దక్షిణాఫ్రికాలో ముదురుతున్న వివాదం
దక్షిణాఫ్రికాలో బంగారు గనిలో అక్రమ మైనింగ్ ఉదంతం ముదురు పాకాన పడుతోంది. నార్త్‌వెస్ట్ ప్రావిన్స్‌లో మూసేసిన స్టీల్‌ఫాంటీన్ గనిలో 4 వేల మంది దాకా కార్మికులు చిక్కుకుపోవడం తెలిసిందే. వారిని అరెస్టు చేసేందుకు పోలీసు లు భారీగా మోహరించారు. ఆహారం తది తరాలు అందకుండా అడ్డుకుంటున్నారు. ‘‘దాంతో మరో దారిలేక వారే బయటకు వస్తారు. రాగానే అరెస్టు చేస్తాం.
అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేయాలంటే ఇలాంటి కఠిన చర్యలు తప్పవు’’అని అధికారులు చెబున్నారు. ఈ ఉదంతం దక్షిణాఫ్రికాలోనే గాక అంతర్జాతీయంగా కూడా సంచలనం సృష్టిస్తోంది. ప్రాణాలు నిలుపుకోవడానికి మరో దారి లేక కార్మికులు టూత్‌పేస్టు తింటూ, వెనిగర్ తాగుతున్నారన్న వార్తలు గుండెల్ని పిండేస్తున్నాయి. ఇంకొద్ది రో జులు గడిస్తే వాళ్లు పూర్తిగా నీరసించి స్పృహ తప్పవచ్చంటున్నారు.
ప్రభుత్వ చర్యలు హత్యాయత్నానికి ఏమాత్రం తీసిపోవంటూ హక్కుల సంస్థలు మండిపడుతున్నాయి. జీవించే హక్కును కాలరాసే అధికారం సహా ఎవరికీ లేదని వాదిస్తున్నాయి. అధికారులు మాత్రం చిక్కుబడ్డ కార్మికుల్లో పలువురి వద్ద ఆయుధాలుండే ఆస్కారం కూడా ఉందని చెబుతున్నారు. మరోవైపు కార్మికుల్లో పలువురు అక్రమంగా దేశంలో ప్రవేశించిన వారే కావడంతో కఠిన శిక్షలకు భయపడి బయటికొచ్చేందుకు ససేమిరా అంటున్నారు.
ఈ నేపథ్యంలో కార్మికులను ఆదుకునేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. చాలామంది స్వచ్ఛంద కార్యకర్తలు ఆహారంతో పాటు నిత్యావసరాలు వెంట తీసుకుని భూగర్భ గనిలోకి ప్రవేశించారు. వారు 50 మందితో కూడిన బృందాలుగా లోనికి వెళ్తున్నారు. కార్మికులకు ఆహారం తదితరాలు అందించడమే గాక వారికి నచ్చజెప్పి బయటికి తీసుకొచ్చే పనిలో కూడా పడ్డారు.
వాళ్లలో చాలామంది పూర్తిగా నీరసించిపోయిన స్థితిలో ఉండటంతో ఒక్కొక్కరిని బయటికి తీసుకొచ్చేందుకు గంటకు పైగా పడుతోందట. గనిలో పలు మృతదేహాలను కూడా వలెంటీర్లు గుర్తించినట్టు సమాచారం. అవి కుళ్లి కంపు కొడుతున్నట్టు చెబుతున్నారు! గత వారం రోజుల్లో 1,000 మంది దాకా కార్మికులు బయటికొచ్చి లొంగిపోయారు. దక్షిణాఫ్రికాలో అక్రమ మైనింగ్ భారీ ఎత్తున జరుగుతుంటుంది.
ఫలితంగా ఖజానాకు వందలాది కోట్ల డాలర్ల మేరకు నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో కొంతకాలంగా వాటిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. కొన్నేళ్లలో వందలాది గనులను మూసేయడంతో అప్పటిదాకా వాటిలో పని చేసిన కార్మికులు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. బతుకుదెరువు కోసం అక్రమ మైనింగ్‌కు పాల్పడే ముఠాల చేతిలో చిక్కుతున్నారు. ఆ క్రమంలో నెలల తరబడి భూగర్భంలో గడుపుతున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment