సాక్షి, హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనే అంశంపై సీపీఎం తర్జనభర్జన పడుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్‌ఎఫ్) పేరిట పార్టీ రాష్ట్ర శాఖ చేసిన ప్రయోగం ఆశించిన ప్రయోజనం చేకూర్చకపోవడంతో లోక్‌సభ ఎన్నికల్లో ఏ వైఖరిని అవలంబించాలనే దానిపై చర్చిస్తోంది. సోమవారం రాత్రి వరకు జరిగిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్ కారత్, బీవీ రాఘవులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో సీపీఐ, ఇతర వామపక్షాలు, సామాజిక సంస్థలు, శక్తులతో కలసి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తే బావుంటుందని కొందరు రాష్ట్ర నాయకులు సూచించారు. సీపీఐ ముఖ్య నేతలతో ప్రాథమిక చర్చలు ప్రారంభించినట్లు తెలియజేశారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా పార్టీకి అనుభవంలోకి వచ్చిన లోటుపాట్లను పునరావృతం కానివ్వకుండా జాగ్రత్త వహించాలని రాష్ట్ర నేతలకు జాతీయ నేతలు సూచించినట్లు తెలుస్తోంది. పార్టీ మౌలిక విధానాలు, వైఖరికి భిన్నంగా వ్యవహరించవద్దని, రాష్ట్రంలోని వివిధ సామాజిక వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తూనే కులం లేదా సామాజిక ముద్ర పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment