నేడే ఓట్ల పండుగ
ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్
ఆరు గంటల వరకు క్యూలో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం
సీమాంధ్ర బరిలో 333 మంది లోక్‌సభ, 2,241 మంది అసెంబ్లీ అభ్యర్థులు
మొత్తం 3,67,62,975 మంది ఓటర్లు..40,709 పోలింగ్ కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సీమాంధ్ర జిల్లాల్లోని 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు కొద్ది గంటల్లో పోలింగ్ నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. పోలింగ్ సిబ్బంది.. ఈవీఎంలు, పోలింగ్ సామగ్రితో మంగళవారం రాత్రికే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. నాలుగైదు కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సిన పాడేరు నియోజకవర్గాల్లోని కేంద్రాలకు కూడా రాత్రి పొద్దుపోయాక పోలింగ్ సిబ్బంది చేరుకున్నారు. సీమాంధ్రలో బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. ప్రతి ఓటరు స్వేచ్ఛగా, నిర్భయంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేసేందుకు అన్ని ఏర్పాట్లూ చేశామన్నారు. ఆయన మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. సీమాంధ్ర జిల్లాల్లో 85 శాతం నుంచి 90 శాతానిపైగా పోలింగ్ నమోదు చేసి రికార్డు సృష్టించాల్సిందిగా ఓటర్లకు పిలుపునిచ్చారు.
ఐదేళ్లకోసారి వచ్చే ఓటు అనే ఆయుధాన్ని ఎవరూ జారవిడవద్దని.. కులాలు, మతాలకు అతీతంగా మంచి వ్యక్తికి ఓటు వేసి ఐదేళ్ల భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవాలని సూచించారు. శాంతిభద్రతలకు ఎవరు భంగం కలిగించినా, ఎన్నికల నియామవళిని అత్రికమించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలింగ్ రోజు సిబ్బందితో పాటు పోలీసు యంత్రాంగం అంతా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, పక్షపాతంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అభ్యర్థులు పోలింగ్ ఏజెంట్లుగా పొరుగు గ్రామాల వారిని కూడా నియమించుకోవడానికి అనుమతించినట్లు భన్వర్‌లాల్ తెలిపారు. ముఖ్యాంశాలివీ...
పోలింగ్‌కు ఏర్పాట్లు ఇలా...
సీమాంధ్ర ఎన్నికల బరిలో 25 లోక్‌సభ స్థానాలకు 333 మంది అభ్యర్థులు, 175 అసెంబ్లీ స్థానాలకు 2,241 అభ్యర్థులు.
మొత్తం ఓటర్ల సంఖ్య 3,67,62,975. ఇందులో పురుష ఓటర్లు 1,82,49,310 కాగా మహిళా ఓటర్ల సంఖ్య 1,84,69,027. ఇతర ఓటర్లు 3,227 మంది ఉన్నారు. సర్వీసు ఓటర్లు మొత్తం 41,405 ఉన్నారు. ఆరుగురు ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు ఉన్నారు.
మొత్తం 40,709 పోలింగ్ కేంద్రాల్లో 11,526 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా గుర్తింపు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సాయుధ పోలీసులు నియామకం. 23,184 పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు. మండల, నియోజకవర్గ, సమీపంలోని పట్టణ కూడళ్లలో తెరలపై ఆయా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సరళి ప్రదర్శన. మిగతా పోలింగ్ కేంద్రాల్లో వీడియో చిత్రీకరణతో పాటు, స్టాటిక్ కెమేరాలు, 5,000 మంది మైక్రో పరిశీలకులు ఏర్పాటు.
నక్సలైట్ ప్రభావిత అరకు వాలీ, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే జరుగుతుంది. సాయంత్రం 4 గంటల వరకు క్యూలో ఉన్న వారు ఎంత రాత్రైనా ఓటు వేయవచ్చు.
నక్సలైట్ ప్రభావమున్న కురుపాం, పార్వతీపురం, సాలూరు, రంపచోడవరం, పెదకూరపాడు, వినుకొండ, గురజాల, మాచర్ల - ఈ 8 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలో ఉన్న వారు.. ఎంత రాత్రైనా ఓటు వేయవచ్చు.
మిగతా 165 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉన్న వారు ఎంత రాత్రైనా ఓటు వేయవచ్చు.
పోలింగ్ భద్రతలో మూడున్నర లక్షల మంది సిబ్బంది. 95,158 మంది రాష్ట్ర పోలీసులు, 20,511 హోంగార్డులతో పాటు 272 కేంద్ర సాయుధ కంపెనీల వినియోగం. ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఇద్దరు నుంచి 10 మంది వరకూ పోలీసు సిబ్బంది విధులు.
సీమాంధ్ర జిల్లాల్లో పోలింగ్ రోజు నాలుగు హెలికాప్టర్లు, ఒక ఎయిర్ అంబులెన్స్‌ను వినియోగిస్తున్నారు. పాడేరులోనే రెండు హెలికాప్టర్లను, ఎయిర్ అంబులెన్స్‌ను ఉంచుతారు.
పోలింగ్ నిర్వహణకు 13 జిల్లాల్లో 1,29,930 బ్యాలెట్ యూనిట్లు, 1,00,622 కంట్రోల్ యూనిట్లు వినియోగం. ఉదయం 6 గంటలకు అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో నిర్వహించే మాక్ పోలింగ్‌లో ఈవీఎంలు పనిచేయకపోతే అరగంటలో మరో ఈవీఎం ఏర్పాటుకు ఆదేశాలు.
ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ కేసుల్లో ఉంటే
ఆరేళ్లు అనర్హత వేటు: భన్వర్‌లాల్
ఓటర్లను డబ్బు, మద్యం, ఇతరత్రా ప్రలోభాలకు గురిచేసే చర్యలకు అభ్యర్థులు పాల్పడితే చాలా కఠినంగా వ్యవహరిస్తానని భన్వర్‌లాల్ హెచ్చరించారు. ఇలాంటి అభ్యర్థుల కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో త్వరగా విచారణ జరిగేలా తానే స్వయంగా చర్యలు తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి అభ్యర్థులకు ఆరు నెలల్లోగానే శిక్షపడేలా పర్యవేక్షిస్తానని, ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటింప చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల్లో పంపిణీ చేసే మద్యాన్ని సేవించడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంద నే విషయాన్ని ఓటర్లు గుర్తించాలని, ప్రతి ఓటర్ బాధ్యతగల పౌరునిగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
పోలింగ్ కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవడానికి 9246280027 నంబర్‌కు ‘వీఓటీఈ’ అని టైప్ చేసి.. ఓటరు గుర్తింపు కార్డు నంబరును చేర్చి ఎస్‌ఎంఎస్ చేయాలి. వెంటనే పోలింగ్ కేంద్రం వివరాలు తిరిగి ఎస్‌ఎంఎస్ ద్వారా తెలియచేస్తారు.
పోలింగ్ కేంద్రాల్లో తొలుత పార్లమెంటు అభ్యర్థులకు ఓటు వేసే కంపార్ట్‌మెంట్ ఉంటుంది. తెలుపు రంగు బ్యాలెట్ పార్లమెంటు అభ్యర్థికి ఉంటుంది. రెండో కంపార్టుమెంటులో అసెంబ్లీ అభ్యర్థుల ఈవీఎం ఉంటుంది. గులాబి రంగు బ్యాలెట్ అసెంబ్లీ అభ్యర్థికి ఉంటుంది.