సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో సమైక్య ఉద్యమం ఎగసిపడుతుండడంతో తామూ ఆ ఉద్యమంలో భాగస్వాములవుతున్నామనే అభిప్రాయం ప్రజల్లో కల్పించాలని కాంగ్రెస్ సీమాంధ్ర నేతలు భావిస్తున్నారు. దీక్షలు, సభలు నిర్వహించే యోచనలో ఉన్నారు. సమైక్య ఉద్యమం ఉధృతంగా ఉండడం, హైదరాబాద్‌లో ఏపీఎన్జీఓల సభ విజయవంతం కావడం, ఇతర పార్టీలు ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాజీనామాలు చేయడంతో పాటు ప్రజల్లోకి చొచ్చుకుపోతుండటంతో తామూ ఏదో చేస్తున్నామనిపించుకోవాలనే ప్రయత్నాల్లో పడ్డారు. అయితే ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకాక తప్పదనే అభిప్రాయంతో ప్రత్యక్ష పోరాటం కాకుండా వేరే మార్గాలపై దృష్టి పెట్టారు. హైదరాబాద్ లేదా ఇబ్బందులు ఎదురుకాని సురక్షిత ప్రాంతాలను ఎంచుకుని దీక్షలు, సభలు నిర్వహించేందుకు వ్యూహాన్ని రచిస్తున్నారు.
అయితే కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు, ఆధిపత్యపోరు ఈ విషయంలోనూ బహిర్గతమవుతున్నాయి. విశాఖపట్నంలో సమైక్యాంధ్రప్రదేశ్ పరిరక్షణ పేరిట రాజకీయేతర జేఏసీ సారథ్యంలో ఈ నెల 21న భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే రాజకీయేతర జేఏసీలో మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్యభూమిక పోషిస్తుండడంతో ఆయనకు వ్యతిరేకంగా ఉన్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఈ సభపై విముఖతతో ఉన్నారు. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. సీఎం, ఆయన మద్దతుతో ఇతర మంత్రులు తనకు వ్యతిరేకంగా కొందరిని రెచ్చగొడుతున్నారనే అభిప్రాయం బొత్సలో ఉంది. తనపై వ్యతిరేకతను మరింత పెంచేందుకే ఈ సభకు పూనుకుంటున్నారని బొత్స భావిస్తున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో మరో ప్రాంతంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతృత్వంలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని నేతలు భావిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు మంగళవారం సమావేశమై హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించినందున తామూ అదే రీతిలో ఒక సభను పెట్టాలన్న ఆలోచనలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలున్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతల విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటుచేసి తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. దీంతోపాటు సమైక్యాంధ్ర ప్రదేశ్‌కు మద్దతుగా 48 గంటల నిరశన దీక్ష చేస్తామని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఇదివరకు ప్రకటించారు. అయితే ఎప్పుడు ఎక్కడ చేయాలన్న దానిపై నేతల మధ్య స్పష్టత లేకుండాపోయింది. హైదరాబాద్‌లోనే ఈ దీక్షలు చేపడతామని, అయితే ఎప్పుడు ఏ ప్రాంతంలో చేయాలన్న దానిపై గురువారం అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ సమైక్యాంధ్ర ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్ సాకే శైలజానాథ్ చెప్పారు.
ఏదో ఒకటి చేద్దాం!
Published Thu, Sep 12 2013 2:33 AM | Last Updated on Fri, May 25 2018 9:10 PM
Advertisement
Advertisement