Seemandhra Leaders
-
ఐదు నెలల్లోనే అంచనా వేయొద్దు
మందమర్రి : తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు మాత్రమే అయిందని, అప్పుడే ప్రభుత్వ పనితీరుపై అంచనా వేయొద్దని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ టి.పాపిరెడ్డి అన్నారు. ఆదివారం మందమర్రిలో నిర్వహించిన తెలంగాణ వికాస సమితి మొదటి జిల్లా మహాసభల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతోందని చెప్పారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం 54 శాతం విద్యుత్ తెలంగాణకు ఇవ్వాల్సి ఉండగా చంద్రబాబు అవలంభిస్తున్న నీతిమాలిన రాజకీయాలతో ఈ ప్రాంతానికి కరెంటు తిప్పలు తప్పడం లేదని పేర్కొన్నారు. తెలంగాణలో పాలన సక్రమంగా లేదని ప్రచారం చేసేందుకు సీమాంధ్ర నాయకులు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల నిత్యానందరెడ్డిపై జరిగిన కాల్పులను సాకుగా చూపుతూ హైదరాబాద్‌లో ఉండేవారికి రక్షణ లేదంటూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణాలో వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరిస్తూ వారిని చైతన్యపర్చాల్సిన బాధ్యత తెలంగాణ వికాస సమితిపై ఉందని అన్నారు. చెరువుల ద్వారానే బంగారు తెలంగాణ నిర్మాణం సాధ్యమని ప్రభుత్వ ఓఎస్డీ దేశ్‌పతి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధించుకున్నా సీమాంధ్ర భావజాలం ఇప్పటికీ కొనసాగుతోందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి గని కార్మికుల పోరాట పటిమను ఎన్నటికీ మరిచిపోలేమని చెన్నూర్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు అన్నారు. సభకు తెలంగాణ వికాస సమితి జిల్లా అధ్యక్షుడు సుందిళ్ల రాజయ్య అధ్యక్షత వహించగా రాష్ట్ర కార్యదర్శి హెచ్.రవీందర్ పలు తీర్మానాలు ప్రతిపాదించారు. జేఎన్టీయూ ప్రొఫెసర్ వినయ్‌బాబు, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ సీతారామారావు, సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్, కరీంనగర్ శాఖ అధ్యక్షుడు డాక్టర్ రమేశ్, భిక్ష పతి పాల్గొన్నారు. -
అప్పుడు సీమాంధ్ర నేతలెవ్వరు మాట్లాడలేదే ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయాక సమైక్య పార్టీ పెట్టడంలో అర్థం లేదని జై ఆంధ్ర ఉద్యమ నేత, మాజీ హోంశాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత 20 రోజుల వరకు సీమాంధ్ర నేతలెవ్వరూ మాట్లాడలేదని ఆయన విమర్శించారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అటు విద్యార్థులు, ఇటు ఎన్జీవోలు సమైక్య ఉద్యమం చేశారని, ఆ తర్వాతే నేతలు రంగంలోకి దిగి ఢిల్లీలో ఉద్యమం మొదలు పెట్టారన్నారు. తెలంగాణ ఉద్యమం ఏర్పడకముందే జై ఆంధ్ర ఉద్యమం ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజనపై కాంగ్రెస్ వైఖరికి నిరసనగా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర సమైక్యానికి ప్రతీకగా ఓ పార్టీ పెట్టేందుకు కిరణ్ సంకల్పించారు. ఆ క్రమంలో లోక్‌సభలో యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి సొంత పార్టీ నుంచి బహిష్కరణకు గురైన పలువురు ఎంపీలు ఆదివారం మాదాపూర్‌లో కిరణ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత పరిస్థితులలో కొత్త పార్టీ రావాల్సిన ఆవశ్యకతపై చర్చించారు. అలాగే సోమవారం పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సిఎం కిరణ్ సమావేశమైయ్యారు. ఈ నేపథ్యంలో ఒకటి రెండు రోజులలో సీఎం కిరణ్ కొత్త పార్టీ పేరు ప్రకటిస్తారని సమాచారం. అదికాక గతేడాది జులై 30న సీడబ్య్లుసీ రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో సీమాంధ్ర నేతలు ఎవ్వరు సీడబ్య్లసి నిర్ణయంపై ప్రతిఘటించలేదు. అయితే రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ప్రాంతంలో విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. దాంతో పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులలో కదలిక వచ్చిన సంగతి తెలిసిందే. -
సీమాంధ్ర నేతల ఇళ్ల వద్ద భద్రత కట్టుదిట్టం
హైదరాబాద్: లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో సీమాంధ్ర నేతల ఇళ్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. నెల్లూరులోని కేంద్ర మంత్రి పనబాకలక్ష్మి, బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు ఇళ్ల వద్ద భద్రత పెంచారు. సమైక్యవాదులు వీరి ఇళ్లను ముట్టడించే అవకాశం ఉన్నందున ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. సమైక్యవాదానికి మద్దతివ్వకుండా హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని పనబాక లక్ష్మి పలుమార్లు స్పష్టం చేయడంతో ఆమె తీరును సమైక్యవాదులు ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నెల్లూరు, గూడూరు, కావలి, ఆత్మకూరు, నాయుడుపేట డివిజన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు.తెలంగాణ బిల్లు మూజువాణి ఓటుతో లోక్ సభలో ఆమోదం పొందింది. -
రాజీనామాపై సీఎం ఊగిసలాట
హైదరాబాద్: రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టిన దరిమిలా సీఎం కిరణ్ కుమార్ తన రాజకీయ మార్గాన్ని అన్వేషించుకునే పనిలో పడ్డారు. ఈ రోజు సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశమైన కిరణ్ పలు విషయాలను చర్చించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సమైక్యవాదిగా నిరూపించుకోవాలని ఉబలాటపడుతున్నా, నేతల నుంచి పూర్తి స్థాయి హామీ లభించకపోవడంతో కొంత డోలాయమానంలో కొట్టుమిట్టాడుతున్నారు. కొత్త పార్టీ అంశంపై ఎమ్మెల్యేల నుంచి మిశ్రమ స్పందనలే లభించడంతో రాజీనామా చేసేందుకు వెనుకడుగువేస్తున్నారు. తాను చేపట్టబోయే భవిష్య కార్యాచరణపై ఒక్కొక్కరి నుంచి అభిప్రాయాలు తీసుకున్నా.. ఆ సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తం కాలేదు. రాజీనామాను ఎప్పుడో చేయాల్సిందని కొంతమంది నేతలు చెప్పగా, ఇప్పుడు చేసినా ఏమీ లాభం ఉండదని మరికొందరు సీఎంకు తెలిపారు. కాగా, రాజకీయ నాయకుడిగా మిగలాలంటే..రాజీనామానే సరైన మార్గమని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. -
సీఎంకు సీమాంధ్ర నేతల ఝలక్!
హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన దరిమిలా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏం చేయనున్నారు? బిల్లు భవితవ్యం సోమ, మంగళవారాల్లో తేలిపోయేలా కన్పిస్తుండటంతో వారంతా భావి కార్యాచరణపై దృష్టి సారించారు. రెండు రోజులుగా తనను కలుస్తున్న వారికి కిరణ్ ఇదే మాట చెబుతున్నారు. ‘ఇంకా పదవిలో ఉండాలని నాకు లేదు. రాజీనామా చేయాలనే ఉంది. కానీ అందరం కలిసే నిర్ణయం తీసుకుందాం. సమష్టిగా ముందుకు వెళ్దాం’ అంటున్నారు. ఇప్పటికే పలువురు సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కిరణ్ దఫదఫాలుగా మంతనాలు జరిపారు. ఆదివారం కూడా సీఎం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో సీమాంధ్ర నేతలు గైర్హజరయ్యారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి 25 మంది ఎమ్మెల్యేలు, 6గురు మంత్రులు మాత్రమే హాజరైయ్యారు. సీమాంధ్ర ప్రాంత్రంలో కాంగ్రెస్ పక్షాన ఉన్న 83 మందిలో 52 మంది సమావేశానికి హాజరు కాకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ రోజు జరిగిన సమావేశంలో పాల్గొనని నేతలంతా కిరణ్ కు దూరంగా ఉండేందుకు సిద్ధమవుతున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. -
బిల్లు ఆమోదానికి సహకరిస్తాం: నామా
న్యూఢిల్లీ: పార్లమెంట్లో తెలంగాణ బిల్లును దయచేసి అడ్డుకోవద్దని సీమాంధ్ర నేతలను టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరరావు కోరారు. 40 సంవత్సరాల తెలంగాణ ప్రజల కల నెరవేరబోతుందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనకు తమ పార్టీ కట్టుబడివుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన కోసం టీడీపీ మూడు లేఖలు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఈ లేఖలను ఇప్పటిదాకా వెనక్కి తీసుకోలేదని వెల్లడించారు. తమ పార్టీ తరపున తెలంగాణకు మద్దతు ఎంత ఉందో దీని బట్టి తెలుస్తుందన్నారు. సీమాంధ్ర సమస్యల పరిష్కారానికి తామూ పూర్తిగా కూడా సహకరిస్తామని హామీయిచ్చారు. తెలంగాణకు అడ్డుతగలొద్దని సీమాంధ్ర ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. -
టెర్రరిస్టులకు, సీమాంధ్ర నేతలకు తేడా లేదు
సీమాంధ్ర నేతలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్ రావు మరోసారి నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడుతున్న సీమాంధ్ర నేతలపై దేశద్రోహుల కింద కేసులు నమోదు చేయాలని హరీశ్ రావు బుధవారం హైదరాబాద్‌లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టెర్రరిస్టులకు, సీమాంధ్ర నేతలకు కొంచం కూడా తేడా లేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ నేతలపై డీజీపీ బి.ప్రసాదరావు అనుసరిస్తున్న వైఖరిపై కూడా హరీశ్ రావు మండిపడ్డారు. రాష్ట్ర విభజన విషయంలో తెలంగాణ నేతలపై డీజీపీ సుమోటో కింద కేసులు బనాయిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. అయితే సీమాంధ్ర వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదంటూ ఆయన ఈ సందర్భంగా డీజీపీని ప్రశ్నించారు. -
కిరణ్ తీరుకు నిరసనగా టినేతల దీక్ష
-
ఇద్దరినీ కూర్చోబెట్టాలి: బాబు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చంద్రబాబు తన ‘మనసులో మాట’ను ఇప్పటికీ బయట పెట్టడం లేదు. బిల్లు అంకం తుది ఘట్టానికి చేరుకున్నా తన వైఖరి చెప్పకుండా ఎప్పటిలాగే నాన్చుతున్నారు. సోమవారం ఢిల్లీలో రాష్ట్రపతి సహా పలు పార్టీల నేతలను కలసిన బాబు.. బిల్లును సమర్థిస్తున్నారా, లేక వ్యతిరేకిస్తున్నారా అన్న విషయంపై స్పష్టత ఇవ్వలేకపోయారు. సోమవారం రాత్రి 7.30కు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో బాబు ఒంటరిగా భేటీ అయ్యారు. బిల్లు లోపభూయిష్టమంటూ వినతిపత్రం సమర్పించారు. ‘‘బిల్లుపై పునఃపరిశీలన చేయండి. రాజ్యాంగానికి లోబడి సమన్యాయం జరిగేలా పరిష్కారం చూపండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే సీమాంధ్ర ప్రజలను ఒప్పించాలి. రాష్ట్రం సమైక్యంగా కొనసాగాలంటే తెలంగాణ ప్రజలను ఒప్పించాలి. విభజన తప్పనిసరైతే రెండు ప్రాంతాలకు సమ న్యాయం జరగాలి’ అని అందులో పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రజలతో, నాయకులతో చర్చించి సమస్యను సామరస్యంగా పరిష్కరించాలన్నారు. ఈ మేరకు తాము చేసిన ప్రతిపాదనకు రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఆయనే వారితో చర్చించి సముచిత నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామన్నారు. ‘‘కేంద్రం రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించిందని, సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీ ఓటేసిందని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాను. సమస్యలన్నిటినీ సామరస్యంగా పరిష్కరించేందుకు అవసరమైన యంత్రాంగం ఉండాలని కోరాను’’ అన్నారు. ఎన్నికల వేళ రాజకీయ లబ్ధి కోసమే చెడు సంప్రదాయానికి కాంగ్రెస్ నాంది పలుకుతోందని విమర్శించారు. ‘‘ముఖ్యమంత్రిని ముందర పెట్టి కొత్త నాటకానికి కాంగ్రెస్ తెర తీసింది. సమైక్యమంటే ఆయనకేదో ఓట్లు పడుతాయని ఆలోచిస్తున్నారు. 2008లో టీడీపీ తీర్మానానికే కట్టుబడి ఉన్నాం’’ అన్నారు. చర్చలకు సమయం లేదుగా అని ప్రశ్నించగా, సమయం విషయం కాదని, అంశాన్ని చూడాలని చెప్పుకొచ్చారు. ‘‘ఒకచోట రాజధాని, మరోచోట ప్రజలు విడిపోవడం చరిత్రలో లేదు. ఇలాంటి విషయంలో జాగ్రత్తలు పాటించకే సమస్యలొచ్చాయి. ఆర్టికల్ 371 డి, రాజ్యాంగ సవరణ అవసరమన్నా పట్టించుకోవడం లేదు. పద్ధతి ప్రకారం చేసి ఉంటే బిల్లు వచ్చేది కాదు. అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేదాకా విషయాన్ని ముందుకు తీసుకెళ్తాం’’ అన్నారు. రాజ్‌నాథ్, శరద్‌యాదవ్‌లతో భేటీ సోమవారం మధ్యాహ్నం బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, జేడీయూ నేత శరద్‌యాదవ్‌లతో కూడా బాబు భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రెండు ప్రాంతాలకు న్యాయం జరగాలని, రాష్ట్ర భాగస్వాములను పిలిపించి మాట్లాడాలని, సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని వారికి చెప్పానన్నారు. సీమాంధ్రకు న్యాయం జరగాలని రాజ్‌నాథ్ అన్నారన్నారు. ‘‘స్క్రిప్టు 10 జన్‌పథ్‌లో. అక్కడ రాష్ట్రంలో అదే నాటకం. నేను ఢిల్లీలో దీక్ష చేసినా వీరు మారలేదు’’ అన్నారు. ఎన్డీఏ హయాంలో మూడు రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియ ఆనందంగా జరిగిందంటూ ప్రశంసించారు! బిల్లుపై మంగళవారం నిర్ణయం: శరద్‌యాదవ్ విభజన బిల్లుపై జేడీయూ నిర్ణయాన్ని మంగళవారం సమావేశమై చర్చించాక వెల్లడిస్తామని శరద్ యాదవ్ చెప్పారు. బాబుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. శాంతియుతంగా విభజన జరగాలనేది తమ అభిప్రాయమన్నారు. ‘‘ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్లమెంటు నడవదు. ఆర్థిక బిల్లును పూర్తి చేయాల్సి ఉన్నా ఆర్థిక విభాగాల వద్ద పేపర్లు సిద్ధంగా