
మీ ప్రాంతం.. మీ ఇష్టం: చంద్రబాబు
ఎవరి వాదన వారు వినిపించుకోండి
విభజనపై చేతులెత్తేసిన చంద్రబాబు
అడ్డుకొంటామన్న సీమాంధ్ర నేతలు
లేఖకు కట్టుబడి ఉండాలన్న టీ టీడీపీ
అసెంబ్లీలో తెలంగాణ బిల్లు చర్చకు వచ్చినప్పుడు ఎవరి వాదన వారు వినిపించుకోవచ్చునని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ ఇరు ప్రాంతాల నేతలకు సూచించారు. అంతేగానీ పార్టీని ఇరుకున పెట్టే పరిస్థితులు తీసుకురావద్దన్నారు. దీంతో ఇరుప్రాంతాల నేతలూ అధినేత తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు నివాసంలో బుధవారం టీడీఎల్పీ వ్యూహ కమిటీ సమావేశమైంది. తెలంగాణ, సీమాంధ్ర నేతలు తమ వాదనలతో పరోక్షంగా బాబు వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర విభజనపై స్పష్టమైన విధానం, వైఖరి లేకపోవడంతో టీడీపీ ఇరు ప్రాంతాల్లో రెంటికి చెడ్డ రేవడిలా తయారైందని ఆ నేతలు అభిప్రాయపడ్డారు. ‘పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామన్న భావన కలగడంలేదు. అలాగని సమైక్యాంధ్ర కోసం మాట్లాడుతున్నామా అంటే అదీ లేదు. ఇలాగైతే ప్రజల్లోకి ఎలా వెళ్తాం?’ అని వారు నేరుగా పార్టీ అధినేత చంద్రబాబు ముందు ప్రశ్నల వర్షం కురిపించారు.
‘సమైక్య ఉద్యమం తీవ్రంగా సాగుతోంది కనుక మేమూ సమైక్య వాదన వినిపిస్తాం. అసెంబ్లీలో మిగిలిన పార్టీలకు ఆ అవకాశం ఇవ్వకుండా సభను అడ్డుకుని, వెల్‌లోకి వెళ్తాం’ అని పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్ర ప్రతిపాదించగా, ఎర్రబెల్లి, మోత్కుపల్లి అభ్యంతరం తెలిపారు. అయినా సభను అడ్డుకుని తీరతామని సీమాంధ్ర నేతలు తెగేసి చెప్పారు. దీంతో తాము తమ వాదన వినిపిస్తామని తెలంగాణ నేతలు అన్నారు.బాబు జోక్యం చేసుకుని.. పార్టీని ఎట్టిపరిస్థితుల్లోనూ ఇబ్బందిపెట్టవద్దని ఇరుప్రాంత నేతలకు సూచించారు. ఈ సందర్భంగా తెలంగాణ నేతలపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. 2008లో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా పార్టీకి అనుకున్నంత ప్రయోజనం చేకూర్చలేకపోయారన్నారు. దీనికి ఎర్రబెల్లి అడ్డుతగిలి.. ఆ నిర్ణయం తర్వాత ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకుని ఇప్పుడిలా మాట్లాడం సరికాదని అన్నట్లు సమాచారం. కాగా, పార్లమెంటులో కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాన నోటీసుపై పార్టీ సీమాంధ్ర ఎంపీలు మాత్రమే సంతకాలు చేయడమేంటని, పార్లమెంటరీపక్ష నాయకుడు ఏమయ్యాడని మరికొందరు నేతలు ప్రశ్నించారు.