సాగునీటి ప్రాజెక్టులకు పెరగని కేటాయింపులు..
గతేడాది విదిల్చినట్లుగానే ఈ‘సారీ’..
ఊసేలేని పెన్‌గంగా ప్రాజెక్టు
‘రిమ్స్’కు కేటాయించినా.. నిర్వహణ, జీతభత్యాలకే సరి
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ :
మరికొద్ది నెలల్లో సాధారణ ఎన్నికలు.. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్‌కు ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు. ఈ నేపథ్యంలో సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్‌తో జిల్లాకు ఒరిగిందేమీ లేదు. కిరణ్ ప్రభుత్వం మరోమారు మొండి‘చెయ్యి’ చూపింది. ఎన్నికల ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినా.. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు అరకొరగానే నిధులు విదిల్చారు. ఏటా మాదిరిగానే ఈసారీ మమ అనిపించారు. సోమవారం ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ఓసారి పరిశీలిస్తే..
ఆదిలాబాద్, శ్రీకాకుళంలోని నర్సింగ్ కళాశాలల భవనాల నిర్మాణానికి ఈసారి బడ్జెట్‌లో రూ.రెండు కోట్లు కేటాయించారు. ఇందులో జిల్లాకు రూ.కోటికి మించి వచ్చే అవకాశాలులేవు. ఈ ఒక్క అంశం మినహా ఈ బడ్జెట్‌లో జిల్లాకు ప్రత్యేక కేటాయింపులేవీ లేవు.
ఆదిలాబాద్, ప్రకాశం, శ్రీకాకుళంలోని రిమ్స్‌ల్లో ఆధునిక పరికరాల కొనుగోలుకు మొత్తం రూ.4.5 కోట్లు కేటాయించారు. ఇందులో జిల్లాలోని రిమ్స్‌కు రూ.1.5 కోట్లు మించి వచ్చే అవకాశాలు లేవు. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో కూడా ఇందుకోసం రూ.1.5 కోట్లే కేటాయించారు.
రిమ్స్ ఆస్పత్రికి గతేడాది కేటాయించినట్లుగానే ఈసారి కూడా రూ. 20.92 కోట్లు విదిల్చారు. రిమ్స్ వైద్య కళాశాలకు కూడా రూ.20.92 కోట్లు నిధులు వచ్చాయి. ఈ నిధులు కేవలం ఉద్యోగులు, సిబ్బంది జీతభత్యాలు, నిర్వహణకే సరిపోతాయే తప్ప, పెద్దగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీలు లేకుండా పోయింది.
ఊసేలేని పెన్‌గంగా : సర్వే దశలోనే ఉన్న ఆంధ్ర-మహారాష్ట్ర సరిహద్దుల్లో నిర్మించతలపెట్టిన పెన్‌గంగా అంతర్రాష్ట్ర ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు ఈ బడ్జెట్‌లోనూ ఊసే లేకుండా పోయింది. 50 వేల ఎకరాల బీడు భూములను సాగులోకి తెవాలనే లక్ష్యంతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల కేటాయించడంలో ప్రభుత్వం ఈసారి కూడా మొండి చేయి చూపింది. దీంతో ఈ సర్కారు హాయంలో ఈ ప్రాజెక్టు కేవలం సర్వేకే పరిమితమైనట్లవుతోంది.
{పాణహిత-చేవెళ్ల : తెలంగాణ వరప్రదాయనిగా పేరున్న ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు కేటాయింపులకు ఈసారి రూ.1,051.05 కోట్లుకు పెరిగినా.. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేవలం రెండు ప్యాకేజీల పనులు మాత్రమే జిల్లాలో కొనసాగుతున్నాయి.
స్వర్ణ ప్రాజెక్టు, ప్రధాన కాలువ ఆధునికీకరణకు రూ.14.88 కోట్లతో చేపట్టిన పనులకు ఈ బడ్జెట్‌లో రూ.1.20 కోట్లు కేటాయించారు. సాత్నాల ఆధునికీకరణకు గతేడాది మాదిరే ఈసారీ రూ.కోటి కేటాయించారు. గడ్డెన్నవాగు (సుద్ద వాగు) ప్రాజెక్టు ప్రధాన కాలువ సిమెంట్ లైనింగ్ పనులకు కూడా ఇంతకు ముందుసారి మాదిరిగానే ఈసారి కూడా రూ.10 కోట్లు కేటాయించారు.
మధ్య తరహా ప్రాజెక్టులకు..
జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టులకు గతేడాది కేటాయింపులే ఈ ఆర్థిక సంవత్సరంలో పునరావృతమయ్యాయి. ర్యాలీవాగు ప్రాజెక్టుకు రూ.కోటి, గొల్లవాగుకు రూ.ఐదు కోట్లు, నీల్వాయి ప్రాజెక్టుకు రూ.35 కోట్లు, కొమురంభీమ్ ప్రాజెక్టుకు రూ.32 కోట్లు, పెద్దవాగుకు రూ.2 కోట్ల మేరకు కేటాయింపులు జరిగాయి. ఎన్‌టీఆర్ సాగర్ ప్రాజెక్టు రీ మోడలింగ్ పనులకు రూ.50 లక్షలు, దహెగాంలోని పీపీరావు ప్రాజెక్టుకు రూ.1.40 కోట్లు కేటాయించారు.
జిల్లాకు మళ్లీ మొండి‘చెయ్యి’..
Published Tue, Feb 11 2014 5:37 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement