కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబుల తీరుపై సర్వత్రా విస్మయం
సాక్షి, హైదరాబాద్: ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ - టీడీపీలు.. అటు కేంద్రంలో కాంగ్రెస్ - బీజేపీలు.. రెండు చోట్లా అధికార ప్రతిపక్షాలు బాహాటంగా కుమ్మక్కై రాష్ట్రాన్ని నిలువునా విభజిస్తుంటే.. ఆ విభజనకు ముఖ్యమంత్రి హోదాలో ఆసాంతం సహకరించిన కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబునాయుడులు.. తమ తప్పుల నుంచి తప్పించుకోవటానికి అత్యంత హేయమైన నిందా రాజకీయాలకు పాల్పడుతున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లూ ముఖ్యమంత్రి పదవిలో ఉండి.. సోనియాగాంధీ చెప్పినట్టల్లా విని.. విభజన ప్రక్రియ పూర్తయేందుకు కావలసిన సహకారమంతా ఇచ్చి.. చివరి నిమిషంలో రాజీనామా చేసిన కిరణ్.. కాంగ్రెస్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయిందని, సోనియాగాంధీతో ఆ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి అవగాహన కుదిరిందని, తద్వారా విభజనకు జగన్ ప్రధాన కారకులయ్యారని గత కొంత కాలంగా ఆరోపణలు చేయటం నిందా రాజకీయాలు ఏ స్థాయికి పతనమయ్యాయో అద్దంపడుతోందని కాంగ్రెస్ నేతలే ముక్కున వేలేసుకుంటున్నారు.
విభజన ప్రక్రియ విషయంలో సోనియా చెప్పినట్లు వింటూ అన్నీ దగ్గరుండి పూర్తిచేసిన కిరణ్.. ఇప్పుడు ఆ నిందను ఏ సంబంధంలేని జగన్‌పై నెట్టటానికి ప్రయత్నించటమేమిటని విస్తుపోతున్నారు. అలాగే.. బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నామంటూ టీడీపీ, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు బాహాటంగా ప్రకటించుకుంటే.. అదే బీజేపీతో జగన్‌మోహన్‌రెడ్డి కుమ్మక్కయ్యారని.. విభజన జరిగేందుకు కారకులయ్యారని టీడీపీ ఎంపీ సి.ఎం.రమేష్ విమర్శించటం నిందా రాజకీయాలు ఎంతటి జుగుప్సాకరంగా దిగజారాయో తెలుస్తోందని ఆ పార్టీ నేతలు సైతం ఈసడిస్తున్నారు.
ఆది నుంచీ రాష్ట్ర విభజనను అకుంఠిత పట్టుదలతో వ్యతిరేకిస్తూ.. దానిని నిలువరించేందుకు కృషి చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల్లో రోజు రోజుకూ పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక.. ఆయనపై దుష్ర్పచారం కోసమే ఈ అడ్డగోలు విమర్శలకు దిగుతున్నారన్నది తేటతెల్లమని రాజ కీయ పరిశీలకులు స్పష్టంచేస్తున్నారు. రాష్ట్ర విభజనలో ఎవరి పాత్ర ఏమిటనేది ఈ సందర్భంగా వారు గుర్తుచేస్తున్నారు.
కిరణ్ తన మాటల్లోనే చెప్పారు కదా...
రాష్ట్ర విభజనకు సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న రోజునే తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నానని, కానీ సోనియాగాంధీ వారించినందు వల్ల సీఎంగా కొనసాగానని కిరణ్ తాజాగా స్వయంగా వెల్లడించారు కదా! సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న రోజే కిరణ్ సీఎం పదవికి రాజీనామా చేసి ఉన్నట్లయితే.. పరిస్థితి ఇంతవరకూ రాకుండా ఆగిపోయేది. అప్పుడలా ఎందుకు చేయలేకపోయారు? విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె పతాక స్థాయికి వెళ్లిన దశలో.. కాంగ్రెస్ అధిష్టానం సూచనల మేరకు ఆ ఉద్యమాన్ని నీరుగార్చి.. కేంద్రంపై ఒత్తిడి లేకుండా మార్గం సుగమం చేసింది కిరణ్ కాదా? సీఎం కుర్చీలో కూర్చుని.. పరిపాలనా వ్యవహారాలను, ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి.. ప్రభుత్వ యంత్రాంగాన్నంతా రాష్ట్ర విభజనకు అవసరమైన కార్యక్రమాలు, కసరత్తులో నిమగ్నం చేసి.. ఆగమేఘాల మీద ఆ పనులు పూర్తిచేయించింది కిరణ్ కాదా?
విభజన బిల్లు అసెంబ్లీకి వస్తుందనగా.. శాసనసభలో ముందుగానే సమైక్య తీర్మానం చేయకుండా, పోనీ బిల్లు వచ్చిన వెంటనే అయినా దానిని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయకుండా అడ్డుకుని.. బిల్లుపై చర్చను పూర్తిచేయించి పంపించింది కిరణ్ కాదా? విభజనకు కావలసినవన్నీ పూర్తిచేసి.. బిల్లు లోక్‌సభ ఆమోదం కూడా పొందిన తర్వాత.. ఇక మరికొన్ని రోజుల్లో ఎన్నికల షెడ్యూలు వస్తుందనగా.. విభజనకు నిరసనగా సీఎం పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించటం ఎవరిని మభ్యపెట్టటం కోసం? విభజనకు చేయాల్సిందంతా చేసేసి.. అదే విభజనను నిక్కచ్చిగా వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న జగన్‌మోహన్‌రెడ్డిపైనే ఎదురు దాడికి దిగుతూ నిందలు వేయటం ఎలాంటి రాజకీయం? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
సస్పెండ్ చేయించి.. సహకరించింది ఎవరు బాబూ?
రెండు కళ్ల సిద్ధాంతం అంటూ ఇటు అసెంబ్లీలో స్వయంగా కూర్చుని ఇరు ప్రాంతాల నేతలనూ రెచ్చగొట్టింది.. అటు పార్లమెంటులో కూడా ఇరు ప్రాంతాలకు చెందిన తన పార్టీ నేతలకు స్క్రిప్టు ఇచ్చి పరస్పరం గొడవలకు దిగేలా చేసింది టీడీపీ అధినేత చంద్రబాబు కాదా? లోక్‌సభలో చంద్రబాబు స్క్రిప్టు ప్రకారమే పరస్పరం కలబడి పరిస్థితిని సస్పెన్షన్ వరకూ తెచ్చింది టీడీపీ సభ్యులు కాదా? ఏకంగా 15 మంది సీమాంధ్ర ఎంపీలను సభనుంచి సస్పెండ్ చేయించి.. బిల్లు ఆమోదానికి మార్గం సుగమం చేసింది వాళ్లు కాదా?
బీజేపీతో పొత్తు కోసం తాము ప్రయత్నిస్తున్నామని.. ఎన్‌డీఏ కన్వీనర్‌గా బాబు మళ్లీ చక్రం తిప్పనున్నారని బాహాటంగా ప్రచారం చేసుకున్న టీడీపీ.. ఇప్పుడు అదే బీజేపీతో జగన్ కుమ్మక్కు అయ్యారనటం ఎలాంటి రాజకీయం? రాష్ట్ర విభజన బిల్లును అడ్డుకునేందుకు జాతీయ స్థాయిలో విపక్షాల మద్దతును కూడగట్టేందుకు అన్ని పార్టీల నాయకులనూ కలుస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి.. అందులో భాగంగానే ప్రధాన ప్రతిపక్షం బీజేపీ సీనియర్ నేతలనూ కలిశారన్నది ఎవరికి తెలియనిది?
లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్‌ను జగన్‌మోహన్‌రెడ్డి కలవటాన్ని తప్పుపడుతున్న టీడీపీ నేతలు.. ఒకవేళ ఆమెను జగన్ కలవకుండా ఉన్నా అంతకంటే ఎక్కువగా తప్పుపట్టేవారు కాదా? అసలు టీడీపీయే కొంత కాలంగా బీజేపీతో అంటకాగుతోంది. ఇప్పుడు అదే బీజేపీ విభజన బిల్లుకు మద్దతు ఇచ్చింది. ఇది టీడీపీ ప్రమేయంతోనేనా? విభజనను అడ్డుకునేందుకు నిజాయితీగా అవిశ్రాంతంగా పోరాడుతున్న జగన్‌కు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జనాదరణ పెరుగుతుండటం చూసి ఓర్వలేకనే.. ఇలాంటి నిందా రాజకీయాలకు పాల్పడటం నిజం కాదా? అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
ఇవేం నిందా రాజకీయాలు!
Published Thu, Feb 20 2014 2:30 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement