అసెంబ్లీకి వస్తున్నా.. జనవరిలో చర్చ
జరిగేలా చూస్తానన్న ముఖ్యమంత్రి
వచ్చిన తరువాత బిల్లుపై
చర్చ కొనసాగింపునకు అంగీకారం
అడ్డుకోవద్దని సీమాంధ్ర సభ్యులకు హితవు
ఓటింగ్ అంటూ మరోసారీ అదే వాదన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కీలక సమయంలో అనారోగ్యం కారణంతో సభకు రాని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం శాసనసభకు హాజరై బిల్లుపై చర్చకు పచ్చజెండా ఊపారు. ఆయన సభకు రావడం ద్వారా విభజన బిల్లుకు వ్యతిరేకంగా ఏదో అయిపోతుందనుకున్న సీమాంధ్ర నేతలు సీఎం చర్చను కొనసాగించడానికి అంగీకరించడంతో ఉస్సూరన్నారు. సోమవారం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు సభకు గైర్హాజరైన సంగతి తెలిసిందే. ఈ సమయంలో అసెంబ్లీని తమ అధీనంలోకి తెచ్చుకున్న డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఇతర తెలంగాణ నేతలు విభజన బిల్లుపై చర్చను ప్రారంభించినంత పని చేశారు.
బీఏసీలో నిర్ణయించకుండా బిల్లుపై చర్చ ప్రారంభం కాదని, అది నిబంధనలకు విరుద్ధమని సీమాంధ్ర మంత్రులు చెప్పారు. ఆ మంత్రులతో భేటీ సందర్భంగా సీఎం కిరణ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం బీఏసీ సమావేశానికి వచ్చి చర్చ తేదీని నిర్ణయిస్తామని, జనవరిలో తెలంగాణ బిల్లుపై చర్చ ప్రారంభమయ్యేలా చేస్తామని వారితో చెప్పారు. కానీ మంగళవారం అసెంబ్లీకి హాజరైన సీఎం విభజన బిల్లుకు అనుకూలంగా వ్యవహరించారు. బీఏసీ సమావేశంలో బిల్లుపై చర్చకు కొత్త తేదీని నిర్ణయిస్తామని చెప్పిన ఆయన సోమవారమే చర్చ ప్రారంభ మైందన్న తెలంగాణ నేతల వాదనకు తలూపారు. పైగా ఆ చర్చను బుధవారం నుంచి కొనసాగించేలా మార్గం సుగమం చేశారు. సభలో మాదిరిగానే బీఏసీ సమావేశంలో కూడా సీఎం విభజన బిల్లుకు వ్యతిరేకంగా ఒక్కమాటా మాట్లాడలేదు. పైగా ‘దీనిపై పూర్తి చర్చ జరగాలి. అన్ని పార్టీల సభ్యులు అంశాలవారీగా మాట్లాడాలి. సీమాంధ్ర ప్రాంతంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కనుక వారంతా తమ అభిప్రాయాలు చెబుతారు. తెలంగాణనేతలు కూడా వారి అభిప్రాయాలు చెబుతారు. చర్చ స్వేచ్ఛతో సాగుతుంది’ అన్నారు.
బీఏసీ సమావేశంలో బిల్లులోని లోపాల గురించి సీఎం ఎత్తిచూపిస్తారని భావించిన నేతలు ఆయన మాట తీరుతో విస్తుపోయారు. సీఎం అలా మాట్లాడటంతో సీమాంధ్ర మంత్రులు సైతం మౌనం వహించారు. అంశాలపై చర్చ సందర్భంలో ఓటింగ్ అడిగేందుకు అవకాశముందని ముఖ్యమంత్రి పేర్కొన్నా.. ఇతర రాష్ట్రాల్లో విభజన ప్రక్రియ ఎలా సాగిందో ఆ నియమాలు, నిబంధనల ప్రకారమే ముందుకు వెళ్తామని స్పీకర్ నాదెండ్ల మనోహర్ స్పష్టంచేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంలో హోం శాఖ కార్యదర్శి ఇచ్చిన నోట్ గురించి సీఎం చెప్పిన అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుతోపాటు రాష్ట్రపతి చేసిన సూచనలను అనుసరించే సభలో చర్చ సాగుతుంది తప్పించి వేరేగా హోం శాఖ ఇచ్చే లేఖలు పరిగణనలోకి రావని అసెంబ్లీ వర్గాలు పేర్కొంటున్నాయి.
తెలంగాణ నేతలకు సీఎం హామీ
ఇదిలా ఉండగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని తెలంగాణ నేతలు మంగళవారం అసెంబ్లీలోని ఆయన చాంబర్లో కలిశారు. విభజన బిల్లుపై చర్చ అంతా నిబంధనల ప్రకారమే సాగుతుందని సీఎం వారికి భరోసా ఇచ్చారు. మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సారయ్య, పొన్నాల లక్ష్మయ్య, డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు సీఎంను కలసి బిల్లుపై చర్చ కొనసాగించేలా చూడాలని, దాన్ని త్వరితంగా పూర్తిచేసి కేంద్రానికి పంపించాలని ముఖ్యమంత్రిని కోరారు. తాను విభజన బిల్లును అడ్డుకోబోనని, ఆ విభజన వల్ల తలెత్తే సమస్యలపై సభలో అన్ని పార్టీల సభ్యులూ కూలంకషంగా చర్చించాల్సిన అవసరముందని సీఎం వారికి చెప్పారు. సీఎం చాలా సానుకూలంగా స్పందించారని ఆయన్ను కలసి వచ్చిన మంత్రులు పేర్కొన్నారు.
పక్కా ప్లానేశారు..
Published Wed, Dec 18 2013 2:15 AM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM
Advertisement
Advertisement