రవరి 27న జెన్‌కో 3వ యూనిట్‌కు సీఎం చంద్రబాబు భూమిపూజ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని అక్కడి వారంతా అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతిపత్రాలు సమ ర్పించారు. నేటివరకు ప్రభుత్వం దీనిపై స్పందించలేదు.
వాగ్దానం మరిచిన సోమిరెడ్డి
ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో నాలుగు రోజులపాటు కాంట్రాక్ట్ కార్మికులు పనులు నిలిపివేసి ధర్నా చేశారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి పాల్గొని కార్మికులకు మద్దతు ప్రకటించారు. చివరి రోజున ఎమ్మెల్సీ హోదాలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధర్నా శిబిరాన్ని సందర్శించారు. ప్రాజెక్ట్ సీఈ, ఎస్‌ఈ సమక్షంలో కార్మికులతో చర్చలు జరిపారు. సీఎం చంద్రబాబు, జెన్‌కో ఎండీ విజయానంద్‌తో మాట్లాడి 300 పోస్టుల భర్తీకి 10 రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయిస్తామని వాగ్దానం చేశారు. ఆ తరువాత సోమిరెడ్డి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పదవి చేపట్టారు. 7 నెలలు గడిచినా కార్మికులకు ఇచ్చిన హామీని నెరవేర్చలేదు.
అక్కడ వేల పోస్టులు..ఇక్కడ వందల పోస్టులు
రాష్ట్రంలోని విజయవాడ థర్మల్, రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో 3 వేల మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. కానీ, నేలటూరు జెన్‌కో ప్రాజెక్ట్‌లో పర్మినెంట్ ఉద్యోగుల సంఖ్య కేవలం 300 లోపు మాత్రమే. సుమారు రూ.5 వేల కోట్లతో 3వ యూనిట్ ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నప్పటికీ ఉద్యోగుల సంఖ్య పెంచలేదు సరికదా.. ఖాళీ పోస్టులను భర్తీ చేయలేదు. ప్రస్తుతం పనిచేస్తున్న వారిపై ఒత్తిడి పెంచుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల రాష్ట్రంలో పవన విద్యుత్, సౌర విద్యుత్ ఉత్పత్తి పెరిగింది. థర్మల్ విద్యుత్‌కు డిమాండ్ తగ్గిపోయింది. ఈ నేపధ్యంలో థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్‌లో పోస్టులను భర్తీ చేయడమెందుకని ప్రభుత్వం భావిస్తుం దేమోనని ఉద్యోగులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక భారం పడుతుందన్న ఉద్దేశంతో 300 పోస్టుల భర్తీకి సర్కారు వెనుకంజ వేస్తున్నట్టు చెప్పుకొంటున్నారు. ఇటీవల పరిణామాల నేపథ్యంలో ఈ పోస్టులను ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఏపీ పీడీసీఎల్) భర్తీ చేస్తుందా లేక ఏపీ జెన్‌కో నోటిఫికేషన్ ఇస్తుందా అనేది స్పష్టం కాలేదు.
జాబెప్పుడు బాబూ
Published Tue, Sep 26 2017 7:55 AM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM
Advertisement