ఎంపీటీసీ ఎన్నికల్లో హోరాహోరీ | election war between tdp,ysrcp | Sakshi
Sakshi News home page

ఎంపీటీసీ ఎన్నికల్లో హోరాహోరీ

Published Wed, May 14 2014 2:28 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

ఎంపీటీసీ ఎన్నికల్లో హోరాహోరీ - Sakshi

ఎంపీటీసీ ఎన్నికల్లో హోరాహోరీ

 సాక్షి, చిత్తూరు: జిల్లా వ్యాప్తంగా మంగళవారం  ప్రకటించిన ఎంపీటీసీ ఫలితాల్లో ఫ్యాను జోరు కొనసాగింది. చంద్రబాబు సొంత జిల్లాలోనే ఆ పార్టీకి ఏకపక్షంగా ఫలితాలు రాలేదు. స్వల్ప ఆధిక్యంతో కొన్ని స్థానాల్లో విజయం సాధించింది. మొత్తం 901 ఎంపీటీసీ స్థానాలకు 387 స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. తెలుగుదేశం 459 ఎంపీటీసీలు గెలుపొందింది. కాంగ్రెస్ 4, బీజేపీ ఒకటి, స్వతంత్రులు 50 స్థానాల్లో విజయం సాధించారు.
 
 చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనూ వైఎస్సార్‌సీపీ పది ఎంపీటీసీలను గెలిచింది. శాంతిపురం మండలంలో అన్ని స్థానాల్లో పోటాపోటీగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఓట్లు సాధించారు. బెరైడ్డిపల్లె, గంగవరం మండలాల్లో నూ వైఎస్సార్‌సీపీ ఆధిక్యత సాధించి ఎంపీపీలను కైవసం చేసుకుంది. మదనపల్లె నియోజకవర్గంలో రామసముద్రం, రూరల్, నిమ్మనపల్లెలో ఎంపీపీలు కైవసం చేసుకునేందుకు అవసరమైన మెజారిటీ సాధించింది. ఇక్కడ నిమ్మనపల్లెలో తొమ్మిది ఎంపీటీసీలకు 5 గెలుచుకుని ఎంపీపీ స్థానంచేజిక్కించుకుంది.
 
 రామసముద్రంలో 14 ఎంపీటీసీలకు 10 గెలిచింది. మదనపల్లె రూరల్ 27 ఎంపీటీసీలకు గాను 16 స్థానాలు చేజిక్కించుకుని స్పష్టమైన మెజారిటీతో ఎంపీపీ పదవి దక్కించుకుంది. పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లె మండలంలో 12 ఎంపీటీసీలకు వైఎస్సార్ సీపీ 10 గెలిచింది. పులిచెర్ల మండలంలో 11కు 10 ఎంపీటీసీల్లో విజయకేతనం ఎగురవేసింది. సదుం, సోమల, రొంపిచెర్ల మండలాల్లోనూ అత్యధిక ఎంపీటీసీలు వైఎస్సార్ సీపీనే గెలుచుకుంది. చంద్రగిరి మండలంలో ఏడు ఎంపీటీసీలు గెలిచారు. ఇలా కుప్పం నుంచి శ్రీకాళహస్తి వరకు ఎంపీటీసీలను గెలిచి చాలా మండలాల్లో వైఎస్సార్ సీపీ ఆధిక్యత ప్రదర్శించింది. ప్రారంభం నుంచే వైఎస్సార్ సీపీ, టీడీపీ పోటాపోటీగా స్థానాలు సాధిస్తూ వచ్చాయి. పుంగనూరు నియోజకవర్గంలో చాలా మంది వైఎస్సార్ సీపీ అభ్యర్థులు 500 మెజారిటీ తక్కువ కాకుండా గెలిచారు. జెడ్పీటీసీల్లో 3 వేలకు పైగా మెజారిటీ వచ్చిన వారు ఉన్నారు. జెడ్పీటీసీల్లోనూ నాలుగు మండలాల్లో జయకేతనం ఎగురవేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండలంలో మెజారిటీ ఎంపీటీసీలు వైఎస్సార్ సీపీకి వచ్చాయి. వైఎస్సార్ సీపీ ఓడిన సీట్లలోనూ స్వల్ప తేడాతో వెనుకబడింది.
 
 పీలేరులో వైఎస్సార్ సీపీ హవా..
 మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గం పీలేరులో ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడింది. ఇక్కడ జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున డబ్బులు పంచి, ఓటర్లను ప్రలోభపెట్టిన వారి పాచికలు పారలేదు. ఓటర్లు వైఎస్సార్ సీపీకే పట్టం కట్టారు. 20 ఎంపీటీసీ స్థానాలకుగాను 15 స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు విజేతలుగా నిలిచారు. స్పష్టమైన మెజారిటీతోఎంపీపీ దక్కించుకునే దిశగా తీర్పును ఇచ్చారు. తొలి నుంచి పీలేరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ ఆధిక్యాన్ని నిలబెట్టేందుకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు రాజంపేట వైఎస్సార్ సీపీ లోక్‌సభ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పనిచేశారు. పీలేరు నియోజకవర్గంలోని మిగిలిన మండలాల్లోనూ వైఎస్సార్ సీపీ మెరుగైన ఫలితాలను సాధించింది.
 
 కుప్పంలో 10 ఎంపీటీసీలు కై వసం
 చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనూ వైఎస్సార్ సీపీ 10 ఎంపీటీసీ స్థానాలు కైవసం చేసుకుంది. జెడ్పీటీసీలకు గట్టి పోటీ ఇచ్చింది. శాంతిపురం మండలంలో అత్యధికంగా 6 ఎంపీటీసీలను వైఎస్సార్ సీపీ చేజిక్కించుకుంది. కుప్పం మండలంలో 4, గుడుపల్లిలో 2, రామకుప్పంలో 3 ఎంపీటీసీలను సాధించి వైఎస్సార్ సీపీ సత్తా చాటింది. ఎంపీటీసీల గెలుపుతో బాబు కోటలో వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement