బాబు లేఖలు.. కిరణ్ లెక్కలు...హై డ్రామా! | Chandrababu, Kiran Kumar Reddy fixing in Bifurcation conspiracy | Sakshi
Sakshi News home page

బాబు లేఖలు.. కిరణ్ లెక్కలు...హై డ్రామా!

Published Sat, Aug 10 2013 1:36 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

బాబు లేఖలు.. కిరణ్ లెక్కలు...హై డ్రామా! - Sakshi

బాబు లేఖలు.. కిరణ్ లెక్కలు...హై డ్రామా!

రాష్ట్ర ప్రజల్లో రగులుతున్న ఆవేశకావేశాలు, ఉద్యమాలు, ఆకాంక్షల సమస్యను పక్కదారి పట్టించటానికి అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలు మళ్లీ కుమ్మక్కయ్యాయి. రాష్ట్రంలో ఆందోళనలు, ఉద్యమాలకు మూల కారణమైన ఆ రెండు పార్టీలే ఇప్పుడు మొసలికన్నీళ్లు కారుస్తూ సరికొత్త డ్రామా మొదలుపెట్టాయి. తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయం తీసుకోబోతోందని ముందుగానే తెలిసిన సమయంలోగానీ... సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకటించిన తర్వాత గానీ... లేదా గత పది రోజులుగా సీమాంధ్రలో ఉవ్వెత్తున ఉద్యమం ఎగసిపడుతున్న సమయంలోగానీ... తమకేమాత్రం సంబంధం లేనట్టు ప్రేక్షక పాత్ర పోషించిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. ఒకరి తర్వాత ఒకరు ఒక్కసారిగా రాష్ట్ర ప్రజలపై ప్రేమ ఒలకబోయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఈ సమస్య రాకుండా ఇరు ప్రాంతాల ప్రజలకు అన్యాయం జరక్కుండా.. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపేలా కాంగ్రెస్ నాయకత్వాన్నీ కేంద్ర ప్రభుత్వాన్నీ ఒప్పించే స్థాయిలో ఉన్న ఈ ఇద్దరు నేతలు అప్పుడేమీ మాట్లాడకుండా.. సీమాంధ్రలో ఉద్యమం తీవ్రతరమైన నేపథ్యంలో మరో కొత్త నాటకానికి తెరతీశారు. ఇదంతా కాంగ్రెస్ హైకమాండ్ కనుసన్నల్లో ఒక పథకం ప్రకారం జరుగుతోందని ఆ పార్టీల్లోనే వినిపిస్తోంది. ఇరు ప్రాంతాల్లో రాజకీయంగా దెబ్బతినడంతో ఇప్పుడు సమస్యలకు పరిష్కారం చెప్పకుండా విభజన ఎలా చేస్తారంటూ కొత్త రకం డ్రామా మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. 
 
 వారిద్దరికీ ముందు నుంచి అంతా తెలుసు...
 తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోబోతున్న విషయం ముఖ్యమంత్రి కిరణ్‌కు ముందుగానే తెలుసు. ఈ విషయం టీడీపీ అధినేత చంద్రబాబుకూ తెలుసన్న విషయం హిందుస్థాన్ టైమ్స్ సైతం స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతుందని, దీనికి మూల కారణం తమ రెండు పార్టీలే అని తెలిసినా ఇంతకాలం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి ఇప్పుడు తమ రాజకీయ ప్రయోజనాల కోసం రెండు పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని సరికొత్త డ్రామాను మొదలుపెట్టినట్టు స్పష్టంగా తెలుస్తోంది. జూలై 30 న సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకటించిన తర్వాత సీమాంధ్రలో తీవ్ర నిరసన వ్యక్తం కావడమే కాకుండా ప్రజల్లో ఉవ్వెత్తున ఉద్యమం ఎగసిపడింది. ఈ పరిస్థితుల్లో పార్టీలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒకవైపు రాజీనామాలని.. మరోవైపు సోనియాగాంధీని కలిసి తామేదో అడ్డుకుంటున్నామని హైడ్రామా నడపడం కొంతకాలంగా సర్వసాధారణంగా మారింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు సైతం పార్టీకి చెందిన సీమాంధ్ర నేతలను ఉద్యమాల్లో పాల్గొనాలంటూ తెరవెనుక కథ నడపడం తెలిసిందే. సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువడిన తర్వాత ఇటు కిరణ్‌కుమార్‌రెడ్డిగానీ, అటు చంద్రబాబుగానీ గత పది రోజులుగా బహిరంగ వ్యాఖ్యలేవీ చేయలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరెళ్లి అడిగినా పట్టించుకోని ముఖ్యమంత్రి తొమ్మిది రోజుల తర్వాత ఒక్కసారిగా నిద్రలేచి సమస్యలను పరిష్కరించకుండా విభజన ఎలా చేస్తారంటూ విలేకరుల సమావేశం పెట్టి మరీ చెప్పారు. అది జరిగి 24 గంటలు తిరక్కముందే చంద్రబాబు మౌనముద్ర వీడి సీమాంధ్ర ప్రజలపై ప్రేమను ఒలకబోస్తూ ప్రధానమంత్రికి లేఖ రాశారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను, రాష్ట్రం విభజిస్తే ఎదురయ్యే సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్ర విభజన చేయకుండా అడ్డుపడే స్థాయిలో ఉన్న ఈ నేతలే అంతా జరిగి సీమాంధ్రలో ప్రజలు తీవ్రస్థాయిలో ఉద్యమబాట పట్టిన తర్వాత.. అదికూడా వారంతా రోడ్లపై ఉద్యమాలు చేస్తున్న పది రోజులకు నోరు విప్పటం.. అంతా ఒక పథకం ప్రకారం జరుగుతున్న వ్యవహారంగా స్పష్టమవుతోంది. 
 
 ఇన్నేళ్లుగా ‘విభజన’ సమస్యలు తెలీదా?
 రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశంపై 2008లో టీడీపీ పొలిట్‌బ్యూరో తీర్మానం చేసినప్పుడుగానీ, ఆ తర్వాత ప్రణబ్‌ముఖర్జీ కమిటీకి లేఖ అందించినప్పుడుగానీ మహానాడులో తీర్మానం చేసిన సందర్భంలోగానీ, తెలంగాణ అంశాన్ని సాధ్యమైనంత తొందరగా పరిష్కరించాలని కోరుతూ గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రధానమంత్రికి రాసిన లేఖలోగానీ ఎక్కడా సీమాంధ్ర ప్రజల సమస్యలనూ రాష్ట్రం విభజిస్తే ఉత్పన్నమయ్యే సమస్యలనూ పరిష్కారాల గురించి ఒక్కమాట మాట్లాడని చంద్రబాబు ఉన్నట్టుండి శుక్రవారం ప్రధానమంత్రికి రాసిన లేఖలో సీమాంధ్ర సమస్యలను లేవనెత్తడం ఆ పార్టీ నేతలనే ఆశ్చర్యానికి గురిచేసింది. అది కూడా సీఎం కిరణ్ మాట్లాడిన మరుసటి రోజు ఆయన అవే సమస్యలను ప్రస్తావిస్తూ ప్రధానికి లేఖ రాయడం రాజకీయవర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. రాజకీయంగా ఇరు ప్రాంతాల్లో మనుగడ ప్రశ్నార్థకంగా కావడంతో ఇప్పుడు ఇరు పార్టీలు కలిసి కుమ్మక్కయి ఈ కొత్త డ్రామాను మొదలుపెట్టినట్టు ఆ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సోనియాగాంధీని కలిసినప్పుడు, కోర్ కమిటీ ముందు హాజరైనప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ ఇవే విషయాలను చెప్పానని ఆ రోజే చెప్పకుండా సీమాంధ్ర ఉద్యమం తీవ్రతరమైన నేపథ్యంలో నోరు విప్పడం, అలా చెబుతూనే పరిష్కారం చూపలేని పార్టీలోనూ పదవిలోనూ ఉండే విషయం చెప్పకుండా దాటవేయడం, అదే వాదనను 24 గంటల్లోనే చంద్రబాబు ఎత్తుకోవడం.. అంతా ఒక పథకం ప్రకారం జరుగుతున్నదేనని ఆ వర్గాలు చెబుతున్నాయి. 
 
 పథకం ప్రకారమే వైఎస్ పేరు తెరపైకి
 సీమాంధ్రలో పెద్దఎత్తున ఉద్యమం ప్రారంభమైన పరిస్థితుల్లో కాంగ్రెస్, టీడీపీల రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంగా మారటంతో.. ఆ రెండు పార్టీలూ దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డిని టార్గెట్ చేస్తూ కొత్త డ్రామా మొదలుపెట్టాయి. ఇరు ప్రాంతాల మనోభావాలను దెబ్బతీసే విధంగా నిర్ణయాలు చేసిన కాంగ్రెస్, అలా చేయడానికి అవకాశమిచ్చిన టీడీపీలే.. ఇప్పుడు కుమ్మక్కై అదే అంశాన్ని పక్కదారి పట్టించటానికి ఒక పథకం ప్రకారం వైఎస్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. మారిన పరిస్థితుల్లో ఆ రెండు పార్టీలు విశ్వసనీయత కోల్పోగా.. బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలన్న లక్ష్యంతో ఈ కొత్త కుమ్మక్కు డ్రామాను మొదలుపెట్టినట్లు ఇట్టే అవగతమవుతోంది. పైగా ఇదంతా కాంగ్రెస్ అధిష్టానం కనుసన్నల్లోనే సాగుతోందన్న విషయం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ మాటల్లో స్పష్టమవుతోంది. తెలంగాణ విభజన అంశంపై ముందుగానే స్పష్టమైన సమాచారం ఉన్నప్పటికీ ఇంతకాలం ఏమీ మాట్లాడకుండా తొమ్మిది రోజుల తర్వాత స్పందించిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం తొలిసారి మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ను వివాదంలోకి లాగాలని ప్రయత్నించారు. అది జరిగిన 24 గంటలకే ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ నేత చంద్రబాబు స్పందిస్తూ కిరణ్ మాట్లాడిన కోణంలోనే పలు అంశాలను ప్రస్తావిస్తూ ప్రధానమంత్రికి లేఖ రాశారు. 
 
