సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్‌పై స్పష్టత వచ్చిన తర్వాతే దానికి మద్దతు ఇచ్చే విషయం గురించి ఆలోచిస్తామని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పేర్కొన్నారు. ఫెడరల్ ఫ్రంట్‌ను కేసీఆర్ ఏ ప్రాతిపదికన పెడుతున్నారో చెప్పాల్సిన అవసరం ఉందని, దాని ప్రకారమే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ నెల 18 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో సీపీఎం 22వ జాతీయ మహాసభలు జరగనున్న నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని గోల్కొండ హోటల్‌లో జరిగిన ఎడిటర్స్ మీట్‌లో ఆయన మాట్లాడారు.
‘నిన్న కేసీఆర్‌ను నేను, మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కలిశాం. రాష్ట్ర రాజకీయాలపై చర్చ జరగలేదు. ఫెడరల్ ఫ్రంట్ గురించి మాత్రం చర్చించాం. కేసీఆర్ ఏ ప్రాతిపదికన ఫెడరల్ ఫ్రంట్ పెడుతున్నారో స్పష్టత ఇస్తే.. మద్దతు ఇవ్వాలా, వద్దా అనేది ఆలోచిస్తాం’ అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో సీపీఎం ఎలాంటి పొత్తులు పెట్టుకోదని, అవగాహన కూడా ఉండదని స్పష్టం చేశారు. వీరభద్రం మాట్లాడుతూ బహుజన లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్‌ఎఫ్) ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ మహాసభలు ఉపకరిస్తాయని అన్నారు.
25 ఏళ్లుగా పొత్తుల వల్ల బలహీనమయ్యామని, ప్రజలకు లబ్ధి జరగలేదని పేర్కొన్నారు. తెలంగాణలో జనసేన పార్టీతో కలిసి పని చేస్తామని, కోదండరాం పార్టీ విధివిధానాలు చెబితే ఆయనతో కలసి పనిచేసే అంశంపై ఆలోచిస్తామన్నారు. రాజకీయాల్లో కూడా సామాజిక న్యాయం జరగాలని అభిప్రాయపడ్డారు. గొర్రెలు, బర్రెలు ఇవ్వడం సామాజిక సహాయం మాత్రమేనని, సామాజిక న్యాయం కాదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment