gattu ramachadra rao
-
భారీ మెజారిటీతో శోభకు నివాళి: గట్టు
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గం అభ్యర్థిగా దివంగత భూమా శోభానాగిరెడ్డి పోటీలో ఉన్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసిన నేపథ్యంలో... ఆమెకు భారీ మెజారిటీ తీసుకొచ్చి ప్రజలు నివాళి అర్పిస్తారని వైఎస్సార్సీపీ నేత గట్టు రామచంద్రరావు పేర్కొన్నారు. శోభమ్మ లేకపోయినప్పటికీ... ఈ ఎన్నికల్లో ఆమెకు ఓట్లేసి అధిక మెజారిటీతో గెలిపించుకోవడానికి ఆళ్లగడ్డ ఓటర్లు సిద్ధంగా ఉన్నారన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘శోభానాగిరెడ్డి మరణం తర్వాత రకరకాల తప్పుడు ప్రచారాలు జరిగాయి. శోభ పేరును బ్యాలెట్ నుంచి తొలగిస్తారని, ఆమె పేరున్నప్పటికీ... పడిన ఓట్లన్నీ నోటా కింద లెక్కేస్తారని... రకరకాల తప్పుడు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టతనిచ్చింది. ఎన్నికల్లో శోభ పేరుంటుందని, శోభకు ఎక్కువ ఓట్లు వస్తే ఆమె గెలుపును ప్రకటిస్తూ... ఆ తర్వాత ఉప ఎన్నిక జరుపుతామంటూ ఎన్నికల కమిషన్ పేర్కొంది’ అని గట్టు వివరించారు. -
బాగా రక్తి కట్టించారు...
అసెంబ్లీలో కిరణ్, బాబుల డ్రామాపై వైఎస్సార్ సీపీ ధ్వజం బిల్లు లోపభూయిష్టంగా ఉందని మేం మొదటి నుంచీ చెబుతూనే ఉన్నాం వెనక్కి పంపాలని విజయమ్మ నోటీసు ఇస్తే మౌనంగా ఎందుకున్నారు? ఇది ముసాయిదా బిల్లేనని కేంద్రం మీకు చెప్పినా ఇంతకాలం దాచారేం? సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లు విషయంలో శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత ఎన్. చంద్రబాబు నాయుడు కలిసికట్టుగా తమ డ్రామాను బాగా రక్తి కట్టించారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ధ్వజమెత్తారు. శనివారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ, విభజన బిల్లులో లోపాలున్నట్లు సీఎం శాసనసభలో ఇప్పుడే చెప్పడం, ఆయన చెప్పే వరకూ తనకేమీ తెలియనట్లు, ఇపుడే తెలిసినట్లు చంద్రబాబు నటించడం భేషుగ్గా ఉందన్నారు. గతేడాది డిసెంబర్ 13న రాష్ట్రపతి నుంచి ప్రత్యేక విమానంలో ఆగమేఘాల మీద వచ్చిన బిల్లుపై సీఎం సత్వరమే సంతకం చేసి అసెంబ్లీకి పంపడమంతా చంద్రబాబు సమక్షంలోనే జరిగిందని గుర్తుచేశారు. బిల్లులో లోపాలున్నట్లు ముఖ్యమంత్రిగానీ, ప్రతిపక్ష నేతగానీ ఆరోజు ఎందుకు అభ్యంతరం చెప్పలేకపోయారని ప్రశ్నించారు. లోపభూయిష్టంగా ఉన్న బిల్లుపై చర్చ జరగరాదని, చర్చలోకి వెళితే రాష్ట్ర విభజనకు అంగీకరించినట్లేనని తమ పార్టీ మొదటి నుంచీ చెబుతున్నా తమ అభ్యంతరాలను పట్టించుకోలేదన్నారు. ఇంతకాలం చెప్పలేదే? కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఇది ముసాయిదా బిల్లు అని ఇపుడే కిరణ్ చెప్పడం మరీ వింతగా ఉందని గట్టు విమర్శించారు. తాను రాసిన లేఖకు కేంద్ర హోంశాఖ నుంచి జనవరి 6న వచ్చిన సమాధానంలో ఇది ముసాయిదా బిల్లు మాత్రమేనని ఉన్నట్లుగా కిరణ్ అసెంబ్లీలో చెప్పారని పేర్కొంటూ అలాంటప్పుడు ఇప్పటివరకూ ఆ విషయాన్ని