పిరికిపందల్లా పారిపోతారా ?
సీఎంతో సహా రాజీనామాలు చేస్తున్న నేతలపై ఆనం, రఘువీరా ధ్వజం
సాక్షి, హైదరాబాద్: పదవులన్నీ అనుభవించి పార్టీ కష్టాల్లో ఉన్నపుడు రాజీనామాలు చేసి పిరికిపందల్లా పారిపోతారా అంటూ కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్న నేతలపై సీనియర్ నేతలు ఆనం రామనారాయణ రెడ్డి, ఎన్. రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. కష్టకాలంలో కాంగ్రెస్‌ను దోషిగా నిలబెట్టడం సరికాదన్నారు. పార్టీని ఏ ఒక్కరూ విడిచి వెళ్లరాదని, సీమాంధ్రలో కాంగ్రెస్‌ను రక్షించుకోవలసిన బాధ్యత కార్యకర్తలందరిపైనా ఉందని చెప్పారు. సీమాంధ్ర అభివృద్ధి మళ్లీ కాంగ్రెస్ వల్లనే సాధ్యమన్నారు. శుక్రవారం సీఎల్పీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర విభజన జరగకుండా చూడాలని ప్రయత్నించినా చివరకు విఫలమయ్యామన్నారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాలూ అభివృద్ధి సాధించేలా నేతలంతా పనిచేయాలన్నారు. విభజన తప్పు మొత్తాన్ని కాంగ్రెస్‌పైకే నెట్టేయడం తగదన్నారు. ప్రతిపక్షాలు సీమాంధ్రుల గొంతుల్ని తడిగుడ్డతో కోశాయన్నారు.
కాంగ్రెస్‌ను బతికించుకోవడానికి ఏ బాధ్యత అప్పగించినా పనిచేస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తరఫునే పోటీచేస్తామని ప్రకటించారు. రాజధాని ఎక్కడన్న అంశంపై పారిశ్రామికవేత్తలతో పాటు ఇతర నిపుణులతో చర్చిస్తామని తెలిపారు. సీమాంధ్రకు జరిగిన అన్యాయానికి రాజకీయ నేతలతో పాటు మీడియా కూడా దోషేనని ఆనం ఆరోపించారు. సమైక్యాంధ్రను 60 ఏళ్ల పాటు అభివృద్ధి చేశామని, సీమాంధ్రను పదేళ్లలో పురోగతి బాట పట్టిస్తామన్నారు. మీడియా సమావేశానంతరం ఆనం, రఘువీరా కాంగ్రెస్ టోపీ ధరించి, జెండాలు చేబూని కార్యాలయం బయట మీడియా కెమెరాల ముందు నిలబడ్డారు. వారి కార్లకు ఉన్న జాతీయ జెండాల స్థానంలో పార్టీ జెండాలను పెట్టించారు. ఈలోగా అక్కడకు వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇంద్రసేనారెడ్డి, యాదవరెడ్డి, జగదీశ్వర్‌రెడ్డిలకు పార్టీ జెండాలు అందించారు.