అసెంబ్లీలో చర్చ జరగాల్సిందే
టీ బిల్లుపై సీమాంధ్ర ప్రజాప్రతినిధులు
ముగిసిన సీమాంధ్ర ఎంపీల సంకల్ప దీక్ష
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగాల్సిందేనని పలువురు సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు స్పష్టంచేశారు. చర్చ జరగకుండా కొంతమంది ఎమ్మెల్యేలు అడ్డుకోవడం దురదృష్టకరమన్నారు. సీమాంధ్ర ఎంపీలు లగడపాటి రాజగోపాల్, హర్షకుమార్, సబ్బం హరి, రాయపాటి సాంబశివరావులు ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో చేపట్టిన సంకల్ప దీక్ష శనివారం ముగిసింది. ఈ దీక్షలను విరమింపజేసేందుకు సమైక్యాంధ్ర ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్, మంత్రి శైలజానాథ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర విభజనను నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ సంకల్ప దీక్ష చేస్తున్న ఎంపీలకు తెలుగు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. తామంతా రాష్ట్రం కలిసి ఉండేందుకు చివరి వరకూ ప్రయత్నం చేస్తామని చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఎంపీలు పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం తమకు స్ఫూర్తినిచ్చినట్లు ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షులు అశోక్‌బాబు తెలిపారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కూడా అదే పని చేయాలని సూచించారు. అయితే సంకల్ప దీక్ష పేరుతో రెండు రోజుల పాటు దీక్ష చేపట్టిన ఎంపీలు లగడపాటి రాజగోపాల్, హర్షగోపాల్, సబ్బం హరిలు అసలు ప్రసంగించకపోవడం విశేషం. కాగా, సంకల్పదీక్షకు రెండోరోజు శనివారంకూడా తెలంగాణవాదులనుంచి నిరసన ఎదురైంది. ఇందిరాపార్కు చౌరస్తా నుంచి సంకల్ప దీక్ష జరిగే ధర్నా చౌక్ వైపుకు దూసుకెళ్లేందుకు కొందరు తెలంగాణవాదులు ప్రయత్నించారు. అలాగే దీక్ష విరమణకోసం ఎంపీ హర్షకుమార్‌కు శైలజానాధ్ నిమ్మరసం ఇచ్చిన సమయంలో నలుగురు తెలంగాణవాదులు వేదిక ముందునుంచి ఒక్కసారిగా జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. ఈ హడావుడిలో హర్షకుమార్‌తోపాటు మిగతా ఎంపీలు కూడా నిమ్మరసం తాగకుండానే దీక్ష ముగించారు.