సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సార్వత్రిక సమరం ముగిసింది. పోటీ నువ్వా-నేనా అన్నట్లు సాగింది. కొన్ని చోట్ల త్రిముఖ, మరికొన్ని చోట్ల చతుర్ముఖ పోటీ నెలకొనడంతో విజయబావుటా ఎగురవేసేదెవరనేది ఉత్కంఠగా మారింది. జిల్లాలో 14 శాసనసభ, రెండు లోక్‌సభ స్థానాల్లో ఓటరు విలక్షణమైన తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేసినట్టు విశ్లేషకులు ఊహిస్తున్నారు. కొత్త రాష్ట్రంలో ఓటర్ల ఆలోచన తీరు కూడా సరికొత్తగా సాగినట్టు ఎన్నికల ట్రెండ్ స్పష్టం చేస్తోంది.
లోక్‌సభ అభ్యర్థుల విషయంలో ఓటర్లు విశాల ధృక్పథంతో వ్యవహరించారు. పార్టీలకతీతంగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. సంస్థాగతంగా బలంగా లేని టీఆర్‌ఎస్ అనూహ్యంగా పుంజుకుంది. గ్రామీణ నియోజకవర్గాలైన వికారాబాద్, తాండూరు, పరిగి, చేవెళ్ల నియోజకవర్గాల్లో ‘కారు’ స్పీడ్ మరింత పెరిగింది. హైదరాబాద్ శివారు నియోజకవర్గాల్లో కూడా టీఆర్‌ఎస్‌కు ఆదరణ పెరిగినట్లు పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. పశ్చిమ ప్రాంతంలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్- కాంగ్రెస్ మధ్యే ప్రధానంగా పోరు సాగింది. గత ఎన్నికల్లో ఇక్కడ బలీయంగా ఉన్న టీడీపీ ఈ సారి చతికిలపడ్డట్టు అంచనా.
మరోవైపు మహేశ్వరం, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ సెగ్మెంట్లలో తెలుగుదేశంకు మొగ్గు కనిపిస్తున్నా.. క్రాస్ ఓటింగ్ ఆ పార్టీ అభ్యర్థుల్లో గుబులు పుట్టిస్తోంది. టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్. కృష్ణయ్య ఎల్‌బీనగర్‌లో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి గట్టిపోటీ ఇచ్చారు. సుధీర్ విజయం నల్లేరుమీద నడకేనని భావించినా .. టీఆర్‌ఎస్ అభ్యర్థి ముద్దగోని రామ్మోహన్‌గౌడ్ ఊహించని విధంగా పుంజుకోవడం, వైఎస్సార్ సీపీ అభ్యర్థి పుత్తా ప్రతాపరెడ్డికి భారీగా ఓట్లు పోలవడం.. టీడీపీకి అనుకూలించేలా కనిపిస్తోంది. రాజేంద్రనగర్‌లో టీడీపీ, ఎంఐఎం మధ్య ప్రధాన పోరు జరగడం విశేషం.
మల్కాజిగిరి, ఎల్‌బీనగర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టించింది. విజయావకాశాలు స్వల్పంగానే ఉన్నా.. ప్రత్యర్థుల గెలుపోటముల్లో ఆ పార్టీ కీలకపాత్ర పోషించనుంది. జిల్లాలో నాలుగుచోట్ల పోటీచేస్తున్న బీజేపీ ఖాతా తెరిచే అవకాశాలు తక్కువనే అంటున్నారు. మల్కాజిగిరిలో మాత్రమే ఆ పార్టీ చెప్పుకోదగ్గస్థాయిలో ప్రతిఘటించగా పరిగి, వికారాబాద్, ఉప్పల్‌లో చేతులెత్తేసింది.
మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ టీఆర్‌ఎస్‌తో గట్టిపోటీని ఎదుర్కొన్నట్టు చెప్తున్నారు. వికారాబాద్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అనూహ్యంగా పుంజుకోవడంతో మాజీ మంత్రి ఎదురీదుతున్నట్లు పోలింగ్ సరళి స్పష్టం చేస్తోంది. పరిగి, ఉప్పల్, చేవెళ్ల, మల్కాజిగిరి, మహేశ్వరంపై కాంగ్రెస్ భారీ ఆశ లు పెట్టుకుంది. ఓటర్లు తమవైపు మొగ్గినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజావ్యతిరేకత తీవ్రప్రభావం చూపింది. గత ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలుచుకున్న ఆ పార్టీ.. ఈ సారి అదేస్థాయిలో సీట్లు నిలబెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నా.. గెలిచే స్థానాలు మారేలా ఉన్నాయి.
లోక్‌సభ స్థానాల్లో విచిత్ర పరిస్థితి!
పోలింగ్ సరళిని విశ్లేషిస్తే లోక్‌సభ, అసెంబ్లీ ఓటింగ్‌లలో స్పష్టమైన తేడా కనిపిస్తోంది. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓటేసే విషయంలో ఓటర్లు భిన్నంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక విషయంలో విశాల ధృక్ఫథం ప్రదర్శించిన ఓటర్లు పార్టీలకతీతంగా క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్టు సమాచారం. దీనికి తోడు శాసన సభ అభ్యర్థులు కూడా తమకు ఎమ్మెల్యే ఓటేసి.. ఎంపీ ఓటు ఇష్టం వచ్చిన వారికేయండని బాహాటంగానే చెప్పడంతో క్రాస్ ఓటింగ్ పెరిగింది.
ఈ నేపథ్యంలో ఓట్ల బదలాయింపులు పార్టీలకతీతంగా జరిగినట్లు అర్థమవుతోంది. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గానికి వస్తే టీఆర్‌ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఈ దిశగా కొంత సఫలమైనట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థి కార్తీక్‌రెడ్డికి లాభించగా, మరికొన్ని చోట్ల మోడీ హవా నేపథ్యంలో టీడీపీ అభ్యర్థి వీరేందర్‌గౌడ్‌కు కలిసివచ్చింది. అదేక్రమంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి కొండా రాఘవరెడ్డికి కూడా చాపకింద నీరులా క్రాస్ ఓట్లు పడ్డట్లు విశ్లేషిస్తున్నారు. ఓటరు నాడి అంతుచిక్కనప్పటికీ, ఈసారి లోక్‌సభ ఫలితాల్లో అనూహ్య ఫలితాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
తిర‘క్రాస్ ఓటింగ్’!
Published Thu, May 1 2014 12:12 AM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM
Advertisement