కిరణ్ కేబినెట్‌ది కాలక్షేపమే : రాఘవులు
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ అవసరాల కోసమే కాంగ్రెస్, కేంద్రం విభజన నిర్ణయం తీసుకున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు ఆరోపించారు. సీమాంధ్రలో ఉధృతంగా ఆందోళనలు సాగుతున్నా ఆయా సంఘాల ప్రతినిధులతో మాట్లాడకపోవడం దుర్మార్గమని విమర్శించారు. కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) ఏపీ ఎన్జీవోలు, జేఏసీలు, ప్రజా సంఘాల వారిని పిలిచి అభ్యంతరాలేమిటో వినాలన్నారు. అప్పుడే రాష్ట్రంలో శాంతి, సామరస్యం నెలకొంటాయన్నారు. ఆదివారం ఢిల్లీలో సీపీఎం పొలిట్ బ్యూరో భేటీలో పాల్గొన్న సందర్భంగా రాఘవులు మీడియాతో మాట్లాడారు.
దేశ రాజకీయ పరిస్థితులతో పాటు సీమాంధ్ర ఉద్యమంపైనా పొలిట్ బ్యూరో చర్చించిందని, అక్కడి పరిస్థితులపై తాను నివేదిక సమర్పించానని చెప్పారు. ‘‘రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు, పరిణామాలకు కాంగ్రెస్, కేంద్రమే బాధ్యత వహించాలని పొలిట్ బ్యూరో అభిప్రాయపడింది. జాతీయ, ప్రాంతీయ పార్టీలతో కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. వారి అభ్యంతరాలు, వాదనలు వినాలి. సూచించే పరిష్కార మార్గాలను ఆలకించాలి’’ అని డిమాండ్ చేశారు.
ఉద్యమంలో ప్రభుత్వ, ప్రైవేట్ తేడాలొద్దు
రాష్ట్రంలో ఉద్యమం జరుగుతున్నా సమస్య పరిష్కారానికి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఏ చొరవా చూపడం లేదని రాఘవులు ధ్వజమెత్తారు. ‘‘కనీసం కేంద్రంతో ఓ సమావేశం ఏర్పాటు చేసే శక్తి కూడా సీఎంకు లేదు. సమస్యలను పెంచేలా వ్యవహరిస్తున్నారు. కిరణ్, మంత్రులు తమ స్థానాల్లో కూర్చుని కాలక్షేపం చేస్తున్నారే తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదు’’ అని విమర్శించారు. నేతలందరితో కేంద్రం చర్చించేలా కిరణ్ చొరవ చూపాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర ఉద్యమంలో ప్రభుత్వ సంస్థలు మూతబడి, ప్రైవేట్ సంస్థలు మాత్రం పని చేస్తున్నాయని, ఉద్యమంలో ఇలాంటి తేడాలు మంచివి కాదని అన్నారు. ఎంతకాలం ఉద్యమం జరిగితే అంత మంచిదనేలా, ప్రజల్లో అసంతప్తిని మరింత పెంచే ఉద్దేశంతో సర్కారు వ్యవహరిస్తోందన్నారు. పొత్తులపై ఇప్పుడేమీ మాట్లాడదల్చుకోలేదని, వాటిపై ఎలాంటి నిర్ణయాలకూ రాలేదని ఓ ప్రశ్నకు బదులుగా చెప్పారు.