సాక్షి, సంగారెడ్డి: ఎట్టకేలకు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లెక్కలు తేలాయి. జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు బుధవారం నిర్వహించిన ఎన్నికల్లో 76.83 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2009 సాధారణ ఎన్నికల్లో 74.97 శాతం పోలింగ్ నమోదైతే, ఈ ఎన్నికల్లో 1.86 శాతం వృద్ధి మాత్రమే కనిపించింది.
జిల్లాలో 21,98,882 మంది ఓటర్లు ఉంటే అందులో 16,89,508 మంది ఓటు హక్కును వినియోగించుకోగా.. 5,09,374 మంది ఓటర్లు ‘ఓటు పండుగ’కు ముఖం చాటేశారు. ఓటేయని ఓటర్లు 23.17 శాతం ఉండడం గమనార్హం. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే.. నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 85.96 శాతం పోలింగ్ నమోదు కాగా.. పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యల్పంగా 67.67 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది.
ఓట్ల పండుగ ఏదీ?
95 శాతం పోలింగ్ నిర్వహించి జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్మితాసబర్వాల్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ‘ఓటేయండి..బహుమతులు గెలుచుకోండి’ అనే నినాదంతో కలెక్టర్ భారీ ఎత్తున ‘ఓటు పండుగ’ పేరుతో భారీ స్థాయిలో ప్రచారం నిర్వహించారు. కానీ, పోలింగ్ మాత్రం 80 శాతానికి సైతం సమీపించలేకపోయింది.
పటాన్‌చెరు నియోజకవర్గంలో అత్యల్పంగా 67.67 శాతం పోలింగ్ మాత్రమే నమోదు కావడంతో జిల్లా సగటు పోలింగ్‌పై భారీగా ప్రభావం చూపింది. ఎన్నికలు ముగిసిన తర్వాత బుధవారం రాత్రి జిల్లా యంత్రాంగం జిల్లాలో 81 శాతం పోలింగ్ జరిగిందని ప్రాథమిక గణాంకాలను వెల్లడించింది. అయితే, ఈ కాకిలెక్కలతో పోల్చినా వాస్తవ పోలింగ్ 3.17 శాతం తక్కువగా ఉండడం గమనార్హం.
పోలింగ్ 76.83 శాతమే
Published Thu, May 1 2014 11:41 PM | Last Updated on Sat, Sep 2 2017 6:47 AM
Advertisement
Advertisement