
సాక్షి, హైదరాబాద్: సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 3, 4, 5వ తేదీల్లో జరిగే ఈ సమావేశాలకు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు హాజరుకానున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక, మతోన్మాద విధానాలు దేశంతో పాటు రాష్ట్రానికి తీవ్ర నష్టం తెస్తున్నాయని సీపీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న రైతు సమన్వయ సమితులు(జీవో 39, 42), టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీల అమలు, ప్రజలకు నష్టం చేకూర్చేలా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వంటి అంశాలపై చర్చించి కార్యాచరణ నిర్ణయించనున్నట్లు వివరించింది. వచ్చే ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో జరగనున్న పార్టీ 22వ అఖిల భారత మహాసభలు, ఫిబ్రవరిలో జరగనున్న ద్వితీయ రాష్ట్ర మహాసభలపై రాష్ట్ర కమిటీ చర్చించనుంది.