గట్టు రామచంద్రరావు (ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్: ప్రజల కోసం చేపట్టిన ప్రజాసంకల్పయాత్రను విజయవంతంగా పూర్తి చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి గట్టు రామచంద్రరావు అభినందనలు తెలిపారు. వైఎస్ జగన్ తొలుత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుగా గుర్తింపు పొందినప్పటికీ ఆయన ప్రజల మధ్యలోనే ఎదిగారని, ప్రజలలోనే పెరిగారని ఆయన అభిప్రాయడ్డారు. ప్రజలను నమ్ముకున్న ఏ నాయకుడు కూడా నష్టపోడని, ప్రజలు లేకపోతే తానులేనుకునే నాయకుడు జగన్ అని ఆయన కొనియాడారు.
వైఎస్ జగన్ పాదయాత్ర ముగింపు సందర్భంగా బుధవారం ‘సాక్షి టీవీ’తో రామచంద్రరావు మాట్లాడారు. సొంత పార్టీ పెట్టుకుని ప్రజల అభిమానాలు, ఆదరణను జగన్ పొందారని అన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిస్తే కేవలం 5 లక్షల 40వేల ఓట్లు మాత్రమే వైఎస్సార్‌సీపీ కంటే ఎక్కువగా వచ్చాయని, బీజేపీ లేకపోతే అన్ని ఓట్లు కూడా రావని వెల్లడించారు. కేవలం ఒక్క ఎమ్మెల్యేతో సొంత పార్టీని స్థాపించి నేడు 67 మంది ఎమ్మెల్యేలు, తొమ్మిది మంది ఎంపీలు సాధించి ఏపీలో బలమైన నేతగా జగన్ ఎదిగారని ఆయన పేర్కొన్నారు.
కేంద్రంలో తనకు బలం సరిపోదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో పొత్తుల కోసం ప్రయత్తిస్తున్నారని, ఏపీలో కూడా టీడీపీకి బలం సరిపోదని చంద్రబాబు నాయుడు పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందే వైఎస్ జగన్ ముందు చంద్రబాబు ఓడిపోయారని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికలు జగన్, ఆయన వ్యతిరేకుల మధ్యనే జరుగుతాయని, భవిష్యత్తులో ఆయనకు మంచి జరుగుతుందని ఆశిస్తున్నట్లు గట్టు రామచంద్రరావు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment