అలుపెరగని జనోద్యమం
సాక్షి నెట్‌వర్క్ : సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం అలుపెరగకుండా సాగుతోంది. వరుసగా 98వ రోజూ మంగళవారం కోస్తా, రాయలసీమ జిల్లాల్లో సమైక్య ఉద్యమం ఉద్ధృతంగా ఎగసింది. విశాఖ కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు ధర్నా చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్‌ను ఎన్జీవోలు ముట్టడించారు. భీమవరంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు రోడ్డుపై బైఠారుుంచారు. దువ్వలో రైతు జేఏసీ నాయకులు, ఆకివీడులో వృద్ధుల సంక్షేమ సంఘం సభ్యులు, భీమడోలులో వికలాంగులు నిరశన దీక్షలు చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో సమైక్యవాదులు ధర్నా చేశారు. కాకినాడలో న్యాయవాదుల బంద్ పిలుపుతో జనజీవనం స్తంభించింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైఎస్సార్ కూడలిలో విద్యార్థులు భారీ మానవహారం నిర్వహించారు.
సమైక్య రాష్ట్రం కోసం ప్రాణాలైనా అర్పిస్తామంటూ శపథం చేశారు. కృష్ణాజిల్లా చల్లపల్లి, కలిదిండిలో డ్వాక్రా మహిళలు దీక్షలు చేపట్టారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా మాట్లాడుతున్న కేంద్రమంత్రి పనబాక లక్ష్మి దిష్టిబొమ్మను దహనం చేశారు. మైలవరంలో ఎన్జీవోలు, ఆర్టీసీ కార్మికులు ప్రదర్శన చేపట్టారు. విజయవాడలో న్యాయవాదులు కొవ్వొత్తులతో ప్రదర్శన చేపట్టారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో విద్యార్థులు భారీ ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. కుప్పంలో సమైక్య జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు, చిత్తూరులో న్యాయవాదులు రాస్తారోకో చేశారు. అనంతపురం జిల్లా హిందూపురంలో ర్యాలీ చేశారు. రాయదుర్గంలోని విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు. వైఎస్సార్ జిల్లా కడపలోని కోటిరెడ్డి కూడలిలో వందలాదిమంది విద్యార్థులు భారీ మానవహారం నిర్మించారు. ప్రొద్దుటూరు, బద్వేలు, రైల్వేకోడూరు పట్టణాల్లో విద్యార్థులు మానవహారాలుగా నిలబడ్డారు.
వైఎస్సార్సీపీ శ్రేణుల నిర్విరామపోరు
జననేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు సమైక్యాంధ్ర పరిరక్షణకు ఉద్యమిస్తున్న పార్టీ శ్రేణులు మంగళవారం నాడూ ఆందోళనలు చేపట్టాయి. సమైక్య ఉద్యమాన్ని కించపరుస్తూ మాట్లాడిన మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల దిష్టిబొమ్మలను పార్టీ కార్యకర్తలు తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం పాశర్లపూడిలో దహనం చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ఐస్‌లు అమ్మి వినూత్న నిరసన తెలిపారు. అనంతపురంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. గుం టూరులో పార్టీ నేతలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. సీమాంధ్ర జిల్లాల్లోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.