మూతపడిన బంగారం గనిలో చిక్కుకుపోయిన 4 వేల మంది
ఆహారం, నీరు అందకుండా మోహరించిన పోలీసులు
బయటకు రప్పించి అరెస్టు చేయడానికి ఎత్తుగడ
జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలో బంగారం గనులు అధికంగా ఉన్నాయి. కొన్నిచోట్ల ముడి ఖనిజాన్ని పూర్తిగా తవ్వేసి గనులను మూసివేశారు. ఆయా గనుల్లోకి వెళ్లడం చట్టవిరుద్ధం. కానీ, అక్రమ మైనింగ్‌కు పాల్పడే ముఠాలు మూతపడిన గనులను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. అక్కడ ఇంకా బంగారం ఉంటుందన్న అంచనాతో మనుషులను అందులోకి పంపిస్తున్నాయి. మట్టిని తవ్వేసి బయటకు చేర్చడమే వీరి పని. వారాల తరబడి పని చేయాల్సి ఉంటుంది.
ఈ గనుల్లో పని చేయడానికి పొరుగు దేశాల నుంచి కూడా వస్తుంటారు. ఇదంతా పెద్ద మాఫియాగా మారింది. నార్త్‌వెస్ట్ ప్రావిన్స్‌లోని స్టిల్‌ఫాంటీన్ గనిలో ఏకంగా 4 వేల మంది చిక్కుకుపోవడం సంచలనాత్మకంగా మారింది. వీరంతా కొద్ది రోజుల క్రితం గనిలోకి చేరుకున్నారు. ప్రస్తుతం ఆహారం, నీరు, ఇతర సౌకర్యాలు లేక అలమటిస్తున్నట్లు తెలిసింది.
అక్రమ మైనింగ్‌కు పాల్పడేవారిని అరెస్టు చేసి, శిక్షించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అధికారులు స్టిల్‌ఫాంటీన్ ప్రాంతంలోని బంగారు గని ప్రవేశ మార్గాలను మూసివేసినట్లు సమాచారం. ఆహారం అందకపోతే వారు చచ్చినట్లు బయటకు వస్తారని, అప్పుడు అదుపులోకి తీసుకుంటామని అధికారులు చెప్పారు. అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవడానికి ఇలా కఠినంగా వ్యవహరించక తప్పదని అంటున్నారు.
ప్రస్తుతం గని చుట్టూ పోలీసులు మోహరించారు. గనిలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించినవారికి సహాయం చేసే ఉద్దేశం లేదని దక్షిణాఫ్రికా మంత్రి ఖుమ్‌బుడ్జో షావెనీ స్పష్టంచేశారు. వారంతా నేరానికి పాల్పడ్డారని, శిక్షించక తప్పదని అన్నారు. నేరగాళ్లకు సహాయం ఎందుకు చేయాలని ప్రశ్నించారు. నార్త్‌వెస్ట్ ప్రావిన్స్‌లోని ఇలా వేర్వేరు గనుల్లో గత కొన్ని వారాల వ్యవధిలో వేయి మందికిపైగా కారి్మకులు బయటకు వచ్చారు. సరైన ఆహారం అందక వారంతా చాలా బలహీనంగా, అనారోగ్యంతో కనిపించారు.
శాంతి భద్రతల సమస్యలు
దక్షిణాఫ్రికాలో అక్రమ మైనింగ్ ముఠాలతో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ ముఠాల వద్ద మారణాయుధాలు ఉంటాయి. ఎంతకైనా తెగిస్తారు. అడ్డుకొనేందుకు ప్రయతి్నంచిన అధికారులపై దాడులకు దిగుతుంటారు. ముఠాల మధ్య ఆధిపత్య పోరుతో రక్తపాతం జరిగిన సందర్భాలున్నాయి. స్థానికులపై దాడులు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడడం సర్వసాధారణంగా మారిపోయింది. అందుకే అక్రమ మైనింగ్ ముఠాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment