కామెంట్
ఇచ్చిన మాటకే కాదు, తామన్న మాటలకూ ఎల్లప్పుడూ కట్టుబడి ఉండే అతి కొద్దిమంది రాజకీయ నాయకులలో సీతారాం ఏచూరి ఒకరు. ఇంటర్వ్యూ లలో వెలిబుచ్చిన అభిప్రాయాల పర్యవసానాలను ఆ తర్వాత ఎదుర్కొనే ధైర్యం లేక ప్రసారాలకు ముందే వాటిని తొలగించమని నాయకులు కోరటమన్నది అసాధారణమేమీ కాదు. కానీ ఏచూరి తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండేవారు. యునైటెడ్ ఫ్రంట్‌కు సీపీఎం మద్దతిస్తున్నప్పటికీ, అప్పటి ప్రధాని దేవె గౌడ మీద ఆయన చేసిన విమర్శ దీనికి నిదర్శనం. రాజకీయ నాయకులు ఏ మాత్రం సంకోచించకుండా తిరస్కరించే విజ్ఞప్తులను సైతం అంగీకరించటం కోసమే ఏచూరి మార్గాలను వెతికేవారు. ఆయన గుణం సావధానం. ఆయన జ్ఞాపకశక్తి అపారం.
సీతారాం ఏచూరిని నేను మొదటిసారి ఎప్పుడు కలిశానో గుర్తుకు రావటం లేదు. బహుశా అది నేను 1990లో ఇండియాకు తిరిగి వచ్చిన కొద్ది రోజులకు కావచ్చు. అయితే నేనెప్పటికీ మర్చిపోలేనిది మాత్రం ఆయనతో సుదీర్ఘమైన నా మొదటి ఇంటర్వ్యూ. అది 1996వ సంవత్సరం.
ఇంటర్వ్యూ చేసింది ఆనాటి నూతన ప్రధాని దేవె గౌడ గురించి. అప్పటికి సీతారాంతో నాకు బాగా పరిచయం ఏర్పడి ఉంది. ఇంటర్వ్యూలో ‘సీత’ (తనను ఇలా పిలవొచ్చని ఏచూరి నాతో అన్నప్పట్నుంచీ నేనాయన్ని సీత అనటం మొదలుపెట్టాను) దేవె గౌడ తన అధికారిక పర్యటనకు తనతో పాటుగా అనేక మంది తన కుటుంబ సభ్యులను ఇటలీకి వెంటబెట్టుకుని వెళ్లటాన్ని విమర్శించారు.
నాటి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి దేవె గౌడ పార్టీ, సీపీఎం రెండూ కూడా మద్దతు ఇస్తూ ఉన్నందు వల్ల సీత అలా విమర్శించటం అనూహ్యం, దాపరికం లేకపోవడం మాత్రమే కాక వార్తగా కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. అది కేవలం ఒక సాధారణ వ్యాఖ్య కాదు. పూర్తి స్థాయి విమర్శ.
ఇంటర్వ్యూ ప్రసారానికి ముందు రోజు సాయంత్రం సీత నాకు ఫోన్ చేశారు. ‘‘ఇంటర్వ్యూలో నేను చెప్పిన దానిని తొలగించమని అడగటానికి నేను మీకు కాల్ చేయలేదు’’ అని నవ్వుతూ అన్నారు. అదొక వ్యాప్తి చెందే స్వభావం కలిగిన సహృదయ హాసం. ‘‘నేను దాని గురించి ఇప్పటికే నా సహచరులకు చెప్పి, వారి స్పందనలకు తగిన వివరణ ఇచ్చేశాను కనుక దానిని మీరు తీసేయలేదని నిర్ధారించుకోటానికే మీకు కాల్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు దానిని తొలగిస్తే ఇద్దరం కూడా నవ్వులపాలౌతాం’’ అన్నారు.
నిజానికి సీత, తామన్న మాటలకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉండే అతి కొద్ది మంది రాజకీయ నాయకులలో ఒకరు. నాయకులు ఇంటర్వ్యూలలో వెలిబుచ్చిన తమ వాస్తవ అభిప్రాయాల పర్యవసానా లను ఎదుర్కొనే ధైర్యం లేక వాటిని తొలగించమని కోరటమన్నది అసాధారణమేమీ కాని ఆ 9వ దశకంలో, 2000–2009 మధ్య కాలంలో సీత అలా నాకు కాల్ చేయటం అత్యంత అసాధారణం. చెప్పాలంటే అభినందనీయం.
అదొక్కటే కాదు, సీత సావధానంగా వినే గుణం కలిగిన వారనీ, ఆయన జ్ఞాపకశక్తి అపారమనీ కనిపెట్టటానికి నాకు మరికొంచెం సమయం పట్టింది. నేను ‘ఐ విట్నెస్’ వీడియో మేగజీన్‌కు పని చేస్తూ, తరచు చర్చలు నిర్వహిస్తూ ఉన్న సందర్భంలో ఓసారి నాకు ఢిల్లీ కమానీ ఆడిటోరియం వెలుపలి ప్రాంగణంలో సీత సిగరెట్ తాగుతూ కనిపించారు. ‘‘మీకూ ఒకటి కావాలా?’’ అని నన్ను అడిగారు. బహుశా నా ముఖం సిగరెట్టు తాగే రకంలా ఆయనకు కనిపించి ఉండాలి. తన సిగరెట్ వెలిగించుకున్నాక, నాకూ ఒకటి ఇచ్చారు. నేను సిగరెట్ తాగుతానని మీకెలా తెలుసు అని అడిగాను.
‘‘మీరేగా చెప్పారు, మర్చిపోయారా?’’ అని ఆశ్చర్యపోయారు. ‘‘జనవరిలో మాత్రమే తాగుతానని, అది కూడా ఇతరులు ఇచ్చే సిగ రెట్‌లు మాత్రమే తాగుతానని మీరు నాతో చెప్పారు కదా’’ అన్నారు. ఆయన అన్నది నిజమే. అయితే ఎవరికి గుర్తుంటుంది కనుక అని నేను తమాషాగా చెప్పే విషయాలలో ఇది కూడా ఒకటి. కానీ సీత దానిని గుర్తుపెట్టుకున్నారు!
వాస్తవానికి ఆయన జ్ఞాపకశక్తి పరిధి, కచ్చితత్వాలే ఇంటర్వ్యూ లలో ఆయనకు శక్తిమంతమైన ఆయుధాలు. ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నా ప్రశ్నల్లో నేను తేదీలను కలిపేసినప్పుడు లేదా వాస్త వాలలో నా వైపు తప్పులు దొర్లినప్పుడు వెంటనే ఆయన నన్ను సరి దిద్దేవారు. అలాగని ఎప్పుడూ కూడా అభ్యంతరకరంగా మాట్లాడే వారు కాదు. నేను మర్చిపోయిన ఒకటీ రెండు పాయింట్లను కూడా జోడించి మరీ విషయాన్ని ముగించేవారు. అలాగుండేది ఏచూరితో.
అయితే ఆయనలో అస్సలు లేనివి ఏమిటంటే ముఖం చిట్లింపు, హాస్య విహీనత. ఆయన చమత్కారం ఉవ్వెత్తున పొంగిన షాంపేన్‌లా మిరిమిట్లతో నురగలు కక్కుతుంది. 2005లో బృందా కారత్ సీపీఎం పాలిట్ బ్యూరోలో చేరారు. అప్పటికే ఆమె భర్త (ప్రకాశ్ కారత్) అందులో ఉన్నారు. బృందా పాలిట్ బ్యూరో సభ్యురాలైన కొత్తల్లో ‘సీఎన్ బీసీ’ లేట్ నైట్ డిస్కషన్‌లో ఆమె అతిథిగా పాల్గొన్నారు.
బృందాతో పాటు మరికొందరు అతిథులు ఉన్నారు. ఆ డిస్కషన్‌కు నాదే యాంకరింగ్. చర్చ సాగుతుండగా అతిథుల్లో ఒకరు... సీపీఎం పొలిట్ బ్యూరోలో స్థానం సంపాదించిన తొలి మహిళ కదా బృందా కారత్ అన్నారు. ‘‘అవును’’ అని చిరునవ్వుతో చూస్తూ, ‘‘మాది ఇప్పుడు రెండు క్యారెట్‌ల పార్టీ!’’ అన్నారు సీత.
సీత... సల్లాపాల ఉల్లాస ప్రియుడు కూడా. కథలు కథలుగా తన గురించి చెప్పుకుంటున్నప్పుడు... ఆయన కళ్లు దివ్వెలై వెలగటం, ఆయన ముఖం నవ్వులై విరియటం చూసి... ఆయన స్వీయానంద భరితులై ఉన్నట్లు మీరు చెప్పగలుగుతారు. కొన్నిసార్లు ఆయనకు ఒక ఇంటర్వ్యూ నచ్చి, లేదా అంతక్రితమే ఆయన చదివిన ఒక కాలమ్ గురించి చెప్పాలనిపించి, పొద్దుపోయాక నాతో ఫోన్‌లో వృత్తాంత భరితంగా మాట్లాడుతున్నప్పుడు ఆయన ముఖంలోని చిరుమంద హాసం లేదా ఆ గొంతులో తొణికిసలాడే నవ్వు నా గ్రహింపులోనికి వచ్చేవి.
సీత ఎప్పుడో గాని చెప్పిన సమయానికి చేరుకోలేరు. ఒక ఇంటర్యూకి ఫలానా సమయానికి వచ్చేస్తానని మాట ఇచ్చి కూడా దారి మధ్యలో తనను కలవాలని వచ్చిన అనేక మంది కోసం కారును ఆపించేవారు. ‘‘సమస్య చిన్నదే. వాళ్లందరూ ఆయనతో మాట్లాడాలని ఆశ పడతారు. అందుకు ఆయన ఎప్పుడూ నిరాకరించరు’’ అని ఇంటర్వ్యూకు ఆయను తీసుకువచ్చేందుకు వెళ్లిన నా సహచరులు చెప్పేవారు.
‘కాదు’ అని సీత ఎప్పుడైనా నాతో అన్నట్లు గుర్తు లేదు. సాధా రణంగా జర్నలిస్టులు చేసే విధంగానే, ఇతర రాజకీయ నాయకులు ఏ మాత్రం సంకోచించకుండా తిరస్కరించే అసంభవమైన విజ్ఞప్తులను నేను సీతకు చేసేవాడిని. అందుకు సీత ఎప్పుడూ వాటిని అంగీకరించటం కోసమే మార్గాలను వెతికే ప్రయత్నం చేసేవారు. కొన్నిసార్లు తన భార్య సీమ వైపు నుంచి చేయించే విన్నపాలను మన్నించేవారు. ఇన్ని విధాలుగా ఆయన నాకు ఎల్లప్పుడూ గుర్తుంటారు.
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment