తారస్థాయికి కాంగ్రెస్ కుట్రలు: గట్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన, సమైక్య ఉద్యమాలపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డ్రామాలు, కుట్రలు తారస్థాయికి చేరుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు దుయ్యబట్టారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అంటే వేయి తలల విష సర్పం వంటిదని అభివర్ణించారు. వెయ్యి తలల్లో ఒకటైన సీఎం కిరణ్ లోపల అమ్మ జపం చేస్తూ, బయటకి సమైక్య ముసుగు వేసుకొని డ్రామాను రక్తి కట్టిస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం తాజాగా కొత్త డ్రామా మొదలెట్టారన్నారు. ‘సమైక్యం వినిపిస్తున్నందుకే తనను తప్పిస్తున్నారంటూ మీడియాకు లీకులిస్తారు. ఇదంతా కూడా కేంద్రం ఆదేశాల మేరకు బ్రహ్మాండంగా లీకులిస్తూ నటనను రక్తికట్టిస్తున్నారు. ఇంతటి ఘోరమైన రాజకీయ డ్రామా ఆడుతున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు భూస్థాపితం చేయడం ఖాయం’ అని దుయ్యబట్టారు. ‘రాష్ట్రాన్ని విభజించాలని సీడబ్ల్యూసీ నిర్ణయం చేసిన తర్వాత కూడా జీవోఎం ఎదుట ఇరు ప్రాంత నేతలు భిన్నమైన వాదనలు వినిపించారు. అధిష్టానం ఆదేశాల మేరకే నివేదిక ఇచ్చానంటూ మంత్రి వసంతకుమార్ చెప్పడం చూస్తే వారి డ్రామా ఏ స్థాయిలో ఉందో? అర్థమవుతుంది’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ నేతల చేత ఉత్సవాలు, కృతజ్ఞత సభలు పెట్టిస్తోందని ధ్వజమెత్తారు.
వెయ్యి తలల విష సర్పమైన కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామాలకు మరో బుల్లి విష సర్పంలా టీడీపీ వంతపాడుతోందని గట్టు దుయ్యబట్టారు. కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన స్క్రిప్టును చంద్రబాబు రక్తి కట్టిస్తున్నారన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల వల్ల ప్రజలు తీవ్ర గందరగోళానికి గురవుతుంటే.. ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు సమైక్యమో, విభజనో ఏ ఒక్కటి స్పష్టం చేయకుండా మరింత గందరగోళానికి గురిచేస్తూ, కాంగ్రెస్‌కు సహకరిస్తున్నారని విమర్శించారు. ప్రజల ఆకాంక్ష మేరకు చాలా స్పష్టంగా వైఎస్సార్‌సీపీ సమైక్య వాణి వినిపిస్తుంటే, తమపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు మాదిరి కేసుల విచారణ నుంచి తప్పించుకునేందుకు తాము చీకట్లో సోనియా కాళ్లు పట్టుకోలేదని మండిపడ్డారు. ఇప్పటి దాకా చంద్రబాబు ఏ ఒక్క రోజైనా సోనియాను విమర్శించారా? అని గట్టు ప్రశ్నించారు.