పల్లెకు పోదాం..ఓటేసి వద్దాం | 3 lakhs voters move to seemandhra from hyderabad | Sakshi
Sakshi News home page

పల్లెకు పోదాం..ఓటేసి వద్దాం

Published Tue, May 6 2014 12:31 AM | Last Updated on Tue, Aug 28 2018 7:14 PM

పల్లెకు పోదాం..ఓటేసి వద్దాం - Sakshi

పల్లెకు పోదాం..ఓటేసి వద్దాం

రాజధాని నుంచి 3 లక్షలమంది సీమాంధ్రకు పయనం
 
 సాక్షి, సిటీబ్యూరో/సనత్‌నగర్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకొనేందుకు సీమాంధ్రకు చెందిన హైదరాబాద్ నగరవాసులు సోమవారం పెద్దసంఖ్యలో తరలివెళ్లారు. శని, ఆది వారాల నుంచే ప్రయాణికుల రద్దీ నెలకొన్నప్పటికీ సోమవారం బాగా పెరిగింది. నగరంలో ఉంటున్న పలువురికి సొంత ఊళ్లల్లో ఓట్లున్నాయి. వీరిలో ఎక్కువమంది బుధవారం జరగనున్న పోలింగ్‌లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు బయలుదేరటంతో బస్సులు, రైళ్లు కిక్కిరిశాయి. ఎన్నికల బరిలో నిలిచిన పలువురు అభ్యర్థులు,  వారి అనుచరులు.. నగరవాసులను స్వగ్రామాలకు తరలించేందుకు ప్రయివేటు బస్సులు ఏర్పాటుచేశారు. శనివారం సుమారు 50 వేలమంది, ఆదివారం దాదాపు 40 వేల మంది, సోమవారం రెండులక్షల మంది వరకు స్వస్థలాలకు బయలుదేరినట్లు అంచనా.
 రైళ్లు కిటకిట...
 
 జంటనగరాల నుంచి బయలుదేరే అన్ని ప్రధాన రైళ్లు కిటకిటలాడాయి. వేసవి సెలవుల దృష్ట్యా నడుపుతున్న ప్రత్యేక రైళ్లలోను రద్దీ నెలకొంది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి రోజూ రాకపోకలు సాగించే 80కి పైగా ఎక్స్‌ప్రెస్‌లు, 120 ప్యాసింజర్ రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిశాయి. సాధారణ రోజుల్లో 2.5 లక్షల మంది రైళ్లలో బయలుదేరతారు. ఎన్నికల దృష్ట్యా మరో 50 వేల మంది రైళ్లలో సొంత ఊళ్లకు వెళ్లారు. ప్రధాన ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని జనరల్ బోగీలు సైతం ప్రయాణికులతో నిండిపోయాయి. సోమవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పోటెత్తింది. సుమారు 2 లక్షల మంది ఇక్కడి నుంచి రైళ్లు ఎక్కినట్లు భావిస్తున్నారు.
 
 బస్సులు, కార్లలో..
 
 ఆర్టీసీ సోమవారం ఒక్కరోజే 250కి పైగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి తదితర ప్రాంతాలకు రోజు వెళ్లే సుమారు 850 బస్సులతో పాటు అదనంగా ఈ బస్సులను ఏర్పాటు చేశారు. రద్దీ సాకుతో యథావిధిగా 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేశారు. సాధారణ రోజుల్లో ఒక్క మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ నుంచే లక్షమంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు వెళ్తారు. సోమవారం మరో 50 వేలమంది ప్రయాణించారు. కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు, అమీర్‌పేట్, లకిడీకాఫూల్, కోఠీ ప్రాంతాల నుంచి రోజూ వివిధ ప్రాంతాలకు బయలుదేరే 500 ప్రైవేట్ బస్సులు కూడా రద్దీగానే ఉన్నాయి. ప్రైవేట్ ఆపరేటర్లు కూడా చార్జీలను రెట్టింపు చేశారు. పక్షం రోజుల ముందే ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్‌లో అడ్వాన్స్ బుకింగ్ పూర్తికాగా.. ఇప్పుడు విపరీత రద్దీతో ‘ప్రత్యేకం’ పేరిట టికెట్ ధరలను రెట్టింపునకు పైగా పెంచేశారు. బస్సులు, రైళ్లు నిండిపోవడంతో పలువురు అద్దె కారుల్లో వెళుతున్నారు. ఎంత ఖర్చయినా తామే భరిస్తామని కొందరు అభ్యర్థులు చెప్పటంతో చాలామంది ట్యాక్సీల్లో స్వస్థలాలకు వెళుతున్నారు. కార్లు, ట్యాక్సీల్లో లక్షమంది వరకు స్వస్థలాలకు వెళ్లినట్లు అంచనా.
 
 సమర్థనేతను ఎన్నుకునేందుకే..
 రైళ్లు, ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఫుల్లయ్యాయి. ప్రైవేటు ట్రావెల్స్ ప్రత్యేకం పేరిట రెట్టింపునకు పైగా వసూలు చేస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక నేను, నలుగురు స్నేహితులం కలసి ప్రత్యేక వాహనంలో సీమాంధ్రకు వెళ్తున్నాం. సమర్ధమైన నాయకుడిని ఎన్నుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్లి ఓటు వేసి రావడం బాధ్యతగా గుర్తించాలనేది నా అభిప్రాయం.
 - ప్రమోద్, ప్రైవేటు ఉద్యోగి
 
 సాధారణ చార్జీలు వసూలు చేయాలి
 ఓటు వేసేందుకు సీమాంధ్రకు వెళ్తున్నాను. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పుడే రేపల్లె ట్రైన్ (డెల్టా)కు టికెట్ బుక్ చేశాను. తప్పనిసరిగా ఓటు వేయాలనే బాధ్యతతోనే ముందస్తుగా టికెట్ బుక్ చేసుకున్నా. రద్దీ పెరగడంతో టికెట్ ధరలు ఒక్కసారిగా పెంచడం బాధాకరం. ఇలాగైతే బాధ్యతాయుతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలనుకునే వారికి ఇబ్బందే. ఎన్నికల కమిషన్ దీనిపై దృష్టిసారించి ప్రత్యేక బస్సుల్లో సాధారణ చార్జీలను వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలి.
 - బి.శివరామప్రసాద్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి
 
 సెలవు పెట్టి వెళ్తున్నా...
 ప్రతిఒక్కరూ ఓటు వేసినప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందనే చైతన్యం ప్రజల్లో పెరిగింది. అందుకే ఓటువేయడానికి సెలవులు పెట్టి మరీ వెళ్తున్నాను. అందుకే నేను మా ఊరు వెళుతున్నా. ట్రావెల్స్ బస్సులు డబుల్ రేట్లు వసూలు చేసినా ఓటు వేసేందుకు చెల్లించక తప్పలేదు.
 - వీరేంద్రకుమార్, ప్రైవేటు ఉద్యోగి


 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement