సమైక్య ఉద్యమానికి ఊపు | Ysr congress party leaders make United initiations in all seemandhra regions | Sakshi
Sakshi News home page

సమైక్య ఉద్యమానికి ఊపు

Published Thu, Oct 3 2013 2:37 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

Ysr congress party leaders make United initiations in all seemandhra regions

* సీమాంధ్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నేతల సమైక్య దీక్షలు ప్రారంభం
 
*  నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నిరశన
 
*  సంఘీభావంగా వేల మంది కార్యకర్తల దీక్షలు.. కదలివచ్చిన ఊరూవాడా 

సమైక్యాంధ్ర ఉద్యమంలో మరో ఘట్టం మొదలైంది. ఇప్పటివరకూ విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, రైతులు వంటి సాధారణ ప్రజా సమూహాలే ఉద్యమిస్తుండగా.. ఇప్పుడిక సమైక్యాంధ్రను కాంక్షిస్తూ ఏకైక రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ఉద్యమ బరిలో దిగింది. దీంతో సమైక్య ఉద్యమం మరింత ఉధృతమైంది. నిన్నటి వరకు పట్టణాలు, నగరాలకు పరిమితమైన సమైక్య ఉద్యమం వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, శ్రేణుల దీక్షలతో మారుమూల పలెల్లలకూ విస్తరించింది.
సాక్షి నెట్‌వర్క్: అహింసే ఆయుధంగా స్వాతంత్య్ర పోరాటాన్ని నడిపిన  గాంధీజీ స్ఫూర్తితో సమైక్య జనోద్యమానికి బాసటగా నిలవాలని పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు బుధవారం గాంధీ జయంతి నాడు సీమాంధ్రలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో దీక్షలు చేపట్టారు. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో నాలుగైదు అసెంబ్లీ సెగ్మెంట్లు మినహా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ సమన్వయకర్తలు నిరాహారదీక్షలకు దిగారు. వీరికి సంఘీభావంగా ప్రతిచోటా వందలాదిమంది కార్యకర్తలు నిరశన చేపట్టారు.

విభజనను వ్యతిరేకిస్తూ సమైక్య రాష్ట్రమే లక్ష్యంగా స్పష్టమైన ప్రకటన చేసి పోరుబాట పట్టిన ఏకైక ప్రధాన రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లోనూ ఒకేసారి ఉద్యమబావుటా ఎగరేయడం రాజకీయ చరిత్రలోనే అరుదైన రికార్డుగా ఘనతికెక్కనుంది. ఏఐసీసీ అధిష్టానం నుంచి వేర్పాటు ప్రకటన వచ్చిన దరిమిలా సీమాంధ్ర జిల్లాల్లో రెండు నెలలకుపైగా ఉధతంగా సాగుతున్న సమైక్య ఉద్యమం ఇప్పుడు వైఎస్సార్ సీపీ శ్రేణుల దీక్షతో కొత్తరూపు సంతరించుకుంది. బుధవారం సీమాంధ్రలో ఎటుచూసినా వైఎస్సార్ సీపీ శ్రేణుల దీక్షలకు మద్దతుగా సమైక్యస్ఫూర్తి సాగింది. సకలజనుల సమ్మెలో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులు, సమైక్యమే లక్ష్యంగా పోరుబాట పట్టిన అన్నివర్గాల ప్రజలు వైఎస్సార్ సీపీ సమైక్య దీక్షా శిబిరాలను సందర్శించి సంఘీభావం తెలిపారు.
 
 జోరువర్షంలోనూ...
 తూర్పు గోదావరి జిల్లాలో తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కాకినాడ మసీదు సెంటర్‌లో నడిరోడ్డుపై ఎలాంటి టెంట్ లేకుండా రిలే దీక్ష చేపట్టారు. కుండపోతగా కురిసిన వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తడుస్తూనే దీక్ష కొనసాగించారు.  పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త సుజయ్ కృష్ణ రంగారావు విజయనగరం జిల్లా బొబ్బిలిలో దీక్షకు కూర్చున్నారు.  శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ 48 గంటల దీక్ష చేపట్టారు. తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాక రరెడ్డి రెండు రోజుల నిరాహారదీక్ష చేపట్టారు.
 
 కర్నూలులో భారీ ర్యాలీ
కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు.  ఆళ్లగడ్డలో వైఎస్‌ఆర్‌సీపీ శాసనసభాపక్ష ఉపనేత, ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి, నంద్యాలలో పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి, మంత్రాలయంలో తాజా మాజీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి దీక్ష చేపట్టారు. అనంతపురం జిల్లా  రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి,  అనంతపురంలో ఎమ్మెల్యే గురునాథరెడ్డి, ఉరవకొండలో సీఈసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి, పుట్టపర్తిలో కడపల మోహన్‌రెడ్డి, డాక్టర్ హరికృష్ణ  దీక్షలు  చేపట్టారు. వైఎస్సార్ జిల్లా రాయచోటిలో  ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడి, జమ్మలమడుగులో ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు,. కమలాపురంలో  మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి, పులివెందులలో నియోజకవర్గ సమన్వయకర్త వైఎస్ అవినాష్‌రెడ్డి, రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి దీక్షలు చేపట్టారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను దీక్షకు కూర్చున్నారు.
 
  వైఎస్సార్ సీఎల్‌పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రకాశం జిల్లా ఒంగోలులో దీక్ష చేశారు. కొండేపిలో ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు దీక్షలు చేపట్టారు.  గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దీక్షలు చేపట్టారు. కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి నెల్లూరు జిల్లా కొడవలూరుమండలం నార్తురాజుపాళెంలో దీక్ష చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement