సాక్షి, న్యూఢిల్లీ: కిరణ్‌కుమార్‌రెడ్డి పెట్టే పార్టీ శతకోటి లింగాల్లో బోడిలింగం లాంటిదని మంత్రి ఎన్.రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం మధ్యాహ్నం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయిన అనంతరం 11 మంది మంత్రుల బృందంలో పలువురు మీడియాతో మాట్లాడారు. కిరణ్ పెడుతున్న కొత్త పార్టీపై మీ స్పందన ఏంటని కోరగా రఘువీరా ఇలా స్పందించారు. ‘ఎన్నో పార్టీలు వచ్చాయి. పోయాయి. ఇప్పుడూ వస్తాయి’ అన్నారు. ‘క్రమశిక్షణ గల కార్యకర్తలుగా పార్టీని బలోపేతం చేస్తామని, అందుకు మా శక్తియుక్తులన్నీ ఉపయోగిస్తామని సోనియాకు చెప్పాం. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతకు విభజన తోడైంది. మా ముందు ఇప్పుడు రెండే లక్ష్యాలున్నాయి. కాంగ్రెస్‌ను బలోపేతం చేయడం, విభజన తరువాత కొత్త ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలబెట్టడం. రాహుల్‌గాంధీని ప్రధాని చేస్తామన్న ప్రతిజ్ఞను నిలబెట్టుకుంటాం. ప్రభుత్వ ఏర్పాటుపై ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని సోనియాకు చెప్పాం’ అన్నారు. ఎన్నికలు వాయిదావేయాలని కోరారా అని ప్రశ్నించగా అలా నిర్దిష్టంగా ఏమీ అడగలేదని, మాటల మధ్యలో ఆ ప్రస్తావన వస్తే వచ్చి ఉండొచ్చని అన్నారు.
ఆరు నెలలైతే పుంజుకుంటుంది: మంత్రి కొండ్రు
‘‘మేడమ్ అన్నీ సావధానంగా విన్నారు.గ్యాస్ కేటాయింపులు కోరాం. సానుకూలంగా స్పందించారు. కనీసం ఆరు నెలలైనా గడిస్తే కాంగ్రెస్ శ్రేణులన్నీ మళ్లీ పుంజుకుంటాయని, రాష్ట్రపతి పాలన వద్దని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరితే పరిశీలిస్తామన్నారు. సీమాంధ్రకు సహకరిస్తామని చెప్పారు. ఎన్నికలు వాయిదా వేయాలని కోరలేదు’’
ఎన్నికల వాయిదా కోరాం: మంత్రి బాలరాజు
‘‘ప్రభుత్వ ఏర్పాటు ఉంటుందో లేదో చెప్పలేం. సీ మాంధ్రకు మరికొన్ని అభివృద్ధి ప్యాకేజీలడిగాం. పర్యాటకం, ఆరోగ్యం, కోస్తా కారిడార్ తదితరాలను ప్రస్తావించాం. గిరిజనాభివృద్ధిపై దృష్టి పెట్టాలని కోరాం. ఎన్నికల వాయిదా దిశగా ఆలోచన చేయాలని కోరాం’’
కొత్త పీసీసీ చీఫ్ వచ్చాకే ఎన్నికలకు: మంత్రి ఆనం
‘‘మరిన్ని వరాలడిగాం. మరింత ఎక్కువ సాయం ఎలా చేయగలమో ప్రధాని దృష్టికి, తన దృష్టికి తీసుకురమ్మని దిగ్విజయ్‌కి సోనియా సూచించారు. సీమాంధ్ర ప్రాంత ప్రజల కష్టాలను తీర్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. రెండు పీసీసీలు రానున్నాయి. కొత్త పీసీసీ అధ్యక్షుని నేతృత్వంలో ఎన్నికలకు వెళ్తాం. ప్రభుత్వ ఏర్పాటుపై బహుశా రేపు కేబినెట్‌లో నిర్ణయిస్తారేమో!’’
శతకోటి లింగాల్లో..
Published Thu, Feb 27 2014 3:20 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement