సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : సార్వత్రిక ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎం)లు అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించాయి. సుమారు వందకుపైగా కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్‌కు అంతరాయం కలిగింది. అనేక చోట్ల ప్రారంభంలోనే సాంకేతిక సమస్యలు తలెత్తగా, కొన్ని కేంద్రాల్లో మధ్యలో సమస్య రావడంతో అధికారులు ఇబ్బందులు పడ్డారు. వెంటనే వాటిని సరి చేసేందుకు ఇబ్బందులు పడ్డారు. ఈవీఎంల మొరాయింపుతో ఓటర్లు గంటల తరబడి కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చింది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా పోలింగ్ ప్రారంభం కాలేదు.
ఆదిలాబాద్ నియోజకవర్గంలో సుమారు 28 చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. ఆదిలాబాద్ మండలం ఖండాలలో మధ్యాహ్నం 12గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, వాగాపూర్‌లో రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. బేల మండలం సైద్‌పూర్, సోన్‌కాస్, చప్రాలలో, జైనథ్ మండలం కూర, సాంగ్విలలో ఈవీఎంలు మొరాయిం చాయి. పిట్టలవాడలో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేశారు.
చెన్నూర్ నియోజకవర్గంలో.. జైపూర్ మండలంలోని భీమారం, పెగడపల్లి, నర్సింగాపూర్, చెన్నూర్ పట్టణంలోని 166, 173 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఈవీ ఎంలు మొరాయించడంతో పోలింగ్ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. కోటపల్లి మం డలం దేవులవాడ, సిర్స, మందమర్రి మం డలం రామకృష్ణాపూర్, అమర్‌వాదిలలో పోలింగ్ గంట ఆలస్యంగా ప్రారంభమైంది.
మందమర్రి మండలం అందుగులపేటలో కొన్ని సంఘాలకు డబ్బులిచ్చి తమకు ఇవ్వలేదని కొన్ని గ్రూపులు ఆందోళనకుదిగాయి. డబ్బులిస్తేనే ఓటు వేస్తామని తేల్చి చెప్పారు.
కోటపల్లి మండలం దేవులవాడ, చెన్నూర్‌లలో పోల్ చిట్టీలు అందక, పోలింగ్ కేంద్రా లు దొరకక ఓటర్లు వెనుదిరిగారు.
ఖానాపూర్ నియోజకవర్గంలో ఈవీఎంల మొరాయింపు ఇబ్బందులకు గురి చేసింది. జన్నారం మండలం బాదంపల్లి అరగంట, చింతగూడలో గంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. కవ్వాల్‌లో సాయంత్రం అరగంటపాటు ఈవీఎం పని చేయలేదు. ఉ ట్నూర్ మండలం లక్షెటిపెట్‌లో అర్ధగంటపా టు, మధ్యాహ్నం అర్ధగంటపాటు ఈవీఎం పని చేయలేదు.
ఖానాపూర్ మండల కేంద్రంలోని 143 బత్‌లో ఏజెంట్ రాలేదని అర్ధ గంట అలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. తాటిగూడ, సూర్జాపూర్, ఖానాపూర్ కేంద్రంలోని 170 బూత్, మస్కాపూర్ కేంద్రాల్లో ఈవీఎంల మొరయింపుతోఉదయం గంట అలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం పెంబిలో ఈవీఎం మొరాయించింది. ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని 19 బూత్‌లో 45 నిమిషాలు, దన్నోర(బీ) గంట 15 నిమిషాలు, అలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది.
ఉట్నూర్ మండల కేంద్రంలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి వచ్చిన మహిళలు గొడవకు దిగారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో సద్దుమణిగింది.
ఊట్నూర్ మండలం పెర్కగూడలో వ్యవసాయ కూలీ ఓటు ఉద్యోగుల మాదిరిగా పోస్టల్ ఓటుగా నమోదైంది. దీంతో ఆమె నిరాశతో వెనుదిరిగారు.
ఆసిఫాబాద్ నియోజకవర్గంలో.. ఆసిఫాబాద్ పట్టణంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఈవీఎం 20 నిమిషాలు మొరాయించింది. నార్నూర్ మండలం అజ్ఞాన్, పునికాస, కెరమెరి మండలం రాంజిగూడ, సుర్దాపూర్ గ్రామాల్లో ఈవీఎంలు మొరాయించడంతో గంట సేపు పోలింగ్ నిలి చింది. రెబ్బెన మండలం గోలేటిలో ఈవీ ఎంలు మొరాయించడంతో అర్ధగంట ఆల స్యంగా ప్రారంభమైంది. కిష్టాపూర్‌లో అర్ధగంట పోలింగ్ నిలిచింది.
ఎన్నికల పరిశీలకులు సంజయ్‌కుమార్ సక్సేనా ఆసిఫాబాద్, నార్నూర్ మండలాల్లోని పోలింగ్ స్టేషన్లు తనిఖీ చేశారు. సబ్ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ మండలంలోని పోలింగ్ స్టేషన్లు తనిఖీ చేశారు. ఉట్నూర్ ఏఎస్‌పీ అహ్మదొద్దీన్ అహ్మద్ జైనూర్ పోలింగ్ కేంద్రాలు తనిఖీ చేశారు.
బెల్లంపల్లి నియోజకవర్గంలో.. కన్నాలబస్తీలో ఈవీఎం గంటపాటు స్తంభించింది. బెల్లంపల్లిలోని బాలికల ఉన్నత పాఠశాలలో సుమారు 20 నిమిషాల వరకు ఈవీఎంలు మొరాయించాయి. చొప్పరిపల్లిలోని పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు మొరాయించడంతో 20 నిమిషాల పాటు పోలింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. నెన్నెలలోని జెండా వెంకటాపూర్‌లో 40 నిమిషాలు, భీమిని మండ లం లక్ష్మీపూర్‌లో పోలింగ్ కేంద్రంలో అరగంటపాటు ఈవీఎంలు సతాయించాయి. వేమనపల్లి మండలం జక్కెపల్లిలో ఈవీఎం పని చేయలేదు. తాండూర్ మండలం కొత్తపల్లి, మాదారంటౌన్‌షిప్ పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు పని చేయలేదు. మాదారం, బెజ్జాల, రేపల్లెవాడ, చౌటపల్లి, అచ్చలాపూర్ పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు సరిగా పని చేయకపోవడంతో ఉదయం ఓట వేయడానికి ఓటర్లు ఇక్కట్లు పడాల్సి వచ్చింది.
సిర్పూర్ నియోజకవర్గంలో.. సిర్పూర్ (టి), కాగజ్‌నగర్ పట్టణంలోని బాలాజీనగర్, బె జ్జూర్ మండల కేంద్రంతోపాటు కమ్మర్‌గాం, కౌటాల, నాగెపల్లి, బాబాసాగర్ గ్రామాల్లోని ఈవీఎంలు మొరాయించడంతో గంటపాటు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది.
కాగజ్‌నగర్ పట్టణంలోని సంజీవయ కాలనీ లో బీఎస్పీ, కాంగ్రెస్ నాయకుల మధ్య వా గ్వాదం జరిగింది. పోచమ్మ బస్తీలో పలువురి ఓట్లు గల్లంతయ్యాయి.
నిర్మల్ నియోజకవర్గం.. అంజనీతాండలో ఉదయం 40 ఓట్లు పోలైన తర్వాత ఈవీఎం మొరాయించింది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు కూడా అధికారులు పునరుద్ధరించలేదు. కాల్వ పోలింగ్ కేంద్రంలో పది ఓట్లు పడగానే ఈవీఎం మొరాయించింది. దాన్ని 9గంటలకు పునరుద్ధరించారు.
నిర్మల్ మండలం పాక్‌పట్లలో ఏ మీట నొక్కినా ఒకే అభ్యర్థికి ఓట్లు పడుతుండడంతో ఓటర్లు అధికారులను ప్రశ్నించారు. దీంతో సుమారు 60 మంది ఓటర్లను తిరిగి రీపోలింగ్ చేపట్టారు.
బోథ్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఈవీఎంలు మొరాయించాయి.
గుడిహత్నూర్ పోలింగ్ కేంద్రంలో టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి నగేష్ తన అనుచరులతో వెళ్లేందుకు ప్రయత్నించగా టీడీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
మంచిర్యాల నియోజకవర్గంలో.. లక్సెట్టిపేట మండలం హన్మాన్‌పల్లి, మోదెల, దేడేపల్లి, దండెపల్లి మండలం గూడెం, మేదర్‌పేట్, గుడిరేవు, చింతపల్లి, మంచిర్యాల మండలం తాళ్లపల్లి, సీసీసీ, పర్తనపల్లి, గుడిపేటలోని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. మంచిర్యాల పట్టణంలోని ఎడ్లవాడ, గోపాల్‌వాడ, ఆర్‌బీహెచ్‌వీ, పాతమంచిర్యాల పోలింగ్ కేంద్రాల్లో కూడా ఈవీఎం సమస్య తలెత్తింది. ఓటర్లు ఇబ్బందులు పడ్డారు.
ఈవీఎంల మొరాయింపు
Published Thu, May 1 2014 2:24 AM | Last Updated on Wed, Sep 26 2018 5:38 PM
Advertisement
Advertisement