* కిరణ్ పార్టీపై ధ్వజమెత్తిన చంద్రబాబు
* సీఎంగా విభజన అడ్డుకోలేని ఆయన పార్టీ పెట్టి ఏం ఉద్ధరిస్తారు?
* రాష్ట్రాన్ని ముక్కలుచేసి ఇప్పుడు రాజధాని పేరుతో ప్రజల్లో కాంగ్రెస్ చిచ్చు
* తెదేపా అధికారంలోకి వస్తే మేమే రాజధానిని ఎంపికచేస్తాం
* విశాఖలో గర్జించని ‘ప్రజా గర్జన’
సాక్షి, విశాఖపట్నం: ‘‘కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఏం ఉద్ధరించలేదు. విభజనపై కనీసం పోరాడలేదు. ఏ న్యాయం చేయలేదు. అసలేం మేలు చేశావని ఇప్పుడు పార్టీ పెడుతున్నావ్? ముఖ్యమంత్రిగా ఏమీ చేయలేని నీవు పార్టీ పెట్టి ప్రజలకు ఏం చేయగలవ్? ప్రజలపై ప్రేమతోకాదు... ఏదోలా ఓట్ల కోసమే పార్టీ పెడుతున్నావ్... నీ పార్టీ పేరు కిరికిరి పార్టీ అని పెట్టుకుంటే మేలు’’ అంటూ కిరణ్‌పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.
రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి మళ్లీ ఇప్పుడు రాజధాని పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కాంగ్రెస్‌పార్టీ విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తోందని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్‌ను నిలువునా చీల్చిన సోనియా, రాహుల్ విభజనపై ఏం మాట్లాడకపోయినా, వారి బంట్రోతులు దిగ్విజయ్‌సింగ్, జైరాం రమేష్‌లు మాత్రం ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
బుధవారం విశాఖనగరంలో తెదేపా ఇందిరాప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ఆరవ ప్రజాగర్జన సభలో బాబు ప్రసంగించారు. ప్రజలను నిలువునా వంచిస్తోన్న పదితలల కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. విభజన తర్వాత సీమాంధ్రను అభివృద్ధిచేయగల సత్తా ఒక్క టీడీపీకి మాత్రమే ఉందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక సీమాంధ్రకు రాజధానిని తానే ఎంపికచేస్తానని చెప్పారు. విశాఖను ఆర్థిక రాజధానిలా తీర్చిదిద్దుతానన్నారు. ఐవీఆర్‌ఎస్ విధానం ద్వారా కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకున్నాకే అభ్యర్థులను ఎంపికచేస్తానన్నారు. పార్టీని బలోపేతం చేయడానికే కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతలను చేర్చుకుంటున్నామని, దీనిపై నాయకుల్లో భేదాభిప్రాయాలు వద్దని చెప్పారు.
గర్జించని గర్జన: తెదేపా విశాఖలో తలపెట్టిన ప్రజాగర్జన విశాఖలో దాదాపుగా విఫలమైంది. లక్ష మంది వస్తారని నేతలు ఊదరగొట్టినా 30 వేల మందికి మించలేదు. చంద్రబాబు 7.48 గంటలకు ప్రసంగం ప్రారంభించి 9.12 గంటల వరకు సుదీర్ఘ ప్రసంగం చేయడం, చెప్పిందే చెప్పడంతో జనం విసుగెత్తి బయటకు వెళ్లిపోయారు. దీంతో 8.30కి సభాప్రాంగణం సగానికిపైగా ఖాళీ అయిపోయింది.
చంద్రబాబుపై అయ్యన్న గర్జన
టీడీపీలో విభేదాలు అధినేత చంద్రబాబుకే చెమటలు పట్టిం చాయి. కాంగ్రెస్‌నుంచి వచ్చిన గంటాను పార్టీలో చేర్చుకోవడాన్ని మొదటినుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ప్రజాగర్జన సభలో విరుచుకుపడ్డారు. గంటా సహా నలుగురు ఎమ్మెల్యేలు కన్నబాబురాజు, అవంతి శ్రీనివాస్, పంచకర్ల రమేష్, చింతలపూడి వెంకట్రామయ్య, విశాఖ నగర మాజీ మేయర్ రాజాన ర మణి తదితరులు టీడీపీలో చేరారు. వీరికి బాబు కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం అయ్యన్న ప్రసంగిస్తూ... ‘‘ఇవాళ టీడీపీలోకి కొందరు వచ్చారు. వాళ్లు ఎంతకాలం ఉంటారో పోతారో తెలియదు. మనం మాత్రం పార్టీలోనే కొనసాగుదాం’’ అంటూ ఎద్దేవా చేశారు. దీంతో ఒక్కసారిగా బాబు అవాక్కయ్యారు. అయ్యన్న తనను ఉద్దేశించి తీవ్రవ్యాఖ్యలు చేయడంతో గంటా సీటులోంచి లేచి గరికపాటిని పక్కకు తీసుకెళ్లి మాట్లాడారు. గరికపాటి ఓదార్చే ప్రయత్నంచేసినా ఆయన వినలేదు.
ఇంతలో అయ్యన్న తన ప్రసంగాన్ని ముగిస్తూ... పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఒక్క మాట అంటూ బాబును ఉద్దేశించి... కొత్తగా వచ్చిన నేతలు ఇకనైనా పార్టీలో బుద్ధిగా పనిచేస్తే పార్టీకి మంచిదంటూ మరోసారి విరుచుకుపడ్డారు. ఆ తర్వాత తన కొడుకుతో సహా వేదిక దిగి విసురుగా వెళ్లిపోయారు. బాబు బుధవారం నగరంలోకి వచ్చిన వెంటనే అయ్యన్నను బుజ్జగించే ప్రయత్నంచేశారు. సభకు బయలుదేరేముందు వాహనంలో పక్కన నిల్చోబెట్టుకుని సభప్రాంగణం వద్దకు ర్యాలీగా వచ్చారు. కానీ అయ్యన్న మాత్రం గంటా విషయంలో బాబుకు ఝలక్ ఇవ్వడం విశేషం.