ఆలంపల్లి, న్యూస్‌లైన్: ప్రజాసమస్యలు పట్టని సీఎం, మంత్రులు వెంటనే పదవులకు రాజీనామాలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. శ్రీకాకుళం, చిత్తూరు తదితర ప్రాంతాల్లో ప్రజలు పచ్చకామెర్లు, చికున్ గున్యా, డెంగీలతో విలవిల్లాడుతుంటే పట్టించుకునేవారు కరువయ్యారని వాపోయారు. ఉద్యమాల బూచిచూపి మంత్రులు కాలక్షేపం చేస్తున్నారని, సీఎం కార్యాలయంలో ఫైళ్లు పేరుకుపోయాయని విమర్శించారు.
ఉద్యమాల వల్ల దళితులు, గిరిజనులే ఇబ్బందుల పాలవుతున్నారని, విద్యార్థులు సైతం నష్టపోయారని తెలిపారు. 70 వేల మంది విద్యావలంటీర్ల నియామకాలను నిలిపేశారని, 25వేల టీచర్ పోస్టుల భర్తీకి బ్రేక్ పడిందని చెప్పారు. ప్రజాపంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు. కాగా వచ్చే ఎన్నికల్లో సీపీఐతోనే కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.