ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈనెల 7న సీమాంధ్ర జిల్లాల్లో జరగనున్న ఎన్నికల కోసం జిల్లా పోలీసులు తరలనున్నారు. ఏప్రిల్ 30న తెలంగాణ జిల్లాల్లో కేంద్ర బలగాలతోపాటు సీమాంధ్ర జిల్లాల పోలీసులు వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఇక్కడ ప్రశాంతంగా ఎన్నికలు జరగడంతో ప్రస్తుతం సీమాంధ్రలో జరగనున్న ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు జిల్లా నుంచి 2,900 మంది పోలీసుల బలగాలను పంపించనున్నట్లు ఎస్పీ గజరావు భూపాల్ తెలిపారు.
ఎన్నికలు ప్రశాంతంగా జరగడం, ఈవీఎంలకు కూడా భారీ భద్రత కల్పించడంలో పోలీసులు సఫలం అయ్యారు. జిల్లా కేంద్రంలో భద్ర పరిచిన ఈవీఎంల బందోబస్తు కోసం ఎస్సై స్థాయి అధికారులను నియమించారు. ప్రతి గంటకోసారి జిల్లా పోలీ సు అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రాత్రి సమయంలో మూడు అంచల భద్రతను ఏర్పాటు చేశారు. తనిఖీలు చేసిన అధికారులు సెంట్రీల వద్ద ఉన్న రిజి స్ట్రేషన్‌లో సంతకాలు చేయాలి. ఎన్నికల ఫలితాలు వెలువడేంత వరకు ఈవీఎంల భద్రతపై జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.
సీమాంధ్రకు 2,900 మంది బలగాలు
ఈనెల 7న సీమాంధ్రలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించేందుకు జిల్లా నుంచి 2,900 మంది పోలీసు బలగాలు బయల్దేరనున్నాయి. వీరిలో డీఎస్పీలు-5, సీఐలు-23, ఎస్సైలు-94, ఏఎస్సైలు-142, హెడ్‌కానిస్టేబుళ్లు- 322, మహిళా కానిస్టేబుళ్లు-40, కానిస్టేబుళ్లు-1,445, హోంగార్డులు-650 మం దిని పంపించనున్నారు. ఇందులో పశ్చిమ గోదావరి జిల్లాకు-2080, గుంటూరుకు-250, తిరుపతి-250, రాజమండ్రికి-250 మందిని కేటాయించారు.
బందోబస్తు మధ్య స్ట్రాంగ్‌రూం
జిల్లా కేంద్రంలోని గిరిజన గురుకుల బాలుర జూనియర్ కళాశాల, బాలికల జూనియర్ కళాశాల, సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల బాలికల పాఠశాలల్లో ఎలక్ట్రానిక్ ఈవీఎంలను భద్రత పరిచిన స్ట్రాంగ్‌రూంలకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వీటి భద్రత కోసం ఇండో టిబిటెన్ బార్డర్ పోలీసులతోపాటు, సాయుధ బలగాలు, స్పెషల్ పార్టీ పోలీసులను ప్రత్యేకంగా నియమించారు. సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. ఈనెల 16న సార్వత్రిక ఫలితాలు వెలువడనుండడంతో నేతల భవితవ్యం ఉన్న ఈవీఎంలకు గట్టి భద్రత ఏర్పాటు చేశారు.
ఈవీఎంలు భద్ర పరిచిన కేంద్రాల్లోని చుట్టు పక్కల ప్రాంతాల్లో పోలీసులు అణువణువు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఫలితాల గడువు మరో పది రోజులు ఉండడంతో పోలీసులు కంటిమీద కునుకులేకుండా ఈవీఎంలకు కాపలాకాస్తున్నారు. రెండు నెలలుగా అలుపెరగకుండా ఎన్నికల విధులు నిర్వర్తించిన పోలీసులకు ఇప్పుడు ఫలితాలు వచ్చేంత వరకు కూడా అదే పరిస్థితి నెలకొంది. ఏదేమైన నేతల భవితవ్యం ఉన్న ఈవీఎంలకు భద్రత కల్పించడంలో పోలీసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
‘సీమాంధ్ర’కు జిల్లా పోలీసులు
Published Mon, May 5 2014 1:39 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement