బాగా రక్తి కట్టించారు...
అసెంబ్లీలో కిరణ్, బాబుల డ్రామాపై వైఎస్సార్ సీపీ ధ్వజం
బిల్లు లోపభూయిష్టంగా ఉందని
మేం మొదటి నుంచీ చెబుతూనే ఉన్నాం
వెనక్కి పంపాలని విజయమ్మ నోటీసు ఇస్తే మౌనంగా ఎందుకున్నారు?
ఇది ముసాయిదా బిల్లేనని కేంద్రం మీకు చెప్పినా ఇంతకాలం దాచారేం?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లు విషయంలో శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత ఎన్. చంద్రబాబు నాయుడు కలిసికట్టుగా తమ డ్రామాను బాగా రక్తి కట్టించారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ధ్వజమెత్తారు. శనివారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ, విభజన బిల్లులో లోపాలున్నట్లు సీఎం శాసనసభలో ఇప్పుడే చెప్పడం, ఆయన చెప్పే వరకూ తనకేమీ తెలియనట్లు, ఇపుడే తెలిసినట్లు చంద్రబాబు నటించడం భేషుగ్గా ఉందన్నారు. గతేడాది డిసెంబర్ 13న రాష్ట్రపతి నుంచి ప్రత్యేక విమానంలో ఆగమేఘాల మీద వచ్చిన బిల్లుపై సీఎం సత్వరమే సంతకం చేసి అసెంబ్లీకి పంపడమంతా చంద్రబాబు సమక్షంలోనే జరిగిందని గుర్తుచేశారు. బిల్లులో లోపాలున్నట్లు ముఖ్యమంత్రిగానీ, ప్రతిపక్ష నేతగానీ ఆరోజు ఎందుకు అభ్యంతరం చెప్పలేకపోయారని ప్రశ్నించారు. లోపభూయిష్టంగా ఉన్న బిల్లుపై చర్చ జరగరాదని, చర్చలోకి వెళితే రాష్ట్ర విభజనకు అంగీకరించినట్లేనని తమ పార్టీ మొదటి నుంచీ చెబుతున్నా తమ అభ్యంతరాలను పట్టించుకోలేదన్నారు.
ఇంతకాలం చెప్పలేదే?
కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఇది ముసాయిదా బిల్లు అని ఇపుడే కిరణ్ చెప్పడం మరీ వింతగా ఉందని గట్టు విమర్శించారు. తాను రాసిన లేఖకు కేంద్ర హోంశాఖ నుంచి జనవరి 6న వచ్చిన సమాధానంలో ఇది ముసాయిదా బిల్లు మాత్రమేనని ఉన్నట్లుగా కిరణ్ అసెంబ్లీలో చెప్పారని పేర్కొంటూ అలాంటప్పుడు ఇప్పటివరకూ ఆ విషయాన్ని ఎందుకు దాచారని ప్రశ్నించారు. ఇది ముసాయిదా బిల్లు అని తెలిసినపుడు అనవసరంగా ఇన్ని రోజులు ఎందుకు చర్చిం చారు, ఈ చర్చ అంతా వృథా కదా అని అన్నారు. ఢిల్లీ స్క్రిప్టు ప్రకారమే కిరణ్, బాబు వ్యవహరిస్తున్నారనేది సుస్పష్టమన్నారు. రాష్ట్రపతి నుంచి అసెంబ్లీకి బిల్లు రాక ముందే గత డిసెంబర్ 12నే తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, పార్టీ ఎమ్మెల్యేలు సమైక్య తీర్మానం చేయాలని నోటీసిస్తే పట్టించుకోలేదని, ఆ తరువాత 16న విభజన బిల్లును రాష్ట్రపతికి వెనక్కి పంపాలని 77, 78 నిబంధనల కింద నోటీసులిచ్చినా స్పందించలేదని గుర్తు చేశారు. మళ్లీ ఈ నెల 24 విజయమ్మ వాటన్నింటినీ గుర్తుచేస్తూ స్పీకర్‌కు మరో లేఖ కూడా రాశారంటూ వాటి ప్రతులను గట్టు ప్రదర్శించారు. ఈ రెండింటిపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. బిల్లులో తప్పులుంటే శాసనసభ సలహామండలి సమావేశాలకు కిరణ్, చంద్రబాబు ఎందుకు రాలేదని ఆయన అన్నారు.