
కృష్ణం వందే సమైక్యం
సాక్షి నెట్‌వర్క్: సమైక్య ఉద్యమం రోజురోజుకు ఉద్థృతమవుతోంది. సీమాంధ్ర జిల్లాలో బుధవారం ఉద్యమకారులు నిరసనలతో హోరెత్తించారు. ర్యాలీలు, ధర్నాలు, మానవహారాలు, దిష్టిబొమ్మల దహనాలు చేశారు. కృష్ణాష్టమి వేడుకల్లోనూ సమైక్య ఆకాంక్ష ప్రతిఫలించింది. పలుచోట్ల సమైక్యవాదులు ఉట్టికొట్టి తెలుగువారంతా ఒక్కటిగానే ఉండాలంటూ కృష్ణభగవానుణ్ణి పూజించారు. సకలం బంద్‌తో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నా ప్రజలు ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. గుంటూరులో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో, చిలకలూరిపేటలోని జాతీయరహదారిపై విద్యార్థులు మానవహారం చేపట్టారు.
ఆర్టీసీ ఉద్యోగులు అద్దెబస్సులతో ర్యాలీ నిర్వహించారు. తెనాలి, బాపట్ల, సత్తెనపల్లి, వినుకొండ, మాచర్లలో బ్రాహ్మణ సమాఖ్య బైక్‌ర్యాలీలు చేపట్టింది. శ్రీకాకుళంలో జెడ్పీ ఉద్యోగులు, ఆటో, మెకానిక్‌లు శిరో ముండనం, అర్ధ శిరో ముండనాలు చేయించుకొని నిరసన తెలిపారు. పాలకొండలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు చెందిన దాదాపు 10 వేల మంది విద్యార్థులు పట్టణంలో మహా మానవహారం నిర్వహించారు. పాలకొండలోని ఉపాధ్యాయ ఐక్యవేదిక శిబిరం నుంచి సోనియాగాంధీకి పోస్టుకార్డులు, ఆంటోనీ కమిటీకి ఎస్‌ఎంఎస్‌లు పంపే కార్యక్రమం చేపట్టారు.
ఎచ్చెర్లలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ విద్యార్థులు మాక్ పార్లమెంట్ నిర్వహించారు. రాజాంలో ఎన్‌జీవోలు భిక్షాటన చేశారు. విజయనగరంలో ఏపీఎన్జీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ దిష్టిబొమ్మకు సుమారు మూడు గంటల పాటు శవయాత్ర చేపట్టి అనంతరం దహన సంస్కారాలు చేశారు. ఆ దిష్టిబొమ్మకు మద్యం పట్టించి సారా సత్తిబాబు అంతిమ కోరిక తీర్చినట్లు నిరసన తెలిపారు. బొత్స సతీమణి ఝాన్సీ వేషధారణలో మహిళల రోదన నటన అందరినీ ఆకట్టుకుంది. గజపతినగరంలో పలు గ్రామాలకు చెందిన రైతులు సమైక్యాంధ్రకు మద్దతుగా ఎడ్ల బళ్లతో ర్యాలీ చేసి నిరసన వ్యక్తం చేశారు.
విజయవాడలోని బందర్‌రోడ్డులో వే లాదిమంది విద్యార్ధులు కదం తొక్కారు. ఇరిగేషన్ కార్యాలయం వద్ద రైతు నేత యెర్నేని నాగేంద్రనాథ్ చేపట్టిన నిరాహార దీక్ష రెండోరోజుకు చేరింది. ముదినేపల్లిలో ఉపాధ్యాయులు రోడ్డుపై బిక్షాటన చేశారు. ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ గేట్ వద్ద సమైక్యాంధ్రకు మద్దతుగా రోడ్డుపైనే కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో వందల మంది స్వర్ణకారులు ధర్నా చేపట్టారు. విశాఖ ఏజెన్సీ మారుమూల చింతపల్లిలో భారీ వర్షంలోనూ జేఏసీ నేతలు మానవహారం చేపట్టారు. ఏయూ మెయిన్‌గేట్ వద్ద విద్యార్థులు నిరసన వ్యక్తం చేసి అనంతరం మానవహారంగా ఏర్పడ్డారు. చోడవరం సమీపంలోని ల క్ష్మీపురం చెరువులో సమైక్యవాదులు జలదీక్ష నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ప్రజలకు కనిపించడం లేదంటూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నగరంలో బ్యానర్లు కట్టింది. అమలాపురంలో గజల్ శ్రీనివాస్ పాటలు పాడి ఉత్తేజపరిచారు.
నేడు సీమ-తెలంగాణ రహదారి దిగ్బంధం
సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రభుత్వ రవాణా శాఖ, జర్నలిస్టుల ఆధ్వర్యంలో గురువారం కర్నూలు జిల్లా శ్రీశైలం డ్యాం దిగువున ఉన్న బ్రిడ్జి వద్ద రాయలసీమ-తెలంగాణ రహదారిని దిగ్బంధించనున్నారు. కర్నూలులోని ప్రభుత్వ టౌన్ మోడల్ కాలేజీకి చెందిన 500 మంది విద్యార్థులు రాష్ట్రాన్ని విభజించొద్దని కోరుతూ ప్రధానికి పోస్టు కార్డులు పంపారు. ప్రభుత్వ ప్రసూతి వైద్యులు నడిరోడ్డుపైనే రోగులను పరీక్షించి నిరసన తెలిపారు. అనంతపురంలో న్యాయవాదులు బుధవారం రాత్రి కాగడాల ప్రదర్శన చేపట్టారు. గుంతకల్లులో సమైక్యవాదులు ప్రజాగర్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. పశువైద్య సిబ్బంది తెలుగుతల్లి విగ్రహం వద్ద మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. మంత్రి రఘువీరారెడ్డి కనిపించడం లేదని లేపాక్షి, పామిడిలో సమైక్యవాదులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాయదుర్గంలో గొర్రెలకు సోనియా, దిగ్విజయ్, కేసీఆర్ చిత్రపటాలు తగిలించి ర్యాలీ చేశారు. వైఎస్సార్ జిల్లా కడప నగరంలో వైద్యులు భారీ ర్యాలీ చేపట్టారు. కలెక్టరేట్ సమీపంలో అర్చకులు హోమం నిర్వహించారు.
పశు సంవర్థక శాఖ ఉద్యోగులు కాగడాలతో వినూత్న నిరసన తెలిపారు. జమ్మలమడుగులో ఐదువేల మంది మహిళలు, రాయచోటిలో ఆర్టీసీ కార్మికులు, రైల్వేకోడూరులో 600 మంది ఎపీఎండీసీ కార్మికులు ర్యాలీని నిర్వహించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని దీక్షలు చేస్తున్న వారి ఆరోగ్యం బాగుండాలని దేవాదాయ శాఖ ఉద్యోగులు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో హోమం నిర్వహించారు. పెనుగొండలో జేఏసీ నాయకులు భిక్షాటన చేశారు. కొవ్వూరులో జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరంలో కేరళ రాష్ట్రానికి చెందిన మలయాళీలు ఆంధ్ర రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వారి సంప్రదాయ దుస్తులు ధరించి ప్రదర్శన చేశారు.
తిరుపతి.. చిత్తూరు దిగ్బంధం
చిత్తూరు, తిరుపతి నగరాలను దిగ్బంధించారు. రెండురోజుల బంద్ పిలుపులో భాగంగా తొలిరోజు రెండు నగరాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలు, వ్యాపార దుకాణాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. తిరుమలకు వెళ్లే భక్తుల కోసం తిరుపతి స్టేషన్ నుంచి అలిపిరి బస్టాండ్ వరకు వెళ్లేందుకు టీటీడీ బస్సులను ఏర్పాటుచేసింది. చిత్తూరులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో రోడ్డుపై చేపలు పడుతూ నిరసన తెలిపారు. శ్రీకాళహస్తిలో రైతులు అరటిచెట్లు, చెరుకుగడలు, వరి కంకులతో ర్యాలీ నిర్వహించారు.