ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
17 అసెంబ్లీ నియోజకవర్గాల బరిలో 239 మంది
గుంటూరు పార్లమెంటుకు 12 మంది
నరసరావుపేట పార్లమెంటుకు 11 మంది
బాపట్ల పార్లమెంటుకు14 మంది
సాక్షి, గుంటూరు,సార్వత్రిక ఎన్నికల్లో మరో ప్రధాన ఘట్టం ముగిసింది. ఇక బరిలో ఉండేది ఎవరో తేలిపోయింది. రెండు రోజులుగా జరుగుతున్న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ బుధవారం సాయంత్రం 3 గంటలకు ముగిసింది. ఆయా పార్టీల నాయకులు, అధిష్టానం బుజ్జగించడంతో రెబల్స్ అందరూ నామనేషన్లు ఉపసంహరించుకున్నారు.
ప్రధానంగా జిల్లాలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల్లో పోటీ చేసేందుకు 349 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వీటిలో 34 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. గత రెండు రోజుల్లో 76 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. గుంటూరు పార్లమెంటుకు సంబంధించి 22 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. ఆరు నామినేషన్లు తిరస్కరణకు గురవగా ఒకరు ఉపసంహరించుకున్నారు.
ఇక బరిలో 15 మంది నిలిచారు. నరసరావుపేట పార్లమెంటుకు సంబంధించి 13 నామినేషన్లు దాఖలు కాగా అందులో రెండు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఇక్కడి నుంచి ఎవరూ నామినేషన్లు ఉపసంహరించుకోకపోవడంతో బరిలో 11మంది మిగిలారు.
బాపట్ల పార్లమెంటుకు 17మంది నామినేషన్లు దాఖలు చేయగా.. ఒకటి తిరస్కరణకు గురవగా, ఇద్దరు నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో 14 మంది పోటీలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ అనం తరం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే...గురజాల నుంచి అత్యధికంగా 24 మంది బరిలో ఉన్నారు. మంగళగిరిలో 22 మం ది, గుంటూరు తూర్పు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల్లో 20 మంది వంతున బరిలో ఉండడం విశేషం. బాపట్లలో 15మంది, చిలకలూరిపేట, రేపల్లెలో 14 మంది వంతున, పొన్నూరు, నరసరావుపేట, మాచర్లలో 13 మంది వంతున బరిలో నిలవగా.. సత్తెనపల్లి, వినుకొండ నియోజకవర్గాల్లో 12 మంది వంతున, ప్రత్తిపాడులో 11మంది పోటీపడుతున్నారు.
తాడికొండ, వేమూరు, తెనాలి, పెదకూరపాడు నియోజకవర్గాల్లో 9 మంది వంతున బరిలో ఉన్నారు. నామినేషన్ల ప్రక్రియ మొత్తం పూర్తయినందున సార్వత్రిక ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించనున్నారు.