 మాట మార్చింది వైఎస్ కాదు.. ఇప్పటి నేతలే...
 నిజానికి సీఎల్పీ నాయకుడిగా, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా వైఎస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత 2009లో రోశయ్య నేతృత్వంలో కమిటీ వేసేంతవరకు అనేక సందర్భాల్లో తెలంగాణ అంశంపై విడమరిచి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ సీఎల్పీ నేతగా ఉన్న సమయంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అనుసరిస్తున్న వైఖరితో అన్నిప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. ఆ తరుణంలో ఆ ప్రాంత నేతల, ప్రజల మనోభావాల మేరకు.. తెలంగాణ కాంగ్రెస్ ఫోరం నేత చిన్నారెడ్డి కోరటంతో తెలంగాణపై లేఖను పార్టీ అధినేత్రి సోనియాకు పంపించారు. ఆ లేఖపై సీడబ్ల్యూసీ రెండో ఎస్సార్సీని ఏర్పాటు చేయాలని తీర్మానించి అప్పటి ఎన్‌డీఏ ప్రభుత్వానికి పంపింది. ఎన్‌డీఏ దాన్ని తోసిపుచ్చింది. ఆ తరువాత 2004, 2009 ఎన్నికల్లో కూడా వైఎస్ కాంగ్రెస్‌ను ఒంటిచేత్తో అధికారంలోకి తీసుకురాగలిగారు. 2004లో ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా రెండో ఎస్సార్సీనే కాంగ్రెస్ ప్రస్తావించింది. 2009 ఎన్నికలకు ముందు తెలంగాణపై అప్పటి ఆర్థికమంత్రి రోశయ్య ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటుచేసి, విభజన వల్ల తలెత్తే అనేక అంశాలపై ముందుగా చర్చించి పరిష్కరించుకోవాల్సిన అవసరముందని స్పష్టంచేశారు. ఆ రెండు ఎన్నికల్లోనూ వైఎస్ కాంగ్రెస్‌ను గెలిపించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఈ విషయాలేవీ గుర్తులేదా? అని కాంగ్రెస్ పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు.
 
అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలు, అభిప్రాయాలు తెలుసుకోవటానికి రోశయ్య నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసిన విషయం మరిచారా? ఆ కమిటీ పరిశీలించాల్సిన అంశాలపై అటు పార్టీ కానీ, ప్రభుత్వం కానీ స్పష్టతకు రాకుండానే నిర్ణయానికి వచ్చినా.. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పటివరకు ఎందుకు మౌనంగా ఉన్నారు? అన్న అనుమనాలు తలెత్తుతున్నాయి. కోర్ కమిటీ సమావేశం జరగటానికి ముందునుంచే రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పెద్దలు హడావుడి చేస్తున్నట్లు సంకేతాలు వచ్చాయి. కోర్ కమిటీ సమావేశానికి హాజరైన కిరణ్‌కుమార్‌రెడ్డి రోశయ్య కమిటీ ప్రతిపాదించిన అంశాలపై ఎందుకు గట్టిగా వాదించలేకపోయారు? పార్టీ నిర్ణయం తీసుకుంటోందని తెలిశాక వెంటనే ఆ విషయాన్ని నిరసిస్తూ పదవిని ఎందుకు త్యజించలేకపోయారు? అన్న విమర్శలు కాంగ్రెస్ నేతల నుంచే వెల్లువెత్తుతున్నాయి. ప్రజల నుంచి వచ్చే స్పందనను అనుసరించి ముందుకు వెళ్లాలన్న ఆలోచనతోనే అటు చంద్రబాబు, ఇటు కిరణ్‌కుమార్‌రెడ్డిలు ఆలస్యంగా స్పందించటం, ఆపై ఇరువురూ వైఎస్సార్ కాంగ్రెస్‌నే లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయటం వెనుక అంతా కాంగ్రెస్ హైకమాండ్ మార్గనిర్దేశంలోనే జరుగుతోందన్న అనుమానాలు బలపడుతున్నాయి. నిజానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయంపై చంద్రబాబు తొలుత స్పందిస్తూ.. ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొనటం గమనార్హం. రాష్ట్ర విభజనపై కేంద్రం ప్రకటన చేశాక ప్రధాన ప్రతిపక్షనేతగా దానిపై తన అభిప్రాయాన్ని చెప్పటం కాకుండా ఏకంగా కాంగ్రెస్ తీర్మానాన్నే చంద్రబాబు సమర్థించినట్లు ప్రకటన చేశారంటే ఆ పార్టీ అధిష్టానం కనుసన్నల్లోనే బాబు నడుస్తున్నారన్నది స్పష్టమవుతోంది. ఇదంతా కాంగ్రెస్, టీడీపీల మ్యాచ్‌ఫిక్సింగ్‌కు తార్కాణంగా నిలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement