హైదరాబాద్: సీమాంధ్రలోని సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల గడువు నేటితో ముగిసింది. సీమాంధ్ర ప్రాంతంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 పార్లమెంట్ స్థానాలకు గాను అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ కార్యక్రమం శనివారంతో ముగిసింది. ఈనెల 12న నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం మొదలైంది. చివరి రోజైన శనివారం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభ్యర్థులు హాజరుకావడంతో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.
మూడు గంటల వరకే నామినేషన్ల స్వీకరణ
నామినేషన్ల ప్రక్రియ శనివారం సాయంత్రం 3 గంటలకు ముగిసింది. 21వ తేదీ రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు పరిశీలిస్తారు. 23వ తేదీ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ జరుగుతుంది. అనంతరం ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులను ప్రకటిస్తారు. మే 7వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 16వ తేదీ ఓట్లు లెక్కిస్తారు.