ఎందుకు దాచారని ప్రశ్నించారు. ఇది ముసాయిదా బిల్లు అని తెలిసినపుడు అనవసరంగా ఇన్ని రోజులు ఎందుకు చర్చిం చారు, ఈ చర్చ అంతా వృథా కదా అని అన్నారు. ఢిల్లీ స్క్రిప్టు ప్రకారమే కిరణ్, బాబు వ్యవహరిస్తున్నారనేది సుస్పష్టమన్నారు. రాష్ట్రపతి నుంచి అసెంబ్లీకి బిల్లు రాక ముందే గత డిసెంబర్ 12నే తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, పార్టీ ఎమ్మెల్యేలు సమైక్య తీర్మానం చేయాలని నోటీసిస్తే పట్టించుకోలేదని, ఆ తరువాత 16న విభజన బిల్లును రాష్ట్రపతికి వెనక్కి పంపాలని 77, 78 నిబంధనల కింద నోటీసులిచ్చినా స్పందించలేదని గుర్తు చేశారు. మళ్లీ ఈ నెల 24 విజయమ్మ వాటన్నింటినీ గుర్తుచేస్తూ స్పీకర్‌కు మరో లేఖ కూడా రాశారంటూ వాటి ప్రతులను గట్టు ప్రదర్శించారు. ఈ రెండింటిపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. బిల్లులో తప్పులుంటే శాసనసభ సలహామండలి సమావేశాలకు కిరణ్, చంద్రబాబు ఎందుకు రాలేదని ఆయన అన్నారు. -
వైఎస్ మరణంపై వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి
సాక్షి, హైదరాబాద్ : దివగంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంపై టీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖరరావు చేసిన వ్యాఖ్యలు అనుచితమని.. ఆయన వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు డిమాండ్ చేశారు. వైఎస్ ప్రాంతాలకు అతీతంగా పనిచేసిన నాయకుడని.. ఆయన పథకాలు రాష్ట్రంలో ప్రతీ గడపకు వెళ్లినా కనిపిస్తాయని గట్టు గుర్తుచేశారు. కేసీఆర్ మానవత్వం లేని వ్యక్తిగా మాట్లాడారని.. ఉన్మాదిలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఆయన భాష మార్చుకోవాలని గట్టు కోరారు. సోమవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సకల జనభేరీలో వైఎస్ మరణంపై హీనంగా మాట్లాడిన కేసీఆర్.. వైఎస్ మరణం తరువాత రవీంద్రభారతిలో జరిగిన సంతాపసభలో ‘రాజశేఖరరెడ్డిగారి మరణం తరువాత రాష్ట్ర ప్రజలందరి హృదయాలు ఘోషిస్తున్నాయి’ అని ఆవేదన వ్యక్తంచేసిన విషయాన్ని గట్టు గుర్తుచేశారు. భేరీ సభలో కేసీఆర్ ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య వైషమ్యాలు సృష్టించే విధంగా మాట్లాడారని తప్పుపట్టారు. పది జిల్లాల తెలంగాణ ప్రజలు కూడా ఇప్పుడు కేసీఆర్‌ను వ్యతిరేకిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇటీవల కాలంలో టీఆర్ఎస్ నుంచి పెద్ద సంఖ్యలో నేతలు బయటకు వచ్చారని, ఎంపీ విజయశాంతి సైతం పార్టీ వీడేందుకు సిద్ధపడ్డారని చెప్పారు. దీంతో కేసీఆర్ తిట్ల పురాణం మొదలుపెట్టి తెలంగాణలో తన హీరోయిజం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మూడున్నర జిల్లాల్లో ఉన్న పార్టీని పది జిల్లాల్లో విస్తరించుకోవాలన్న తాపత్రయమే కేసీఆర్‌దని గట్టు ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎదుర్కోలేక కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ వంటి పార్టీలు ఒక్కటై పనిచేస్తున్నాయని విమర్శించారు.