రాష్ట్రంలో ప్రభుత్వం ఎక్కడుంది?
సాక్షి, హైదరాబాద్: విభజన, సమైక్య ఉద్యమాలతో రాష్ట్రంలో పాలన స్తంభించడం వల్లే ప్రజా సమస్యల పరిష్కారం కోసం గవర్నర్‌ను సంప్రదించామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు చెప్పారు. రాష్ట్రంలో అనిశ్చితికి తెరదించి సామాన్యుల కడగండ్లకు పరిష్కారం చూపాల్సిందిగా ఆయన గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. కుల వివక్ష పోరాట సమితి (కేవీపీఎస్) ఆధ్వర్యంలో మంగళవారం రాఘవులు, చెరుపల్లి సీతారాములు, జమలయ్య, జాన్‌వెస్లీ, శ్రీరామ్ నాయక్, ప్రసాద్ తదితరులు రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఈ మేరకు ఒక వినతి పత్రాన్ని అందజేశారు.
రాష్ట్ర విభజన, సమైక్యాంధ్ర ఉద్యమాల ఆందోళనలతో బడుగు, బలహీన వర్గాలు తీవ్రంగా నష్టపోతున్నాయని వివరించారు. వినతిపత్రంలోని సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళతానని గవర్నర్ పేర్కొనడంతో... ‘అదే (ప్రభుత్వం) ఉంటే మీ దగ్గరకు వచ్చే వాళ్లం కాదు. రాష్ట్రంలో పాలన స్తంభించి ఏడాది దాటి పోయింది’ అని రాఘవులు వ్యాఖ్యానించారు. దీంతో కంగుతిన్న గవర్నర్.. తన పరిధి మేరకు ఏది చేయగలిగితే అది చేస్తానని బదులిచ్చారు.