samaikya movement
-
పెండింగ్‌లో 13 ‘సమైక్య కేసులు’
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో నమోదైన కేసుల తొలగింపుపై పోలీసు విభాగం కసరత్తు పూర్తి చేసింది. 257 కేసుల ఎత్తివేతపై తుది నిర్ణయం తీసుకోవాలని సమీక్ష కమిటీ ప్రభుత్వానికి గురువారం నివేదించింది. దాదాపు 1,900 కేసులు నమోదయ్యాయి. వీటిలో కొన్నింటికి ప్రభుత్వం అప్పట్లోనే ఎత్తివేసింది. ఏపీ డీజీపీగా వెంకటరాముడు బాధ్యతలు చేపట్టే నాటికి 847 కేసులు మిగిలాయి. అన్ని కేసులను ఎత్తేయాలని ప్రభుత్వం నిర్ణరుుంచిన నేపథ్యంలో పోలీసు విభాగం కసరత్తు చేపట్టింది. 13 కేసులు తీవ్రమైన ఆరోపణలతోపాటు రైల్వేలు లాంటి కేంద్రం ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం లాంటి కేసులున్నట్లు కమిటీ గుర్తించింది. వీటిపై నిర్ణయం తీసుకునే అవకాశం లేదని చెప్పింది. -
ఎగసిన సమైక్య పోరు
సాక్షి నెట్వర్క్: సమైక్య ఉద్యమం మరోమారు ఉవ్వెత్తున ఎగిసింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకిస్తూ ఏపీఎన్జీవోల ఆధ్వర్యంలో సాగుతున్న సమ్మె శుక్రవారం రెండోరోజుకు చేరింది. ఈ సమ్మె ప్రభావంతో సీమాంధ్ర జిల్లాల్లో పాలన స్తంభించింది. పలు ప్రాంతాల్లో ఎన్జీఓలు, సమైక్యవాదుల ఆధ్వర్యంలో రాస్తారోకోలు, ర్యాలీలు, మానవహారాలు, విగ్రహాలకు క్షీరాభిషేకాలు, దిష్టిబొమ్మల దహనాలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని కోఠి డీఎంహెచ్ఎస్, అబిడ్స్ తిలక్‌రోడ్డులోని బీమా భవన్లో ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఏపీ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ పెన్‌డౌన్ కార్యక్రమం చేపట్టింది. విద్యుత్‌సౌధ ఆవరణలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సహా అన్ని పట్టణాల్లోను ఎన్జీవోలు ర్యాలీలు, రాస్తారోకోలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో భరతమాత వేషధారణలో జెడ్పీ సిబ్బంది నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే దిష్టిబొమ్మకు ఉరి వేశారు. విశాఖ కలెక్టరేట్ వద్ద కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మల్ని దహనం చేశారు. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో లక్ష సంతకాల సేకరణ చేపట్టారు. విజయనగరంలోని బీఎస్ఎన్ఎల్, పోస్టల్ కార్యాలయాలను ముట్టడించారు. నెల్లూరులో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కిరణ్, చంద్రబాబు ఫ్లెక్సీలను దహనం చేశారు. కృష్ణా జిల్లా కైకలూరులో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. విజయవాడలో మున్సిపల్ ఉద్యోగులు ప్రదర్శన నిర్వహించగా న్యాయవాదులు రిక్షాలు తొక్కి నిరసన తెలిపారు. గుంటూరులో మానవహారం నిర్వహించారు. ఒంగోలులో న్యాయవాదులు వంటావార్పు చేపట్టారు. అనంతపురం జిల్లా శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీలో జేఏసీ నాయకులు రోడ్డుపై బైఠాయించారు.వైఎస్సార్ జిల్లా రాయచోటిలో సమాచార హక్కు చట్టం రాష్ట్ర కన్వీనర్ ఇంతియాజ్ అహ్మద్‌ను సమైక్యవాదులు అడ్డుకున్నారు. -
క్షమించు భారతీ
ఏ రంగంలోనైనా ఏటా పురోగతి సాధించడం రివాజు... కానీ జిల్లా విద్యారంగంలో మరింత వెనుకబడిపోయింది. పది ఫలితాల్లో తొమ్మిదో స్థానాన్ని నిలబెట్టుకోగా, ఇంటర్లో ‘17’ నుంచి చిట్టచివరి స్థానానికి దిగజారింది. విద్యాహక్కు చట్టం ఎక్కడా అమలుకు నోచుకోలేదు. ఆర్వీఎం, విద్యాశాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో విద్యావ్యవస్థ నిర్వీర్యమైపోతుందనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో, హాస్టళ్లలో వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. - న్యూస్‌లైన్, మహబూబ్‌నగర్ విద్యావిభాగం జిల్లాలో విద్యారంగం అభివృద్ధి నత్తనడకన నడుస్తోంది. ఎంతో ఉన్నతాశయంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినా ఈ పథకం అమలుపై, పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం రిజర్వేషన్ అమలుపై కూడా ప్రభుత్వం తగిన ఉత్తర్వులు ప్రకటించనే లేదు. నిధుల మంజూరు కూడా అంతంత మాత్రమే. దీనికి తోడు సర్కారు పథకాలేవీ సమర్థవంతంగా అమలు కాకపోవడంతో విద్యారంగం ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా మారింది. తెలంగాణ, సమైక్య ఉద్యమాల వల్ల ఈ ఏడాది ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నిలిచిపోయింది. కార్పొరేట్ విద్యను అభ్యసించలేక విద్యార్థులు బడిమెట్లు ఎక్కలేకపోయారు. పత్తిచేళ్లు, పంటపొలాల్లో మరోఏడాది బాల్యం గడిచిపోయింది. నిరంతర సమగ్ర మూల్యాంకన ప్రకారం బోధన కొనసాగించాలని ఆదేశాలున్నప్పటికీ, ఉపాధ్యాయులకు శిక్షణలు ఇచ్చినప్పటికీ పాఠశాలల్లో సీసీఈ ప్రకారం బోధన కొనసాగలేదు. - న్యూస్‌లైన్, మహబూబ్‌నగర్ విద్యావిభాగం బదిలీలు పదోన్నతులు జిల్లా వ్యాప్తంగా 2794 మంది ఉపాధ్యాయులు బదిలీ అవకాశాన్ని దక్కించుకున్నారు. ప్రతినెల పదోన్నతుల కౌన్సెలింగ్ చేపడుతుండటంతో ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా 700మంది ఉపాధ్యాయులకు పదోన్నతి అవకాశం దక్కింది. జిల్లాలో కొత్తగా ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఇంటర్ కోర్సును ప్రవేశపెట్టి పరీక్షలను కూడా నిర్వహించడంతో ఓపెన్ విధానంతో వయోజనులకు ఇంటర్ చదివే అవకాశం దక్కింది. ఏప్రిల్ 22న అంతర్ జిల్లాల బదిలీలు నిర్వహించి, 59 మందికి పోస్టింగ్ ఇచ్చారు. డీఈఓ సుదర్శన్‌రెడ్డి బదిలీ కాగా, ఆయన స్థానంలో ఏప్రిల్ 26న చంద్రమోహన్ డీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. మే 24న ఆర్వీఎం పీఓ విష్ణువర్ధన్‌రావు బదిలీ కాగా, ఆయన స్థానంలో పద్మహర్ష ఇన్చార్జి పీఓగా బాధ్యతలు చేపట్టారు. ‘పది’లో తొమ్మిదో స్థానం పదోతరగతిలో గతేడాది 90.59 శాతంతో తొమ్మిదో స్థానంలో నిలిచిన జిల్లా ఈసారి కూడా ఉత్తీర్ణత శాతం (91.22) పెరిగినా ఆ స్థానాన్ని నిలబెట్టుకుంది. మొత్తం 45,897 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 41,868 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈసారి కూడా గ్రేడింగ్ విధానంలో ఫలితాలు విడుదల చేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సైతం పదికి పది (గ్రేడ్1) పాయింట్లు సాధించడం విశేషం. ఇంటర్లో అట్టడుగు.. ఇంటర్ ఫలితాల్లో ఈ సారి పాలమూరు జిల్లా అట్టడుగు స్థానంలో నిలిచింది. గతేడాది 57 శాతం ఉత్తీర్ణతతో 17వ స్థానంలో నిలవగా, ఈ సారి 45 శాతంతో చివరి స్థానానికి దిగజారింది. మొత్తం 37,039 మంది పరీక్ష లకు హాజరుకాగా, 16,580 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ కళాశాల ఉత్తీర్ణతలో జిల్లా 58 శాతంతో 12వ స్థానంలో నిలిచింది. ఇంటర్ ఫస్టియర్‌లో 40 శాతంతో చివరిస్థానంలోనే నిలిచింది. ముఖ్యమైన పోస్టులు ఖాళీ... జిల్లాలోని 64 మండలాలకు గాను 50 మండలాలకు రెగ్యులర్ ఎంఈఓలు లేరు. డిప్యూటీ ఈఓలు సైతం డిప్యుటేషన్‌పై పనిచేస్తుండటంతో విద్యా వ్యవస్థ గాడిన పడటం లేదు. అధికారుల అలసత్వం కారణంగా జిల్లాలోని 39 ఎయిడెడ్ పాఠశాలల్లో దాదాపు 200 ఉపాధ్యాయ పోస్టులకు పైగా ఖాళీ ఏర్పడింది. నిరుద్యోగులకు తప్పని నిరాశ... టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే అర్హత పరీక్ష(టెట్) వాయిదా పడటంతో అభ్యర్థులలో అయోమయం నెలకొంది. రాష్ట్ర విభజన ఉద్యమాలతో ప్రభుత్వం టెట్‌ను పలుమార్లు వాయిదా వేసింది. దీంతో డీఎస్సీపై నీలినీడలు కమ్ముకున్నాయి. జిల్లాలోని వేలాది మంది డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు టెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. పంతుళ్లపై క్రిమినల్ కేసులు నకిలీ మెడికల్ బిల్లులతో ప్రభుత్వ సొమ్మును కాజేసిన 37 మంది ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులు పెట్టారు. విజిలెన్స్ అధికారులు విచారణ చేసి, ఈ విషయాన్ని బయటపెట్టారు. నవంబర్ 21న ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ వాణిమోహన్ ఆదేశాలు జారీ చేశారు. మి(మ)థ్యాన్న భోజనం జిల్లాలోని 3677 సర్కారు బడుల్లోని 4,90,254 విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాల్సి ఉంది. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు, విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణాలోపం కారణంగా ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేయలేదు. ఫిబ్రవరి 6న ఎమ్మెల్సీ చుక్కా రామయ్య కొండనాగుల డిగ్రీ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. అదే నెల 15న మంత్రి డీకే అరుణ ఈ పథకంలో జొన్నకిచిడిని ప్రారంభించారు. పీయూ విశేషాలు ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 16న ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి పీయూ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. పీయూ అభివృద్ధి కోసం * 15 కోట్ల ప్యాకేజీ ఇస్తానని సీఎం హామీ ఇచ్చారు. ఇప్పటివరకు రూ.8.9 కోట్లు మంజూరు చేశారు. పాలమూరు యూనివర్సిటీ పరిధిలో 12 పీజీ కళాశాలలు, 68 డిగ్రీ కళాశాలలు, 2 ఫార్మసీ కళాశాల, 40 బీఈడీ కళాశాలలు, 5ఎంబీఏ కళాశాలలు ఉన్నాయి. పీయూ ప్రిన్సిపల్ పిండి పవన్‌కుమార్‌కు రిసెర్చ్‌లో యూజీ అవార్డు వచ్చింది. పీయూలో అడ్మినిస్ట్రేషన్, లైబ్రరీ, పీజీ. ఫా ర్మసీ విభాగాలకు నూతన భవనాలు నిర్మించారు. ముఖ్య సంఘటనలు... గతేడాదికి సంబంధించిన యూనిఫామ్‌లను మాత్రమే ఈ విద్యాసంవత్సరంలో విద్యార్థులకు సరఫరా చేశారు. ఎంఈఓలు ఓ కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై జిల్లా కేంద్రంలోనే యూనిఫామ్స్ కుట్టేందుకు అప్పగించారు. కలెక్టర్ ఆదేశాలతో అధికారులు గోదాంలపై దాడి చేసి యూనిఫామ్స్ వస్త్రాన్ని సీజ్ చేశారు. జూన్ 22న ప్రైవేట్ పాఠశాలల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయ ముట్టడి నిర్వహించారు. పోలీసులు లాఠీచార్జి చేయడంతో పలు విద్యార్థి సంఘాల నాయకులకు గాయాలయ్యాయి. జూలైలో బల్మూర్ కేజీబీవీ విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈసారి జిల్లాలోఆరుగురుజాతీయ ఉత్తమఉపాధ్యాయు లుగాఎంపికకాగా,11మందిరాష్ట్రస్థాయి, 42మంది జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు అందుకున్నారు. వైఫల్యాలు... స్కూల్ కాంప్లెక్సు నిర్వహణ తగిన విధంగా కొనసాగడం లేదు. కిందిస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా కాంప్లెక్స్‌ల ద్వారా సాధించాల్సిన లక్ష్యాలు వెనుకబడి పోయాయి. రాజీవ్ విద్యామిషన్ పథకం ద్వారా ఈ ఏడాది జిల్లాలో చేపట్టిన పలు కార్యక్రవూలు తగిన ఫలితాలు చూపలేదు. అన్నీ మొక్కుబడి కార్యక్రమాలే కొనసాగాయి. విద్యార్థుల ఆరోగ్య స్థితిని మెరుగుపర్చేందుకు ప్రవేశపెట్టిన జవహర్ బాల ఆరోగ్య రక్ష పథకం సక్రమంగా అమలు కావడంలేదు. నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రకారం పూర్తిస్థాయిలో బోధన అమలు కావడం లేదు. విద్యాహక్కు చట్టం అమలులో భాగంగా ఉపాధ్యాయులు బోధనేతర విధుల్లో ఉండకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ కేజీబీవీ, సంక్షేమ హాస్టళ్లు, ఇతర డిపార్ట్మెంటుల్లో రాజకీయ పలుకుబడితో ఉపాధ్యాయులు డిప్యూటేషన్‌పై కొనసాగుతున్నారు. పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణం, మూత్ర శాలలు, కిచెన్ షెడ్లు, ఇతర నిర్మాణాల కోసం నిధులు మంజూరయినప్పటికీనిర్మాణాలు నత్తనడకన కొనసాగుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభంలో చేపట్టిన బడిబాట కార్యక్రమం మొక్కుబడిగానే సాగింది. విద్యావ్యాపారాన్నిఅడ్డుకోవడంలోఅధికారులువిఫలమయ్యారు. -
బతికి బట్టకట్టేదెలా?
మన్నును నమ్ముకున్న రైతన్నలకే కాదు- మగ్గాన్ని నమ్ముకున్న నేతన్నలకూ మనుగడ గండంగా మారిపోతోంది. తెల్లని దారపుపోగుల నుంచి వన్నెలవన్నెల వస్త్రాలను సృష్టించే వారి బతుకులు వెలసిపోతున్నాయి. సమాజానికి గుడ్డ సమకూర్చే వారికి కూడు కనాకష్టమయ్యే గడ్డుకాలం దాపురిస్తోంది. వారికి అండగా నిలవాల్సిన చేనేత సహకార సంఘాలు.. చిక్కులు పడ్డ దారపు ఉండను సరి చేయాల్సి వచ్చినట్టు... దిక్కుతోచని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. బతికి బట్టకట్టేదెలా? సాక్షి, కాకినాడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చిన్నచూపు, మూడు నెలల పాటు సాగిన సమైక్య ఉద్యమం, వరుస తుపాన్లు, భారీ వర్షాలతో చేనేత కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పుండు మీద కారం చల్లినట్టు.. చేనేత వస్త్రాలకు ఇచ్చే 20 శాతం రిబేట్‌ను కేంద్రం పూర్తిగా రద్దు చేసింది. పండుగ సీజన్లో గిరాకీ ఉన్నా చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ లేకుండా పోయింది. దీనికి తోడు ఆప్కో కూడా కొనే పరిస్థితి లేకపోవడంతో సొసైటీల్లో కోట్లాది రూపాయల వస్త్ర ఉత్పత్తులు పేరుకుపోయాయి. అటు సొసైటీలు నష్టాల పాలై, ఇటు చేనేత కార్మికులు అప్పుల ఊబిలో కూరుకుపోయే దుస్థితి నెలకొంది. జిల్లాలో లక్ష మందికి పైగా మగ్గాలపై ఆధారపడి జీవిస్తున్నారు. ఉప్పాడ, బండార్లంక, గొల్లప్రోలు, పుల్లేటికుర్రు, మోరి, కె.జగన్నాథపురం, ద్వారపూడి, విలసవిల్లి తదితర గ్రామాల్లో సుమారు 18,061 గోతిమగ్గాలుండగా, ఒక్కో మగ్గంపై నలుగురు చొప్పున సుమారు 80 వేల మంది వరకు ఆధారపడి జీవిస్తున్నారు. మగ్గంపై ఆధారపడే కుటుంబంలో నలుగురు కలిసి రోజుకు రూ.300 నుంచి రూ.500 వరకు సంపాదిస్తుంటారు. జిల్లాలో 50 చేనేత సహకార సంఘాలున్నాయి. వీటికి డీసీసీబీ రూ.12 కోట్ల మేర రుణ సౌకర్యం కల్పించింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.25 కోట్ల విలువైన చేనేత వస్త్రాలు ఉత్పత్తి అవుతాయని అంచనా. ఇప్పటికే సొసైటీల వద్ద రూ.7.5 కోట్ల విలువైన చేనేత ఉత్పత్తులు పేరుకుపోయాయి. ముఖ్యంగా అంగర, పులగుర్త, మోరి తదితర సొసైటీల్లో నిల్వలు భారీగా ఉన్నాయి. నెలల తరబడి ఉండిపోవడం వలన ఈ ఉత్పత్తుల నాణ్యత కూడా దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. అమ్మేదెలాగో అగమ్యగోచరం.. ప్రొడక్షన్ ప్రోగ్రామ్ (పీపీ) కింద ప్రభుత్వం జిల్లాలో ఆప్కోకు తొలి అర్థ సంవత్సరంలో రూ.3.15 కోట్లు మంజూరు చేసింది. ఇటీవలే రెండో అర్థ సంవత్సరానికి సంబంధించి రూ.2.66 కోట్లు విడుదల చేసింది. సొసైటీల వద్ద ఏడున్నర కోట్ల విలువైన ఉత్పత్తులు పేరుకుపోవడంతో పీపీ కింద రూ.ఆరు కోట్లు మంజూరు చేయాలంటూ జిల్లా నుంచి ప్రతిపాదనలు పంపగా కేవలం రూ.2.66 కోట్లు మాత్రమే విడుదల చేశారు. ఈ మొత్తంతో సొసైటీల వద్ద పేరుకుపోయిన వస్త్ర నిల్వలను ఎలా కొనుగోలుచేయాలో పాలుపోని స్థితిలో ఆప్కో ఉండగా.. 20 శాతం రిబేట్ రద్దు చేయడంతో ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలో తెలియక సొసైటీలు అయోమయంలో పడుతున్నాయి. ఉత్పత్తి అయిన వస్త్రాల్లో మూడో వంతైనా ఆప్కో కొనుగోలు చేస్తే తప్ప కార్మికులకు సొసైటీలు పని కల్పించలేని పరిస్థితి నెలకొంది. పీపీ కింద మంజూరైన రూ.2.66 కోట్లను కూడా రానున్న ఆర్థిక సంవత్సరంలో రెండు దఫాలుగా సొసైటీల నుంచి వస్త్ర నిల్వలు కొనుగోలు చేసే వెసులుబాటునిచ్చారు. ఈ నెలాఖరులోగా రూ.1.33 కోట్ల విలువైన ఉత్పత్తులను కొనుగోలు చేయనుండగా, మిగిలిన రూ.1.33 కోట్ల విలువైన ఉత్పత్తులను ఫిబ్రవరిలో కొనుగోలు చేస్తారు. మిగిలిన ఉత్పత్తులను ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలో తెలియక సొసైటీ పాలకవర్గాలు దిక్కులు చూస్తున్నాయి. కనీసం 20 శాతం రిబేట్‌ను పునరుద్ధరిస్తే కొద్దొగొప్పో ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోగలుగుతామని చెబుతున్నారు. జిల్లాలో 12 వేల మంది కార్మికుల ఉపాధిపై రిబేట్ రద్దు తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లాలో 50 సంఘాలకు గాను 47 సంఘాలకు 20 శాతం రిబేటును పొందేందుకు అర్హత ఉంది. రిబేట్ రద్దు వల్ల గత ఏడు నెలలో రూ.75 లక్షలకు పైగా అమ్మకాలు తగ్గిపోవడంతో ఆ మేరకు ఉత్పత్తిపై ప్రభావం చూపింది. ఇప్పటికే ఆప్కో ద్వారా సంఘాలకు రావాల్సిన బకాయిసొమ్ము రూ.10 కోట్లకు పైనే ఉంది. గత ఐదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లాకు నూలుపై రిబేటు రూపంలో దాదాపు రూ.3.5 కోట్లు విడుదల కావాల్సి ఉంది. సంఘాల మనుగడ కష్టమే.. ప్రస్తుతం సొసైటీల్లో రూ.25 కోట్ల విలువైన వస్త్రాలు తయారయ్యే అవకాశముండగా ఆప్కో కనీసం రూ.6 కోట్ల విలువగల వస్త్రాలు కూడా కొనలేని పరిస్థితి నెలకొంది. ఉత్పత్తిలో మూడో వంతైనా కొనుగోలు చేస్తే తప్ప సంఘాలు మనుగడ సాగించలేవు. రిబేటు లేకపోవడం వల్ల సంఘాల్లో దుస్తులు పేరుకుపోయాయి. కనీసం రిబేటైనా ఇస్తే దుస్తులు బహిరంగ మార్కెట్లో అమ్ముకోవడానికి సాధ్యమవుతుంది. - చింతా వీరభద్రేశ్వరరావు, మోరి చేనేత సొసైటీ అధ్యక్షుడు -
సమర పథంలో...
సాక్షి, కాకినాడ : సమైక్య ఉద్యమం జిల్లాలో హోరెత్తుతోంది. ఏపీ ఎన్జీఓల సమ్మె విరమణతో కాస్త ఊపుతగ్గిన ఉద్యమానికి వైఎస్సార్ కాంగ్రెస్ కొత్త ఊపిరులూదింది. రాష్ట్ర విభజన బిల్లు రాష్ర్టపతి నుంచి అసెంబ్లీకి చేరుకున్నా- సమైక్యాంధ్ర సాధనే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయస్థాయిలో చేస్తున్న ఉద్యమంతో ఏదో ఒక దశలో విభజన ఆగిపోతుందన్న నమ్మకం సమైక్యవాదుల్లో బలంగా కనిపిస్తోంది. ఆ నమ్మకంతోనే జగన్ ఇచ్చిన ప్రతి పిలుపునకు సంపూర్ణ మద్దతునిస్తున్నారు. ఆ క్రమంలోనే గురువారం పార్టీ పిలుపు మేరకు రహదారుల దిగ్బంధం విజయవంతమైంది. గంటల తరబడి సాగిన ఆందోళనలో సమైక్యవాదులు కదంతొక్కారు. వంటావార్పులు, దిష్టిబొమ్మల దహనాలు, మానవ హారాలు, ధర్నాల వంటి నిరసన కార్యక్రమాలకు రహదారులు వేదికలయ్యాయి. సమైక్యనినాదాలతో మార్మోగాయి. జిల్లా మీదుగా వెళ్లే 16, 216 నంబర్ల జాతీయ రహదారులతో పాటు పలు చోట్ల ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ రహదారులనూ దిగ్బంధించారు. పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి సహా జిల్లాలో పలు చోట్ల జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో సుమారు 52 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు గోకవరం పాత బస్టాండ్ సెంటర్లో రాస్తారోకో చేశారు. వంటావార్పు చేసి సహపంక్తి భోజనాలు చేశారు. అమలాపురం ఎర్రవంతెన వద్ద జాతీయ రహదారి- 216ని కుడుపూడి చిట్టబ్బాయి, మాజీ ఎంపీ ఏజేవీబీ మహేశ్వరరావుల ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు దిగ్బంధించడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. చిట్టబ్బాయి, మహేశ్వరరావులతో పాటు 40 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు. కాకినాడ భానుగుడి సెంటర్లో తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర శేఖరరెడ్డి ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆందోళన నిర్వహించి రోడ్డుపైనే భోజనాలు చేశారు. కాకినాడ రూరల్ కో ఆర్డినేటర్, జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణు, జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ రావూరి వెంకటేశ్వరరావు, నగర కన్వీనర్ ఆర్‌వీజేఆర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సోనియా తదితరుల దిష్టిబొమ్మల దహనం మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో రావులపాలెం వద్ద జాతీయ రహదారి-16ని దిగ్భందించారు. పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మల కుమారి, జిల్లా సేవాదళ్, వాణిజ్య విభాగాల కన్వీనర్లు మార్గన గంగాధర్, కర్రి పాపారాయుడు, జిల్లా అధికారప్రతినిధి గొల్లపల్లి డేవిడ్‌రాజులతో పాటు వందలాది మంది కార్యకర్తలు పాల్గొని సోనియా తదితరుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ప్రత్తిపాడు మండలం ధర్మవరం వద్ద జాతీయ రహదారి-16పై మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బా రావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, సమైక్యవాదులు రాస్తారోకో చేశారు. రోడ్డుపైనే వంటావార్పు చేసి నిరసన తెలిపారు. రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ బొమ్మన రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో లాలాచెరువుసెంటర్‌లో జాతీయ రహదారి -16ని పార్టీ శ్రేణులు దిగ్బంధించగా బొమ్మన, సేవాదళ్ రాష్ర్ట కార్యదర్శి సుంకర చిన్ని, జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గారపాటి ఆనంద్‌లతో పాటు 12 మందిని అదుపులోకి తీసుకొని సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు. కాకినాడ రూరల్ మండలం పండూరు జంక్షన్లో 216 జాతీయ రహదారిని నియోజకవర్గ కో ఆర్డినేటర్, జెడ్పీ మాజీచైర్మన్ చెల్లుబోయిన వేణు ఆధ్వర్యంలో దిగ్బంధించారు. సోనియా, కేసీఆర్, దిగ్విజయ్‌సింగ్, చంద్రబాబు తదితరుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. పిఠాపురం బైపాస్‌రోడ్‌లో 216 జాతీయ రహదారిని మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆధ్వర్యంలో దిగ్బంధించారు. మండపేట కో ఆర్డినేటర్ రెడ్డి వీరవెంకట సత్యప్రసాద్, కిసాన్‌సెల్ జిల్లా కన్వీనర్ రెడ్డి రాధాకృష్ణల ఆధ్వర్యంలో ద్వారపూడి వంతెన వద్ద కాకినాడ-రాజమండ్రి కెనాల్రోడ్ను దిగ్బంధించారు. తుని కో ఆర్డినేటర్ దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో కొట్టాం జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. పార్టీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ రొంగలి లక్ష్మి, మాజీ ఎంపీపీ మాకినీడి గంగారావు, లోవ దేవస్థానం మాజీ చైర్మన్ లాలం బాబ్జి తదితరులతో పాటు పెద్దసంఖ్యలోపార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అక్విడెక్టుపై వంటావార్పు మలికిపురం మండలం దిండి వద్ద చించినాడ వంతెనపై రాజోలు కో ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. పి.గన్నవరం డొక్కా సీతమ్మ అక్విడెక్టుపై పార్టీ కో ఆర్డినేటర్లు కొండేటి చిట్టిబాబు, విప్పర్తి వేణుగోపాల్, మందపాటి కిరణ్‌కుమార్, మిండగుదిటి మోహన్, రైతు విభాగం రాష్ర్ట కమిటీ సభ్యుడు జక్కంపూడి తాతాజీ తదితరుల ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించారు. నగరంలో గ్యాస్ కలెక్షన్ సెంటర్ ఎదుట కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో 216 జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. రంపచోడవరం మండలం పందిరిమామిడి వద్ద స్థానిక నాయకుల ఆధ్వర్యంలో రాజమండ్రి-భద్రాచలం రహదారిని కొద్దిసేపు దిగ్బంధించారు. ముమ్మిడివరం కో ఆర్డినేటర్ గుత్తుల సాయి ఆధ్వర్యంలో ముమ్మిడివరం తహశీల్దార్ కార్యాలయం ఎదుట రాస్తారోకో నిర్వహించి వంటావార్పు నిర్వహించారు. రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో బొమ్మూరు సెంటర్లో జాతీయ రహదారి-16ని దిగ్బంధించారు. సామర్లకోట రైల్వేస్టేషన్ సెంటర్లో రహదారి దిగ్బంధనం జరిగింది. కోరుకొండలో జరిగిన ‘గ డపగడపకూ వైఎస్సార్సీపీ సమైక్యనాదం’ కార్యక్రమంలో పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి పాల్గొన్నారు. -
దిగ్విజయ్ హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదు: ఆశోక్ బాబు
హైదరాబాద్: రాష్ట్రవిభజనపై పార్లమెంటులో ఉన్న తెలంగాణ బిల్లు రాష్ట్ర అసెంబ్లీకి రానున్న నేపథ్యంలో కేంద్రం సమైక్య రాష్ట్రంపై స్పష్టమైన వైఖరిని ఇచ్చేవరకు ఉద్యమం ఆగదంటూ ఎపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు హెచ్చరించారు. ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దిగ్విజయ్ హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదంటూ ఆయన మండిపడ్డారు. సొంతపార్టీపై అవిశ్వాసం పెట్టిన సీమాంధ్ర ఎంపీలను అభినందిస్తున్నామని చెప్పారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తూ అన్ని పార్టీలు సహకరించాలని అశోక్ బాబు కోరారు. అయితే సమైక్యానికి సహకరించని ఎంపీలకు మాత్రం సాంఘిక బహిష్కరణ తప్పదన్నారు. -
ముక్కలు కానివ్వం.. సమైక్యవాదుల ప్రతిన
108రోజులకు చేరిన ఉద్యమం సాక్షి నెట్వర్క్: సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం 108వరోజూ శుక్రవారం సీమాంధ్ర జిల్లాల్లో ఉద్ధృతంగా సాగింది. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వబోమని ప్రతిజ్ఞ చేశారు. బెజవాడ బార్ అసోసియేషన్ (బీబీఏ) న్యాయవాదులు విజయవాడలో రైల్‌రోకో చేపట్టేందుకు విఫలయత్నం చేశారు. న్యాయవాదుల ప్రతిఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కృష్ణాజిల్లా రెడ్డిగూడెం మండలం నాగులూరుకు చెందిన 74ఏళ్ల గోగులమూడి రామకోటిరెడ్డి కాలినడకన 54 కిలోమీటర్ల దూరంలో ఉన్న జమలాపురం శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు బయల్దేరి వెళ్లారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఉపాధ్యాయులు రాస్తారోకో చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ముస్లిం లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. విద్యార్థులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. కాగా, రాష్ట్రాన్ని విభజించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయానికి ఏ రాజకీయ పార్టీ అయినా మద్దతు తెలియజేస్తే ఎస్కేయూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో మిలిటెంట్ పోరాటాలు చేయడంతో పాటు అవసరమైతే భౌతిక దాడులకు కూడా వెనుకాడే ప్రసక్తే లేదని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు పరుశురాంనాయక్ హెచ్చరించారు. మంత్రి రఘువీరా, ఎమ్మెల్యే గుప్తాకు సమైక్యసెగ అనంతపురం జిల్లా కదిరిలో మంత్రి రఘువీరారెడ్డిని సమైక్యవాదులు అడ్డుకున్నారు. రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లోపు తెలంగాణపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ప్రయత్నం చేస్తున్నట్లు మంత్రి రఘువీరా చెప్పారు. అనంతపురంలో డీసీసీ అధ్యక్షుడు, గుంతకల్లు ఎమ్మెల్యేమధుసూదన్గుప్తాను శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ (ఎస్కేయూ) జేఏసీ నాయకులు అడ్డుకుని సమైక్య నినాదాలు చేశారు. మోసం చేసిందని చెబుతున్న పార్టీలో ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ శ్రేణుల ఉద్యమపథం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు సమైక్యాంధ్ర పరిరక్షణకు పార్టీ శ్రేణులు శుక్రవారం కూడా విభిన్నరూపాల్లో ఆందోళనలు కొనసాగించాయి. తూర్పుగోదావరి పి.గన్నవరం మండ లం ముంగండపాలెంలో, ప్రత్తిపాడు నియోజకవర్గంలో జడ్డంగి అన్నవరం, తూర్పు లక్ష్మీపురం గ్రామా ల్లో గడపగడపకూ వైఎస్సార్సీపీ సమైక్యనాదం పేరిట పాదయాత్రలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం బిరదవోలులో సమైక్య దీవెనయాత్ర చేపట్టారు.బాలాయపల్లి మండలం కాలగంధ, కాట్రగుంట, కరిమెనగుంట గ్రామాల్లో, అనంతపురం జిల్లా నల్లమాడలో పాదయాత్రలు చేపట్టారు. చిత్తూరులో గడపగడపకూ సమైక్యశంఖారావం పేరిట పాదయాత్ర జరిగింది. జిల్లాలోని పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి రిక్షాతొక్కి నిరసన తెలిపారు. -
తారస్థాయికి కాంగ్రెస్ కుట్రలు: గట్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన, సమైక్య ఉద్యమాలపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డ్రామాలు, కుట్రలు తారస్థాయికి చేరుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు దుయ్యబట్టారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అంటే వేయి తలల విష సర్పం వంటిదని అభివర్ణించారు. వెయ్యి తలల్లో ఒకటైన సీఎం కిరణ్ లోపల అమ్మ జపం చేస్తూ, బయటకి సమైక్య ముసుగు వేసుకొని డ్రామాను రక్తి కట్టిస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం తాజాగా కొత్త డ్రామా మొదలెట్టారన్నారు. ‘సమైక్యం వినిపిస్తున్నందుకే తనను తప్పిస్తున్నారంటూ మీడియాకు లీకులిస్తారు. ఇదంతా కూడా కేంద్రం ఆదేశాల మేరకు బ్రహ్మాండంగా లీకులిస్తూ నటనను రక్తికట్టిస్తున్నారు. ఇంతటి ఘోరమైన రాజకీయ డ్రామా ఆడుతున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు భూస్థాపితం చేయడం ఖాయం’ అని దుయ్యబట్టారు. ‘రాష్ట్రాన్ని విభజించాలని సీడబ్ల్యూసీ నిర్ణయం చేసిన తర్వాత కూడా జీవోఎం ఎదుట ఇరు ప్రాంత నేతలు భిన్నమైన వాదనలు వినిపించారు. అధిష్టానం ఆదేశాల మేరకే నివేదిక ఇచ్చానంటూ మంత్రి వసంతకుమార్ చెప్పడం చూస్తే వారి డ్రామా ఏ స్థాయిలో ఉందో? అర్థమవుతుంది’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ నేతల చేత ఉత్సవాలు, కృతజ్ఞత సభలు పెట్టిస్తోందని ధ్వజమెత్తారు. వెయ్యి తలల విష సర్పమైన కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామాలకు మరో బుల్లి విష సర్పంలా టీడీపీ వంతపాడుతోందని గట్టు దుయ్యబట్టారు. కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన స్క్రిప్టును చంద్రబాబు రక్తి కట్టిస్తున్నారన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల వల్ల ప్రజలు తీవ్ర గందరగోళానికి గురవుతుంటే.. ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు సమైక్యమో, విభజనో ఏ ఒక్కటి స్పష్టం చేయకుండా మరింత గందరగోళానికి గురిచేస్తూ, కాంగ్రెస్‌కు సహకరిస్తున్నారని విమర్శించారు. ప్రజల ఆకాంక్ష మేరకు చాలా స్పష్టంగా వైఎస్సార్సీపీ సమైక్య వాణి వినిపిస్తుంటే, తమపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు మాదిరి కేసుల విచారణ నుంచి తప్పించుకునేందుకు తాము చీకట్లో సోనియా కాళ్లు పట్టుకోలేదని మండిపడ్డారు. ఇప్పటి దాకా చంద్రబాబు ఏ ఒక్క రోజైనా సోనియాను విమర్శించారా? అని గట్టు ప్రశ్నించారు. -
బాబు డైరెక్షన్లోనే తమ్ముళ్ల తిట్లపురాణం
-
టీడీపీ నేతల డ్రామా
ఎర్రబెల్లి, కేశవ్ రగడ గేమ్‌ప్లానే! సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై స్పష్టమైన వైఖరి చెప్పకుండా దాటవేత వైఖరితో ఒకవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, మరోవైపు ఆ పార్టీకి చెందిన ఇరు ప్రాంతాల నేతలు ఎవరి వాదనలు వారు వినిపిస్తూ కొంతకాలంగా డ్రామాను రక్తి కట్టిస్తున్నారు. సీమాంధ్రకు చెందిన పయ్యావుల కేశవ్, తెలంగాణకు చెందిన ఎర్రబెల్లి దయాకరరావు మధ్య బుధవారం జరిగిన మాటల యుద్ధం పార్టీ గేమ్‌ప్లాన్‌లో భాగమేనని తెలుస్తోంది. వీరిలా పరస్పరం వాదోపవాదాలు చేసుకోవడానికి బాబే అనుమతించారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. సీమాంధ్రలో ఉదృతంగా సాగుతున్న సమైక్య ఉద్యమంలో కేశవ్ పాల్గొనకపోవడం తెలిసిందే. గురువారం నుంచి వారం రోజుల పాటు తన జిల్లాలో పర్యటనను ఖరారు చేసుకున్న నేపథ్యంలో ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా చేసుకునేందుకు బాబు అనుమతితోనే ఎర్రబెల్లిపై ఆయన ఆరోపణలు సంధించారంటున్నారు. తెలంగాణలో టీడీపీని ఎవరూ విశ్వసించకపోవడంతో, ఇలా సొంత పార్టీ నేతపైనే ఆరోపణలు చేయడం ద్వారా గట్టిగా వాదన విన్పిస్తున్నారన్న భావన కల్పించాలని భావించినట్టు పార్టీ నేతలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. -
అలుపెరగని జనోద్యమం
సాక్షి నెట్వర్క్ : సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం అలుపెరగకుండా సాగుతోంది. వరుసగా 98వ రోజూ మంగళవారం కోస్తా, రాయలసీమ జిల్లాల్లో సమైక్య ఉద్యమం ఉద్ధృతంగా ఎగసింది. విశాఖ కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు ధర్నా చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్‌ను ఎన్జీవోలు ముట్టడించారు. భీమవరంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు రోడ్డుపై బైఠారుుంచారు. దువ్వలో రైతు జేఏసీ నాయకులు, ఆకివీడులో వృద్ధుల సంక్షేమ సంఘం సభ్యులు, భీమడోలులో వికలాంగులు నిరశన దీక్షలు చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో సమైక్యవాదులు ధర్నా చేశారు. కాకినాడలో న్యాయవాదుల బంద్ పిలుపుతో జనజీవనం స్తంభించింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైఎస్సార్ కూడలిలో విద్యార్థులు భారీ మానవహారం నిర్వహించారు. సమైక్య రాష్ట్రం కోసం ప్రాణాలైనా అర్పిస్తామంటూ శపథం చేశారు. కృష్ణాజిల్లా చల్లపల్లి, కలిదిండిలో డ్వాక్రా మహిళలు దీక్షలు చేపట్టారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా మాట్లాడుతున్న కేంద్రమంత్రి పనబాక లక్ష్మి దిష్టిబొమ్మను దహనం చేశారు. మైలవరంలో ఎన్జీవోలు, ఆర్టీసీ కార్మికులు ప్రదర్శన చేపట్టారు. విజయవాడలో న్యాయవాదులు కొవ్వొత్తులతో ప్రదర్శన చేపట్టారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో విద్యార్థులు భారీ ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. కుప్పంలో సమైక్య జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు, చిత్తూరులో న్యాయవాదులు రాస్తారోకో చేశారు. అనంతపురం జిల్లా హిందూపురంలో ర్యాలీ చేశారు. రాయదుర్గంలోని విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు. వైఎస్సార్ జిల్లా కడపలోని కోటిరెడ్డి కూడలిలో వందలాదిమంది విద్యార్థులు భారీ మానవహారం నిర్మించారు. ప్రొద్దుటూరు, బద్వేలు, రైల్వేకోడూరు పట్టణాల్లో విద్యార్థులు మానవహారాలుగా నిలబడ్డారు. వైఎస్సార్సీపీ శ్రేణుల నిర్విరామపోరు జననేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు సమైక్యాంధ్ర పరిరక్షణకు ఉద్యమిస్తున్న పార్టీ శ్రేణులు మంగళవారం నాడూ ఆందోళనలు చేపట్టాయి. సమైక్య ఉద్యమాన్ని కించపరుస్తూ మాట్లాడిన మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల దిష్టిబొమ్మలను పార్టీ కార్యకర్తలు తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం పాశర్లపూడిలో దహనం చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ఐస్‌లు అమ్మి వినూత్న నిరసన తెలిపారు. అనంతపురంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. గుం టూరులో పార్టీ నేతలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. సీమాంధ్ర జిల్లాల్లోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. -
విభజనాగ్ని.. జనోద్యమం@ 92
సాక్షి నెట్వర్క్: సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం వరుసగా 92వ రోజైన బుధవారం కూడా సీమాంధ్ర జిల్లాల్లో ఉద్ధృతంగా సాగింది. సమైక్యాంధ్రను కాంక్షిస్తూ ప్రదర్శనలు, విభజన యత్నాలను నిరసిస్తూ ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు ఊరూరా పోటెత్తాయి. అనంతపురంలోని టవర్ క్లాక్ సర్కిల్లో జాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. గుంతకల్లులో విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ ఆకారంలో కూర్చొని ఆందోళన చేపట్టారు. హిందూపురంలో దిగ్విజయ్‌సింగ్ దిష్టిబొమ్మను సమైక్యవాదులు దహనం చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. తిరుపతిలో ఎన్జీవోల జేఏసీ ఆధ్వర్యంలో రెవెన్యూ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. పుంగనూరులో ఎన్జీవోలు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. విభజన ప్రక్రియను ఆపకపోతే సీమాంధ్రులు భవిష్యత్‌లో బానిసలుగా బతకాల్సి వస్తుందంటూ వీఆర్వోలు చేతులకు, మెడలకు సంకెళ్లు తగిలించుకుని రాయలసీమ, కోస్తాంధ్ర ప్లకార్డులతో నిరసన తెలిపారు. రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖర్‌రెడ్డిని పుంగనూరులో సమైక్యవాదులు అడ్డుకున్నారు. జై సమైక్యాంధ్ర అనాలని పట్టుపట్టారు. ఇందుకు బెరైడ్డి ససేమిరా అనడంతో గందరగోళం చోటుచేసుకుంది. కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో రెవెన్యూ ఉద్యోగులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. విజయవాడలో బెజవాడ బార్ అసోసియేషన్ (బీబీఏ) ఆధ్వర్యంలో న్యాయవాదులు రాస్తారోకో చేశారు. కలిదిండిలో విద్యార్ధులు మానవహారం నిర్వహించి, సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. నాగాయలంకలో రహదారిపై గుంజీలు తీసి నిరసన వ్యక్తం చేశారు. నెల్లూరులోని చింతారెడ్డిపాళెం జంక్షన్ వద్ద ఏపీఎన్జీఓలు రాస్తారోకో నిర్వహించారు. కేసీఆర్, సోనియా, దిగ్విజయ్ చిత్రపటాలను దహనం చేశారు. కావలిలో తహశీల్దార్కార్యాలయం సెంటర్లో ఎన్జీవోలు రాస్తారోకో చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ కోకన్వీనర్ ముప్పాళ్ల సుబ్బారావు ఆధ్వర్యంలో న్యాయవాదులు మానవహారం నిర్వహించారు. గంటపాటు వాహనాల రాకపోకలు అడ్డుకుని సమైక్య నినాదాలు చేశారు. కాకినాడలో న్యాయవాదులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. హోరెత్తించిన వైఎస్సార్సీపీ శ్రేణులు రాష్ట్ర విభజన నిర్ణయంపై ఎగసిపడుతున్న నిరసనోద్యమానికి వెన్నుదన్నుగా నిలుస్తూ, సమైక్యాంధ్ర పరిరక్షణకు అలుపెరుగని పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బుధవారం కూడా ఆందోళనలు హోరెత్తించారు. చిత్తూరులో ‘సమైక్య శంఖారావం’కు వేలాదిగా విద్యార్థులు కదలివచ్చారు. పలమనే రులో వైఎస్ఆర్ సీపీ నాయకులు రిక్షా తొక్కి, మొక్కజొన్న పొత్తులు అమ్మి నిరసన తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వజ్జ బాబూరావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కాగితాలపూరులో సమైక్య దీవెన యాత్ర చేపట్టారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో పార్టీ నేతల ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరంలో పార్టీ కార్యకర్తలు రాస్తారోకో చేశారు. కృష్ణాజిల్లా చాట్రాయిలో పోలవరం-విస్సన్నపేట రహదారిపై పార్టీ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ఇక ఈనెల 2వ తేదీ నుంచి కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ శ్రేణులు చేపట్టిన రిలే నిరశన దీక్షలు నిరవధికంగా కొనసాగుతున్నాయి. -
చల్లారని ఉద్యమాగ్ని.. అలుపెరుగని సమైక్య పోరు
మూడు నెలలుగా అలుపెరుగని సమైక్య పోరు సాక్షి నెట్వర్క్ : సీమాంధ్ర జిల్లాల్లో ఎగసిన సమైక్యాంధ్ర ఉద్యమం నిరవధికంగా సాగుతోంది. వేర్పాటు ప్రకటన వెనక్కి వెళ్లేవరకూ పోరాటాన్ని ఆపేదిలేదంటూ తెగేసి చెబుతున్న సమైక్యవాదులు విభిన్న రూపాల్లో ఆందోళనలు హోరెత్తిస్తున్నారు. వరుసగా 90వ రోజైన సోమవారం కోస్తా, రాయలసీమ జిల్లాల్లో సమైక్యాంధ్ర పరిరక్షణ కోరుతూ ప్రదర్శనలు, విభజన యత్నాలను నిరసిస్తూ ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు పోటెత్తాయి. తొంభై రోజుల ఉద్యమానికి సంకేతంగా చాలాచోట్ల విద్యార్థులు 90 అంకె ఆకారంలో ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. జాతీయ రహదారిపై ధర్నా చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎన్జీవోలు, ఆర్టీసీ కార్మికులు, వీఆర్వోలు జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. మదనపల్లెలో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. శ్రీకాళహస్తిలో ఇంజినీరింగ్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. బి.కొత్తకోటలో విద్యార్థులు ర్యాలీ చేశారు. చిత్తూరు ఎన్జీవో హోం వద్ద ఎన్జీవోలు రిలే దీక్షలు ప్రారంభించారు. తిరుపతిలో రెవెన్యూ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. అనంతపురంలో యువ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం నిర్మించి సమైక్య నినాదాలు చేశారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాస్కులు ధరించి.. రాజ్యాంగాన్ని పరిరక్షించండి అంటూ ప్రదర్శన నిర్వహించారు. పెనుకొండలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలుపగా.. విద్యార్థులు ర్యాలీ చేశారు. రాయదుర్గంలో విద్యార్థులు నిర్వహించిన ర్యాలీకి ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మద్దతు తెలిపారు. ఇంజనీరింగ్ విద్యార్థుల భారీ ర్యాలీ కడపలో ఇంజనీరింగ్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏడురోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. విశాఖ జిల్లా మద్దిలపాలెంలో ఆర్టీసీ ఎన్ఎంయూ సభ్యులు దీక్ష చేపట్టారు. ఆంధ్రా యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ దిష్టిబొమ్మను విద్యార్థులు దగ్ధం చేశారు. సమైక్యాంధ్ర కోసం ఎవరైనా సభలు, సమావేశాలు పెట్టుకోగా లేనిది వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజధాని నడిబొడ్డున సమైక్య శంఖారావం మోగిస్తే లగడపాటికొచ్చిన ఇబ్బందేమిటో చెప్పాలని విద్యార్థులు నినదించారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో పెన్షనర్లు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఎన్జీవోలు రిలే దీక్ష చేపట్టారు. తాడేపల్లిగూడెంలో న్యాయవాదులు రోడ్డుపై గుంజీలు తీసి నిరసన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఎన్జీవోలు ఆందోళన నిర్వహించారు. వైఎస్సార్సీపీ అకుంఠిత దీక్షలు సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా సీమాంధ్ర జిల్లాల్లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేపట్టిన రిలే నిరశన దీక్షలు నిరవధికంగా కొనసాగుతున్నాయి. ప్రతిచోటా పార్టీ కార్యకర్తలు, నేతలు రిలే దీక్షలు చేపడుతున్నారు. నేడు నాగార్జున వర్శిటీలో సమైక్య విద్యార్థి జేఏసీ సమావేశం సీమాంధ్ర ప్రాంతంలోని విశ్వవిద్యాలయాలు, వివిధ జిల్లాల సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నాయకుల సమావేశం మంగళవారం గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరుగుతుందని సమైక్యాంధ్ర జేఏసీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఆచార్య పి.నరసింహారావు తెలిపారు. భవిష్యత్ కార్యాచరణను ఈ సమావేశంలో రూపొందిస్తామని ఆయన గుంటూరులో విలేకరులతో చెప్పారు. -
సమైక్య భేరికి సన్నద్ధం.. జిల్లా నేతలతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 26న హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన ‘సమైక్య భేరి’కి జిల్లా నుంచి జన సమీకరణపై పార్టీ నేతలు దృష్టి సారించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం జిల్లాకు చెందిన పార్టీ నేతలతో హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టి జగపతితో పాటు జిల్లాకు చెందిన ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ‘సమైక్య’ ఉద్యమం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంత ప్రజలు, పార్టీ నేతల ప్రయోజనాలకు సంపూర్ణంగా పరిరక్షిస్తుందని జగన్ హామీనిచ్చినట్లు సమాచారం. సమైక్య రాష్ట్రంలోనే వచ్చే ఎన్నికలు జరిగే అవకాశమున్నందున పార్టీ బలోపేతం చేసేందుకు పార్టీ నేతలు కృషి చేయాల్సిందిగా వైఎస్ జగన్ సూచించినట్లు తెలిసింది. ఈ నెల 26న హైదరాబాద్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ‘సమైక్య భేరి’ సభకు హైదరాబాద్‌కు పొరుగునే ఉన్న పటాన్చెరు, సంగారెడ్డి, జహీరాబాద్, అందోలు తదితర నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేయాలని నిర్ణయించినట్లు పార్టీ నేతలు వెల్లడించారు. సమావేశంలో ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లా సూర్యప్రకాశ్, ఉజ్వల్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, నర్ర భిక్షపతి, సతీష్‌గౌడ్, బిడకన్నె హన్మంతు, మాణిక్‌రావు, రామాగౌడ్, దేశ్‌పాండే, ప్రభుగౌడ్, కొమ్మెర వెంకట్‌రెడ్డి, ఎల్లు రవీందర్‌రెడ్డి, డాక్టర్ శ్రావణ్‌కుమార్ రెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. -
సమైక్య రైతు బేరి
సాక్షి నెట్వర్క్ : పండుగల్లేవు.. పబ్బాలేవు.. సెలవుల్లేవు.. విరామం లేదు.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే లక్ష్యంగా ఉద్యమిస్తున్న సీమాంధ్ర ప్రజ వరుసగా 77వ రోజైన మంగళవారం కూడా సమైక్య ఉద్యమాన్ని ఉద్ధృతంగా చేపట్టింది. ఉద్యోగ జేఏసీ నేతలు కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని అన్ని మండలాల్లోనూ రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి విభజన జరిగితే వ్యవసాయరంగానికి వచ్చే నష్టాల్ని వివరించారు. హోరెత్తిన రైతుగర్జనలు తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం మండల కేంద్రాల్లో రైతులు ర్యాలీలు చేసి విభజన యత్నాలపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రం ముక్కలైతే సస్యశ్యామలమైన కోనసీమ బీడువారి పోతుందని, నదీజలాల సమస్యలు తలెత్తి గోదావరి డెల్టా ఎండిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సీతానగరంలో జరిగిన రైతు గర్జనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి. మాజీ ఎమ్మెల్యే చిట్టూరి రవీంద్ర పాల్గొన్నారు. పెద్దాపురం తహశీల్దార్ కార్యాలయం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు గర్జనకు 500 మంది రైతులు ఎడ్ల బండ్లపై తరలివచ్చారు. జగ్గంపేట, రాజానగరం, తుని తదితర ప్రాంతాల్లో రైతులు, జేఏసీ నేతలు ర్యాలీలు నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు జంక్షన్లో ‘రైతుభేరి’ నిర్వహించారు. పాలకొల్లు, చింతలపూడి, పెరవలి, శింగగూడెంలలో రైతు అవగాహన సదస్సులు నిర్వహించారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఎన్జీఓలు కోర్టు జంక్షన్లో రహదారులను దిగ్భందించి మానవహారం నిర్మించారు. పార్వతీపురంలో ఏపీ ఎన్జీవోలు కేంద్ర మంత్రుల మాస్కులు వేసుకున్న వ్యక్తులకు గడ్డి తినిపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. అన్నదాతల ధర్నా కృష్ణా జిల్లా పామర్రులో రైతులు నాలుగురోడ్ల కూడలిలో ధర్నా నిర్వహించారు. చల్లపల్లిలో వీఆర్వోలు, వీఆర్ఏలు రాస్తారోకో చేపట్టారు. జేఏసీ పిలుపు మేరకు అవనిగడ్డ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో రైతు సదస్సులు జరిగాయి. గుంటూరు జిల్లా పొన్నూరులో రైతులు ప్రదర్శన చేపట్టారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో రైతుగర్జన పేరిట బహిరంగసభ నిర్వహించారు. ముందుగా రైతులు భారీ ర్యాలీగా సభాస్థలికి వస్తూ నాలుగురోడ్ల కూడలిలో మానవహారం చేపట్టారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఎన్జీవోలు ర్యాలీ నిర్వహించి రాష్ట్రీయ రహదారిపై మానవహారం నిర్వహించారు. ఒంగోలులో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఎన్జీవోలు, రెవెన్యూ, ఇతర ఉద్యోగ సంఘాలన్నీ కలిసి జిల్లా కలెక్టరేట్ ఎదుట మానవహారం నిర్వహించాయి. సీమలో వినూత్న నిరసనలు అనంతపురంలో కార్పొరేషన్ ఉద్యోగులు మెడలో ఉరితాళ్లు వేసుకుని నిరసన తెలిపారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోనియా గాంధీని రావణాసురుడిలా చిత్రీకరించి.. కేంద్ర మంత్రుల తలలు అటూ ఇటూ పెట్టి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని దహనం చేశారు. రాయదుర్గంలో రిలే దీక్షలు చేస్తున్న సమైక్యవాదులకు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సంఘీభావం తెలిపారు. చిత్తూరు జిల్లా పలమనేరులో ప్రతి ఇంటి ముందూ సమైక్యాంధ్ర అని రాసి ఉంచాలని కోరుతూ సమైక్యవాదులు పాదయాత్ర చేపట్టారు. మదనపల్లె-తిరుపతి ర హదారిపై కొత్తవారిపల్లి వద్ద రైతు గర్జన నిర్వహించారు. తిరుపతి గాంధీపురం శ్మశాన వాటిక లో సమాధి నిర్మించి, సోనియాగాంధీ బొమ్మ తగిలించారు. కర్నూలులో కలియుగ రావణాసురిగా సోనియాగాంధిని చిత్రీకరించి ఆమెకు పదితలలుగా ప్రధాని మన్మోహన్, కేంద్రమంత్రుల చిత్రాలను ఉంచారు. దానిపై టపాసులు పెట్టి కలెక్టరేట్ వద్ద దహనం చేశారు. చాగలమర్రిలో రైతు గర్జన సదస్సును నిర్వహించారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో భారీ ర్యాలీ చేపట్టారు. రాజంపేటలో రైతులు ర్యాలీ నిర్వహించారు. పులివెందులలో ఎన్జీఓలు కాగడాల ప్రదర్శనతోపాటు రోడ్డుపైన పడుకొని నిరసన చేపట్టారు. విభజనకు వ్యతిరేకంగా ఓటేస్తాం రాష్ర్ట శాసనసభలో అసెంబ్లీ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేస్తామని పలువురు ఎమ్మెల్యేలు మంగళవారం ఎన్జీవోలకు ప్రమాణం చేసి హామీపత్రాలను సమర్పించారు. విశాఖలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్, కృష్ణాజిల్లా జగ్గయ్యపేట శాసనసభ్యుడు శ్రీరాం రాజగోపాల్ హామీ పత్రం ఇచ్చారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఎన్జీవోలు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు నివాసాన్ని ముట్టడించారు. తాను అసెంబ్లీలో విభజనకు వ్యతిరేకంగా ఓటేస్తామంటూ ఆయన ప్రమాణ పత్రాన్ని అందివ్వడంతో వారు శాంతించారు. -
సమైక్య ఆందోళనలతో.. ప్రభుత్వాఫీసుల మూత
సీమాంధ్ర వ్యాప్తంగా మిన్నంటిన సమైక్య ఆందోళనలు సాక్షి నెట్వర్క్ : కేంద్రం టీ-నోట్‌ను ఆమోదించిన దరిమిలా ఉద్ధృతమైన సమైక్య ఉద్యమం తారస్థాయికి చేరింది. సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక, ఏపీఎన్జీవోల పిలుపు మేరకు మంగళవారం సీమాంధ్ర జిల్లాల్లోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, పోస్టాఫీసులు, బ్యాంకులను సమైక్యవాదులు, ఆందోళనకారులు మూయించారు. వైద్య ఆరోగ్య శాఖ జేఏసీ పిలుపు మేరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు మినహా అన్ని సేవలనూ నిలిపివేశారు. ఇక సోమవారం కూడా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలతో కోస్తా, రాయలసీమ జిల్లాలు హోరెత్తాయి. పోలవరం పనులు అడ్డగింత రాష్ర్టం ముక్కలైతే పోలవరం ప్రాజెక్టుతో ఇక పనేమిటంటూ పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు ఆ ప్రాజెక్టు నిర్మాణ పనులను అడ్డగించారు. సోనియూగాంధీ, దిగ్విజయ్‌సింగ్ సహా విభజనవాదులందిరికీ సద్బుద్ధిని ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ ఏలూరులో జపం చేశారు. విశాఖలో దీక్షలు కొనసాగుతున్నాయి. అనకాపల్లిలో ఉద్యోగులు రోడ్లు ఊడ్చి నిరసన వ్యక్తంచేశారు. నర్సీపట్నంలో గాజువాక ఎంఎల్ఎ చింతలపూడి వెంకట్రామయ్య ఇంటిని ముట్టడించారు. తూర్పుగోదావరి జిల్లా కడియం, వేమగిరిల్లో 250 లారీలతో భారీ ర్యాలీ చేపట్టారు. సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెం గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్ (జీసీఎస్) ముట్టడి రెండోరోజు కూడా కొనసాగుతోంది. అమలాపురం ఎంపీ హర్షకుమార్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ముమ్మిడివరం, మామిడికుదురులలో ఆందోళనలు జరిగాయి. రాష్ట్రంలో రైల్వేను స్తంభింపజేస్తాం అనంతపురం జిల్లా గుంతకల్లులో రైల్వే ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. విభజన ఆపకపోతే రాష్ట్రంలో రైల్వే వ్యవస్థను స్తంభింపజేస్తామని గుంతకల్లు డివిజన్ రైల్వే జేఏసీ నేతలు హెచ్చరించారు. మడకశిరలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఇంటిని ముట్టడించారు. కర్నూలులో కలెక్టరేట్ వద్ద ప్రభుత్వ వైద్యులు యూపీఏ ప్రభుత్వాన్ని సమాధి చేసినట్లు వినూత్న నిరసన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా పీలేరులో సీమాంధ్ర మంత్రులకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. విజయనగరం జిల్లా గుర్ల మండల కేంద్రంలో సమైక్యవాదులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ చేపట్టారు. శ్రీకాకుళంలో డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద ముగ్గురు వైద్య ఉద్యోగులు ఆమరణ దీక్ష చేపట్టారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసం ఈ నెల 11వ తేదీ ఉదయం 10 గంటలకు విజయవాడలో భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు విద్యాసంస్థల యాజ మాన్య కమిటీ ప్రకటించింది. కోఠి ఎస్బీఐని ముట్టడించిన ఏపీఎన్జీవోలు హైదరాబాద్: ఏపీఎన్జీవోల రాష్ట్ర కార్యవర్గం ఇచ్చిన పిలుపుపై మంగళవారం కోఠిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ప్రధాన కార్యాలయాన్ని ఏపిఎన్జీవోలు ముట్టడించారు. తమ కార్యాలయం నుండి ర్యాలీగా వచ్చిఎస్బీఐ ప్రధాన గేట్ వద్దకు నినాదాలు చేస్తూ దూసుకొచ్చారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే ధర్నాకు దిగారు. పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఏపీఎన్జీవోల సంఘం నగర అధ్యక్షుడు పివీవీ సత్యనారాయణ విలేకరులతో మాట్లాడుతూ తమ దీక్షా శిబిరాన్ని త్వరలో ఢిల్లీకి మార్చుతామన్నారు. విద్యుత్ సబ్స్టేషన్ల దిగ్బంధం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లావ్యాప్తంగా విద్యుత్ సబ్స్టేషన్ల ఎదుట సమైక్యవాదులు ఆందోళనలు చేపట్టారు. ఒంగోలులో ఉద్యోగులు ఎంపీ మాగుంట ఇంటిని ముట్టడించారు. మార్కాపురంలో చంద్రబాబు తీరుపై నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్ జిల్లా ఆర్టీపీపీలో ఉద్యోగుల విధుల బహిష్కరతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. పులివెందులలో ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. తుమ్మలపల్లి యురేనియం ప్రాజెక్టుకు విద్యుత్ నిలిపేశారు. సమైక్యాంధ్ర కోసం బలిదానం హైదరాబాద్ : సమైక్యాంధ్ర కోసం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పుంటించుకున్న వ్యక్తి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం రాత్రి 11.45 మృతి చెందాడు. అనంతపురం జిల్లా చెన్నంపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ మల్లికార్జున్నాయక్(35) ఈ నెల 6న కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. మరోవైపు, విభజన కలతతో సీమాంధ్రలో నలుగురు గుండె పోటుతో మృతిచెందారు. లగడపాటిపై ఫిర్యాదు ఎంపీ లగడపాటి రాజగోపాల్ కనబడటం లేదంటూ విద్యార్థి, పొలిటికల్ జేఏసీల నాయకులు విజయవాడలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరులో జరిగిన సమైక్య శంఖారావం కార్యక్రమానికి వేలాదిగా విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే, ఎమ్మెల్యే మల్లాది విష్ణును న్యాయవాదులు అడ్డుకున్నారు. పదవికి రాజీ నామా చేయాలంటూ బార్ అసోసియేషన్ నేతలు నిలదీయగా, అంతుచూస్తానంటూ విష్ణు బెదిరించడంతో న్యాయవాదులు తిరగబడ్డారు. -
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్లను దిగ్బంధించిన వైఎస్సార్ సీపీ శ్రేణులు
సాక్షి నెట్వర్క్: సమైక్య ఉద్యమ కార్యాచరణలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం పార్టీ కార్యకర్తలు అధికార కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడించారు. దీంతో పలుచోట్ల ఉద్రిక్తంగా మారింది. విశాఖలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ నేతృత్వంలో కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి, రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, పసుపులేటి బాలరాజు, రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి ఇళ్లను ముట్టడిం చారు. జిల్లావ్యాప్తంగా ఏడుగురు ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడించిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు వినూత్నరీతిలో నిరసనలు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జోరువానలో సైతం తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి పళ్లంరాజు ఇంటిని ముట్టడించారు. మంత్రి నివాసం వద్ద గాజులు, పూలతో నిరసన తెలిపారు. అమలాపురం విద్యుత్‌నగర్‌లో ఎంపీ జీవీ హర్షకుమార్ క్యాంప్ కార్యాలయాన్ని పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ గొల్ల బాబూరావు, రాష్ర్ట మహిళా విభాగం కన్వీనర్ కొల్లి నిర్మలకుమారి, సీజీసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మాజీ ఎంపీ ఏజేవీబీ మహేశ్వరరావు తదితరుల నేతృత్వంలో ముట్టడించారు. రంపచోడవరంలో రాజ్యసభ సభ్యురాలు టి.రత్నాబాయి ఇంటిని ముట్టడించారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రాజమండ్రి నగర కో-ఆర్డినేటర్ బొమ్మన రాజ్‌కుమార్ నాయకత్వంలో రాజమండ్రిలోని వై జంక్షన్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో చెవిలో పువ్వులు పెట్టుకుని వైఎస్సార్ సీపీ సమన్వయకర్త చీర్ల రాధయ్య ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఇంటిని ముట్టడించారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఎమ్మెల్యే షాజహాన్‌బాషా కార్యాలయం ఎదుట పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. చిత్తూరు లో ఉన్న పూతలపట్టు ఎమ్మెల్యే రవి ఇంటిని, సురుటపల్లిలోని సత్యవేడు ఎమ్మెల్యే హేవులత, గుంటూరులో నగర కన్వీనర్ అప్పిరెడ్డి ఆధ్వర్యంలో మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఇళ్లను ముట్టడించారు. బాపట్లలో కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి నివాసాన్ని పార్టీ పట్టణ కన్వీనర్ ధర్మారావు ఆధ్వర్యంలో ముట్టడించారు. అనంతపురంలో వైఎస్సార్సీపీ నాయకుడు బి.ఎర్రిస్వామిరెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేసి ఆందోళన చేశారు. సాయుధ బలగాల రక్షణలో లగడపాటి ఇల్లు విజయవాడలో ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇంటి పరిసర ప్రాంతాల్లో వందలాదిగా సాయుధ బలగాలను మోహరించారు. ఆయన ఇంటికి వెళ్లే దారిలో ఇనుప కంచె వేశారు. బీఎస్ఎఫ్ రిజర్వు దళాలతో ఏసీపీ, నలుగురు సీఐలు, ఐదారుగురు ఎస్సైలు, 50 మంది వరకు కానిస్టేబుళ్లు బందోబస్తు నిర్వహించారు. వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో ఎంపీ ఇంటిని ముట్టడిం చేందుకు యత్నించిన నేతలను పోలీసు బలగాలు అడ్డుకున్నాయి. బలవంతంగా పోలీసు వాహనంలోకి ఎత్తిపడేసి పటమట స్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో సామినేని ఉదయభాను, విజయవాడ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయ కర్త పి.గౌతమ్‌రెడ్డి తదితరులున్నారు. విజయనగరం జిల్లా గజపతినగరంలో ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య ఇంటిముందు పుష్పాలతో శాంతి ర్యాలీ చేశారు. సాలూరులో ఎమ్మెల్యే రాజన్నదొర, సీతానగరంలో ఎమ్మెల్యే సవరపు జయమణి ఇళ్లను ముట్టడించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో కేంద్రమంత్రి కృపారాణి ఇల్లు ముట్టడి సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. శ్రీకాకుళంలో మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటిని ముట్టడించారు. కాశీబుగ్గలో టెక్కలి ఎమ్మెల్యే కొర్ల భారతి ఇంటి గోడపై రాష్ట్ర ద్రోహులుగా మిగల కండి సమైక్యాంధ్రకు మద్దతు పలకండి అంటూ పోస్టర్లను అతికించారు. సీతంపేటలో పాల కొండ ఎమ్మెల్యే సుగ్రీవులు,, ఆమదాలవలసలో ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి, హరిపురంలో పలాస ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు ఇళ్లను ముట్టడించారు. ఉద్యోగులకు సరుకుల పంపిణీ ఉద్యమం కారణంగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న ఆర్టీసీ ఉద్యోగులకు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రూ.5లక్షల విలువైన సరుకులు పంపిణీ చేశారు. పుంగనూరులో 165 మంది ఆర్టీసీ కార్మికులకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బియ్యం పంపిణీ చేశారు. బొబ్బిలిలో వైఎస్ఆర్సీపీ అరుకు పార్లమెంటు పరిశీలకుడు ఆర్వీఎస్కేకే రంగారావు లక్షన్నర రూపాయల విలువ చేసే నిత్యవసర సరుకులను అందించారు. -
ఆగని ఆగ్రహజ్వాల
సాక్షి నెట్వర్క్: సీమాంధ్రలో సమైక్య ఉద్యమం పతాకస్థాయికి చేరింది. రాష్ర్ట విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ అడుగడుగునా ఆగ్రహజ్వాలలు మిన్నంటుతున్నాయి. కేంద్రం తెలంగాణ నోట్‌ను ఆమోదించిన దరిమిలా నిప్పుకణికలై ఉద్యమిస్తున్నారు. కర్నూలు జిల్లాలో సుంకేసుల వద్ద చేపట్టిన ‘రైతు శంఖారావం’ రైతులు, పోలీసుల మధ్య ఘర్షణకు దారితీసింది. బ్యారేజీపై సమావేశం నిర్వహించేందుకు రైతులు సన్నాహాలు చేయగా, పోలీసులు అడ్డుకుని కేసీ కెనాల్ గట్టుపై సభ జరుపుకోమని సూచించారు. ఇందుకు ససేమిరా అన్న రైతులు బారికేడ్లను తోసుకుని వెళ్లేందుకు యత్నించగా పోలీసులు లాఠీచార్జిచేశారు. అనంతపురంలో వాణిజ్య పన్నుల శాఖ సిబ్బంది కేంద్ర మంత్రుల ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేసి చెప్పులతో కొడుతూ నిరసన తెలిపారు. విద్యుత్ శాఖ ఎస్ఈ రమణమూర్తి, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ సంపత్‌కుమార్ ఆధ్వర్యంలో ఆ శాఖ కార్యాలయానికి తాళాలు వేశారు. చెన్నేకొత్తపల్లిలో జేఏసీ నాయకులు పెనుకొండ వైపు వెళ్తున్న దివాకర్ ట్రావెల్స్ బస్సును అడ్డుకున్నారు. విశాఖ జిల్లా సీలేరులో సమైక్యవాదులు విద్యుత్ ఉత్పత్పి కేంద్రాల వద్ద ఆందోళనకు దిగారు. రోడ్డు నిర్బంధించారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలో ఎన్టీటీపీఎస్ గేటు వద్ద ఉద్యోగులు, కార్మికులు ప్రదర్శన, రాస్తారోకో నిర్వహించారు. నెల్లూరు జిల్లావ్యాప్తంగా విద్యుత్ సబ్స్టేషన్లను సమైక్యవాదులు ముట్టడించారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని కోనాడ జంక్షన్లో జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. కురుపాంలో కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్ ఇంటిని ముట్టడించగా, ఆయన స్పందిస్తూ విభజనను అడ్డుకునేందుకు చివరివరకు ప్రయత్నించడం కోసమే పదవిలో కొనసాగుతున్నానని చెప్పారు. జాతీయరహదారిని దిగ్బంధించిన రైతులు: పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం వద్ద జాతీయ రహదారిని రైతులు దిగ్బంధించారు. దీంతో సుమారు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోరుుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ బొమ్మూరు 220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద విద్యుత్ శాఖ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. మండపేటలో జరిగిన మహాజన గళగర్జనకు వేలాదిగా సమైక్యవాదులు తరలి వచ్చారు. రావులపాలెంలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. -
ప్రభుత్వ అండతోనే ‘సమైక్యం’ : కోదండరాం
తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం ఘట్కేసర్, న్యూస్‌లైన్: సమైక్య ఉద్యమానికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం దుయ్యబట్టారు. రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం జోడిమెట్లలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇతరుల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లలేదని, ప్రస్తుతం సీమాంధ్ర ఉద్యమంతో విద్యుత్ నిలిచిపోయిందని, రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోందన్నారు. ఈ కారణ ంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ కోసం ఇక్కడ ఉద్యమం చేస్తున్న రోజుల్లో ఇంట్లో ఉన్న నాయకులను సైతం ప్రభుత్వం అరెస్టులు చేయించిందన్నారు. ఉద్యమకారులపై వందలాది కేసులు పెట్టిందని తెలిపారు. సమైక్య ఉద్యమకారులపై ప్రభుత్వం ఉదాసీనత వైఖరిని అవలంబించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. హైదరాబాద్‌పై కిరికిరి చేస్తే మళ్లీ ఉద్యమం: దేవీప్రసాద్ మేడ్చల్,న్యూస్‌లైన్: హైదరాబాద్‌పై ఎవరు కిరికిరి పెట్టినా మరోసారి ఉద్యమం తప్పదని టీఎన్జీఓల అధ్యక్షుడు దేవీ ప్రసాద్ హెచ్చరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అధికారం దక్కించుకోవడానికి సీమాంధ్ర ప్రజలను దీక్ష పేరుతో గందరగోళంలోకి నెట్టారని విమర్శించారు. సోమవారం ఆయన రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌లో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్ సీమాంధ్రలో అశోక్‌బాబును అడ్డుపెట్టుకుని ఉద్యమాన్ని నడిపిస్తున్నారన్నారు. తెలంగాణ ఉద్యోగుల అక్రమ బదిలీలు: శ్రీనివాస్‌గౌడ్ ఆరోపణ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో, సంస్థల్లో ఉన్నత స్థానాల్లోని తెలంగాణ ఉద్యోగులను, అధికారులను అక్రమంగా బదిలీ చేస్తున్నారని టీజీవో నేత శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. ఆయున సోమవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ, మార్క్‌ఫెడ్ సీఎండీ, కోఆపరేటివ్ సొసైటీ ఎండీలతోపాటు కీలకమైన శాఖల అధిపతులుగా ఉన్న తెలంగాణ అధికారులను తొలగించి ఆయూ స్థానాలను సీమాంధ్రులకు కేటాయించారని, దీని వెనుక సీమాంధ్ర మంత్రులు, ఐఏఎస్‌ల ప్రోద్భలముందని ఆరోపించారు. -
ముంచుకొస్తున్న చీకట్లు!
సాక్షి నెట్వర్క్: సమైక్య ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల సమ్మె వల్ల ఇప్పటికే అధిక శాతం ఉత్పత్తి నిలిచిపోగా, నేటి ఉదయం నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించనున్నట్లు సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రకటించడంతో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లే ప్రమాదం నెలకొంది. సీమాంధ్ర ప్రాంతంలోని 13 జిల్లాల జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కంల ఉద్యోగులు ఆదివారం ఉదయం నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు జేఏసీ అధ్యక్షుడు ఆర్ సాయిబాబా ప్రకటించారు. కాంట్రాక్టు కార్మికులు కూడా పాల్గొంటారని తెలిపారు. సమ్మెలో అత్యవసర సేవలకు కూడా మినహాయింపు లేదన్నారు. దాంతో రాష్ట్రం దాదాపు విద్యుత్ సంక్షోభం వాకిట్లో నిలబడిన పరిస్థితి నెలకొంది. సమ్మె ప్రభావం.. సమ్మె కారణంగా శనివారం వైఎస్సార్ జిల్లాలోని ఆర్టీపీఎస్లో 1,050 మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోగా, విజయవాడలోని వీటీపీఎస్‌లో 1,260 మెగావాట్లు, ఆర్టీపీపీలో 840 మెగావాట్లు, సీలేరు థర్మల్ కేంద్రంలో 260 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. సమైక్యవాదుల ముట్టడితో తూర్పుగోదావరి జిల్లాలోని డొంకరాయి జలవిద్యుదుత్పత్తి కేంద్రంలోనూ ఉత్పత్తికి అంతరాయం కలిగింది. దాంతో విద్యుత్ సరఫరా వ్యవస్థ(గ్రిడ్)ను కాపాడేందుకు అనధికార కోతలను అధికారులు ప్రారంభించారు. దీనివల్ల సీమాం ధ్రతో పాటు తెలంగాణ ప్రాంతంలోనూ శనివారం ప్రజలకు విద్యుత్ కోతలు తప్పలేదు. హైదరాబాద్‌కు అందాల్సిన కోటా కూడా తగ్గడంతో రాజధానిలోనూ సుమారు 2 గంటలపాటు కోత విధించారు. ఇదిలా ఉండగా, సీమాంధ్రలోని ట్రాన్స్‌కో సిబ్బంది కూడా ఆది వారం నుంచి సమ్మె ప్రారంభిస్తామని ప్రకటించడంతో ఉత్పత్తి జరుగుతున్న కొద్దోగొప్పో విద్యుత్తును కూడా సరఫరా చేయలేని పరిస్థితి నెలకొననుంది. మరోవైపు, జెన్కో, ట్రాన్స్‌కో సిబ్బంది సమ్మె కొనసాగిస్తామని ప్రకటించడంతో కర్నూలు జిల్లాలోని శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో ఆదివారం 700 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయే ప్రమాదం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి సీమాంధ్రలో ప్రజలకు విద్యుత్ కష్టాలు పెరగనున్నాయి. విద్యుత్‌పై ఆధారపడిన తాగు, సాగునీటి అవసరాలకు విఘాతం కలగనుంది. ఎలాంటి సేవలు అందించబోమని విద్యుత్ జేఏసీ ప్రకటించడంతో.. ట్రాన్స్ఫార్మర్లు, ఇతర యంత్రాల మరమ్మతు తదితర సేవలకు కూడా అంతరాయం కలగనుంది. దాంతో విద్యుత్ సరఫరాకు ఇబ్బం దులు తప్పని పరిస్థితి కనిపిస్తోంది. అయితే, జెన్కో ఉన్నతాధికారుల వాదన మరో రకంగా ఉంది. ‘వీటీపీఎస్‌లో ఆదివా రం ఉదయం నుంచి ఉద్యోగులు విధులకు హాజరవుతారని చెబుతున్నారు. కాబట్టి ఆదివారం మధ్యాహ్నం నాటికి విద్యుదుత్పత్తి నిలిచిపోయిన ఆరు యూనిట్ల ద్వారా 1260 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలమ’ని వారు తెలిపారు. మొత్తం మీద అందుబాటులో ఉన్న విద్యుత్‌ను కూడా సరఫరా చేయలేకపోవడంతో కోతలు తప్పేలా లేవు. కాగా,ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సమీక్షించేందుకు ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి ట్రాన్స్‌కో, జెన్కో ఉన్నతాధికారులతో ఆదివారం అత్యవసరంగా సమావేశం కానున్నారు. ఎన్టీపీసీలో నిండుకున్న బొగ్గు నిల్వలు.. మూతపడనున్న యూనిట్లు గోదావరిఖని: కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీలో బొగ్గు నిల్వలు అడుగంటాయి. బొగ్గు కొరత మూలంగా 500 మెగావాట్ల 6వ యూనిట్‌ను అధికారులు శుక్రవారం నిలిపివేశారు. మిగతా యూనిట్లలో తక్కువ లోడ్‌తో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. కోల్‌యార్డులో 20 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉండగా, ఒక్కరోజుకు మాత్రమే సరిపోతుందని తెలుస్తోంది. ప్లాంట్‌లో 200 మెగావాట్ల మూడు యూనిట్లు, 500 మెగావాట్ల నాలుగు యూనిట్లు ఉన్నాయి. మొత్తం ఏడు యూనిట్లలో పూర్థిస్థాయి విద్యుత్ ఉత్పత్తికి ప్రతిరోజూ 30-35 వేల మెట్రిక్ టన్నులు బొగ్గు అవసరం. సింగరేణి సంస్థ నుంచి రోజుకు 25-30వేల మెట్రిక్ టన్నుల బొగ్గు సరఫరా అవుతుండగా, ఏ రోజుకారోజే వినియోగిస్తున్నారు. ఈ నెల 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా సింగరేణి సంస్థలో సెలవు దినం కావడంతో బొగ్గు రవాణా నిలిపోయింది. దీంతో 6వ యూనిట్‌ను అధికారులు నిలుపుదల చేశారు. ఇవే పరిస్థితులు కొనసాగిన పక్షంలో ఒక్కొక్కటిగా మిగతా యూనిట్లను నిలిపివేసే అవకాశముంది. అధికారులు బొగ్గు దిగుమతి కోసం సమీక్షలు చేయడం తప్ప ప్రత్యామ్నాయమార్గాలను ఎంచుకోకపోవడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. -
సీమాంధ్రకు పర్యాటక బస్సులు రద్దు
హైదరాబాద్-షిర్డీ మధ్య యథావిధిగా సర్వీసులు సాక్షి, హైదరాబాద్: సమైక్య ఉద్యమ సెగ పర్యాటక శాఖ బస్సులకూ తాకింది. ఆర్టీసీ బస్సులు నిలిచిపోయినా ఇన్నాళ్లూ పర్యాటక బస్సులు తిరుగుతూనే ఉన్నాయి. పర్యాటక శాఖ బస్సులను కూడా నిలిపివేయాలని, బస్సులు నడిపితే ధ్వంసం చేస్తామని సీమాంధ్ర ఉద్యమకారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి సీమాంధ్రవైపు అన్ని పర్యాటక బస్సులూ రద్దయ్యాయి. హైదరాబాద్-తిరుపతి, విశాఖ-భద్రాచలం సర్వీసులకు ముందుగా రిజర్వు చేసుకున్న ప్రయాణికులకు డబ్బులు తిరిగి ఇచ్చేశారు. నాగార్జునసాగర్-శ్రీశైలం మధ్య నిర్వహించే బోటు షికారు కూడా నిలిచిపోయింది. అయితే, హైదరాబాద్-షిర్డీ మధ్య పర్యాటక శాఖ బస్సులు మాత్రం యథావిధిగా నడుస్తున్నాయి. -
సమైక్య ఉద్యమానికి ఊపు
-
సమైక్య ఉద్యమానికి ఊపు
* సీమాంధ్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతల సమైక్య దీక్షలు ప్రారంభం * నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నిరశన * సంఘీభావంగా వేల మంది కార్యకర్తల దీక్షలు.. కదలివచ్చిన ఊరూవాడా సమైక్యాంధ్ర ఉద్యమంలో మరో ఘట్టం మొదలైంది. ఇప్పటివరకూ విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, రైతులు వంటి సాధారణ ప్రజా సమూహాలే ఉద్యమిస్తుండగా.. ఇప్పుడిక సమైక్యాంధ్రను కాంక్షిస్తూ ఏకైక రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ఉద్యమ బరిలో దిగింది. దీంతో సమైక్య ఉద్యమం మరింత ఉధృతమైంది. నిన్నటి వరకు పట్టణాలు, నగరాలకు పరిమితమైన సమైక్య ఉద్యమం వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, శ్రేణుల దీక్షలతో మారుమూల పలెల్లలకూ విస్తరించింది. సాక్షి నెట్వర్క్: అహింసే ఆయుధంగా స్వాతంత్య్ర పోరాటాన్ని నడిపిన గాంధీజీ స్ఫూర్తితో సమైక్య జనోద్యమానికి బాసటగా నిలవాలని పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు బుధవారం గాంధీ జయంతి నాడు సీమాంధ్రలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో దీక్షలు చేపట్టారు. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో నాలుగైదు అసెంబ్లీ సెగ్మెంట్లు మినహా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ సమన్వయకర్తలు నిరాహారదీక్షలకు దిగారు. వీరికి సంఘీభావంగా ప్రతిచోటా వందలాదిమంది కార్యకర్తలు నిరశన చేపట్టారు. విభజనను వ్యతిరేకిస్తూ సమైక్య రాష్ట్రమే లక్ష్యంగా స్పష్టమైన ప్రకటన చేసి పోరుబాట పట్టిన ఏకైక ప్రధాన రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లోనూ ఒకేసారి ఉద్యమబావుటా ఎగరేయడం రాజకీయ చరిత్రలోనే అరుదైన రికార్డుగా ఘనతికెక్కనుంది. ఏఐసీసీ అధిష్టానం నుంచి వేర్పాటు ప్రకటన వచ్చిన దరిమిలా సీమాంధ్ర జిల్లాల్లో రెండు నెలలకుపైగా ఉధతంగా సాగుతున్న సమైక్య ఉద్యమం ఇప్పుడు వైఎస్సార్ సీపీ శ్రేణుల దీక్షతో కొత్తరూపు సంతరించుకుంది. బుధవారం సీమాంధ్రలో ఎటుచూసినా వైఎస్సార్ సీపీ శ్రేణుల దీక్షలకు మద్దతుగా సమైక్యస్ఫూర్తి సాగింది. సకలజనుల సమ్మెలో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులు, సమైక్యమే లక్ష్యంగా పోరుబాట పట్టిన అన్నివర్గాల ప్రజలు వైఎస్సార్ సీపీ సమైక్య దీక్షా శిబిరాలను సందర్శించి సంఘీభావం తెలిపారు. జోరువర్షంలోనూ... తూర్పు గోదావరి జిల్లాలో తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కాకినాడ మసీదు సెంటర్లో నడిరోడ్డుపై ఎలాంటి టెంట్ లేకుండా రిలే దీక్ష చేపట్టారు. కుండపోతగా కురిసిన వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తడుస్తూనే దీక్ష కొనసాగించారు. పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త సుజయ్ కృష్ణ రంగారావు విజయనగరం జిల్లా బొబ్బిలిలో దీక్షకు కూర్చున్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ 48 గంటల దీక్ష చేపట్టారు. తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాక రరెడ్డి రెండు రోజుల నిరాహారదీక్ష చేపట్టారు. కర్నూలులో భారీ ర్యాలీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. ఆళ్లగడ్డలో వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్ష ఉపనేత, ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి, నంద్యాలలో పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి, మంత్రాలయంలో తాజా మాజీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి దీక్ష చేపట్టారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, అనంతపురంలో ఎమ్మెల్యే గురునాథరెడ్డి, ఉరవకొండలో సీఈసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి, పుట్టపర్తిలో కడపల మోహన్‌రెడ్డి, డాక్టర్ హరికృష్ణ దీక్షలు చేపట్టారు. వైఎస్సార్ జిల్లా రాయచోటిలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడి, జమ్మలమడుగులో ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు,. కమలాపురంలో మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి, పులివెందులలో నియోజకవర్గ సమన్వయకర్త వైఎస్ అవినాష్‌రెడ్డి, రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి దీక్షలు చేపట్టారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను దీక్షకు కూర్చున్నారు. వైఎస్సార్ సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రకాశం జిల్లా ఒంగోలులో దీక్ష చేశారు. కొండేపిలో ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు దీక్షలు చేపట్టారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దీక్షలు చేపట్టారు. కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి నెల్లూరు జిల్లా కొడవలూరుమండలం నార్తురాజుపాళెంలో దీక్ష చేపట్టారు. -
అధిష్టానంతో నేరుగా చర్చించి.. పార్టీని కాపాడుకొందాం! : సీమాంధ్ర మంత్రులు
సాక్షి, హైదరాబాద్: ‘‘సమైక్య ఉద్యమంలో కాంగ్రెస్‌కు పూర్తిస్థాయి నష్టం తప్పదు. రాజకీయంగా మనమూ కష్టాలపాలవుతాం. ఈ దశ…లో పార్టీని రక్షించుకొనేందుకు మనమే ప్రయత్నిద్దాం అధిష్టానంతో నేరుగా సంబంధాలు నెరుపుతూ విభజన సమస్యలకు పరిష్కారం చూపిద్దాం. సీమాంధ్రలో పార్టీకి ఇబ్బందులు లేకుండా చూసుకుందాం. సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ కాంగ్రెస్ పేరిట ప్రజల్లోకి వెళ్దాం. ఇందుకోసం ముందుగా, ఉద్యమం కొంతైనా చల్లబడాలి. కేంద్ర మంత్రుల బృందాన్ని రప్పించి కొన్ని భరోసాలు ఇప్పిస్తే ఉద్యమాన్ని కొంత చల్లార్చవచ్చు. కేంద్ర మంత్రి చిరంజీవి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు ఈ బాధ్యత తీసుకోవాలి.’’ ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నివాసంలో మంగళవారం భేటీ అరుున… పలువ…ురు సీమాంధ్ర మంత్రులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సవ…ూవేశానికి కేంద్రమంత్రి చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. వ…ుంత్రి ఆనం మంత్రులందరికీ స్వయంగా ఫోన్‌చేసి భేటీకి పిలిచారని సమాచారం. సీమాంధ్ర సమస్యలపై కేంద్రంతో చర్చించే బాధ్యతను చిరంజీవికి అప్పగించారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు రఘువీరారెడ్డి, వట్టి వసంతకుమార్, సీ రామచంద్రయ్య, డొక్కా మాణిక్య వరప్రసాద్, మహీధర్ రెడ్డి, బాలరాజు, కొండ్రు మురళీ మోహన్ హాజరయ్యారు. రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయంతో ఉద్యమం తీవ్రతరమై ఇబ్బందులు ఎదురవుతున్నా పార్టీ లైన్లోనే వెళ్లాలని ఇటీవలి నిర్ణయానికి అనుగుణంగానే వారు చర్చలు కొనసాగించారు. ‘‘ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే సమైక్య ఉద్యమాన్ని భుజాలకెత్తుకోవడంతో పరిస్థితి ఆ పార్టీ వైపే ఏకపక్షమయ్యేలా కనిపిస్తోంది. సమస్యలను కేంద్రంతో పరిష్కరింప చేసి కాంగ్రెస్ పార్టీపై నమ్మకం కలిగించే బాధ్యత తీసుకోవలసిన ముఖ్యమంత్రి, ఏకపక్షంగా వెళ్లుతున్నారు. ఈ పరిస్థితిలో అధిష్టానంతో మంతనాలు సాగించి, సమస్యలు పరిష్కరింపచేశామని చెప్పుకొని …మే ప్రజల్లోకి వెళ్దాం’’ అని మంత్రి ఒకరు ప్రతిపాదించారు. ఆంటోనీ కమిటీని రాష్ట్రానికి రప్పించాలన్ని సూచన కూడా వచ్చింది. ఈ అంశాన్ని కేంద్ర మంత్రివ…ర్గ సమావేశంలో ప్రధాని దృష్టికి తేవాలని కేంద్రమంత్రి చిరంజీవిని కోరారు. అలాగే పార్టీ అధినేత్రికి కూడా పరిస్థితిని విన్నవించాలని నిర్ణయించారు, ఇక పార్టీలోని ఇతర పెద్దలతో చర్చించే బాధ్యతను బొత్స సత్యనారాయణకు అప్పగించారు. అలాగే మంత్రివర్గ ఉపసంఘంతో ఇకపై చర్చించబోవమంటూ ఏపీఎన్జీఓలు, ఉద్యోగ సంఘాలు ప్రకటించినందున, వారితో మాట్లాడి సమ్మెను విరమింపచేయాల్సిన బాధ్యతను సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికే వదిలేయాలని మంత్రులు భావిస్తున్నారు. -
ఉద్యమాన్ని నీరుగార్చేందుకే.. : ‘సేవ్ ఆంధ్రప్రదేశ్... సేవ్ కాంగ్రెస్’
‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ ఆంతర్యమదే కాంగ్రెస్ వర్గాల స్పష్టీకరణ సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ విభజన అనుకూల చర్చకు యత్నం అధిష్టానం వద్ద క్రెడిట్ కొట్టేయడానికి ఆధిపత్య పోరు షురూ సీఎం కిరణ్‌కు చెక్ పెట్టేందుకు తెరపైకి చిరంజీవిని తెచ్చారు! సాక్షి, హైదరాబాద్: ‘సేవ్ ఆంధ్రప్రదేశ్... సేవ్ కాంగ్రెస్’ - కాంగ్రెస్ కొత్తగా ఎత్తుకుంటున్న నినాదమిది. సమైక్య ఉద్యమం తీవ్రంగా సాగుతున్న తరుణంలో దాన్ని చల్లార్చి ప్రజల్లోకి వెళ్లాలని ఆ పార్టీ రచిస్తున్న వ్యూహంలో భాగంగా ఈ కొత్త నినాదంతో ముందుకొస్తున్నారు. సీమాంధ్రలో సమైక్య ఉద్యమానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ను ముందుకు తీసుకువెళ్లేందుకు పార్టీ పెద్దలు తెరవెనుక మరో కొత్త నాటకానికి తెరతీస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మైక్యాంధ్రప్రదేశ్ అని కాకుండా ప్రజల్లోకి వెళ్లేందుకు వారు ఎంచుకున్న ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ నినాదంలోనే సమైక్య వ్యతిరేక భావన దాగి ఉందని చెప్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత కూడా సీమాంధ్రను ఆంధ్రప్రదేశ్‌గానే పరిగణిస్తూ సీడబ్ల్యూసీ తీర్మానించిందని, అక్కడి సమస్యలను తీర్చి దాన్ని పరిరక్షించాలన్నదే కాంగ్రెస్ నేతల కొత్త నినాదం ఆంతర్యమని తేలుతోంది. మంగళవారం ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి నివాసంలో జరిగిన సీమాంధ్ర మంత్రుల సమావేశం పలురకాల చర్చలకు తావిస్తోంది. సీఎం తీరుపై ఇతర నేతల్లో ఆగ్రహం... రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ ఏకగ్రీవ తీర్మానం తరువాత సీమాంధ్రలో సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతుండడంతో కాంగ్రెస్ నేతలెవ్వరూ ఆ ప్రాంతంలో అడుగుపెట్టే పరిస్థితి లేకుండా పోయింది. పది రోజుల తరువాత… సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యవాదిగా తెరపైకి వచ్చే ప్రయత్నం చేశారు. పార్టీ కోర్ కమిటీ, సీడబ్ల్యూసీ సమావేశాలకు ముందు మౌనంగా ఉండి విభజన వల్ల తలెత్తే సమస్యలంటూ మీడియా ముందు ఏకరువుపెట్టారు. అయితే సీమాంధ్రలో పరిస్థితులు చేజారిపోతుండడంతో అధిష్టానమే ఇలా సీఎంతో మాట్లాడించిందన్న అనుమానాలు ఏర్పడ్డాయి. సమైక్య ఉద్యమం ప్రారంభమై అరవై రోజుల తరువాత కొద్ది రోజుల ముందు సీఎం మళ్లీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. కాంగ్రెస్ అధినాయకత్వం వ్యూహాత్మకంగానే సీమాంధ్ర నేతలందరినీ కలుపుకుని ఆ రకంగా మాట్లాడాలని చెప్తే సీఎం ఒక్కరే తానే చాంపియన్ అన్న రీతిలో మాట్లాడటంపై మిగిలిన నేతల్లో ఆగ్రహం తెప్పించింది. వ్యూహాత్మకంగా వ్యవహరించి సీమాంధ్ర ఉద్యమాన్ని చల్లార్చే విధంగా చూస్తానని అధిష్టానం ముందు చెప్పిన సీఎం ఒక్కడే అధిష్టానం దృష్టిలో పడుతున్నారని గమనించిన నేతలు ఆధిపత్య పోరులో అప్రమత్తమయ్యారు. ఆనం రామనారాయణరెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సీమాంధ్ర మంత్రులతో గత కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న సమావేశాలు కాంగ్రెస్ పెద్దల తాజా ఆలోచనల మేరకేనని తెలుస్తోంది. చిరంజీవిని ఈ సమావేశాల ద్వారా తెరపైకి తెచ్చి సీఎం కిరణ్‌కు చెక్ పెట్టించడంతో పాటు ‘సేవ్ ఆంధ్రప్రదే శ్ - సేవ్ కాంగ్రెస్’ నినాదంతో ప్రజల్లోకి వెళ్లేందుకు మార్గం సుగమం చేసుకోవచ్చన్న ఆలోచనతో పార్టీ పెద్దలు ఉన్నట్లు కనిపిస్తోందని కాంగ్రెస్ నేతలు విశ్లేషిస్తున్నారు. సమైక్య ఉద్యమాన్ని చల్లార్చి విభజనకు అనుకూలంగా ఉద్యమకారుల ఆలోచనలు మారేలా కాంగ్రెస్ నేతలు వ్యూహాన్ని అమల్లో పెట్టాలని భావిస్తున్నారు. తమ భేటీ కిరణ్‌కు వ్యతిరేకంగా కాదన్న ఆనం సీఎం కిరణ్‌కు వ్యతిరేకంగా ఈ సమావేశాన్ని పెట్టినట్లు బయట ప్రచారం జరగ్గా మంత్రి ఆనం దాన్ని ఖండించారు. సీఎం ఆలోచనల మేరకే తాము వివిధ సమస్యలపై చర్చించి వాటికి పరిష్కారం చూపించాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు పేర్కొన్నారు. కేంద్రంతో చర్చించే బాధ్యతలను కేంద్రమంత్రి చిరంజీవికి, పీసీసీ అధ్యక్షుడు బొత్సకు అప్పగించినట్లు ఆనం విలేకరులకు చెప్పారు. సీమాంధ్ర మంత్రుల్లో చీలిక... రాష్ట్ర విభజన ప్రక్రియను సాఫీగా పూర్తి చేయడానికి అధిష్టానం వ్యూహం అమలుచేయటంలో ఆధిపత్య పోరుతో మంత్రుల్లో విభేదాలు తీవ్రస్థాయికి చేరినట్టు చెప్తున్నారు. మరోవైపు విభజన సమస్యలను లేవనెత్తి వాటిని పరిష్కరించాకనే కేంద్రం ముందుకు వెళ్లాలంటూ అధిష్టానాన్ని ప్రశ్నించిన మాదిరిగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలతో అధిష్టానమే చీలికను ప్రోత్సహిస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు సీనియర్ మంత్రులను కూడా ఇదే పనిలో దించింది. బొత్స, ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి తదితరులు కూడా సీఎంకు అనుకూలంగా వ్యవహరిస్తున్న మంత్రులతో మాట్లాడుతూ వారిని తమ వర్గంలోకి తెచ్చుకుంటున్నారు. సీఎం అనుకూల వర్గంగా ముద్రపడ్డ మంత్రి కొండ్రు మురళి కూడా ఆనం నివాసంలో జరిగిన సమావేశానికి హాజరవటం విశేషం. ఇక్కడ సమావేశం జరుగుతున్న సమయంలోనే మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసంలో మరో భేటీ జరిగింది. గంటాతో పాటు మంత్రి శైలజానాథ్, ఎంపీ లగడపాటి ఇందులో పాల్గొన్నారు. దీంతో ఈ రెండు భేటీలపై సీఎం అనుకూల, వ్యతిరేక గ్రూపుల సమావేశంగా మీడియాలో ప్రచారమైంది. అయితే తాము అనుకోకుండా కలిశామని, లగడపాటి కూడా యథాలాపంగా అక్కడికి వచ్చారే తప్ప సమావేశం కావడానికి కానేకాదని ఒక మంత్రి పేర్కొన్నారు. -
ఉక్కు సంకల్పం .. యాభై రోజులుగా ఆగని సమైక్య పోరు
సాక్షి నెట్వర్క్ : సరిగ్గా యాభైరోజుల కిందట కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన దరిమిలా సీమాంధ్ర జిల్లాల్లో ఎగసిన సమైక్య ఉద్యమం జన నినాదమై ఉప్పెనలా సాగుతోంది. ప్రజోద్యమానికి సకల జనుల సమ్మె, ఆర్టీసీ సమ్మె తోడు కావడంతో సీమాంధ్ర జిల్లాల్లో పాలన స్తంభించింది. ఎన్ని ఇబ్బందులెదురవుతున్నా జనం సమైక్యాంధ్రప్రదేశ్ పరిరక్షణే లక్ష్యంగా అలుపెరగకుండా పోరాడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం బెల్లుపడలో రైతుగర్జన పేరుతో ర్యాలీ నిర్వహించారు. కొత్తూరులో క్రైస్తవులు ర్యాలీ చేపట్టగా పాలకొండలో సర్వమత ప్రార్థనలు చేశారు. ఆమదాలవలసలో ఉపాధ్యాయులు, ఎచ్చెర్ల అంబేద్కర్ వర్సిటీ విద్యార్థులు హోమాలు చేయించారు. విజయనగరంలోని జాతీయ రహదారిపై మహిళలు లలితాపారాయణం చేపట్టారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. నెల్లిమర్లలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు నడిరోడ్డుపై పడుకొని నిరసన తెలిపారు. విశాఖ ఏజెన్సీ పరిధిలోని పాడేరు, లంబసింగి, జి.మాడుగుల ప్రాంతాల్లో బంద్ జరిగింది. చింతపల్లిలో 11 మండలాల జీసీసీ ఉద్యోగులు ర్యాలీగా వెళ్లి బంద్ చేయించారు. మల్కాపురంలోని ఐవోఎల్ కంపెనీ గేట్ వద్ద 700 ఆయిల్ ట్యాంకర్ల నిర్వాహకులు రవాణాను నిలిపివేశారు. రాష్ట్రం విడిపోతే నదీ జలాల సమస్య తలెత్తి, వ్యవసాయం అనుబంధ రంగాలు దెబ్బ తింటాయని, పశువుల మనుగడకు ముప్పు వాటిల్లుతుందంటూ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రోడ్ కం రైలు వంతెనపై పశుసంవర్ధక శాఖ ఉద్యోగులు గొర్రెలతో ర్యాలీ చేశారు. విభజన జరిగితే గడ్డితిని బతకాలంటూ మండపేటలో ఉపాధ్యాయులు గడ్డి తిని నిరసన తెలిపారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో మహిళా ఉద్యోగులు, ఉపాధ్యాయులు బతుకమ్మ పండగను ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తోట గోపి తాడేపల్లిగూడెంలో పాదయాత్ర ప్రారంభించారు. కృష్ణా జిల్లా కౌతవరంలో వేలాది స్వశక్తి సంఘాల మహిళలు మానవహారం నిర్వహించారు. విజయవాడలో మున్సిపల్ ఉద్యోగులు బైక్ ర్యాలీతో గిరిప్రదక్షిణ చేశారు. భవన నిర్మాణశాఖ ఉద్యోగులు గుడివాడలో భారీ ప్రదర్శన చేపట్టారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో అంధులు రిలే నిరాహారదీక్షలో కూర్చున్నారు. సత్తెనపల్లిలో జలదీక్ష చేపట్టారు. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని సర్పంచ్‌లు సమైక్యాంధ్రకు మద్దతుగా తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయిలో రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరులో రెవెన్యూ సిబ్బంది కళ్ళకు గంతలు కట్టుకుని నిరసన చేపట్టారు. ఎన్జీఓలు బస్సులతో ర్యాలీ నిర్వహించారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వఠిద్ద ఆ సంస్థ కార్మికులు ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. గంగవ రంలో ఉపాధ్యాయులు గొర్రెల మందకు వినతిపత్రం సమర్పించి నిరసన తెలిపారు. వైఎస్సార్ జిల్లా రాజంపేటలోని బోయనపల్లె వద్ద జాతీయ రహదారిని ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో దిగ్బంధం చేశారు. జమ్మలమడుగులో విద్యుత్ ఉద్యోగులు సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలకు విద్యుత్ షాక్ ఇచ్చి దహనం చేశారు. ప్రొద్దుటూరులో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి నేతృత్వంలో పోస్టుకార్డు ఉద్యమాన్ని చేపట్టారు. అనంతపురంలో వ్యవసాయశాఖ అధికారులు భిక్షాటన చేశారు. విభజన జరిగితే మా బతుకులు బుగ్గి పాలవుతాయంటూ ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. గార్లదిన్నెలో వైఎస్సార్ సీపీ నేత పూజారి మాధవ ఆమరణ దీక్ష చేపట్టారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఉద్యోగ, ఉపాధ్యాయులు భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో లక్ష సంతకాల సేకరణ నిర్వహించారు. కాగా, విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన ఆర్టీసీ ఉద్యోగి బహుబలి రామరాజు (57) మంగళవారం టీవీలో ఉద్యమ వార్తలు చూస్తూ గుండెపోటుతో మృతిచెందాడు. లక్ష గళ గర్జన.. సమైక్య శంఖారావం.. భారీ మానవహారం... ఇలా వివిధ పేర్లతో విభిన్న రూపాల్లో జనం స్వచ్ఛందంగా రోడ్లపైకి తరలివచ్చి సమైక్య నినాదాలు హోరెత్తిస్తున్నారు. బుధవారం వైఎస్సార్ జిల్లా కడప నగరం రింగ్‌రోడ్డు చుట్టూ 36 కిలోమీటర్ల మేర వేలాది మంది మానవహారంగా ఏర్పడి సమైక్య ఆకాంక్షను వ్యక్తం చేశారు. నాన్‌పొలిటికల్ జేఏసీ చైర్మన్, జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్ధులు స్వచ్ఛందంగా హాజరై రోడ్డు వెంబడి సమైక్య నినాదాలను హోరెత్తించారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరులో విద్యార్థి, యువ జేఏసీ ఆధ్వర్యంలో జనగోదావరి సభ నిర్వహించారు. ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ వి.లక్ష్మణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్న ఈ సభకు జనం పోటెత్తారు. కొవ్వూరులో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ గర్జన నిర్వహించారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో మహాగళార్చన, బుట్టాయగూడెంలో సమైక్యాంధ్ర ఏజెన్సీ ప్రజాగర్జన చేపట్టారు. విజయనగరం జిల్లా ఎస్.కోటలో సమైక్య శంఖారావం నిర్వహించారు. పాతిక వేలమందికి పైగా ప్రజలు ఒక్క చోటకు చేరి ముక్తకంఠంతో జై సమైక్యాంధ్ర నినాదాలు మార్మోగించారు, సమైక్యాంద్రప్రదేశ్ను సాధించేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో పద్మశాలి సింహగర్జన పేరిట మహార్యాలీ చేపట్టారు. కోవూరులో సమైక్య సమరభేరి సభ, కలిగిరిలో మహిళా గర్జన, పొదలకూరులో యాదవ గర్జన నిర్వహించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో వేలాది మంది పాల్గొన్న మహిళా గర్జనలో సమైక్య నినాదాలు మార్మోగాయి. - సాక్షి నెట్వర్క్ టీచర్ల సద్భావనా యాత్ర ప్రారంభం ఇడుపులపాయ : ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను రెండుగా విడగొడుతామంటూ ఢిల్లీలో సీడబ్ల్యుసీ తీసుకున్న నిర్ణయం తిరిగి వెనక్కి తీసుకునేవరకు ఉద్యమం ఆగదని వైఎస్ఆర్టీఎఫ్ రాష్ట్ర కన్వీనర్ ఓబుళపతి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సీమాంధ్ర వ్యాప్తంగా నిర్వహించనున్న సమైక్యాంధ్ర ఉపాధ్యాయ సద్భావన యాత్రను బుధవారం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ ఘాట్ వద్ద వైఎస్సార్ సీపీ ముఖ్య నేత డాక్టర్ ఈసీ గంగిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఉపాధ్యాయులతో కలిసి గంగిరెడ్డి వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పించారు. హైదరాబాద్ బయల్దేరిన సమైక్య గణపతి నేటి ఉదయం హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం గుంటూరు : సమైక్యాంధ్ర నినాదంతో గుంటూరులో ఏర్పాటుచేసిన పది అడుగుల సమైక్య గణపతి విగ్రహాన్ని హుస్సేన్‌సాగర్‌లో గురువారం నిమజ్జనం చేసేందుకు నిర్వాహకులు బుధవారం రాత్రి 10 గంటలకు హైదరాబాద్‌కు బయల్దేరారు. అరండల్‌పేటలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహానికి తొమ్మిది రోజుల పాటు పూజలు చేసిన సమైక్యవాదులు బుధవారం హైదరాబాద్‌కు తరలివెళ్లారు. -
సమైక్యమే శ్వాస... వాడవాడల్లోనూ జనగర్జన
సమైక్య గర్జనలతో సీమాంధ్రలో ఊరూ, వాడా దద్దరిల్లుతోంది. గుంటూరు నగరంలో మంగళవారం ‘మండే గుండెలఘోష’ పేరుతో నిర్వహించిన సమైక్యాంధ్రప్రదేశ్ మహాసభ సమైక్యవాణిని ఎలుగెత్తి చాటింది. విద్యాసంస్థల యాజమాన్య జేఏసీ ఆధ్వర్యంలో నగర నడిబొడ్డునున్న అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద నిర్వహించిన సభకు జిల్లానలుమూలల నుంచి విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, న్యాయవాదులు వేలాదిగా తరలివచ్చారు. మండుటెండను సైతం లెక్కచేయక నడిరోడ్డుపై మూడు గంటలపాటు కూర్చుని సమైక్య నినాదాలు చేశారు. విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ.. 49 రోజులుగా అలుపెరగని సమైక్య ఉద్యమం.. మరో స్వాతంత్య్ర సంగ్రామాన్ని తలపిస్తోందని అభిప్రాయపడ్డారు. విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ లావురత్తయ్య, సమైక్యాంధ్ర జేఏసీ గౌరవాధ్యక్షుడు ఆచార్య పి. నరసింహారావు, కన్వీనర్ ఆచార్య ఎన్. శామ్యూల్, విద్యాసంస్థల జేఏసీ అధ్యక్షుడు జి. వెంకటేశ్వరరావు తదితరులు ప్రసంగించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో డీఆర్డీఏ-ఐకేపీ, మెప్మాల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ప్రకాశం మహిళా గర్జన’ కార్యక్రమానికి వేలాది మంది మహిళలు హాజరై సమైక్య నినాదాలు హోరెత్తించారు. కందుకూరులో ఐదు వేల మంది విద్యార్థులు విద్యార్థి గర్జన నిర్వహించారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని కోసిగి మండలకేంద్రంలో దాదాపు 20వేల మంది ప్రజలు సింహగర్జన పేరిట కదంతొక్కారు. సమైక్య నినాదాలు మార్మోగాయి. కర్నూలుకు చెందిన కళాకారులు ఆలపించిన జానపద గీతాలు ప్రజల్లో చైతన్యం నింపాయి. విశాఖ జిల్లా పెందుర్తిలో మువ్వన్నెల జెండా సాక్షిగా సమైక్యనాదం మిన్నంటింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు బీఆర్టీఎస్ రహదారిపై 2300 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన చేపట్టారు. - సాక్షి నెట్వర్క్ -
24 గంటల పాటు వైద్యసేవలు బంద్
విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్: జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 24 గంటల పాటు వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు సీమాంధ్ర మెడికల్ జేఏసీ తీసుకున్న నిర్ణయం మేరకు మంగళవారం అన్ని ఆస్ప త్రుల్లో వైద్య సేవలు నిలిపివేయనున్నారు. జిల్లాలో 400 వరకూ ప్రైవేట్, 95 ప్రభుత్వ ఆస్పత్రులున్నాయని, ఈ ఆస్పత్రుల్లో మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు వైద్యసేవలు నిలిపివేయనున్నట్టు విజయనగరం మెడికల్ జేఏసీ కన్వీనర్ ఇజ్రాయిల్, సభ్యులు తెలిపారు. వారు సోమవారం విలేకరులతో మా ట్లాడారు. అయితే అత్యవసర వైద్య సేవలకు మాత్రం మినహాయింపు ఇస్తున్నట్టు ప్రకటించా రు. కేంద్రాస్పత్రిలో ఓపీని కూడా నిలిపివేయనున్నట్టు ఇజ్రాయిల్ చెప్పారు. ఈ విషయాన్ని రోగులు గమనించి, సహకరించాలని ఆయన కోరా రు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉద్ధృతం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. -
ఏదో ఒకటి చేద్దాం!
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో సమైక్య ఉద్యమం ఎగసిపడుతుండడంతో తామూ ఆ ఉద్యమంలో భాగస్వాములవుతున్నామనే అభిప్రాయం ప్రజల్లో కల్పించాలని కాంగ్రెస్ సీమాంధ్ర నేతలు భావిస్తున్నారు. దీక్షలు, సభలు నిర్వహించే యోచనలో ఉన్నారు. సమైక్య ఉద్యమం ఉధృతంగా ఉండడం, హైదరాబాద్‌లో ఏపీఎన్జీఓల సభ విజయవంతం కావడం, ఇతర పార్టీలు ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాజీనామాలు చేయడంతో పాటు ప్రజల్లోకి చొచ్చుకుపోతుండటంతో తామూ ఏదో చేస్తున్నామనిపించుకోవాలనే ప్రయత్నాల్లో పడ్డారు. అయితే ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకాక తప్పదనే అభిప్రాయంతో ప్రత్యక్ష పోరాటం కాకుండా వేరే మార్గాలపై దృష్టి పెట్టారు. హైదరాబాద్ లేదా ఇబ్బందులు ఎదురుకాని సురక్షిత ప్రాంతాలను ఎంచుకుని దీక్షలు, సభలు నిర్వహించేందుకు వ్యూహాన్ని రచిస్తున్నారు. అయితే కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు, ఆధిపత్యపోరు ఈ విషయంలోనూ బహిర్గతమవుతున్నాయి. విశాఖపట్నంలో సమైక్యాంధ్రప్రదేశ్ పరిరక్షణ పేరిట రాజకీయేతర జేఏసీ సారథ్యంలో ఈ నెల 21న భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే రాజకీయేతర జేఏసీలో మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్యభూమిక పోషిస్తుండడంతో ఆయనకు వ్యతిరేకంగా ఉన్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఈ సభపై విముఖతతో ఉన్నారు. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. సీఎం, ఆయన మద్దతుతో ఇతర మంత్రులు తనకు వ్యతిరేకంగా కొందరిని రెచ్చగొడుతున్నారనే అభిప్రాయం బొత్సలో ఉంది. తనపై వ్యతిరేకతను మరింత పెంచేందుకే ఈ సభకు పూనుకుంటున్నారని బొత్స భావిస్తున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మరో ప్రాంతంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతృత్వంలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని నేతలు భావిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు మంగళవారం సమావేశమై హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించినందున తామూ అదే రీతిలో ఒక సభను పెట్టాలన్న ఆలోచనలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలున్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతల విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటుచేసి తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. దీంతోపాటు సమైక్యాంధ్ర ప్రదేశ్‌కు మద్దతుగా 48 గంటల నిరశన దీక్ష చేస్తామని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఇదివరకు ప్రకటించారు. అయితే ఎప్పుడు ఎక్కడ చేయాలన్న దానిపై నేతల మధ్య స్పష్టత లేకుండాపోయింది. హైదరాబాద్‌లోనే ఈ దీక్షలు చేపడతామని, అయితే ఎప్పుడు ఏ ప్రాంతంలో చేయాలన్న దానిపై గురువారం అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ సమైక్యాంధ్ర ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్ సాకే శైలజానాథ్ చెప్పారు. -
హైదరాబాద్ యూటీ అంటే యుద్ధమే: మంద కృష్ణ
హైదరాబాద్, సాక్షి: హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం(యుూటీ)గా చేస్తే కేంద్రంతో యుద్ధం తప్పదని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను తెలంగాణకు కాకుండా చేస్తే, తెలంగాణలో కాంగ్రెస్ లేకుండా చేస్తామన్నారు. తెలంగాణ ఉద్యమమే బలమైనదని 29న గుంటూరు సభలో నిరూపిస్తామన్నారు. తెలంగాణ వాదిగా తాను పాల్గొంటానని, 13 సీమాంధ్ర జిల్లాల నేతలు అదే సభలో పాల్గొని, ప్రత్యేకరాష్ట్ర వాదనను బలపరుస్తారన్నారు. సమైక్య ఉద్యమం నుంచి విద్యా సంస్థలు, ఆర్టీసీని మినహాయించాలన్న డిమాండ్‌తో ఇందిరాపార్కు వద్ద బుధవారం జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌ను యూటీ చేయాలనే కుట్రలకు వ్యతిరేకంగా 21న లక్షమంది విద్యార్థులతో ఓయూలో యుద్ధభేరి సభ నిర్వహిస్తావున్నారు. -
రాష్ట్రంలో ప్రభుత్వం ఎక్కడుంది?
సాక్షి, హైదరాబాద్: విభజన, సమైక్య ఉద్యమాలతో రాష్ట్రంలో పాలన స్తంభించడం వల్లే ప్రజా సమస్యల పరిష్కారం కోసం గవర్నర్‌ను సంప్రదించామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు చెప్పారు. రాష్ట్రంలో అనిశ్చితికి తెరదించి సామాన్యుల కడగండ్లకు పరిష్కారం చూపాల్సిందిగా ఆయన గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. కుల వివక్ష పోరాట సమితి (కేవీపీఎస్) ఆధ్వర్యంలో మంగళవారం రాఘవులు, చెరుపల్లి సీతారాములు, జమలయ్య, జాన్‌వెస్లీ, శ్రీరామ్ నాయక్, ప్రసాద్ తదితరులు రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఈ మేరకు ఒక వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర విభజన, సమైక్యాంధ్ర ఉద్యమాల ఆందోళనలతో బడుగు, బలహీన వర్గాలు తీవ్రంగా నష్టపోతున్నాయని వివరించారు. వినతిపత్రంలోని సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళతానని గవర్నర్ పేర్కొనడంతో... ‘అదే (ప్రభుత్వం) ఉంటే మీ దగ్గరకు వచ్చే వాళ్లం కాదు. రాష్ట్రంలో పాలన స్తంభించి ఏడాది దాటి పోయింది’ అని రాఘవులు వ్యాఖ్యానించారు. దీంతో కంగుతిన్న గవర్నర్.. తన పరిధి మేరకు ఏది చేయగలిగితే అది చేస్తానని బదులిచ్చారు. -
రోజురోజుకూ రగులుతున్న నిరసనాంధ్ర
సాక్షి నెట్వర్క్: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి వేర్పాటు ప్రకటన వచ్చిన దరిమిలా సరిగ్గా నెలరోజుల కిందట ఎగసిన సమైక్య ఉద్యమం రోజురోజుకూ బలపడుతూ తీవ్రరూపం దాలుస్తోంది. రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలంటూ సీమాంధ్ర జిల్లాల్లో ప్రతినిత్యం ఆందోళనలు మిన్నంటుతున్నాయి. తెలుగు భాషా, క్రీడా దినోత్సవమైన గురువారంనాడు కూడా రోజూమాదిరిగానే ధర్నాలు, రాస్తారోకోలు, వినూత్న ఆందోళనలతో కోస్తా, రాయలసీమ జిల్లాలు దద్దరిల్లాయి. అనంతపురం జిల్లా కదిరిలో జేఏసీ చేపట్టిన ‘ఖాద్రీ లక్ష జన గర్జన’ విజయంతమైంది. జై సమైక్యాంధ్ర అంటూ లక్ష గొంతులు నినదించాయి. ఎస్కేయూలో జేఏసీ నాయకులు, విద్యార్థులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. గుంతకల్లులో వైఎస్సార్సీపీ యూత్ విభాగం ఆధ్వర్యంలో మోటారు సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. రాయదుర్గంలో మునిసిపల్ కమిషనర్, గుంటూరు జిల్లా తెనాలి గాంధీచౌక్ సెంటర్లో మునిసిపల్ ఉద్యోగులు రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. గుంటూరులో భారీ మానవహారంగా ఉద్యమకారులు ఏర్పడ్డారు. రాజకీయ జేఏసీ నేతృత్వంలో ప్రైవేటు ఉపాధ్యాయుల రిలేదీక్షల శిబిరాన్ని వైఎస్ఆర్ సీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆర్టీసీ కార్మికులు శరీరానికి చెట్ల కొమ్మలు చుట్టుకొని ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయులు భారీ ప్రదర్శన చేపట్టారు. వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్లలో ఐదుగురు విద్యుత్ కార్మికుల అరెస్టును నిరసిస్తూ రెండు వేల మందికి పైగా ఆర్టీపీపీ కార్మికులు, ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, లింగారెడ్డి, మాజీమంత్రి పి.రామసుబ్బారెడ్డి నేతృత్వంలో పోలీసుస్టేషన్‌ను ముట్టడించారు. దీంతో చేసేదేమి లేక పోలీసులు వారిని విడుదల చేశారు. రైల్వేకోడూరులో అర్ధ లక్ష గళ గర్జన పేరుతో ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. విశాఖలో వ్యవసాయశాఖ అనుబంధశాఖ సిబ్బంది ఆధ్వర్యంలో గడ్డి తినే కార్యక్రమం జరిగింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి మూడురోడ్ల జంక్షన్లో ఉపాధ్యాయులు మోకాళ్లతో నడుస్తూ నిరసన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం బెండమూరులంకలో రైతులు రోడ్డుపై పశువులను ఉంచి దిగ్బంధం చేశారు. స్పోర్ట్స్ డే సందర్భంగా కొత్తపేట పాత బస్టాండ్ సెంటర్లో పీఈటీలు ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. కాకినాడలో ఉపాధ్యాయులు భారీ బైక్ ర్యాలీ చేశారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో వికలాంగులు ర్యాలీ చేపట్టి సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. స్పోర్ట్స్ డేను పురస్కరించుకుని గురువారం చిత్తూరులో ఎమ్మెల్యే సీకేబాబు, వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఏఎస్.మనోహర్‌తోపాటు పలువురు జేఏసీ నేతలు రోడ్డుపైనే క్రికెట్, ఫుట్‌బాల్, వాలీబాల్ ఆడారు. శ్రీకాకుళంలో 500 మంది డ్వాక్రా సంఘాల మహిళలు నిండు బిందెలతో ర్యాలీగా వెళ్లి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పంచామృతాభిషేకం చేశారు. నరసన్నపేటలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో 10 వేల మంది విద్యార్థులతో గళార్చన కార్యక్రమం జరిగింది. కృష్ణాజిల్లా బెజవాడ దుర్గమ్మ గుడి అర్చకులు, వేద పండితులు ప్రవచనాలు చెప్పి నిరసన తెలిపారు. గుడివాడలో మున్సిపల్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 4 వేల మంది డ్వాక్రా మహిళలతో ర్యాలీ జరిపారు. తెలంగాణ-రాయలసీమ రహదారి దిగ్బంధం తెలంగాణ-రాయలసీమ సరిహద్దు గ్రామమైన శ్రీశైలం వద్ద సమైక్యవాదులు రహదారిని దిగ్బంధించారు. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల జేఏసీ, విద్యార్థి జేఏసీ, శ్రీశైలం మండల జర్నలిస్ట్‌ల ఆసోసియేషన్ల ఆధ్వర్యంలో వాహనాలను అడ్డుకున్నారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కేసీఆర్, సోనియా గాంధీ, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, న్యాయశాఖ మంత్రి ఏరాసుప్రతాపరెడ్డిల దిష్టిబొమ్మలను దహనం చేసి కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. ‘మెగా’ సినిమాలను అడ్డుకుంటాం: సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ సమైక్యాంధ్రకు కట్టుబడి కేంద్రమంత్రి చిరంజీవి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని లేదంటే ఆయన కుటుంబ సభ్యుల సినిమాల విడుదలను అడ్డుకుంటామని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ జిల్లా అధ్యక్షుడు డి.అంజయ్య బుధవారం నెల్లూరులో హెచ్చరించారు. తిరుపతి, చిత్తూరు దిగ్బంధం.. విజయవంతం సమైక్యాంధ్ర జేఏసీల ఐక్యకార్యాచరణ కమిటీ పిలుపు మేరకు తిరుపతి, చిత్తూరు నగరాల్లో 48 గంటల పాటు చేపట్టిన దిగ్బంధనం విజయవంతంమైంది. బుధ, గురువారాలు రెండు రోజులు సమైక్యవాదులు ద్విచక్ర వాహనాలను మినహా ఏ వాహనాన్నీ తిరగనివ్వలేదు. ఫలితంగా తిరుపతి, చిత్తూరు శివారు ప్రాంతంలో తమిళనాడు, కర్ణాటక వైపు వెళ్లివచ్చే వాహనాలు కిలోమీటర్ల మేర రోడ్లపై నిలిచిపోయాయి. మందుల షాపులు మినహా ఆసుపత్రులు, సినిమాహాళ్లు, విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు తాళాలు వేశారు. కూరగాయల మార్కెట్లు కూడా మూసివేశారు. అరెస్టు చేస్తే కరెంట్ కట్ చేస్తాం: విద్యుత్ జేఏసీ సమైక్యాంధ్ర కోసం పోరాటం చేసే విద్యుత్ ఉద్యోగులను, జేఏసీ నేతలను అరెస్టుచేస్తే ఆయా పోలీసుస్టేషన్లు, ఎస్పీ, కలెక్టర్ కార్యాలయాలకు కరెంట్ తీసేస్తామని విద్యుత్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కోలాకి శ్రీనివాసరావు గురువారం విశాఖలో హెచ్చరించారు. వైఎస్సార్ జిల్లా కడపలోని రాయలసీమ థర్మల్ పవర్స్టేషన్కి చెందిన పది మంది కాంట్రాక్టు ఉద్యోగులను పోలీసులు గురువారం అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. 5 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి ఇంటర్ అధ్యాపకులు రానున్న సెప్టెంబర్ 5వ తేదీ గురుపూజోత్సవం అర్ధరాత్రి నుంచి ఇంటర్అధ్యాపకులంతా సమ్మెలోకి వెళ్లనున్నుట్టు ఇంటర్మీడియేట్ అధ్యాపక జేఏసీ కన్వీనర్ వి.రవి ప్రకటించారు. విజయవాడలో గురువారం అధ్యాపక జేఏసీ 13 జిల్లాల నాయకుల సమీక్ష సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కోస్తా, సీమ జిల్లాల్లోని 665 కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులు, సిబ్బంది సమ్మెలో పాల్గొంటూ నిరవధిక నిరాహారదీక్షలకు దిగనున్నట్టు చెప్పారు. ప్రైవేటు కళాశాలల అధ్యాపక సిబ్బంది కూడా తమతో కలిసివచ్చేందుకు చర్చలు జరుపుతున్నామన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యం బాగుండాలని ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోకాళ్లపై మెట్లెక్కి ఆలయంలో పూజలు చేశారు. పార్టీ నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ తెల్లం వెంకట్రావు, పార్టీ బీసీ సెల్ రాష్ట్ర నేత కడియం రామాచారి పాల్గొన్నారు. -
కృష్ణం వందే సమైక్యం
సాక్షి నెట్వర్క్: సమైక్య ఉద్యమం రోజురోజుకు ఉద్థృతమవుతోంది. సీమాంధ్ర జిల్లాలో బుధవారం ఉద్యమకారులు నిరసనలతో హోరెత్తించారు. ర్యాలీలు, ధర్నాలు, మానవహారాలు, దిష్టిబొమ్మల దహనాలు చేశారు. కృష్ణాష్టమి వేడుకల్లోనూ సమైక్య ఆకాంక్ష ప్రతిఫలించింది. పలుచోట్ల సమైక్యవాదులు ఉట్టికొట్టి తెలుగువారంతా ఒక్కటిగానే ఉండాలంటూ కృష్ణభగవానుణ్ణి పూజించారు. సకలం బంద్‌తో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నా ప్రజలు ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. గుంటూరులో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో, చిలకలూరిపేటలోని జాతీయరహదారిపై విద్యార్థులు మానవహారం చేపట్టారు. ఆర్టీసీ ఉద్యోగులు అద్దెబస్సులతో ర్యాలీ నిర్వహించారు. తెనాలి, బాపట్ల, సత్తెనపల్లి, వినుకొండ, మాచర్లలో బ్రాహ్మణ సమాఖ్య బైక్‌ర్యాలీలు చేపట్టింది. శ్రీకాకుళంలో జెడ్పీ ఉద్యోగులు, ఆటో, మెకానిక్‌లు శిరో ముండనం, అర్ధ శిరో ముండనాలు చేయించుకొని నిరసన తెలిపారు. పాలకొండలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు చెందిన దాదాపు 10 వేల మంది విద్యార్థులు పట్టణంలో మహా మానవహారం నిర్వహించారు. పాలకొండలోని ఉపాధ్యాయ ఐక్యవేదిక శిబిరం నుంచి సోనియాగాంధీకి పోస్టుకార్డులు, ఆంటోనీ కమిటీకి ఎస్ఎంఎస్లు పంపే కార్యక్రమం చేపట్టారు. ఎచ్చెర్లలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ విద్యార్థులు మాక్ పార్లమెంట్ నిర్వహించారు. రాజాంలో ఎన్జీవోలు భిక్షాటన చేశారు. విజయనగరంలో ఏపీఎన్జీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ దిష్టిబొమ్మకు సుమారు మూడు గంటల పాటు శవయాత్ర చేపట్టి అనంతరం దహన సంస్కారాలు చేశారు. ఆ దిష్టిబొమ్మకు మద్యం పట్టించి సారా సత్తిబాబు అంతిమ కోరిక తీర్చినట్లు నిరసన తెలిపారు. బొత్స సతీమణి ఝాన్సీ వేషధారణలో మహిళల రోదన నటన అందరినీ ఆకట్టుకుంది. గజపతినగరంలో పలు గ్రామాలకు చెందిన రైతులు సమైక్యాంధ్రకు మద్దతుగా ఎడ్ల బళ్లతో ర్యాలీ చేసి నిరసన వ్యక్తం చేశారు. విజయవాడలోని బందర్‌రోడ్డులో వే లాదిమంది విద్యార్ధులు కదం తొక్కారు. ఇరిగేషన్ కార్యాలయం వద్ద రైతు నేత యెర్నేని నాగేంద్రనాథ్ చేపట్టిన నిరాహార దీక్ష రెండోరోజుకు చేరింది. ముదినేపల్లిలో ఉపాధ్యాయులు రోడ్డుపై బిక్షాటన చేశారు. ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ గేట్ వద్ద సమైక్యాంధ్రకు మద్దతుగా రోడ్డుపైనే కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో వందల మంది స్వర్ణకారులు ధర్నా చేపట్టారు. విశాఖ ఏజెన్సీ మారుమూల చింతపల్లిలో భారీ వర్షంలోనూ జేఏసీ నేతలు మానవహారం చేపట్టారు. ఏయూ మెయిన్‌గేట్ వద్ద విద్యార్థులు నిరసన వ్యక్తం చేసి అనంతరం మానవహారంగా ఏర్పడ్డారు. చోడవరం సమీపంలోని ల క్ష్మీపురం చెరువులో సమైక్యవాదులు జలదీక్ష నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ప్రజలకు కనిపించడం లేదంటూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నగరంలో బ్యానర్లు కట్టింది. అమలాపురంలో గజల్ శ్రీనివాస్ పాటలు పాడి ఉత్తేజపరిచారు. నేడు సీమ-తెలంగాణ రహదారి దిగ్బంధం సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రభుత్వ రవాణా శాఖ, జర్నలిస్టుల ఆధ్వర్యంలో గురువారం కర్నూలు జిల్లా శ్రీశైలం డ్యాం దిగువున ఉన్న బ్రిడ్జి వద్ద రాయలసీమ-తెలంగాణ రహదారిని దిగ్బంధించనున్నారు. కర్నూలులోని ప్రభుత్వ టౌన్ మోడల్ కాలేజీకి చెందిన 500 మంది విద్యార్థులు రాష్ట్రాన్ని విభజించొద్దని కోరుతూ ప్రధానికి పోస్టు కార్డులు పంపారు. ప్రభుత్వ ప్రసూతి వైద్యులు నడిరోడ్డుపైనే రోగులను పరీక్షించి నిరసన తెలిపారు. అనంతపురంలో న్యాయవాదులు బుధవారం రాత్రి కాగడాల ప్రదర్శన చేపట్టారు. గుంతకల్లులో సమైక్యవాదులు ప్రజాగర్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. పశువైద్య సిబ్బంది తెలుగుతల్లి విగ్రహం వద్ద మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. మంత్రి రఘువీరారెడ్డి కనిపించడం లేదని లేపాక్షి, పామిడిలో సమైక్యవాదులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాయదుర్గంలో గొర్రెలకు సోనియా, దిగ్విజయ్, కేసీఆర్ చిత్రపటాలు తగిలించి ర్యాలీ చేశారు. వైఎస్సార్ జిల్లా కడప నగరంలో వైద్యులు భారీ ర్యాలీ చేపట్టారు. కలెక్టరేట్ సమీపంలో అర్చకులు హోమం నిర్వహించారు. పశు సంవర్థక శాఖ ఉద్యోగులు కాగడాలతో వినూత్న నిరసన తెలిపారు. జమ్మలమడుగులో ఐదువేల మంది మహిళలు, రాయచోటిలో ఆర్టీసీ కార్మికులు, రైల్వేకోడూరులో 600 మంది ఎపీఎండీసీ కార్మికులు ర్యాలీని నిర్వహించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని దీక్షలు చేస్తున్న వారి ఆరోగ్యం బాగుండాలని దేవాదాయ శాఖ ఉద్యోగులు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్లో హోమం నిర్వహించారు. పెనుగొండలో జేఏసీ నాయకులు భిక్షాటన చేశారు. కొవ్వూరులో జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరంలో కేరళ రాష్ట్రానికి చెందిన మలయాళీలు ఆంధ్ర రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వారి సంప్రదాయ దుస్తులు ధరించి ప్రదర్శన చేశారు. తిరుపతి.. చిత్తూరు దిగ్బంధం చిత్తూరు, తిరుపతి నగరాలను దిగ్బంధించారు. రెండురోజుల బంద్ పిలుపులో భాగంగా తొలిరోజు రెండు నగరాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలు, వ్యాపార దుకాణాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. తిరుమలకు వెళ్లే భక్తుల కోసం తిరుపతి స్టేషన్ నుంచి అలిపిరి బస్టాండ్ వరకు వెళ్లేందుకు టీటీడీ బస్సులను ఏర్పాటుచేసింది. చిత్తూరులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో రోడ్డుపై చేపలు పడుతూ నిరసన తెలిపారు. శ్రీకాళహస్తిలో రైతులు అరటిచెట్లు, చెరుకుగడలు, వరి కంకులతో ర్యాలీ నిర్వహించారు.