హైదరాబాద్ : జీవోఎం సూచించిన 11 అంశాలపై రాష్ట్ర కాంగ్రెస్ ఇచ్చే నివేదికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నివేదిక సమర్పణకు ఈ రోజే తుదిగడువు కావడంతో తెలంగాణ మంత్రులు ఈరోజు మధ్యాహ్నం పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు తమ నివేదికను అందచేయనున్నారు. జీవోఎం సూచించిన 11 అంశాలపై తెలంగాణ మంత్రుల నివేదికను వారు సిద్ధం చేశారు.
తెలంగాణ మంత్రులు సోమవారం ఇదే అంశంపై బొత్స, డిప్యూటీ సీఎం దామోదర నివాసంలోనూ వారితో సమావేశమై నివేదిక రూపకల్పనపై కసరత్తు చేశారు. మరోవైపు సీఎం క్యాంప్ ఆఫీస్‌లో సీమాంధ్ర మంత్రులు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల సమావేశంలో జీవోఎంకు నివేదికను ఇచ్చేది లేదని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే తమ ఎజెండా అని తీర్మానం చేశారు.
ఈ నేపథ్యంలో ఇరు ప్రాంత కాంగ్రెస్ నేతల అభిప్రాయాలను పొందుపరుస్తూ జీవోఎంకు పిసిసి నివేదిక ఇవ్వచ్చనేది రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతల అంచనా. కాగా ఇదే విషయమై రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ జీవోఎంకు నివేదిక ఇస్తామని మంత్రి శైలజానాథ్ స్పష్టం చేశారు. సమైక్యం తప్ప మరో ప్రత్యామ్నాయం తమకొద్దని ఆయన అన్నారు. చంద్రబాబుకు ఏ విషయంలోనూ స్పష్టత లేదని శైలజానాథ్ అన్నారు.
జీవోఎంకు రాష్ట్ర కాంగ్రెస్ నివేదికపై సర్వత్రా ఆసక్తి
Published Tue, Nov 5 2013 2:29 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement