మీకు కొంచెమైనా సిగ్గుందా ?: వైఎస్ జగన్ | Ys jagan mohan reddy slams chandrababu naidu, kiran kumar reddy | Sakshi
Sakshi News home page

మీకు కొంచెమైనా సిగ్గుందా ?: వైఎస్ జగన్

Published Fri, Jan 10 2014 2:18 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

Ys jagan mohan reddy slams chandrababu naidu, kiran kumar reddy

 * సీఎం కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజం
* కేంద్రం అడ్డగోలుగా విభజన నిర్ణయం తీసుకుని రాష్ట్రానికి బిల్లు పంపింది
* ఆ బిల్లు మాకొద్దని వెనక్కి పంపాల్సిన కిరణ్, బాబు నిస్సిగ్గుగా బిల్లుపై చర్చ జరిపిస్తున్నారు
* బిల్లుపై చర్చ జరిగితే విభజనకు ఒప్పుకున్నట్టే
* కిరణ్, బాబులతో మాట్లాడి గులాంనబీ ఆజాద్ బిల్లుపై చర్చ జరిగేలా చేస్తున్నారు
* ఓటింగ్ కోసం పట్టుబట్టిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారు

 

 ‘సమైక్య శంఖారావం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజిస్తూ నిర్ణయం తీసుకొని ఆ బిల్లు మనకు పంపించారు. ఈ బిల్లు మాకు వద్దు అని చెప్పి వెనక్కి పంపించాల్సిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నిస్సిగ్గుగా బిల్లు మీద ఇవాళ చర్చ జరిపిస్తున్నారు. బిల్లు మీద చర్చ జరిగితే విభజన చేయడానికి కేంద్రానికి అనుమతిచ్చినట్టే అవుతుంది.. అందుకోసమే చర్చ జరగనే వద్దని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పట్టుపడుతోంది. కానీ కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు కుమ్మక్కై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే తప్పని వేలెత్తి చూపించే సిగ్గుమాలిన పనికి ప్రయత్నిస్తున్నారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. తాపీగా విభజన కార్యక్రమం పూర్తి చేసేందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని అన్నారు. ఈ గడ్డ మీద పుట్టిన ఈ ముఖ్యమంత్రికి, ప్రతిపక్ష నాయకుడికి ఇంతకంటే  సిగ్గు ఏమైనా ఉందా? అని నిలదీశారు. ‘‘బీహార్‌లో కూడా ఇటువంటి పరిస్థితి ఎదురైనపుడు అక్కడి ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గట్టిగా నిలబడి ఎదుర్కొన్నారు.
 
 మీరెవరు మా రాష్ట్రాన్ని విడగొట్టడానికి? ఆ అధికారం మీకు ఎవరిచ్చారు? అని ఆ బిల్లును లాలూ ప్రసాద్ యాదవ్ వెనక్కి పంపించారు. మళ్లీ లాలూను ఒప్పించిన తరువాతే బీహార్‌ను విడగొట్టారు. మన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆ పని ఎందుకు చేయలేకపోతున్నారు?’’ అని ప్రశ్నించారు. ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించటాన్ని నిరసిస్తూ జగన్‌మోహన్‌రెడ్డి  కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా తలపెట్టిన ‘సమైక్య శంఖారావం’ యాత్ర చిత్తూరు జిల్లాలో మూడో విడత, ఐదో రోజు గురువారం ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పీలేరులోను,చంద్రగిరి, పుంగనూరు నియోజకవర్గాల్లోనూ కొనసాగింది. సదుం, కల్లూరుల్లో వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించారు. సదుం మండల కేంద్రం, పీలేరు నియోజకవర్గ కేంద్రం, కల్లూరు, మాదలచెరువు గ్రామాల్లో జరిగిన బహిరంగ సభలకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. ఈ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..
 
 చర్చ అంటూ పట్టపగలు ప్రజల్ని మోసం చేస్తున్నారు
 ‘‘ఈ రోజు టీవీ ఆన్ చేస్తే మనకు అసెంబ్లీ సమావేశాలే కనిపిస్తున్నాయి. కానీ వాటిలో చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం కనపడరు. ఇద్దరూ మోసగాళ్లే. ఇవాళ అసెంబ్లీ జరుగుతున్న తీరు చూస్తుంటే దేశ చరిత్రలో ఇంత అన్యాయం ఎక్కడా జరగలేదేమో అనిపిస్తోంది. ఏ రాష్ట్రాన్నైనా విభజించాలని అనుకుంటే మొదట ఆ శాసన సభలో తీర్మానం చేయాలి. శాసన సభ్యులంతా అనుకూలమే అని చెబితే తప్ప విభజించడానికి వీలు లేదు. ఇవాళ రాష్ట్రంలో 70 శాతం మంది ప్రజలు సమైక్యాన్ని కోరుకుంటున్నారు. శాసన సభలో మెజార్టీ ఎమ్మెల్యేలు రాష్ట్రాన్ని విడగొట్టొద్దని చెప్తున్నారు. కానీ యూపీఏ ప్రభుత్వం మాత్రం ఎటువంటి తీర్మానం లేకుండా బిల్లును అసెంబ్లీకి పంపి ఇక విభజన అయిపోయింది, చర్చించుకోండి అని చెప్తోంది. ఇటువంటి అన్యాయం ఎక్కడైనా ఉందా? బిల్లు మీద చర్చ పెట్టి, పట్టపగలు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు. సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరాహార దీక్షలు చేసింది. పార్టీ మొత్తం ఒక్కతాటి మీద నిలబడి, రాష్ట్రపతి దగ్గరకు వెళ్లి అఫిడవిట్లు ఇచ్చి సమైక్యాంధ్ర కోసం నిలబడింది. చర్చ జరిగితే విభజనకు ఒప్పుకున్నట్టే అని, చర్చ కాదు ఓటింగ్ జరపండి అని పట్టుబట్టిన వైఎస్సార్ సీపీ శాసన సభ్యులను ప్రభుత్వం ఈ రోజు శాసనసభ నుంచి సస్పెండ్ చేయించింది. ఇవాళ పేపర్‌లో చదివా.. కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్ మన రాష్ట్రానికి వచ్చారట. చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డితో మాట్లాడి వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయించి చర్చ సాగిస్తున్నారట. నిజంగా మీరు చేస్తున్న దిక్కుమాలిన రాజకీయాలు, రాక్షస పాలన అంతమయ్యే రోజులు త్వరలోనే వస్తాయి.
 
 విభజన కోసం చర్చ ఎందుకు?

 రాష్ట్రాన్ని విభజించడానికి మీరు అసెంబ్లీలో చర్చ ప్రారంభించారు. విభజన కోసం చర్చ ఎందుకు అని అడుగుతున్నా. ఒక్కరోజు శాసన సభ్యులందరినీ అసెంబ్లీకి పిలవండి, పిలిచి ఈ రాష్ట్ర విభజనకు మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరా అని అడగండి. వాళ్లు చెప్పిన దాన్నే తీర్మానంగా చేయండి. అది చేస్తే సరిపోదా? అని అడుగుతున్నా. ఆ కార్యక్రమం చేయాలంటే మీకు మనసు రాదు. ఒక్కసారి ప్రజల వద్దకు రండి, ఆ ప్రజలను అడగండి. వాళ్లు ఏం చెప్తే అది చేయండి. నేను దారి వెంట వస్తూ చాలా మంది ప్రజలను అడిగా.. పీలేరు నియోజకవర్గ ప్రజలను కూడా అడిగా!  ‘గ్యాస్ సబ్సిడీ ఇంత వరకు అందలేదన్నా.. రూ.1,300 పెట్టి గ్యాస్ కొనుక్కుంటున్నాం’ అని చాలామంది అక్కా చెల్లెమ్మలు చెప్పారు. వ్యవసాయానికి ఎన్నిగంటలు కరెంటు ఇస్తున్నారని రైతన్నలను అడిగితే.. 3-4 గంటలకు మించి ఇవ్వలేదన్నారు. పీలేరులో తాగటానికి నీళ్లు లేవని అక్కాచెల్లెమ్మలు చెప్తున్నా రు, బిందెడు నీళ్లు రూ.3 నుంచి రూ. 5 పెట్టి కొనుక్కుంటున్నాం అని చెప్తున్నారు. ఈ సమస్యల మీద చర్చించకుండా రాష్ట్రాన్ని ఎలా విభజించాలని చర్చిస్తారట.
 
 కిరణ్.. ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని?
 అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు చూస్తే గుండె తరుక్కుపోతోంది. ఎప్పుడో జూలై 30న సీడబ్ల్యూసీ మీటింగ్‌లో సోనియాగాంధీ రాష్ట్రాన్ని విభజిస్తామని చెప్పారు. కిరణ్‌కుమార్‌రెడ్డిని నేను అడుగుతున్నా. ఎవరు ఆపుతున్నారయ్యా నిన్ను? ముఖ్యమంత్రి హోదాలో వెంటనే అసెంబ్లీని సమావేశపరిచి విభజనకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని చెప్పి మేం అంతా కోరినా కూడా మీరు ఎందుకు తీర్మానం చేయలేదు? అంతెందుకు కనీసం ఇప్పుడైనా తీర్మానం చేయండి అంటే వెనకడుగు వేస్తున్నారు. సోనియా గాంధీ ప్రత్యేక విమానంలో బిల్లును పంపించారు. ఆ బిల్లు డ్రాఫ్టు అందిన 17 గంటలలోపే సంతకం చేసి దాన్ని అసెంబ్లీకి ఎందుకు పంపించారు? రాష్ట్రమంతటా సమైక్య ఉద్యమాలు జరుగుతున్నాయి. ఉద్యోగస్తులు దీక్షలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. అటువంటి ఉద్యోగులను ఎందుకు కిరణ్‌కుమార్‌రెడ్డి భయపెట్టి దీక్షలు, ధర్నాలను విరమింపజేశారు? సోనియా గాంధీ విభజన చేయాలని చెప్తుంటే ముఖ్యమంత్రిగా నువ్వు మీ అధికారులకు చెప్పి ప్రతి అడుగులోనూ ఎందుకు సహకారం అందిస్తున్నావు?’’
 
 జగన్ వెంట యాత్రలో పాల్గొన్న వారిలో జిల్లా పార్టీ కన్వీనర్ నారాయణస్వామి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, పార్టీ నాయకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, రోజా, డాక్టర్ సునీల్‌కుమార్ తదితరులు ఉన్నారు.
 
 సమైక్యం కోసం మీరు ఏం చేశారు?
 ‘‘రాష్ట్రాన్ని విడగొట్టడానికిగాను బిల్లుపై చర్చ జరిపించేందుకు ఉత్సాహం చూపిస్తున్న నాయకులందరినీ నేను అడగదలుచుకున్నా. ఈ రాష్ట్రాన్ని విడగొట్టకూడదని ఏ రోజైనా మీరు నిరాహార దీక్షలు చేశారా? రాష్ట్రాన్ని విడగొట్టవద్దని ఎప్పుడైనా రాష్ట్రపతి వద్దకు వెళ్లి అఫిడవిట్లు ఇచ్చారా? రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి అని కనీసం ఒక్క లేఖైనా ఇచ్చారా? అని అడుగుతున్నా. ఏ ఒక్కటీ కూడా వీళ్లు చేయలేదు. వీళ్లు చేస్తున్నదంతా ముసుగులో దొంగాట. వీళ్లంతా కుమ్మక్కై ఈ రాష్ట్రాన్ని విడగొట్టడానికి సిద్ధమయ్యారు. మీరు చేస్తున్న మోసాలను పై నుంచి దేవుడు చూస్తున్నాడు.
 
  రాష్ట్రంలోని ప్రతి ఒక్కరం ఒక్కటవుతాం. ఒక్కటైనప్పుడు ఉప్పెన లేస్తుంది. రాష్ట్రాన్ని విభజించాలని ఉబలాటపడుతున్న సోనియాగాంధీ, ఆమె గీచిన గీత దాటకుండా ప్రజలను మోసం చేస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్యాకేజీలు అడుగుతున్న చంద్రబాబు.. వీళ్లంతా ఆ ఉప్పెనలో కొట్టుకుపోతారు. వీళ్లంతా ఎన్ని కుట్రలు పన్నినా.. మరో నాలుగు నెలల్లో ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికలు ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి మధ్య జరుగుతాయి. వాటిలో మనందరం ఒక్కటవుదాం. ఒక్కటై 30 ఎంపీ స్థానాలను మనంతట మనమే తెచ్చుకుందాం. ఎవరైతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారో వారినే ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెడదాం.’’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement