గొంతెత్తి.. ఎలుగెత్తి | ys jagan mohan reddy only fight for andhra pradesh | Sakshi
Sakshi News home page

గొంతెత్తి.. ఎలుగెత్తి

Published Mon, May 5 2014 1:05 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM

గొంతెత్తి.. ఎలుగెత్తి - Sakshi

గొంతెత్తి.. ఎలుగెత్తి

విభజన వద్దని పోరాడిన ఏకైక నాయకుడు జగనే
* చంద్రబాబుది గోడమీద పిల్లివాటం
* అసెంబ్లీలో నోరు విప్పకపోవడమే ప్రత్యక్ష నిదర్శనం
* ఆనాడు పవన్ కల్యాణ్ గొంతు మూగబోయిందా?

 
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, విభజన వల్ల సీమాంధ్రకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మొదటి నుంచి వాదించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. సీపీఎం కూడా సమైక్యానికే కట్టుబడినా రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం సాగించింది మాత్రం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరే.

 
 బాబు అవకాశవాదం

 విభజనపై త్వరగా నిర్ణయం తీసుకోవాలంటూ కేంద్రానికి లేఖలు రాయడమే కాకుండా అడ్డగోలు విభజనపై కనీసం పెదవి విప్పని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు మాట్లాడుతున్న తీరు ఆయన అవకాశవాద రాజకీయాలను తేటతెల్లం చేస్తోంది.
 
 విభజన నష్టాలపై గొంతెత్తింది జగనే
 రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్ర  నష్టపోతుందని, యువత ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు కోల్పోతుందని, ఉద్యోగులకు వేతనాలు, సంక్షేమ పథకాల అమలుకు నిధుల కొరత ఏర్పడుతుందని వైఎస్ జగన్ ఆది నుంచి వివిధ సందర్భాల్లో వివరిస్తూ వచ్చారు. అందు వల్లే విభజనను తమ పార్టీ వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు.
 
 విభజన వల్ల సీమాంధ్రకు కలిగే నష్టాలపై జగన్ పేర్కొన్న అంశాలివీ...
 
హైదరాబాద్ నగరం గత 60 ఏళ్లుగా మొత్తం 23 జిల్లాలకు కేంద్రంగా అభివృద్ధి చెందింది. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర యువత ఉద్యోగాల కోసం ఎక్కడికి పోవాలి? 60 ఏళ్లుగా తెలుగు ప్రజలందరి సమష్టి కృషి ఫలితంగానే నేడు హైదరాబాద్ రాబడి రాష్ట్ర బడ్జెట్‌లో సగానికి పైగా ఉంది. రాష్ట్ర విభజనతో ఉద్యోగుల వేతనాలు చెల్లించడమే సీమాంధ్ర ప్రభుత్వానికి కష్టమవుతుంది. నిధుల కొరత వల్ల అభివృద్ధి, సంక్షేమం కుంటుపడుతుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు నేడు హైదరాబాద్‌లోనే ఉపాధి పొందుతున్నారు. పొదుపు చేసిన మొత్తాలను ఇక్కడే మదుపు చేశారు. విభజన జరిగి ఆ పెట్టుబడుల విలువ ఒక్కసారిగా పడిపోతే సీమాంధ్రులే నష్టపోతారు.
 
రాష్ట్రాల మధ్య తలెత్తుతున్న జల వివాదాలు తీవ్రతరమవుతున్నాయి. ట్రిబ్యునళ్లు, కోర్టు తీర్పులు, ఆదేశాలు, వాటర్‌బోర్డులు ఉన్నా తమిళనాడు, కర్ణాటక మధ్య కావేరీ జల వివాదం చెలరేగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలను బేఖాతరు చేసి మహారాష్ట్ర ప్రభుత్వం చట్టవిరుద్ధంగా బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతూనే ఉంది. ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక తమ అవసరాలు తీరిన తర్వాతే ఆంధ్రప్రదేశ్‌కు (ఉమ్మడి రాష్ట్రానికి) నీరు వదులుతామంటున్నాయి. రాష్ట్రం సమైక్యంగా ఉండగానే పరిస్థితులు ఇలా ఉంటే.. విభజిస్తే శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు నీరు ఎక్కడి నుంచి వస్తుంది? విభజనతో రాష్ట్రంలో కృష్ణా నది ప్రవహించే ప్రాంతం వెంబడి తరచుగా ఘర్షణలు తలెత్తవా? కృష్ణా ఆయకట్టుకు నీరు ఎలా అందిస్తారు? గోదావరి జలాల సంగతేమిటి? పోలవరం ప్రాజెక్టుకు నీరు ఎక్కడి నుంచి వస్తుంది? మిగులు జలాలపై ఆధారపడి నిర్మిం చిన, నిర్మిస్తున్న ప్రాజెక్టుల గతి ఏమిటి?

ట్రిబ్యునళ్లు, బోర్డులు నిరర్థకమైనవి కావడం వల్ల సమైక్యంగా ఉండగానే రాష్ట్రం దుర్భిక్షానికి, వరద బీభత్సానికి గురవుతూ వస్తోంది. రాష్ట్రాన్ని విభజిస్తే పరిస్థితి మరింత విషమిస్తుంది. మరో జలమండలి లేదా వాటర్‌బోర్డు ఏర్పాటు చేయడం దేనికి తోడ్పడుతుంది? కృష్ణా జలాల వినియోగంపై బచావత్ ట్రిబ్యునల్ రాష్ట్రానికి పూర్తి హక్కులు ఇచ్చినా, వాటిని విస్మరించి బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆ హక్కును మహారాష్ట్ర, కర్ణాటకలకు కట్టబెట్టింది. రాష్ట్ర విభజన జరగబోతుందన్న వార్తలతో అప్పుడే ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు మిగులు జల్లాల్లోనూ, కేటాయించిన జలాల్లోనూ వాటాలు పెంచాలని కోరుతున్నాయి. ఈ పరిస్థితుల్లో విభజన జరిగితే తెలుగు ప్రజలపై మరింత దుష్ర్పభావం చూపక తప్పదు.
 
 రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తే కుప్పం నుంచి శ్రీకాకుళం  వరకూ సముద్రపు ఉప్పునీరు తప్ప తాగడానికి మంచినీరు ఏదీ? ఎక్కడి నుంచి నీరు ఇస్తారు?
 
 రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని వెలిగొండ, హంద్రీ - నీవా, గాలేరు - నగరి సుజల స్రవంతి పథకాలకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? కృష్ణా ఆయకట్టులో నీటి కోసం రోజూ ప్రజలు కొట్టుకునే పరిస్థితి రాదా?
 
 ఉన్నత విద్య, ఉపాధి కోసం సీమాంధ్ర యువత హైదరాబాద్‌పైనే ఆధారపడి ఉంది. పదేళ్లలో హైదరాబాద్‌ను విడిచిపెట్టి వెళ్లాలంటే సీమాంధ్ర యువత ఉద్యోగాలు, ఉపాధి కోసం ఎక్కడికి వెళ్లాలి?
 
 రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 90 వేల కోట్లు వివిధ మార్గాల ద్వారా హైదరాబాద్ నుంచే వస్తోంది. అంటే రాష్ట్ర ప్రభుత్వ  బడ్జెట్‌లో 55 శాతం, కేంద్రానికి రాష్ట్రం నుంచి వెళుతున్న పన్నుల్లో 65 శాతం కేవలం హైదరాబాద్ నుంచే జమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ నుంచి ఇంత డబ్బు ఖజానాకు రాకపోతే... వృద్ధాప్య పింఛన్లు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్తు, రూపాయికే కిలో బియ్యం తదితర సంక్షేమ కార్యక్రమాలకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది?
 
 పార్లమెంటు సాక్షిగా సమైక్య నినాదం
 లోక్‌సభలో మూడేళ్ల క్రితమే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమైక్యాంధ్ర ప్లకార్డు ప్రదర్శించి పతాక శీర్షికల్లో నిలిచారు. రాష్ట్రం ముక్కలు కాకూడదన్న ఆయన పట్టుదలకు, సమైక్యాంధ్ర పరిరక్షణకు ఆయన ఎంతగా కట్టుబడి ఉన్నారో తెలియజేప్పేందుకు.. సాక్షాత్తూ చట్టసభలో జరిగిన ఘటనే నిదర్శనం.
 
 సోనియాకు జగన్ సూటి ప్రశ్న
 రాష్ట్రాన్ని ముక్కలు చేసిన సోనియాగాంధీపై జగన్ అనేక సందర్భాల్లో  ధ్వజమెత్తారు. ‘రాహుల్ ప్రధాని అయ్యేందుకు ఇక్కడి బిడ్డల జీవితాలతో ఆడుకుంటారా? ఇటలీ దేశీయురాలు సోనియా.. రాజీవ్‌గాంధీని పెళ్లి చేసుకుని భారత్‌కు వచ్చారు. 30ఏళ్ల క్రితం భారత పౌరసత్వం తీసుకున్నారు.. ఇప్పుడు పార్లమెంటులో బిల్లు పెట్టి విదేశీయులకు ఇచ్చిన పౌరసత్వాలన్నీ రద్దు చేస్తున్నామంటే ఇటలీ వెళ్లిపోతారా..’ అని హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన సమైక్య శంఖారావం సభలో జగన్ సూటిగా ప్రశ్నించడం అందరికీ గుర్తుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement