bv raghavalu
-
రాఘవులే రైట్...
సాక్షి, హైదరాబాద్: సీపీఎం అధిష్టానం బీవీ రాఘవులును బుజ్జగించింది. పార్టీ పొలిట్‌బ్యూరోలో కొనసాగాలని ఆయన్ను కోరింది. దీంతో రాఘవులు రాసిన లేఖపై రెండు మూడు రోజులుగా నెలకొన్న వివాదం సద్దుమణిగినట్లయింది. పార్టీ పొలిట్‌బ్యూరో నుంచి తనను తప్పించాలని, క్షేత్రస్థాయిలో పనిచేస్తానని బీవీఆర్ ఇటీవల పార్టికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ పార్టీ రాష్ట్ర కమిటీలో తలెత్తిన వివాదాల నేపథ్యంలో రాఘవులుపై ఒక వర్గం పొలిట్‌బ్యూరోకు ఫిర్యాదులు చేయడంతో పరిస్థితి వేడెక్కింది. ఈ వివాదంపై పార్టీ పొలిట్‌బ్యూరో ఒక విచారణ కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదిక కూడా పార్టికి చేరింది. రెండ్రోజుల పాటు జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశాల్లో రాఘవులు అంశం చర్చకు వచ్చింది. ఆయన్ను పార్టీ బుజ్జగించినట్లు తెలిసింది. దీంతో రాఘవులు కూడా మెత్తబడ్డారని అంటున్నారు. బయటకొస్తే క్యాడర్లో నైరాశ్యం... మతోన్మాదంపై వామపక్షాలు పెద్ద ఎత్తున పోరాటమే చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు ఇన్చార్జిగా ఉన్న రాఘవులు పార్టీ కీలక బాధ్యతల నుంచి బయటకు వస్తే ఆ ప్రభావం క్యాడర్‌పై ప్రభావం చూపుతుంది. పార్టీ ఐక్యతకు నష్టం వాటిల్లుతుంది. ఈ తరుణంలో పార్టిలో లుకలుకలు కనిపించడం మంచిది కాదని పార్టీ పొలిట్‌బ్యూరో అభిప్రాయపడినట్లు తెలిసింది. ‘ఆంధ్రప్రదేశ్‌లోని పార్టీ సంస్థాగత అంశాలపై చర్చించాం. రాఘవులు వివాదం ముగిసిపోయింది. రాఘవులు పొలిట్‌బ్యూరో సభ్యునిగా కొనసాగుతారు. ఏపీలో పార్టీ నిర్మాణాత్మక అంశాలపై సమస్యలున్నాయి. వాటి కోసం కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. వాటిని ఏపీలో అమలు చేస్తాం’ అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. రాఘవులు కూడా పార్టీ విజ్ఞప్తికి ఒప్పుకోక తప్పలేదు. ఏపీలో అంతర్గత వివాదాల వల్ల తాను తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నానని చెప్పినట్టు తెలిసింది. ఇక నుంచి అటువంటి పరిస్థితి రాకుండా చూసుకుంటామని పార్టీ అధిష్టానం ఆయనకు నచ్చజెప్పినట్లు సమాచారం. ఒక వెలుగు వ్చెలిగిన రాఘవులు... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాఘవులు కార్యదర్శిగా ఉండి అనేక పోరాటాలు చేశారు. విద్యుత్ ఉద్యమం ఆయన హయాంలోనే జరిగింది. పోరాట పటిమగల నేతగా ఉన్నత స్థాయి పదవి పొలిట్‌బ్యూరో వరకు వెళ్లారు. ఆయన సింప్లిసిటీ కూడా క్యాడర్‌ను ఉత్తేజపరిచేది. అయితే తర్వాత తర్వాత ఆయన హయాంలోనే పార్టీ వెనుకపట్టు పట్టిందన్న విమర్శలున్నాయి. 10 టీవీ అమ్మడం వంటి విషయాల్లోనూ విమర్శలను మూటగట్టుకోవాల్సి వచ్చింది. మొత్తంగా కొద్దిరోజులుగా నలుగుతున్న రాఘవులపై అసమ్మతి వ్యవహారం ఎట్టకేలకు సద్దుమణగడంతో సీపీఎం శ్రేణులు ఊపిరిపీల్చుకున్నాయి. -
ఇక చాలు.. తప్పుకుంటా: బీవీ రాఘవులు
సాక్షి, హైదరాబాద్: సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు తన పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారా..? ఆయన ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఏపీకి చెందిన పార్టీ నేతలు పార్టీ కేంద్ర నాయకత్వానికి రాసిన లేఖ, దానిపై నాయకత్వం ప్రత్యేక కమిటీతో విచారణ జరిపించిన నేపథ్యంలో రాఘవులు తన పదవి నుంచి తప్పుకోనున్నట్లు లేఖ ద్వారా స్పష్టం చేసినట్టు సమాచారం. ఏపీలో పార్టీ పదవులకు సంబంధించి తలెత్తిన అభిప్రాయభేదాలు, కొందరిపట్ల రాఘవులు వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తున్నారంటూ పంపిన ఫిర్యాదు లేఖపై కేంద్ర నాయకత్వం విచారణ జరిపించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాఘవులు తన పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. విచారణ నివేదిక, రాఘవులు తప్పుకుంటానన్న లేఖపై ఆదివారం ఢిల్లీలో జరిగే పార్టీ పొలిట్‌బ్యూరోలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. విచారణ కమిటీ రాఘవులు చర్యలను తప్పుపట్టిందా? లేక విచారణ జరిపించడంపైనే ఆయన మనస్తాపం చెంది పార్టీ పదవి నుంచి తప్పుకుంటానని లేఖ ఇచ్చారా? అన్న దానిపై స్పష్టత లేదు. ఉమ్మడి ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న సమయంలో పార్టీ పటిష్టత కోసం రాఘవులు ఆధ్వర్యంలో పోరాటాలు చేసిన సంగతి తెలిసిందే. తమ్మినేని, శ్రీనివాసరావుల్లో ఒకరికి చాన్స్ పొలిట్‌బ్యూరో సభ్యునిగానే రాఘవులు రెండు తెలుగు రాష్ట్రాల పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. అయితే ఆయన్ను తప్పించే అవకాశం లేదని పార్టీ లోని ఓ వర్గం భావిస్తోంది. ఒకవేళ ఆయన తప్పుకుంటేఈ రెండు రాష్ట్రాల నుంచి ఒకరిని పొలిట్‌బ్యూరోలోకి తీసుకుంటారని చెబుతున్నారు. తెలంగాణ నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం లేదా ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న వి.శ్రీనివాసరావుల్లో ఒకరికి ఆ చోటు దక్కే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పొలిట్‌బ్యూరో నుంచి తప్పిస్తే రాఘవులు ఇక సేవా కార్యక్రమాలకు పరిమితం కావాలని భావిస్తున్నట్టు తెలిసింది. -
ఎన్నికల ప్రచారానికి సురవరం, ఏచూరి
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చేనెల మొదటివారంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల అగ్రనేతలు రాష్ట్రానికి రానున్నారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల పొత్తుల్లో భాగంగా భువనగిరి, మహబూబాబాద్ (ఎస్టీ) స్థానాల నుంచి సీపీఐ, నల్లగొండ, ఖమ్మంల నుంచి సీపీఎం పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నాలుగు స్థానాల్లో ఇరుపార్టీలు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆయా సభల్లో రెండు పార్టీల నాయకులు పాల్గొనేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. 1, 2 తేదీల్లో సురవరం సభలు సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి ఏప్రిల్ 1న భువనగిరిలో, 2న మహబూబాబాద్‌లో నిర్వహించే ఎన్నికల బహిరంగసభల్లో పాల్గొంటారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు బృందా కారత్, బీవీ రాఘవులు వచ్చే నెల మొదటివారంలో ప్రచారం నిర్వహించనున్నారు. వచ్చేనెల 4న బహుజన్ సమాజ్‌పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి, జనసేన నేత పవన్‌కల్యాణ్‌ల ఆధ్వర్యంలో బహిరంగసభ నిర్వహించే అవకాశాలున్నాయి. సీపీఐ, సీపీఎం పోటీ చేయని స్థానాల్లో జనసేన, బీఎస్పీ, ఎంసీపీఐ(యూ), బీఎల్పీ, ఎంబీటీలకు మద్దతునివ్వాలని సీపీఎం నిర్ణయించగా, జనసేన, బీఎస్పీ, బీఎల్పీ వంటి పార్టీలకు మద్దతునిచ్చే విషయాన్ని సీపీఐ వ్యతిరేకిస్తోంది. ఉమ్మడి సమావేశాలు... తాము పోటీ చేసే నాలుగు స్థానాల్లో మెరుగైన రీతిలో పరస్పరం సహకరించుకునేందుకు సీపీఐ, సీపీఎం ఉమ్మడిగా లోక్‌సభ నియోజకవర్గస్థాయి సమావేశాలు నిర్వహించనున్నాయి. ఈ నెల 27న ఖమ్మంలో, 28న మహబూబాబాద్‌లో నిర్వహించనున్న సమావేశాల్లో ఇరుపార్టీల రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకట్‌రెడ్డి, తమ్మినేని వీరభద్రం పాల్గొననున్నారు. రాష్ట్ర కమిటీ సభ్యుల నుంచి మండల కమిటీ సభ్యుల వరకు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 30న నల్లగొండ, 31న భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ స్థాయి సంయుక్త సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఆయా లోక్‌సభ సీట్ల పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు, మండలాల్లో కూడా రెండుపార్టీల సంయుక్త సమావేశాలు నిర్వహించనున్నారు. -
లోక్‌సభ ఎన్నికలకు వ్యూహమెలా?
సాక్షి, హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనే అంశంపై సీపీఎం తర్జనభర్జన పడుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్ఎఫ్) పేరిట పార్టీ రాష్ట్ర శాఖ చేసిన ప్రయోగం ఆశించిన ప్రయోజనం చేకూర్చకపోవడంతో లోక్‌సభ ఎన్నికల్లో ఏ వైఖరిని అవలంబించాలనే దానిపై చర్చిస్తోంది. సోమవారం రాత్రి వరకు జరిగిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్ కారత్, బీవీ రాఘవులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సీపీఐ, ఇతర వామపక్షాలు, సామాజిక సంస్థలు, శక్తులతో కలసి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తే బావుంటుందని కొందరు రాష్ట్ర నాయకులు సూచించారు. సీపీఐ ముఖ్య నేతలతో ప్రాథమిక చర్చలు ప్రారంభించినట్లు తెలియజేశారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా పార్టీకి అనుభవంలోకి వచ్చిన లోటుపాట్లను పునరావృతం కానివ్వకుండా జాగ్రత్త వహించాలని రాష్ట్ర నేతలకు జాతీయ నేతలు సూచించినట్లు తెలుస్తోంది. పార్టీ మౌలిక విధానాలు, వైఖరికి భిన్నంగా వ్యవహరించవద్దని, రాష్ట్రంలోని వివిధ సామాజిక వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తూనే కులం లేదా సామాజిక ముద్ర పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. -
చంద్రబాబు జోక్యం ప్రతికూలమే...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఏపీ సీఎం చంద్రబాబు జోక్యం చేసుకున్న తీరు.. ప్రజా కూటమిపై ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు చూపబోతోందని సీపీఎం అంచనా వేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసమే కాంగ్రెస్‌తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని పేర్కొంది. మొదట్లో కాంగ్రెస్ కూటమికి అనుకూలంగా ఉండొచ్చునని భావించినా తెలంగాణ అనుకూల సెంటిమెంట్ పెరగడంతో ఆ తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చిందని అభిప్రాయపడింది. శనివారం మఖ్దూమ్ భవన్లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో తెలంగాణ ఎన్నికలు, రాజకీయ పరిణామాలు, బీఎల్ఎఫ్కున్న అవకాశాలను గురించి సమీక్షించారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, 17 లోక్‌సభ నియోజకవర్గాల ఇన్చార్జీలు హాజరయ్యారు. వివిధ వర్గాల ప్రజలకిచ్చే పింఛను డబ్బును పెంచడం, రైతుబంధు పథకం, సమాజంలోని వివిధ రంగాలకు చెందిన వారి కోసం సంక్షేమ పథకాల అమలు, ఏదో ఒకరూపంలో లబ్ధి చేకూర్చేందుకు చేసిన ప్రయత్నాలు టీఆర్ఎస్కు ఎన్నికల్లో రాజకీయంగా ప్రయోజనం చేకూర్చాయని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తేనే ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ప్రజలు భావించినందువల్లే.. ఆ పార్టీకే మళ్లీ పట్టంగడుతున్నారని విశ్లేషించారు. మైనారిటీల ఓట్లు పెద్ద సంఖ్యలో పడటం కూడా టీఆర్ఎస్కు కలిసొచ్చే అంశమన్నారు. తెలంగాణ సెంటిమెంట్ మళ్లీ తెరపైకి... తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేలా చంద్రబాబు చేసిన ప్రసంగాలు, ఆయన వ్యవహారశైలిపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైందని సీపీఎం విశ్లేషించింది. తెలంగాణలో మరోసారి చంద్రబాబు వేలుపెడితే ఇక్కడి రాజకీయాలు, పరిస్థితుల్లో కూడా ప్రతికూల మార్పులొస్తాయనే ప్రజలు భావించారని అభిప్రాయపడింది. కూటమిని మొత్తం తన చుట్టే తిప్పుకోవడం, ప్రచార వ్యూహాన్ని ఖరారు చేయడం మొదలుకుని, తానే ముందుండి నడిపించడం కూడా ఇక్కడి ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి కారణమైందని అంచనా వేసింది. ఎన్నికలకు ముందు చివరి 4,5 రోజుల పాటు చంద్రబాబు నిర్వహించిన విస్తృత ప్రచారం, ప్రస్తావించిన అంశాలు కూటమిపై ప్రతికూల ప్రభావం చూపాయని అభిప్రాయపడింది. సీపీఎంగా పోటీచేసిన భద్రాచలం, మిర్యాలగూడలలో, బీఎల్ఎఫ్ అభ్యర్థులున్న నారాయణ్‌పేట్, మధిరలలో కనీసం ఒక్కోస్థానంలోనైనా గెలిచే అవకాశాలున్నాయని భావిస్తోంది. -
స్పష్టత వస్తేనే ‘ఫెడరల్ ఫ్రంట్’కు మద్దతు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్‌పై స్పష్టత వచ్చిన తర్వాతే దానికి మద్దతు ఇచ్చే విషయం గురించి ఆలోచిస్తామని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పేర్కొన్నారు. ఫెడరల్ ఫ్రంట్‌ను కేసీఆర్ ఏ ప్రాతిపదికన పెడుతున్నారో చెప్పాల్సిన అవసరం ఉందని, దాని ప్రకారమే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ నెల 18 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో సీపీఎం 22వ జాతీయ మహాసభలు జరగనున్న నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని గోల్కొండ హోటల్లో జరిగిన ఎడిటర్స్ మీట్లో ఆయన మాట్లాడారు. ‘నిన్న కేసీఆర్‌ను నేను, మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కలిశాం. రాష్ట్ర రాజకీయాలపై చర్చ జరగలేదు. ఫెడరల్ ఫ్రంట్ గురించి మాత్రం చర్చించాం. కేసీఆర్ ఏ ప్రాతిపదికన ఫెడరల్ ఫ్రంట్ పెడుతున్నారో స్పష్టత ఇస్తే.. మద్దతు ఇవ్వాలా, వద్దా అనేది ఆలోచిస్తాం’ అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో సీపీఎం ఎలాంటి పొత్తులు పెట్టుకోదని, అవగాహన కూడా ఉండదని స్పష్టం చేశారు. వీరభద్రం మాట్లాడుతూ బహుజన లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్ఎఫ్) ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ మహాసభలు ఉపకరిస్తాయని అన్నారు. 25 ఏళ్లుగా పొత్తుల వల్ల బలహీనమయ్యామని, ప్రజలకు లబ్ధి జరగలేదని పేర్కొన్నారు. తెలంగాణలో జనసేన పార్టీతో కలిసి పని చేస్తామని, కోదండరాం పార్టీ విధివిధానాలు చెబితే ఆయనతో కలసి పనిచేసే అంశంపై ఆలోచిస్తామన్నారు. రాజకీయాల్లో కూడా సామాజిక న్యాయం జరగాలని అభిప్రాయపడ్డారు. గొర్రెలు, బర్రెలు ఇవ్వడం సామాజిక సహాయం మాత్రమేనని, సామాజిక న్యాయం కాదని చెప్పారు. -
నేటి నుంచి సీపీఎం రాష్ట్ర సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 3, 4, 5వ తేదీల్లో జరిగే ఈ సమావేశాలకు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు హాజరుకానున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక, మతోన్మాద విధానాలు దేశంతో పాటు రాష్ట్రానికి తీవ్ర నష్టం తెస్తున్నాయని సీపీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న రైతు సమన్వయ సమితులు(జీవో 39, 42), టీఆర్ఎస్ ఇచ్చిన హామీల అమలు, ప్రజలకు నష్టం చేకూర్చేలా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వంటి అంశాలపై చర్చించి కార్యాచరణ నిర్ణయించనున్నట్లు వివరించింది. వచ్చే ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో జరగనున్న పార్టీ 22వ అఖిల భారత మహాసభలు, ఫిబ్రవరిలో జరగనున్న ద్వితీయ రాష్ట్ర మహాసభలపై రాష్ట్ర కమిటీ చర్చించనుంది. -
'రూ.కోట్లు కుమ్మరించి ఎమ్మెల్యేలను కొంటున్నారు'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల సమస్యలను టీడీపీ ప్రభుత్వం పక్కన పెట్టిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు. మాకినేని బసవపున్నయ్య 24 వ వర్థంతిని పురస్కరించుకుని ఆదివారం విజయవాడలో స్మారక సభ జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..చంద్రబాబు ప్రభుత్వం రూ.కోట్లు కుమ్మరించి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకినేని వర్థంతి సభకు సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ ముఖ్య అతిధిగా హాజరై స్మారకోపన్యాసం చేశారు. దేశ ఆర్ధిక వ్యవస్థను సంస్కరణలు దెబ్బతీస్తున్నాయని ఆయన అన్నారు. సంస్కరణల పేరుతో పేదలకు ఇచ్చే రాయితీలు తగ్గించి...బడా కార్పొరేట్లకు రూ.62 వేల కోట్లు కేటాయించారని కేంద్రప్రభుత్వంపై ప్రకాశ్ కారత్ మండిపడ్డారు. -
సమస్యలు పట్టని సీఎం వైదొలగాలి
ఆలంపల్లి, న్యూస్‌లైన్: ప్రజాసమస్యలు పట్టని సీఎం, మంత్రులు వెంటనే పదవులకు రాజీనామాలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. శ్రీకాకుళం, చిత్తూరు తదితర ప్రాంతాల్లో ప్రజలు పచ్చకామెర్లు, చికున్ గున్యా, డెంగీలతో విలవిల్లాడుతుంటే పట్టించుకునేవారు కరువయ్యారని వాపోయారు. ఉద్యమాల బూచిచూపి మంత్రులు కాలక్షేపం చేస్తున్నారని, సీఎం కార్యాలయంలో ఫైళ్లు పేరుకుపోయాయని విమర్శించారు. ఉద్యమాల వల్ల దళితులు, గిరిజనులే ఇబ్బందుల పాలవుతున్నారని, విద్యార్థులు సైతం నష్టపోయారని తెలిపారు. 70 వేల మంది విద్యావలంటీర్ల నియామకాలను నిలిపేశారని, 25వేల టీచర్ పోస్టుల భర్తీకి బ్రేక్ పడిందని చెప్పారు. ప్రజాపంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు. కాగా వచ్చే ఎన్నికల్లో సీపీఐతోనే కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. -
నారాయణా.. ఇంక దిగజారకు!
సాక్షి, హైదరాబాద్: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ తనతో పాటు తన పార్టీ పరువు, ప్రతిష్టలను దిగజార్చుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు దుయ్యబట్టారు. తన స్థాయి మరిచి విమర్శలకు దిగి అసత్యాలు, దిగజారుడు మాటలు మాట్లాడవద్దని హితవుపలికారు. వైఎస్సార్సీపీతో సర్దుబాట్లపై చర్చలకు తానే ప్రత్యక్ష సాక్షినన్నట్టు మాట్లాడిన నారాయణ.. నిజాయితీ ఉన్న కమ్యూనిస్టయితే వాటిని నిరూపించాలని రాఘవులు సవాల్ చేశారు. వైఎస్సార్సీపీతో సీపీఎం రహస్యంగా సీట్ల ఒప్పందం కుదుర్చుకుంటోందని నారాయణ విమర్శించిన నేపథ్యంలో రాఘవులు శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. పదేపదే లేఖలు రాసినా సీపీఎం పట్ల నారాయణ దురుసుగానే ప్రవర్తిస్తున్నారని చెప్పారు. వామపక్షాల మధ్య ఉండాల్సిన స్థాయిలో ఈ విమర్శలు ఉండడం లేదని, వ్యక్తిగత దూషణలకు దిగి అబద్ధాలు మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. ఈ విమర్శల వల్ల నారాయణకు, ఆయన పార్టీకే తీరని నష్టమని అన్నారు. వైఎస్సార్సీపీతో పొత్తుపై బేరసారాలు జరిపి సీట్ల సంఖ్యపై కూడా తాము చర్చించినట్టు నారాయణ చెప్పడాన్ని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అనిశ్చితి తేలేవరకు ఎన్నికల గురించి చర్చించబోమని ఇదివరకే చెప్పామని గుర్తు చేశారు. ఈమేరకు ఆయన శుక్రవారం నారాయణకు ఓ లేఖ రాశారు. ఒంగోలులో గురువారం నారాయణ చేసిన వ్యాఖ్యలను ఖండించడంతో పాటు, నిరాధార, కల్పిత ఊహాగానాలు చేయవద్దని సలహా ఇచ్చారు. నారాయణ వాడిన ప్రతిమాటను ఖండిస్తూ ఈ లేఖ సాగింది. -
కిరణ్ కేబినెట్‌ది కాలక్షేపమే : రాఘవులు
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ అవసరాల కోసమే కాంగ్రెస్, కేంద్రం విభజన నిర్ణయం తీసుకున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు ఆరోపించారు. సీమాంధ్రలో ఉధృతంగా ఆందోళనలు సాగుతున్నా ఆయా సంఘాల ప్రతినిధులతో మాట్లాడకపోవడం దుర్మార్గమని విమర్శించారు. కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) ఏపీ ఎన్జీవోలు, జేఏసీలు, ప్రజా సంఘాల వారిని పిలిచి అభ్యంతరాలేమిటో వినాలన్నారు. అప్పుడే రాష్ట్రంలో శాంతి, సామరస్యం నెలకొంటాయన్నారు. ఆదివారం ఢిల్లీలో సీపీఎం పొలిట్ బ్యూరో భేటీలో పాల్గొన్న సందర్భంగా రాఘవులు మీడియాతో మాట్లాడారు. దేశ రాజకీయ పరిస్థితులతో పాటు సీమాంధ్ర ఉద్యమంపైనా పొలిట్ బ్యూరో చర్చించిందని, అక్కడి పరిస్థితులపై తాను నివేదిక సమర్పించానని చెప్పారు. ‘‘రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు, పరిణామాలకు కాంగ్రెస్, కేంద్రమే బాధ్యత వహించాలని పొలిట్ బ్యూరో అభిప్రాయపడింది. జాతీయ, ప్రాంతీయ పార్టీలతో కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. వారి అభ్యంతరాలు, వాదనలు వినాలి. సూచించే పరిష్కార మార్గాలను ఆలకించాలి’’ అని డిమాండ్ చేశారు. ఉద్యమంలో ప్రభుత్వ, ప్రైవేట్ తేడాలొద్దు రాష్ట్రంలో ఉద్యమం జరుగుతున్నా సమస్య పరిష్కారానికి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఏ చొరవా చూపడం లేదని రాఘవులు ధ్వజమెత్తారు. ‘‘కనీసం కేంద్రంతో ఓ సమావేశం ఏర్పాటు చేసే శక్తి కూడా సీఎంకు లేదు. సమస్యలను పెంచేలా వ్యవహరిస్తున్నారు. కిరణ్, మంత్రులు తమ స్థానాల్లో కూర్చుని కాలక్షేపం చేస్తున్నారే తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదు’’ అని విమర్శించారు. నేతలందరితో కేంద్రం చర్చించేలా కిరణ్ చొరవ చూపాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర ఉద్యమంలో ప్రభుత్వ సంస్థలు మూతబడి, ప్రైవేట్ సంస్థలు మాత్రం పని చేస్తున్నాయని, ఉద్యమంలో ఇలాంటి తేడాలు మంచివి కాదని అన్నారు. ఎంతకాలం ఉద్యమం జరిగితే అంత మంచిదనేలా, ప్రజల్లో అసంతప్తిని మరింత పెంచే ఉద్దేశంతో సర్కారు వ్యవహరిస్తోందన్నారు. పొత్తులపై ఇప్పుడేమీ మాట్లాడదల్చుకోలేదని, వాటిపై ఎలాంటి నిర్ణయాలకూ రాలేదని ఓ ప్రశ్నకు బదులుగా చెప్పారు. -
రాష్ట్రంలో ప్రభుత్వం ఎక్కడుంది?
సాక్షి, హైదరాబాద్: విభజన, సమైక్య ఉద్యమాలతో రాష్ట్రంలో పాలన స్తంభించడం వల్లే ప్రజా సమస్యల పరిష్కారం కోసం గవర్నర్‌ను సంప్రదించామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు చెప్పారు. రాష్ట్రంలో అనిశ్చితికి తెరదించి సామాన్యుల కడగండ్లకు పరిష్కారం చూపాల్సిందిగా ఆయన గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. కుల వివక్ష పోరాట సమితి (కేవీపీఎస్) ఆధ్వర్యంలో మంగళవారం రాఘవులు, చెరుపల్లి సీతారాములు, జమలయ్య, జాన్‌వెస్లీ, శ్రీరామ్ నాయక్, ప్రసాద్ తదితరులు రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఈ మేరకు ఒక వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర విభజన, సమైక్యాంధ్ర ఉద్యమాల ఆందోళనలతో బడుగు, బలహీన వర్గాలు తీవ్రంగా నష్టపోతున్నాయని వివరించారు. వినతిపత్రంలోని సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళతానని గవర్నర్ పేర్కొనడంతో... ‘అదే (ప్రభుత్వం) ఉంటే మీ దగ్గరకు వచ్చే వాళ్లం కాదు. రాష్ట్రంలో పాలన స్తంభించి ఏడాది దాటి పోయింది’ అని రాఘవులు వ్యాఖ్యానించారు. దీంతో కంగుతిన్న గవర్నర్.. తన పరిధి మేరకు ఏది చేయగలిగితే అది చేస్తానని బదులిచ్చారు. -
స్కూళ్లను సమ్మె నుంచి తప్పించండి
హైదరాబాద్, న్యూస్‌లైన్: సీమాంధ్రలో జరుగుతున్న బంద్‌లు, ఆందోళనలు, నిరసనల నుంచి పాఠశాలు, సంక్షేమ హాస్టళ్లకు మినహాయింపు ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు కోరారు. బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కేవీపీఎస్, గిరిజన సంఘం, చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. సీమాంధ్ర ఉద్యమంలో ఎక్కువగా నష్టపోయేది బలహీన వర్గాల పిల్లలేనని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలు, హాస్టళ్లు మూతపడి సామాన్యుల పిల్లలు విద్యాపరంగా నష్టపోతుంటే, ధనవంతుల పిల్లలు చదువుతున్న కార్పొరేట్ విద్యాసంస్థలు మాత్రం నిరంతరాయంగా నడుస్తున్నాయని ఇదెక్కడి న్యాయయమని ప్రశ్నించారు. పాఠశాలలు నడిచేలా ఉపాధ్యాయ సంఘాలు చొరవ తీసుకోవాలని సూచించారు. టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన యాత్రలో స్పష్టత లేదన్నారు. మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మాట్లాడతూ.. ఉద్యమంలో సాధారణ, మధ్యతరగతి ప్రజల పిల్లలు విద్యాపరంగా నష్టపోతున్నారన్నారు. -
ఇంత చవకబారు విమర్శలా: బీవీ రాఘవులు
నారాయణకు రాఘవులు లేఖ సాక్షి, హైదరాబాద్: వామపక్షాలుగా చెప్పుకునేవారికి చౌకబారు విమర్శలు, అవాస్తవ వ్యాఖ్యలు తగదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణకు సలహా ఇచ్చారు. రాజకీయ చర్చ, విమర్శ పరిధి దాటి ఉండకూడదని సూచించారు. నిగ్రహం ఉండాల్సిన చోట ఆగ్రహం తగదని హితవు పలికారు. సీపీఎంను విమర్శిస్తూ నారాయణ సోమవారం చేసిన ప్రకటనను తిప్పికొడుతూ రాఘవులు మంగళవారం నారాయణకు లేఖ రాశారు. ‘‘మీ ప్రకటనలో విషయం కన్నా ఆగ్రహం, అపవాదులు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ విమర్శల కన్నా అప్రతిష్ట పాలుచేయాలన్న ఆదుర్ధా ఎక్కువగా ఉంది. కొన్ని సందర్భాలలో వామపక్షాల మధ్య బహిరంగంగా రాజకీయ చర్చ, విమర్శలు జరగడం అసహజమేమీ కాదు. కానీ మీ ప్రకటనలో వాడిన భాష, చేసిన వ్యాఖ్యలు అవాస్తవం. చౌకబారు విమర్శల వల్ల వామపక్షాలనుకునే వారికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. విభజన- సమైక్యత ఉద్యమాలలో అవకాశవాద వైఖరి అనుసరిస్తున్న పార్టీలు, సంఘాల గురించి పేర్లు ప్రస్తావించే మా అభిప్రాయం చెప్తున్నాం తప్ప అవకాశవాద పార్టీల జాబితాలో సీపీఐని చేర్చి మేం ఎప్పుడూ మాట్లాడలేదు. సీపీఐపై రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్న సీపీఎం నాయకులకు సమాధానంగా మీరు ప్రకటన విడుదల చేసినట్టు చెబుతున్నారు. వాస్తవం ఏమిటంటే మీ విమర్శకు మేం స్పందించామే తప్ప ముందు మేము ఎలాంటి విమర్శా చేయలేదు’’ అని అందులో పేర్కొన్నారు.