లేవు. పార్లమెంటు సమావేశాలను 12వ తేదీ నుంచి పెట్టాలంటే విన్లేదు. ముందు ఆర్థిక బిల్లును ఆమోదిస్తే బాగుంటుందని నేటి అఖిలపక్షంలో అన్ని పార్టీలూ చెప్పాయి’’ అని బదులిచ్చారు. ‘సోనియా ఇంటివద్ద పోరాడమనండి’ ‘‘నిరవధిక ధర్నా చేస్తానంటూ రేపు ఒక కొత్త యాక్టర్ ఇక్కడికొస్తున్నాడ’’ంటూ సీఎం కిరణ్నుద్దేశించి బాబు ఎద్దేవా చేశారు. ‘‘కలిసి పోరాడదామంటున్నారు. మాకు చెప్పడం కాదు, సోనియాపై పోరాడమనండి. ఆమె నివాసం 10 జన్‌పథ్ ముందు కిరణ్ ధర్నా చేయాలి. కారకుల ఎదుట పోరాడాలి గానీ వీధుల్లో కాదు. కానీ అక్కడ చేయరు. రాజ్‌ఘాట్ పోతామని, అధ్యక్షుడి దగ్గరకు పోతామని అంటున్నారు. ఇదంతా 10 జన్‌పథ్ నుంచి ఆడిస్తున్న నాటకం. అందులో వీరంతా పాత్రధారులు. కేంద్ర కేబినెట్లో బిల్లు పాస్ చేసి ప్రధాని పంపితే ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తారు. ఢిల్లీకి, రాష్ట్రపతి దగ్గరకు వచ్చి పాదయాత్ర చేస్తానంటాడు. సోనియా అధ్యక్షతన సీడబ్ల్యుసీ నిర్ణయం తీసుకుంటుంది. దాన్ని పీసీసీ అధ్యక్షుడు తిరస్కరిస్తారు. ఎవరిని మోసం చేస్తున్నారు? ఈ డ్రామాలు కట్టిపెట్టి ఆమోదయోగ్య పరిష్కారం చూడాలి’’ అన్నారు. ‘ఒంటరి’ భేటీల బాబు ‘ఢిల్లీకి వచ్చిన పని ఒకటి.. చేస్తున్న పని మరొకటి’ - చంద్రబాబు తీరుపై టీడీపీ నేతల్లోనే వ్యక్తమవుతున్న అసంతృప్తి ఇది! సోమవారం ఢిల్లీలో బాబు ఎవరిని కలసినా వ్యక్తిగతంగా మాత్రమే మాట్లాడటం, తమెవరినీ అనుమతించకపోవడం పట్ల వారిలో విస్మయం వ్యక్తమవుతోంది. పైగా అందరినీ కలుస్తున్నా విభజనకు టీడీపీ అనుకూలమా, వ్యతిరేకమా అన్నది మాత్రం సూటిగా చెప్పడం లేదంటూ నిట్టూరుస్తున్నారు. నిజానికి రాబోయే ఎన్నికలు, పొత్తుల వ్యవహారాలకే బాబు ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఆయన వ్యవహార శైలిని బట్టి అర్థమవుతోందని ఆయనతో పాటు ఢిల్లీ వచ్చిన టీడీపీ నేత ఒకరన్నారు. రాష్ట్రపతితో ఎప్పుడూ పార్టీ నేతలతో పాటుగా భేటీ అయ్యే బాబు, సోమవారం మాత్రం ఒక్కర్నీ వెంట తీసుకెళ్లలేదు! సుమారు 40 నిమిషాల పాటు ప్రణబ్‌తో ఏకాంతంగా భేటీ అయ్యారు. అంతకు ముందు బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌తో భేటీ సందర్భంగా తొలుత యనమల రామకృష్ణుడు, ఎంపీలు ఎన్.శివప్రసాద్, రమేశ్ రాథోడ్ బాబు వెంట ఉన్నారు. కానీ కొద్ది నిమిషాలకే వారిని పక్కకు పంపి, రాజ్‌నాథ్‌తో ముప్పావు గంట పాటు బాబు ఏకాంతంగా మంతనాలు జరిపారు. ఆ సమయంలో పార్టీ నేతలను దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు. తరవాత శరద్‌యాదవ్, అజిత్‌సింగ్‌లతో భేటీ సందర్భంగా కూడా ఇదే పునరావృతమైంది. ‘‘అన్ని భేటీల్లోనూ లోపలికి బాబుతో కలసి వెళ్తాం. బయటికి కూడా ఆయనతో కలిసే వచ్చాం. అంతే తప్ప లోపల ఏ జాతీయ నేతతో బాబు ఏం మాట్లాడారో మాకైతే తెలియదు’’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడొకరు వాపోయారు. మంగళవారం బీజేపీ అగ్ర నేత అద్వానీని కూడా ఏకాంతంగానే కలవాలని బాబు నిర్ణయించారు! అధినేత వైఖరి అర్థం కాక అయోమయపడుతున్న సీమాంధ్ర టీడీపీ నేతలు మంగళ లేదా బుధవారాల్లో రాష్ట్రపతిని విడిగా కలవాలన్న నిర్ణయానికి వచ్చారు. -
టీ కాంగ్రెస్ పోటీ దీక్ష
తెలంగాణ మంత్రులు, నేతల భేటీలో నిర్ణయం సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ బుధవారం ఉదయం సీఎం కిరణ్ సహా సీమాంధ్ర మంత్రులు, నేతలు ఢిల్లీలోని ఇందిర సమాధి శక్తిస్థల్ వద్ద దీక్ష చేసేందుకు సిద్ధమవుతుండగా.. అదే సమయంలో నెహ్రూ సమాధి శాంతివనం వద్ద దీక్ష చేసేందుకు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు సమాయత్తమయ్యూరు. డిప్యూటీ సీఎం దామోదర్‌తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి, ఆర్టికల్ 3 ప్రకారం విభజన ప్రక్రియ పూర్తి చేయూలని డిమాండ్ చేయనున్నారు. సోమవారం ఢిల్లీకి చేరుకున్న నేతలు సమావేశమై ముఖ్యమంత్రికి పోటీగా దీక్ష చేసే విషయమై సుదీర్ఘంగా చర్చించుకున్నారు. మంత్రులు జానారెడ్డి, శ్రీధర్‌బాబు, ప్రసాద్‌కుమార్, డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, గీతారెడ్డిలు ఈ మేరకు ప్రతిపాదించగా మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇందుకు ఆమోదం తెలిపారు. ఇదే విషయమై కేంద్ర మంత్రులు జైపాల్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్‌లతో సైతం మంత్రులు విడివిడిగా చర్చించారు. ముఖ్యమంత్రికి దీటైన సమాధానం చెప్పాలంటే దీక్షే సరైన విధానమని అభిప్రాయపడిన జైపాల్‌రెడ్డి సహా ఇతర కేంద్ర మంత్రులు దీక్షకు తాము సైతం హాజరవుతామని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. -
ఇక ‘ఢిల్లీ’మే సవాల్!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు అసెంబ్లీలో చర్చ ముగించుకుని రాష్ట్రపతికి చేరనున్న తరుణంలో ఉభయ ప్రాంతాల నేతలు ఢిల్లీలో మోహరించేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్‌లకు చెందిన ఇరు ప్రాంతాల నేతలు వేర్వేరుగా హస్తినకు పయనమవుతున్నారు. 5 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావే శాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తుండడంతో దానికి అనుకూలంగా, వ్యతిరేకంగా తమ వాదనలు వినిపించేందుకు ఉభయ ప్రాంతాల నేతలు సిద్ధమవుతున్నారు. తమ పార్టీ నేతలతో కలసి హస్తినకు చేరుకున్న టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు, పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు సోమ, మంగళవారాల్లో వేర్వేరుగా ఢిల్లీకి చేరుకోనున్నారు. ఎంపీలు, రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్యేలంతా పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లుపై చర్చ పూర్తయ్యే వరకు ఢిల్లీలోనే మకాం వేయాలని భావిస్తున్నారు. కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి సూచనల మేరకు తెలంగాణ ప్రాంత నేతలు వేర్వేరుగా భేటీలు కావడంతోపాటు అవసరమైతే యూపీఏ భాగస్వామ్య పక్షాలను కలసి తెలంగాణకు మద్దతును కూడగట్టాలని యోచిస్తున్నారు. రాజ్యసభ, లోక్‌సభల్లో తెలంగాణ బిల్లు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఆమోదం పొందేందుకు సహకరించాలని యూపీఏయేతర పార్టీల నేతలనూ కలవాలని వారు భావిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ బిల్లుకు పార్లమెంటులో బీజేపీ నుంచి ఇబ్బందులు రావచ్చని భయపడుతున్న తెలంగాణ నేతలు, బీజేపీ వ్యతిరేకించినా పార్లమెంటులో గండాన్ని గట్టెక్కించుకొనేందుకు ఇతర పార్టీల మద్దతును కూడగట్టుకోవాలన్న భావనతో ఉన్నారు. పార్లమెంటులో బిల్లుకు తగిన మద్దతు కూడగట్టే పనిని, ఫ్లోర్ కోఆర్డినేషన్‌ను కేంద్ర మంత్రులు, పార్టీ పెద్దలు చేస్తున్నా, తమవంతు బాధ్యతగా ఆయా పార్టీల నేతలను కలిస్తే ఎక్కువ ప్రయోజనముంటుందని తెలంగాణ నేతలు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రపతితో భేటీకి సీమాంధ్ర నేతల సన్నాహాలు మరోవైపు, సీమాంధ్ర నేతలు కూడా హస్తిన బాటపడుతున్నారు. రాష్ట్రపతిని కలిసి విభజన బిల్లును అసెంబ్లీ తిరస్కరించినందున దానిని పార్లమెంటుకు పంపేందుకు అనుమతించరాదని కోరాలని భావిస్తున్నారు. రాష్ట్రపతి అపాయింట్మెంటు కోసం వారు లేఖ రాశారు. రాష్ట్రపతి ఇచ్చే సమయాన్ని బట్టి ఈనెల 4న లేదా 5న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. అంతకంటే ముందే ఇతర నేతలు హస్తినకు చేరుకోనున్నారు. ఢిల్లీలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఇప్పటికే సీఎం కిరణ్, సీమాంధ్ర మంత్రులు పలుసార్లు సమావేశాలు నిర్వహించారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో మౌనదీక్ష, రాష్ట్రపతి కార్యాలయం వరకు పాదయాత్ర చేయడం వంటి కార్యక్రమాలపై ఆలోచనలు సాగిస్తున్నారు. కాగా, సీఎం 4న ఢిల్లీలో దీక్ష చేపట్టనున్నారని పార్టీనేతలు చెబుతున్నారు. నేడు రాష్ట్రపతితో బాబు భేటీ సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం సాయంత్రం ఏడున్నర గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ కానున్నారు. దీనికోసం బాబుతో సహా పార్టీ ఎమ్మెల్యేలు ఉదయం 6.40 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఇరు ప్రాంతాల ఎమ్మెల్యేలతో కలిసి చంద్రబాబు ఢిల్లీ చేరుకున్న తరువాత పలువురు జాతీయ పార్టీ నేతలను కలిసి తెలంగాణ విషయంపై తమ పార్టీ అభిప్రాయాలను వారి దృష్టికి తీసుకొస్తారు. ఆయనతోపాటు పార్టీ నేతలు మంగళవారం కూడా ఢిల్లీలోనే ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
ఢిల్లీలో 2 గంటలు మౌన దీక్ష
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బిల్లును తిరస్కరిస్తూ అసెంబ్లీలో చేసిన తీర్మానం ప్రాతిపదికగా పార్లమెంట్లో ఆ బిల్లును ప్రవేశపెట్టొద్దని కోరుతూ ఢిల్లీలో రెండు గంటలు మౌన దీక్ష చేయాలని సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నిర్ణయించారు. రాష్ట్రపతిని కలిసి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టొద్దని కోరాలని నిర్ణయించారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం క్యాంపు కార్యాలయంలో సీమాంధ్ర నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, ఎన్.రఘువీరారెడ్డి, శైలజానాథ్, పి.బాలరాజు, వట్టి వసంతకుమార్, శత్రుచర్ల విజయరామరాజు, గంటా శ్రీనివాసరావు, పార్థసారథి, ఎంపీ జి.హర్షకుమార్ తదితరులు హాజరయ్యారు. రెండు గంటలపాటు సమావేశం జరిగింది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. 4 లేదా 5 తేదీల్లో రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరినట్లు సీఎం నేతలకు చెప్పారు. 3వ తేదీ మధ్యాహ్నానికి అందరూ ఢిల్లీ చేరుకోవాలని సూచించారు. విభజన బిల్లును తిరస్కరిస్తూ శాసన సభలో తీర్మానాన్ని ఆమోదించిన విషయాన్ని రాష్ట్రపతికి వివరించి, ఎట్టి పరిస్థితుల్లోనూ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టొద్దని కోరుతూ లేఖ ఇస్తామని చెప్పారు. సమైక్యవాదాన్ని వినిపిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్‌తోపాటు టీడీపీ ఎమ్మెల్యేలను కూడా రాష్ట్రపతి వద్దకు తీసుకెళితే బాగుంటుందని కొందరు మంత్రులు ప్రతిపాదించారు. విపక్ష ఎమ్మెల్యేలు కూడా వస్తే రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇచ్చిన రోజు తొలుత మహాత్మాగాంధీ సమాధి వద్ద 2 గంటలు మౌన దీక్ష చేయాలని నిర్ణయించారు. ఇతర పార్టీల నాయకులు రాకపోతే ఇందిరాగాంధీ సమాధి వద్ద మౌనం పాటించాలని తీర్మానించారు. విభజన బిల్లుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలా? వద్దా? అనే దానిపైనా మల్లగుల్లాలు పడ్డారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని నిర్ణయం తీసుకుందామని సీఎం పేర్కొన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముగ్గురినీ గెలిపించుకునే సంఖ్యా బలం ఉన్నందున ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు. రెబల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డికి మద్దతుపై ఒకరిద్దరు సభ్యులు ప్రస్తావించినప్పటికీ, సీఎం సమాధానం దాటవేసినట్లు తెలిసింది. ఈ నెల 7న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నందున, ఒక రోజు ముందే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించాలని కొందరు నేతలు సూచించారు. ఢిల్లీ నుంచి వచ్చిన తరువాత శాసన సభ సమావేశాల తేదీపై నిర్ణయం తీసుకుందామని సీఎం తెలిపారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ దాఖలు చేసే పిటిషన్లపై తమకు నోటీసులు జారీ చేయాలని, సదరు పిటిషనర్ల అభ్యంతరాలపై తమ వాదన విన్న తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని కోరుతూ తెలంగాణ న్యాయవాదుల జేఏసీ నేత సుంకరి జనార్దన్ గౌడ్ శనివారం సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో కేవియట్‌ను దాఖలు చేశారు. -
'ఢిల్లీలో కిరణ్ దీక్షపై నిర్ణయం తీసుకోలేదు'
హైదరాబాద్ : సమైక్యాంధ్రకు మద్దతుగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో దీక్ష చేపట్టే అంశంపై ఇంకా నిర్ణయానికి రాలేదని, పరిశీలనలో ఉందని మంత్రి సి. రామచంద్రయ్య అన్నారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ ముగిసింది. భేటీ అనంతరం రామచంద్రయ్య మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉభయ సభల్లో తెలంగాణ బిల్లును తిరస్కరించాలన్న తీర్మానం నెగ్గిన విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళతామని తెలిపారు. ఈనెల 4,5వ తేదీల్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అపాయింట్మెంట్ కోరినట్లు ఆయన చెప్పారు. తమకు మద్దతుగా అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను కూడా ఢిల్లీకి ఆహ్వానిస్తామని రామచంద్రయ్య తెలిపారు. -
సీన్ ఢిల్లీకి!
సీఎం క్యాంపు కార్యాలయంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతల భేటీ జానారెడ్డి చాంబర్లో తెలంగాణ నేతల సమావేశం రాష్ర్టపతిని, పార్టీ పెద్దలను కలిసేందుకు 3, 4 తేదీల్లో హస్తినకు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ ముగియడంతో ఇక సీన్ మొత్తం హస్తినకు మారుతోంది. గురువారం అసెంబ్లీ వాయిదా పడ్డాక ఇరు ప్రాంతాల నేతలు ఎవరి వ్యూహాల్లో వారు నిమగ్నమయ్యారు. ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో పాటు పార్టీ ముఖ్యనేతలను కలవాలని వారు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో క్యాంపు కార్యాలయంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, గంటా శ్రీనివాసరావు, పితాని సత్యనారాయణ, కొండ్రు మురళీమోహన్, పార్థసారధి, తోట నర్సింహం తదితరులు... అయిదుగురు ఎంపీలు, 22 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. విభజన బిల్లును తిరస్కరిస్తూ సీఎం తీర్మానం పెట్టడం, సభ దాన్ని ఆమోదించడంతో కిరణ్‌కుమార్‌రెడ్డిని అభినందించారు. సభలో తిరస్కార తీర్మానానికి సహకరించిన నేతలకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టకుండా రాష్ట్రపతిని విన్నవించేందుకు ఢిల్లీ వెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. బిల్లు రాష్ట్రపతినుంచి కేంద్రానికి వెళ్లకముందే ఆయన్ను కలవాల్సి ఉన్నందువల్ల, ఫిబ్రవరి 4న కేంద్ర మంత్రుల బృందం భేటీకి ముందుగానే ఢిల్లీ వెళ్లాలని కొందరు సూచించారు. దీంతో రెండురోజుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో మేధోమధన సదస్సును నిర్వహించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుందామని సీఎం చెప్పారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఢిల్లీలో మౌన దీక్షలు చేయాలని, ఏపీ భవన్‌నుంచి రాష్ట్రపతి భవన్ వరకు పరేడ్‌గా వెళ్లాలని కొందరు సూచించారు. రాష్ట్ర సమైక్యతకోసం ఏ కార్యక్రమం చేపట్టినా తామంతా వెన్నంటే ఉంటామని మంత్రి శైలజానాధ్ చెప్పారు. అవసరమైతే రాష్ట్ర బంద్‌కు సీఎం పిలుపునివ్వాలని, ధర్నాలు, దీక్ష లకు దిగితే తామంతా వాటిని విజయవంతం చేస్తామని తెలిపారు. బిల్లు తిరస్కరణ తీర్మానంతో సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో నూతనోత్సాహం వచ్చిందని, ఇతర పార్టీలవారందరినీ ముందుకు తీసుకువస్తామని శైలజానాధ్, గంటా శ్రీనివాసరావులతోసహా ఇతర మంత్రులు వివరించారు. మరోవైపు మంత్రి జానారెడ్డి చాంబర్లో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశమై తాజా పరిణామాలపై చర్చించారు. వచ్చేనెల 3, 4 తేదీల్లో ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతితో పాటు పార్టీ పెద్దలందరినీ కలవాలని నిర్ణయించారు. నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున సంబరాలు జరపాలని, ప్రత్యేక రాష్ట్రం కాంగ్రెస్ వల్లనే సాధ్యమైందన్న ప్రచారం మరింత ముమ్మరం చేయాలని తీర్మానించారు. ఆ మేరకు అందరూ నియోజవకర్గాలకు బయలుదేరారు. ఆదివారం తిరిగి హైదరాబాద్‌కు చేరుకొని భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. -
టీడీపీ డబుల్ డ్రామా!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013 విషయంలో ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తన డ్రామాను బుధవారం రక్తికట్టించింది. ఓటింగ్ జరపాలని సీమాంధ్ర నేతలు... ఓటింగ్ అక్కరలేదని తెలంగాణ నేతలు పోటాపోటీగా ఆందోళనలు నిర్వహించారు. ఓటింగ్ జరపాలని, చర్చకు గడువు పొడిగించాలని స్పీకర్‌ను డిమాండ్ చేస్తూ పార్టీ సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు శాసనసభా మందిరంలో బైఠాయిస్తే... ఓటింగ్ పెట్టకుండా వెంట నే తిప్పి పంపాలంటూ తెలంగాణ ప్రాంత పార్టీ ఎమ్మెల్యేలు గన్‌పార్క్ వద్ద నిరసన తెలిపారు. బుధవారం సభ వాయిదా పడిన వెంటనే అధినేత చంద్రబాబు రెండు ప్రాంతాల ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అది పూర్తికాగానే ఎమ్మెల్యేలు ప్రాంతాల వారీగా ఆందోళనకు దిగడం గమనార్హం. టీడీపీ డ్రామా పర్వం కొనసాగిందిలా... - రాష్ట్ర విభజన ప్రక్రియ కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో కేంద్రం తీరుకు నిరసనగా గురువారం బంద్ పాటించాలని సీమాంధ్ర టీడీపీ నేతలు పయ్యావుల కేశవ్, సీఎం రమేష్ కోరారు. - సభ వాయిదాపడక ముందు పార్టీ ఎమ్మెల్యేలు ప్రాంతాల వారీగా చీలిపోయి ఒకే సమయంలో ఎవరి వాదనకు అనుగుణంగా వారు స్పీకర్ ఛాంబర్లో వేరువేరుగా ధర్నా నిర్వహించారు. సభ వాయిదా పడిన వెంటనే పార్టీ ఎమ్మెల్యేలు మరోసారి చంద్రబాబుతో సమావేశమయ్యారు. - బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలని అన్ని పార్టీలకు చెందిన సీమాంధ్ర నేతలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలు సభలోనే బైఠాయించాల్సిందిగా చంద్రబాబు సూచిం చారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే తాము నిరసన తెలుపుతున్నామని పోలీసులు అరెస్టు చేసేవరకూ గంటకో మారు వచ్చి మీడియాకు వెల్లడించాల్సిందిగా ఆదేశించారు. - అధినేత సూచనను ఎమ్మెల్యేలు తూ.చ. తప్పకుండా పాటించారు. దేవినేని ఉమా మహేశ్వరరావు, పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, యరపతినేని శ్రీనివాసరావు, గాలి ముద్దుకృష్ణమనాయుడు తదితరులు టీవీ ఛానళ్లలో వార్తలు ప్రసారమయ్యే - సమయానికి వచ్చి మాట్లాడి మళ్లీ సభామందిరంలోకి వెళ్లారు. బిల్లును సమగ్రంగా చర్చించేందుకు ఫిబ్రవరి 28 వరకూ గడువు పెంచాలని, బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. - మరోవైపు బిల్లుపై ఓటింగ్ నిర్వహించవద్దని, యధావిధిగా రాష్ట్రపతికి తిప్పి పంపాలని కోరుతూ తెలంగాణ ప్రాంత టీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకరరావు, మోత్కుపల్లి నర్సిం హులు నేతృత్వంలో అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద సుమారు గంటపాటు నిరసన తెలిపారు. - బిల్లుపై సీఎం ఇచ్చిన నోటీసును స్పీకర్ తిరస్కరిం చాలని ఎర్రబెల్లి, మోత్కుపల్లి డిమాండ్ చేశారు. అలాగే గడువు పెంచొద్దని కోరుతూ తెలంగాణ టీడీపీ ఫోరం నేతలు రాష్ట్రపతికి లేఖ రాశారు. -
సీఎం వ్యాఖ్యలు బాధాకరం
నర్సాపూర్, న్యూస్‌లైన్: రాష్ట్ర శాసనసభలో ప్రత్యేక తెలంగాణ ముసాయిదా బిల్లుపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలు బాధాకరమని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి అన్నా రు. ఆమె గురువారం సాయంత్రం స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేస్తే సీమాంధ్రలో కాంగ్రెస్‌కు నష్టం వాటిల్లుతుందని తెలిసే సోనియాగాంధీ తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. పార్టీ నాయకుడిగా, సీఎంగా ఉంటూ తాను రాష్ట్ర విభజనకు వ్యతిరేకమని ప్రకటించడం సబబుకాదన్నారు. మంత్రి బాలరాజు సభలో మాట్లాడుతూ తాను సమైఖ్యవాదిని అయినా పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించడం అభినందించారు. రాష్ట్రపతి 30వరకు గడువు పెంచడం పట్ల ఆమె స్పందిస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు నిదర్శనమని చెప్పారు. జగన్నాథరావు ఆశయాలు కొనసాగిస్తాం స్థానిక కాంగ్రెస్ నాయకుడు, దివంగత మాజీ డిప్యూటీ సీఎం జగన్నాథరావు రెండవ వర్ధం తిని పురస్కరించుకుని గురువారం సాయంత్రం మంత్రి సునీతాలక్ష్మారెడ్డి నర్సాపూర్ లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మంత్రి వెంట సర్పంచ్ వెంకటరమణారావు, కాంగ్రెస్ నాయకులు ఆంజనేయులుగౌడ్, సత్యంగౌడ్, శ్రీనివాస్‌గుప్తా, అనిల్‌గౌడ్, నయీం, విష్ణువర్ధన్‌రెడ్డి,వెంకటేశం పాల్గొన్నారు. మాజీ డిప్యూటీ సీఎంకు ఘన నివాళి స్థానిక కాంగ్రెస్ నాయకుడు, దివంగత మాజీ డిప్యూటీ సీఎం చౌటి జగన్నాథరావు రెండో వర్ధంతి సందర్భంగా గురువారం స్థానిక ఆయన విగ్రహం వద్ద ఆయన కుటుంబ సభ్యులతో పాటు పలు పార్టీల నాయకులు ఘనంగా నివాళ్లర్పించారు. ఆయన భార్య వనమాల, కుమారుడు శ్రీనివాసరావు, కోడలు రమాదేవితోపాటు ఇతర కుటుంబ సభ్యులతో పాటు ఆయా పార్టీల నాయకులు పాల్గొని జగన్నాథరావు విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. -
ఫిక్సర్లకు రాయితీలు..!
రాష్ట్ర విభజన అంశాన్ని నేతలు క్రికెట్‌తో పోలుస్తున్నారు. ఈ మ్యాచ్‌లో తానింకా బ్యాటింగే మొదలుపెట్టలేదని సీఎం చెబుతుండగా విభజన ప్రక్రియ అంతా అయిపోతున్న సమయంలో చివరి బంతికి సెంచరీ ఎలా చేస్తారని తెలంగాణ నేతలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ మ్యాచ్ ప్రారంభించిన కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం కొందరు సీమాంధ్ర నేతలతో ఫిక్సింగ్ చేసుకుని తన పని సాఫీగా చేసుకుపోతోందని అసెంబ్లీ లాబీల్లో చర్చ. సమైక్య బ్యాటింగ్ మొదలెట్టాలని కొందరు సీమాంధ్ర ఎంపీలను హైకమాండే ఫీల్డ్‌లోకి దింపిందట. బ్యాటు పట్టుకోవడమే తెలియని వారికి గేమ్‌ప్లాన్ వివరించిందట. ‘వీర లెవెల్లో బ్యాటింగ్ చేస్తున్నట్టు కనిపించండి. మీకు మీరే చాంపియన్లుగా కూడా ప్రచారం చేసుకోండి. అవసరమైతే చివరి బంతిలోనూ సెంచరీ చేస్తామని చెప్పండి. మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే కొద్ది రోజుల్లో మరో కొత్త మ్యాచ్ ప్రారంభించాల్సి ఉంటుంది’ అంటూ నూరిపోసిందట. ఇంకేం.. వారంతా రంగంలోకి దిగి స్లోగన్లు, పోస్టర్లు, హోర్డింగ్‌లు, చానెళ్లలో నినాదాలను ఊదరగొట్టడం మొదలెట్టారు. దాంతో.. సెకండ్ ఇన్నింగ్స్‌కు సిద్ధం కావాలని హైకమాండ్ ఆదేశించిందట. మళ్లీ ఇదేమిటని అనుకుంటున్నారా! కొత్త పార్టీ పెట్టి జనంలోకి వెళ్లడం.., ఎన్నికల తర్వాత మళ్లీ వచ్చి పాత టీమ్ (కాంగ్రెస్)లో చేరిపోవడం. ఇటీవలే ఏఐసీసీ మీటింగ్‌కు హాజరైన ఓ నేత అసెంబ్లీ లాబీల్లో ఈ మ్యాచ్ (ఫిక్సింగ్) వివరాలను వెల్లడించారు. దీనివల్ల మనోళ్లకి లాభమేనండీ అని కూడా చెప్పారట. ‘సెకండ్ ఇన్సింగ్స్కయ్యే ఖర్చులకు భారీఎత్తున జేబులు నింపడంతో పాటు ఆ ప్లేయర్లకు చెందిన కంపెనీలకు హైకమాండ్ అనేక రాయితీలు ప్రకటించింది. లేదంటే ఈ ‘ఫిక్సర్లు’ ఊరికే ఫీల్డ్‌లోకి దిగుతారనుకుంటున్నారా?’ అని ఆయన చెప్పడంతో అక్కడున్న వారంతా ‘ఓహో! దీని వెనుక ఇంత కథ ఉందా!’ అనుకున్నారు. -
విభజన బిల్లు.. గడువు గడబిడ
సమీపిస్తున్న విభజన బిల్లు గడువు... రాష్ట్రపతికి పోటాపోటీ లేఖలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చకు గడువు విషయంలో కాంగ్రెస్‌లోని సీమాంధ్ర, తెలంగాణ నేతలు పరస్పరం భిన్న వాదనలు చేస్తున్నారు. అదే వైఖరిని ప్రతిబింబిస్తూ రాష్ట్రపతికి లేఖలు రాయడానికి కూడా సిద్ధవువుతున్నారు. గడువు పెంచాలంటూ సీమాంధ్ర నేతలు, పెంచరాదని కోరుతూ తెలంగాణ నేతలు ఆయనకు లేఖలు రాయాలన్న నిర్ణయానికి వచ్చారు. విభజన బిల్లు డిసెంబర్ 13న శాసనమండలికి, రాష్ట్ర అసెంబ్లీకి చేరడం తెలిసిందే. 40 రోజుల్లోగా అసెంబ్లీ అభిప్రాయంతో దాన్ని తిప్పి పంపాలని రాష్ట్రపతి నిర్దేశించారు. ఆ గడువు జవనరి 23వ తేదీతో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో గడుపు పెంపు కోరుతూ సీవూంధ్ర వుంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరికి వారే విడిగా రాష్ట్రపతికి లేఖలు రాయూలని నిర్ణయించారు. ఈ మేరకు దాదాపు ఒకే రకమైన లేఖను సిద్ధం చేసి, దానిపై సంతకాలు పెట్టి పంపిస్తున్నారు. ‘‘అసెంబ్లీలో ప్రస్తుతం 270 మందికి పైగా సభ్యులున్నారు. బిల్లుపై ప్రతి సభ్యుడూ తన అభిప్రాయం చెప్పాలి. కనుక మరికొంత గడువు అవసరమే. అదే విషయూన్ని రాష్ట్రపతిని లేఖ ద్వారా కోరనున్నాం’’ అని వూజీ వుంత్రి గాదె వెంకటరెడ్డి పేర్కొన్నారు. చర్చలో పార్టీలవారీగా సవుయుం కేటారుుంచడం సరికాదని, సభ్యులు వ్యక్తిగతంగా అభిప్రాయాలు చెప్పుకునేందుకు అవసరమైన సవుయం ఇవ్వాల్సి ఉంటుందని ఆయనన్నారు. గడువు పెంచొద్దు ఇక తెలంగాణకు చెందిన కాంగ్రెస్ సహా ఇతర పార్టీల ఎమ్మెల్యేలేమో గడువు పెంచాల్సిన అవసరం లేనే లేదంటూ రాష్ట్రపతికి లేఖలు రాస్తున్నారు. ఇలా మొత్తం 119 మంది ఎమ్మెల్యేలూ సంతకాలతో కూడిన లేఖలు రాయాలన్న ఆలోచనతో ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాల సేకరణ దాదాపు పూర్తయిందని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. గడువు పెంచొద్దంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా విడిగా రాష్ట్రపతికి ఒక లేఖ రాయనున్నట్టు ఆ పార్టీ శాసనసభాపక్ష నాయకుడు ఈటెల రాజేందర్ తెలిపారు. ఇక బీజేపీలో చేరిన స్వతంత్ర ఎమ్మెల్యే నాగం జనార్దనరెడ్డితో పాటు పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కలిసి మరో లేఖ రాస్తామని శాసనసభాపక్ష నాయకుడు యెండల లక్ష్మీనారాయణ చెప్పారు. ఇలా ఎమ్మెల్యేలు పార్టీలవారీగా లేఖ రాయాలని నిర్ణయించుకున్నా వాటన్నింట్లోనూ ఒకే విషయాన్ని ప్రస్తావిస్తామని వారంటున్నారు. బిల్లుపై చర్చకు సంబంధించి మూడు ప్రధానాంశాలను రాష్ట్రపతికి రాసే లేఖలో ప్రముఖంగా ప్రస్తావించనున్నారు. ‘‘ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్ర శాసనసభలోనే విభజన బిల్లు చర్చకు వస్తే కేవలం పది గంటల పాటు మాత్రమే చర్చించి కేంద్రానికి తిప్పి పంపారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇప్పటికే 20 గంటలకు పైగా చర్చ సాగింది. శాసనసభ్యులందరూ బిల్లుపై తమ అభిప్రాయాలను సవరణల రూపంలో ఇప్పటికే స్పీకర్‌కు అందజేశారు. తొమ్మిది వేలకు పైగా సవరణలు తనకందాయంటూ స్పీకర్నే సభలో ప్రకటించారు’’ అని ప్రస్తావిస్తున్నారు. కిరణ్ లేఖపై పెదవి విరుపు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సభా నాయకుడిగా ఉంటూ, గడువు పెంచాలని కోరుతూ ఎవరికీ చెప్పకుండా రాష్ట్రపతికి అత్యంత రహస్యంగా లేఖ రాయడంపై ఆయన సన్నిహిత మంత్రుల్లో కూడా విస్మయం వ్యక్తమైంది. విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న తరుణంలో సభకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా సీఎం లేఖ రాయడమేమిటని పలువురు మంత్రులు వ్యాఖ్యానించారు. కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా రాష్ట్రపతికి లేఖ రాయాల్సిన అవసరమేమొచ్చిందో అర్థం కావడం లేదని కిరణ్ సన్నిహిత మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. -
సీమాంధ్ర నేతల వైఖరితోనే సంజీవ్ ఆత్మహత్య
గాంధారి, న్యూస్‌లైన్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర నేతలు, ఏపీఎన్జీఓ సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు వైఖరితోనే సర్వాపూర్ గ్రామానికి చెందిన గొడుగు సంజీవ్ ఆత్మ బలిదానం చేశారని జేఏసీ జిల్లా కన్వీనర్ గోపాల్‌శర్మ, అధికార ప్రతినిధి ప్రభాకర్, టీఎన్జీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు గైని గంగారాం ఆరోపించారు. గురువారం వారు సర్వాపూర్ గ్రామాన్ని సందర్శించి సంజీవ్ కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీమాంధ్రలో తెలంగాణ బిల్లు ప్రతులను భోగి మంటలలో దహనం చేయడంతో సంజీవ్ తీవ్ర మనస్తాపం చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లైన ఎనిమిది నెలలకే భర్తను కోల్పోయి భార్య అరుణ, చేతికొచ్చిన కొడుకును పోగొట్టుకొని తల్లి దండ్రులు దిక్కులేని వారయ్యారన్నారు. ప్రభుత్వం వెంటనే బాధిత కుటుంబానికి రూ. ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియాతోపాటు, కుటుంబానికి రెండకరాల భూమి, మృతుడి సోదరునికి వీఆర్ఏ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం గాంధారి మండల కేంద్రంలోని నెహ్రూ విగ్రహం వద్ద అశోక్‌బాబు దిష్టి బొమ్మను దహనం చేశారు. ఏపీఎన్జీఓల సంఘం అధ్యక్షుడిపై ఫిర్యాదు ఏపీఎన్జీఓల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు రెచ్చగొట్టే మాటలకు తోడు తెలంగాణ బిల్లు ప్రతులను దహనం చేసి 4.5 కోట్ల మంది తెలంగాణ ప్రజల మనోభావాలను కించపర్చినందుకే సంజీవ్ ఆత్మహత్య చేసుకున్నాడని గాంధారి ఠాణాలో జేఏసీ నాయకులు ఫిర్యాదు చేశారు. అశోక్‌బాబుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తానాజీరావు, నాయకులు సంతోష్, కమ్మరి సాయిలు తదితరులు పాల్గొన్నారు. -
సీమాంధ్ర నాయకుల దిష్టిబొమ్మ దహనం
బెల్లంపల్లిరూరల్, న్యూస్‌లైన్: విభజన ముసాయిదా బిల్లు ప్రతులను భోగిమంటల్లో వేయడాన్ని నిరసిస్తూ సోమవారం బెల్లంపల్లిలోని కాంటా చౌరస్తా వద్ద తెలంగాణ కుల సంఘాల ఆధ్వర్యంలో ఏపీ ఎన్జీవో, సీమాంధ్ర నాయకుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య మాట్లాడుతూ బిల్లు ప్రతులను దహనం చేయడం రాజ్యాంగ విరుద్ధమని, రాష్ట్రపతిని అవమానించడమేనని అన్నారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన నాయకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణను అడ్డుకునే ప్రయత్నాలను సీమాంధ్రులు మానుకుని ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటుకు సహకరించాలని కోరారు. లేని పక్షంలో తెలంగాణ జిల్లాల్లో నివసిస్తున్న సీమాంధ్రులను తెలంగాణ పొలిమేర వరకు తరిమికొడతామని హెచ్చరించారు. అంతకుముందు పాతబస్టాండ్ నుంచి కాంటా చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కీర్తి నరసింగరావు, కొండబత్తిని రాంమోహన్, పోతరాజు నారాయణ, చంద్రశేఖర్, శ్రీనివాస్, మల్లేశ్, రాజన్న పాల్గొన్నారు. అశోక్‌బాబు దిష్టిబొమ్మ ద హనం ఏదులాపురం : తెలంగాణ బిల్లు ప్రతుల దహనాన్ని నిరసిస్తూ ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు దిష్టిబొమ్మను టీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు సోమవారం జేఏసీ దీక్ష శిబిరం ఎదుట దహనం చేశారు. ఈ సందర్భంగా యువజన విభాగం జిల్లా నాయకుడు జంగిలి ప్రశాంత్ మాట్లాడుతూ తెలంగాణ బిల్లు ప్రతులు చించివేయడం రాజ్యాంగ విరుద్ధమని, అశోక్‌బాబును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర అవకాశవాదులు ఎన్నికుట్రలు పన్నినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగదని అన్నారు. అశోక్‌బాబు ఉద్యోగిగా వ్యవహరించాలని కానీ ఒక రాజకీయ నాయకుడిగా వ్యవహరిస్తూ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు బండారి సతీశ్, గోలి శంకర్, ఎర్రం నర్సింగ్‌రావు, శ్రీపతి శ్రీనివాస్, తిరుపతి, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి బాల శంకర్‌కృష్ణ పాల్గొన్నారు. -
బిల్లు దహనం.. రాజ్యాంగ ఉల్లంఘనే
టీ ముసాయిదా బిల్లు దహనంపై తెలంగాణ నేతల ఆగ్రహం వారిని అరెస్టు చేయాలి: హరీష్‌రావు దేశబహిష్కరణ చేయాలి: శ్రీనివాస్‌గౌడ్ రాజ్యాంగాన్ని కాల్చినట్లే: దిలీప్‌కుమార్ విభజన గీత గీయాల్సిందే: గౌరీశంకర్ న్యూస్‌లైన్ నెట్వర్క్: సీమాంధ్ర నేతలు తెలంగాణ ముసాయిదా బిల్లును భోగి మంటల్లో వేసి తగులబెట్టడంపై తెలంగాణవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రజలను అవమానపర్చడంతో పాటు రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కె.దీలీప్‌కుమార్, టీఆర్ఎల్డీ సెక్రటరీ జనరల్ చెరుకూరి శేషగిరిరావులు హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ, బిల్లును కాల్చడం.. రాజ్యాంగాన్ని కాల్చడమే అవుతుందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, పోరాట ఫలితాన్ని కాల్చి బూడిద చేసిన సీమాంధ్ర నేతలను వెంటనే అరెస్టు చేయాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్‌రావు డిమాండ్ చేశారు. సీమాంధ్ర నేతలు తెలంగాణ బిల్లును భోగిమంటల్లో దహనం చేసి రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు. ఇప్పటిదాకా పార్లమెంటును, ప్రజాస్వామ్యాన్ని అవమానించిన అక్కడి నేతలు ఇప్పుడు పండుగను కూడా అపవిత్రం చేశారన్నారు. వారు తమ విచక్షణను, జ్ఞానాన్ని కూడా అదే భోగి మంటల్లో కాల్చి బూడిద చేసుకున్నారని వ్యాఖ్యానించారు. బిల్లు ప్రతులను దహనం చేసిన వారిని వెంటనే దేశ బహిష్కరణ చేయాలని తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్‌లో డిమాండ్ చేశారు. ఇది సీమాంధ్రుల దురహంకారానికి నిదర్శనమన్నారు. ఒక ప్రాంత ప్రజల ఆంక్షాలను కాల్చివేసి కలిసుందాంరా అనే సమైక్య నినాదం పైశాచికత్వంగా కనిపిస్తుందని తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు జూలూరు గౌరిశంకర్ ఒక ప్రకటనలో ఖండించారు. భోగి మంటల సాక్షిగా రెండు ప్రాంతాల మధ్య విభజన గీతలు గీయాల్సిందేనని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసిన అశోక్‌బాబుపై తెలంగాణ సాధన సమితి అధ్యక్షుడు వెంకటనారాయణ నల్లగొండ జిల్లా కోదాడ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బిల్లును తగులబెట్టడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
బిల్లుపై సహకారానికి టీడీపీ డొంకతిరుగుడు సమర్థన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై రెండు కళ్ల సిద్ధాంతమంటూ టీడీపీ అధినేత చంద్రబాబు అందరినీ గందరగోళ పరిస్తే..ఇప్పుడు అదే కోవలో ఆ పార్టీ సీమాంధ్ర నేతలూ చేరారు. అసెంబ్లీలో విభజన బిల్లుపై చర్చను కొన్ని రోజులు జరపడానికి వీలులేదని పట్టుపట్టిన టీడీపీ సీమాంధ్ర నేతలు రాత్రికి రాత్రే నిర్ణయం మార్చుకుని చర్చకు సహకరించడానికి కారణాలేమిటన్న దానిపై ఆ పార్టీ నేతలు పొంతనలేని సమాధానాలు చెప్పుకొచ్చారు. టీ బిల్లు అసెంబ్లీకి రాకముందే సమైక్య తీర్మానం చేస్తే ప్రయోజనం కానీ ఇప్పుడు చేసి లాభమేమిటని ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమ నాయుడు.. తమ మెడ మీద డెడ్ లైన్ అనే కత్తి వేలాడుతోంది కాబట్టే బిల్లుపై చర్చకు సహకరిస్తున్నామని మరో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. ఏ విషయంలోనైనా వైఎస్సార్సీపీతో పాటు జగన్మోహన్రెడ్డిని గుడ్డిగా వ్యతిరేకించడం తప్ప రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ప్రత్యేక వ్యూహం లేదన్న డొల్లతనం తేటతెల్లమవుతోందని రాజకీయ పరిశీలకులు విమర్శిస్తున్నారు. -
సీమాంధ్రుల పాలనలో నష్టపోయింది మనమే
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సీమాంధ్ర నాయకుల పాలనలో అత్యధికంగా నష్టపోయింది జిల్లా ప్రజలేనని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు, పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకు టీఆర్ఎస్ కృషి చేస్తుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంలో జిల్లా అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటామన్నారు. గురువారం నగరంలో టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హరీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ స్వామిగౌడ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్, నాయకుడు పి.పురుషోత్తంరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రకటన రాగానే రాష్ట్రంలో టీఆర్ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు వైఖరి మార్చాయని, ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఖాయమన్నారు. గ్రామస్థాయి నుంచి టీఆర్ఎస్ను పటిష్టపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అప్పుడు కనిపించలేదే : స్వామిగౌడ్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పేరిట ఇప్పుడు కొందరు యాత్రలు చేపట్టడంపై ఎమ్మెల్సీ స్వామిగౌడ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో ఒక్క రోజు కూడా కనిపించని నేతలు.. ఇప్పుడు తామే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చామని చెప్పుకుంటూ యాత్రలు చేపట్టడం హాస్యాస్పదమన్నారు. కేసీఆర్ పదమూడేళ్ల పాటు ఉద్యమాన్ని నడిపించి, ప్రాణాలను లెక్కచేయకుండా అమరణ దీక్ష చేసినందుకే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందన్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. 17 నుంచి పాదయాత్ర: నాగేందర్ గౌడ్ తెలంగాణ సాధనలో భాగంగా ఈ నెల 17నుంచి నాలుగు రోజులపాటు రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టనున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్ వెల్లడించారు. శంషాబాద్ మండలం పాల్మాకుల నుంచి రాజేంద్రనగర్ మండలం ఖానాపూర్ వరకు దాదాపు 80 కిలోమీటర్లు యాత్ర సాగుతుందని, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని చెప్పారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడిగా ఎంపికైన అబ్దుల్ ముకిత్ చాంద్‌కు నియామక పత్రం అందజేశారు. -
ఓటింగ్ లేకుండా చర్చ ఎలా సాధ్యం?
టీ-నేతల అభ్యంతరంపై సీమాంధ్ర మంత్రుల ధ్వజం ఓటింగ్ హక్కు ఉంటుందని సీఎం, స్పీకర్ చెప్తేనే చర్చకు సిద్ధమయ్యాం అందుకు మీరూ అంగీకరించారు.. ఇప్పుడు వద్దంటూ మోకాలడ్డితే ఎలా? సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లుకు ప్రతిపాదిత సవరణలపై ఓటింగ్‌ను అంగీకరించబోమంటూ తెలంగాణ నేతలు అభ్యంతరం చెప్పడాన్ని సీమాంధ్ర నేతలు తప్పుపట్టారు. విభజనపై చర్చ జరగాలని, ఎవరెన్ని అభిప్రాయా లు చెప్పుకున్నా, సవరణలను ప్రతిపాదించినా అభ్యంతరం లేదని చెప్పిన నేతలు ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరించడమేమిటని సీమాంధ్ర మంత్రులు ప్రశ్నించారు. విభజనకు తాము వ్యతిరేకమైనప్పటికీ సవరణల పేరుతో ఓటింగ్ కోరే హక్కు సభ్యులకు ఉంటుందని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, స్పీకర్ నాదెండ్ల మనోహర్ చెప్పినందనే తాము చర్చకు సిద్ధమయ్యామని మంత్రులు శైలజానాథ్, పితాని సత్యనారాయణ తదితరులు పేర్కొన్నారు. సవరణలపై ఓటింగ్ పేరుతో విభజన బిల్లును వ్యతిరేకించవచ్చన్నదే తమ లక్ష్యమన్నారు. వైఎస్సార్సీపీ మినహా సీమాంధ్రకు చెందిన ఇతర పార్టీల సభ్యులంతా ఇదే అభిప్రాయంతో చర్చకు సిద్ధమవుతున్న తరుణంలో తెలంగాణ నేతలు సవరణలే వద్దంటూ మోకాలడ్డితే ఎలాగని ప్రశ్నించారు. తెలంగాణ నేతల తీరు చూస్తుంటే సభలో చర్చ జరగకూడదనే భావనతో ఉన్నట్లు కన్పిస్తోందని విమర్శించారు. చర్చ జరిగితే సభలో మెజారిటీ సభ్యులు విభజనకు వ్యతిరేకమని తేలిపోతుం దని, తద్వారా రాష్ట్రపతి విభజన బిల్లును పార్లమెంటుకు పంపే విషయంలో పునరాలోచించే అవకాశముందని తెలిసే చర్చకు అడ్డుపడుతున్నారని వారు ధ్వజమెత్తారు. మరోవైపు సీఎం కిరణ్ సైతం మంగళవారం తన చాంబర్లో కొందరు సీమాంధ్ర మంత్రులతో మాట్లాడుతూ అందరూ చర్చకు సహకరించాలని కోరినట్లు తెలిసిం ది. చర్చ కొనసాగితే విభజన బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు చెప్పడంతో పాటు బిల్లులోని అంశాలపై పలు సవరణలను ప్రతిపాదించి ఓటింగ్ కోరదామని ప్రతిపాదించారు. విభజనపై అభిప్రాయాలు మాత్రమే చెప్పాలని, సవరణలు, ఓటింగ్ వద్దని చెప్తున్న తెలంగాణ నేతల వ్యాఖ్యలపై స్పంది స్తూ.. ‘‘ప్రజాస్వామ్యంలో అభిప్రాయమంటే అర్థమేమిటి? వాటిని ఏ రూపంలో తీసుకుంటారు? ఓటింగ్ ద్వారానే కదా! అదే వద్దంటే ఎలా?’’ అని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలు మరుసటి రోజుకు వాయిదా పడిన అనంతరం సీఎం వెళుతూ వెళుతూ మీడియాతో మాట్లాడారు. ‘‘మేం చర్చకు నూటికి నూరుశాతం సిద్ధంగా ఉన్నాం. ఇకపై ప్రతి నిమిషాన్ని మనమంతా సద్వినియోగం చేసుకోవాలి. అందుకోసం అన్ని రాజకీయ పార్టీలు చర్చకు అంగీకరించి శాసనసభ స్పీకర్‌కు పూర్తిగా సహకరించాలి’’ అని వ్యాఖ్యానించారు. -
సమగ్రంగా లేని బిల్లుపై ఎలా చర్చిస్తాం?
స్పీకర్‌తో టీడీపీ సీమాంధ్ర ఎమ్మెల్యేలు సాక్షి, హైదరాబాద్: సమగ్రసమాచారం లేని విభజన బిల్లుపై సభలో ఎలా చర్చిస్తామంటూ టీడీపీ సీమాంధ్ర ఎమ్మెల్యేలు మంగళవారం అసెంబ్లీ స్పీకర్ మనోహర్ వద్ద అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు పి.అశోక్ గజపతిరాజు, పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, కేఈ ప్రభాకర్ తదితరులు ఆయన్ను కలిశారు. తాము రూపొందించిన బిల్లు అసమగ్రంగా ఉందని, త్వరలో పూర్తి వివరాలతో మరో బిల్లు పంపుతామని కేంద్రం రాష్ట్ర సీఎస్‌కు సమాచారమిచ్చినట్లు వార్తలొచ్చాయని, అందు వల్ల బిల్లును వెనక్కు పంపాలని కోరారు. ఒకవేళ చర్చకు చేపడితే సమగ్రత లోపంపై రూలింగ్ కోరతామన్నారు. దీనిపై ప్రభుత్వంతో చర్చిస్తానని స్పీకర్ చెప్పారు. కాగా కేంద్రం రూపొందించిన బిల్లుకు సవరణలు చేసే అధికారం సీఎంకు లేదని, తాను సమైక్యవాదినని చెప్పుకునేందుకు సవరణల పేరిట సభను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ టీ టీడీపీ ఎమ్మెల్యేలు ఆర్.ప్రకాశ్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి తదితరులు స్పీకర్‌కు లేఖ రాశారు. టీఆర్ ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలూ ఇదే విషయమై స్పీకర్‌కు లేఖలు రాశారు.