నాది రెండు కళ్ల సిద్ధాంతం కాదు
నాది బాబులా రెండు కళ్ల సిద్ధాంతం కాదు... కిరణ్‌లా ఓ ప్రాంతం వారిని రెచ్చగొట్టే స్వభావం కాదు.. ఇరు ప్రాంతాలూ చల్లగా ఉండాలని కోరుకునే సిద్ధాంతం నాది.. అన్నారు జగన్. సమైక్య నినాదం వినిపించేందుకు తెలంగాణలోనూ పర్యటించారు. రాష్ట్రాన్ని ఒక్కటిగా ఉంచాలని, ముక్కలు చేయొద్దని ఎంతచెప్పినా వినకుండా కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై ఓట్లు, సీట్ల కోసం విభజిస్తున్నాయంటూ ఆవేదన చెందారు. కేంద్రం నుంచి విభజన ప్రకటన వచ్చాక ఖమ్మం జిల్లాలో ప్రారంభించిన పర్యటన ఇతర జిల్లాల్లో కూడా కొనసాగించారు. కాంగ్రెస్, టీడీపీల మాదిరిగా తాను ఏప్రాంతం వాళ్లను రెచ్చగొట్టలేదని జగన్ చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంగా మార్చుకోండి.. విడగొట్టొద్దు..
రాష్ట్రానికే తెలంగాణ పేరు పెట్టుకోండి కానీ, ఆంధ్రప్రదేశ్‌ను మాత్రం ముక్కలు చేయొద్దని జగన్ పలుమార్లు కేంద్రాన్ని కోరారు. ఆ తీరుగానైనా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమంటూ పలుమార్లు బహిరంగసభల్లో ఆయన ఉద్వేగంగా మాట్లాడారు.
రాష్ట్ర ప్రయోజనాల కంటే నాప్రాణం ముఖ్యం కాదు...
కోట్లాది ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు స్పందించి దీక్ష చేస్తుంటే భగ్నం చేయడం ధర్మం కాదు.. నా కాళ్లూ, చేతులూ కట్టేసి మీరు ఫ్లూయిడ్స్ ఎక్కించాలనుకుంటున్నారా... మీకు ఇది న్యాయమనిపిస్తోందా.. నన్ను దీక్ష చేసుకోనివ్వండి.. దయచేసి నా దీక్షను భగ్నం చేయొద్దు.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం.. వారి సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న ఈ దీక్షకు మీ వంతు సహకరించండి...
- దీక్ష సమయంలో బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు వచ్చిన వైద్యులతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి