సీపీఐ రెండు శాఖల ఏర్పాటు
కార్యదర్శులుగా ఆంధ్రాకు కె.రామకృష్ణ, తెలంగాణకు చాడా
పదవి నుంచి తప్పుకున్న నారాయణ
మఖ్దూంభవన్ నుంచే రెండు శాఖల కార్యకలాపాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో సీపీఐ భావోద్వేగాల నడుమ శుక్రవారం లాంఛనంగా రెండు శాఖల్ని ఏర్పాటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ శాఖకు కె.రామకృష్ణ కార్యదర్శిగా ముప్పాళ్ల నాగేశ్వరరావు, జేవీ సత్యనారాయణ మూర్తి సహాయ కార్యదర్శులుగా, తెలంగాణ శాఖకు చాడా వెంకటరెడ్డి కార్యదర్శిగా పల్లా వెంకటరెడ్డి, సిద్ది వెంకటేశ్వర్లు సహాయ కార్యదర్శులుగా ఎన్నికయ్యారు. రెండురోజులుగా జరుగుతున్న ఉమ్మడి రాష్ట్ర పార్టీ రాష్ట్ర సమితి సమావేశాల ముగింపు సందర్భంగా నూతన శాఖలు ఏర్పాట య్యాయి. ఆహ్వానితులతో కలిసి మొత్తం 182 మంది రాష్ట్ర సమితి సభ్యుల్లో 106 మందిని తెలంగాణకు, 77 మందిని ఆంధ్రాకు కేటాయించారు. ఎన్నికయిన ఇద్దరు కార్యదర్శులూ ఆయా రాష్ట్రాల ఎన్నికల కమిటీలకు కన్వీనర్లుగా వ్యవహరించిన వారే కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ శాఖ కార్యదర్శి రామకృష్ణ అనంతపురం జిల్లాకు చెందినవారు కాగా, సహాయ కార్యదర్శులు ముప్పాళ్ల నాగేశ్వరరావు గుంటూరు జిల్లా, జేవీ సత్యనారాయణ మూర్తి (నానీ) విశాఖ జిల్లాకు చెందినవారు. తెలంగాణ శాఖ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి కరీంనగర్ జిల్లాకు చెందినవారు కాగా, సహాయ కార్యదర్శులు సిద్ది వెంకటేశ్వర్లు ఖమ్మంజిల్లా, పల్లా వెంకటరెడ్డి నల్లగొండ జిల్లాకు చెందినవారు. ఆంధ్రప్రదేశ్ శాఖ తొలి సమావేశాన్ని వచ్చే నెల 7న విజయవాడలో నిర్వహించి భవిష్యత్ కార్యక్రమాన్ని ప్రకటిస్తుంది. ఇప్పటివరకు కొనసాగిన రాష్ట్ర కార్యవర్గం, రాష్ట్ర సమితి రద్దయినట్టు పార్టీ ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ ప్రకటిస్తూ తాను కూడా బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా నూతన కార్యదర్శులతో కలిసి మీడియాతో మాట్లాడారు.
ఆస్తుల విభజనకు కమిటీ
పార్టీ ఉమ్మడి ఆస్తుల విభజనకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు నారాయణ తెలిపారు. విశాలాంధ్ర విజ్ఞాన సమితి, 99 టీవీ, సీఆర్ ఫౌండేషన్, మఖ్దూంభవన్ ప్రస్తుతం ఉమ్మడి ఆస్తులుగా ఉన్నాయి. రెండు శాఖలూ మఖ్దూంభవన్ నుంచే కార్యకలాపాలను నిర్వహిస్తాయి. సుమారు 15 ఏళ్లపాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పని చేసి వివిధ పోరాటాలు చేసిన తన చేతుల మీదుగానే పార్టీకి రెండు శాఖల్ని ఏర్పాటు చేయడం బాధాకరంగా ఉన్నా అనివార్యమని నారాయణ చెప్పారు. ప్రస్తుత పరిస్థితులకు దీటుగా పార్టీని నిర్మించడమే తమ ముందున్న తక్షణ కర్తవ్యంగా రెండు రాష్ట్రాల కార్యదర్శులు చాడా వెంకటరెడ్డి, కె.రామకృష్ణ తెలిపారు. హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రులకు ఎటువంటి కష్టనష్టాలను రానివ్వకుండా చూస్తామన్నారు. అంతకుముందు పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా వామపక్షాల మధ్య తలెత్తిన మనస్పర్థలను తొలగించి ఉమ్మడి పోరాట కార్యక్రమాలకు నడుంకడతామన్నారు.
ఆత్మీయ ఆలింగనాలు, అలాయ్ బలాయ్‌లు
నూతన రాష్ట్ర ఆవిర్భావదినోత్సవానికి జూన్ 2 వరకు గడువున్నా సీపీఐకి మాత్రం శుక్రవారమే అపాయింటెడ్ డేగా మారింది. సుమారు ఆరు దశాబ్దాల పాటు కలిసి మెలిసి ఎన్నెన్నో అనుభవాలను కలబోసుకున్న నేతలు భావోద్వేగాల నడుమ రెండయ్యారు. తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. బరువెక్కిన హృదయాలతో ఉద్విగ్న భరిత వాతావరణంలో ఆత్మీయ ఆలింగనాలు, అలాయ్ బలాయ్‌లు చేసుకున్నారు. రాష్ట్ర సమితి రద్దయిందని అధ్యక్షవర్గం ప్రకటించినప్పుడు యువ నేతలు జి.ఈశ్వరయ్య, కుమారస్వామిలాంటి వాళ్లు కన్నీళ్ల పర్యంతమయ్యారు. తన జీవితం పార్టీతో ముడిపడి ఉందన్న నారాయణ తన శేష జీవితాన్ని పార్టీకి అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు.