ఒకే ఒక్కడు సమైక్యయోధుడు
తొలి భాషాప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ విభజనను అడ్డుకునేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అలుపెరుగని పోరాటం చేశారు. తెలుగు నాది.. తెగువ నాది.. తలదించని పౌరుషం నాది.. అంటూ ముందుకు కదిలారు. ప్రజల గొంతుకై సమైక్యనాదాన్ని మోగించారు. రాష్ట్రపతి, ప్రధాని.. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల ముఖ్య నేతలను కలిసి సమైక్య పరిరక్షణకు సహకరించమని కోరారు. ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కానీ.. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు కుట్రలు.. బీజేపీ సహకారం వల్ల రాష్ర్టం ముక్కలైపోయింది. సమైక్యస్ఫూర్తితో ఉద్యమించిన జగన్ మాత్రం.. ప్రజల మనసుల్లో ఒకే ఒక్కడుగా నిలిచారు.
‘గత 60ఏళ్లుగా పెనవేసుకున్న ఈ అనుబంధాన్ని అర్థం చేసుకోవాలి. కోట్లాది మంది తెలుగు ప్రజలను కొన్ని తరాలపాటు అధోగతి పాలు చేసే ఈ రాష్ట్ర విభజన ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జై ఆంధ్రప్రదేశ్, జై తెలుగుతల్లి’ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి 2013, సెప్టెంబర్ 13న మంత్రుల బృందానికి రాసిన లేఖ
గరికిపాటి ఉమాకాంత్
ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) గత ఏడాది జూలై 30న తీసుకున్న నిర్ణయం దరిమిలా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అలుపెరుగని పోరాటం చేసింది ఒక్క వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డే. జైల్లో ఉన్నా.. జనంలో ఉన్నా సమైక్యమే లక్ష్యంగా ఉద్యమించారు. జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ సీపీ శ్రేణులు సీమాంధ్ర జిల్లాల్లో ఆరునెలల పాటు అవిశ్రాంత పోరాటం చేశాయి. ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, బంద్‌లు, సమ్మెలు, రిలే, నిరవధిక దీక్షలు... ఇలా వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగించాయి. మరో పక్క జగన్‌మోహన్‌రెడ్డి జైలు నుంచి విడుదలైన వెంటనే జాతీయస్థాయి నేతలను కలిసి రాష్ట్రం ముక్కలు కాకుండా ఉండేందుకు సహకరించాలని కోరారు. పార్లమెంటులో టీ బిల్లు ఆమోదం పొందే చివరిక్షణం వరకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అవిశ్రాంత పోరాటం చేశారు. ఇదే సందర్భంలో రెండుకళ్ల సిద్ధాంతంతో టీడీపీ అధినేత చంద్రబాబు, సమైక్య ముసుగులో అప్పటి సీఎం కిరణ్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా జనం జగన్ వెంటే ఉన్నారు. ఆయన ఉద్యమానికి బాసటగా నిలిచారు.
ఎక్కడున్నా సమైక్యమే శ్వాసిస్తూ..
విభజన నిర్ణయంతో సీమాంధ్రలో కోట్లాది ప్రజలు ఉద్యమిస్తుంటే.. అధికార, ప్రతిపక్షాలు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతూ ప్రజల ఆక్రందనలను పట్టించుకోకుండా వ్యవహరిస్తుంటే... అదిచూసి ఆవేదన చెందిన జగన్ ప్రజాఉద్యమానికి మద్దతుగా చంచల్‌గూడ జైల్లోనే దీక్ష చేపట్టారు. ఆరోగ్యం విషమించినా లెక్కచేయక నిరశన కొనసాగించారు. పరిస్థితి చేయి దాటుతుండటంతో జైలువర్గాలు ఆయన్ను బలవంతంగా నిమ్స్‌కు తరలించాయి. అక్కడ కూడా ఆయన నిరశన కొనసాగించారు. ఆరోగ్యం పూర్తిస్థాయిలో క్షీణించడంతో బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించి దీక్షను భగ్నం చేశారు. ఆ తర్వాత జైలు నుంచి విడుదలైన ఆయన లోటస్‌పాండ్ వద్ద తిరిగి నిరవధిక నిరాహారదీక్ష చేశారు.
జననేత దీక్షలకు నీరా‘జనం’
జైలులోనూ, ఆ తర్వాత లోటస్‌పాండ్ వద్ద నిరశన దీక్షలు చేపట్టిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సీమాంధ్ర ప్రజ నీరాజనం పలికింది. పార్టీలు, రాజకీయాలకతీతంగా అన్నివర్గాల ప్రజలు సంఘీభావం ప్రకటించారు. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో జగనన్నకు మద్దతుగా దీక్షా శిబిరాలు పోటెత్తాయి.
విజయమ్మ నిరశనతో దీక్షాంధ్ర
రాష్ట్ర విభజను నిరసిస్తూ గతేడాది ఆగస్టులో వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరులో ఆమరణ దీక్ష చేపట్టారు. ఆరోగ్యం క్షీణిస్తున్నా లెక్కచేయక సమైక్యమే లక్ష్యంగా ఆమె చేపట్టిన దీక్షకు చలించిన పార్టీ శ్రేణులు సంఘీభావంగా సీమాంధ్ర జిల్లాల్లో ఎక్కడికక్కడ దీక్షలకు దిగాయి. ఐదురోజుల తర్వాత ఆమెఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు దీక్షను భగ్నం చేశారు.
వివిధ రాష్ట్రాల సీఎంలు, జాతీయ నేతలతో భేటీ
దేశంలో ఇంతకుముందు ఏ రాష్ట్రాన్ని విభజించినా శాసనసభ అనుమతి పొందాకే ప్రక్రియ చేపట్టేవారని, కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఇందుకు విరుద్ధంగా చేస్తున్నారంటూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయస్థాయి నేతలను, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి వివరించారు. చెన్నై వెళ్లి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధి, ముంబై వెళ్లి ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, శివసేన అధ్య క్షుడు ఉద్దవ్ థాకరే, కోల్‌కతా వెళ్లి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, భువనేశ్వర్‌లో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, బీహార్ రాజధాని పాట్నాలో నితీశ్‌కుమార్, లక్నోలో ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్‌లతో భేటీ అయ్యారు. పంజాబ్ సీఎం బాదల్‌ను కూడా కలిసి కేంద్రం వ్యవహరిస్తున్న అప్రజాస్వామిక తీరును వివరించారు. ఇక ఢిల్లీలో మాజీ ప్రధాని దేవెగౌడ, వామపక్ష అగ్రనేతలు సీతారాం ఏచూరి, ప్రకాష్‌కారత్, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, జేడీయూ అధ్యక్షుడు శరద్‌యాదవ్‌లతో భేటీ అయ్యారు.
ఢిల్లీలోనూ మార్మోగిన సమైక్యం
ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలిసి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధర్నా చేపట్టారు. ధర్నా ప్రదేశం నుంచి పార్లమెంటు వరకు ర్యాలీకి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
కుప్పం నుంచి సమైక్య యాత్ర
రెండుకళ్ల సిద్ధాంతంతో ప్రజలను ఏమార్చిన చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నుంచే జగన్ ‘సమైక్య శంఖారావం’ యాత్ర మొదలుపెట్టారు. రాష్ట్రమంతా పర్యటించి సమైక్య స్ఫూర్తిని రగిలించడంతో పాటు ఉద్యమ ఆవశ్యకతపై ప్రజలను చైతన్యం చేశారు. విభజనలో టీడీపీ, కాంగ్రెస్‌ల కుమ్మక్కు కుట్రలను ప్రజలకు వివరిస్తూ సీమాంధ్ర జిల్లాల్లో పర్యటించారు.
రాజధానిలో సమైక్య శంఖారావం
హైదరాబాద్‌లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో సమైక్య శంఖారావం పేరిట భారీ బహిరంగసభ నిర్వహించారు. సీమాంధ్ర జిల్లాల నుంచే కాక తెలంగాణలోని మారుమూల ప్రాంతాల నుంచి కూడా సభకు లక్షలాది మంది సమైక్యవాదులు తరలివచ్చారు.
షర్మిల బస్సు యాత్ర
‘సమైక్యం’పై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు జగన్ సోదరి షర్మిల సీమాంధ్ర జిల్లాల్లో బస్సు యాత్ర చేపట్టారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి నాలుగో వర్ధంతి నాడు ఆయన సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనల అనంతరం తిరుపతికి వెళ్లి సమైక్యశంఖారావం సభలో పాల్గొన్నారు. అక్కడి నుంచి చిత్తూరు, మదనపల్లె సభల్లో పాల్గొని కాంగ్రెస్, టీడీపీల అవకాశవాద రాజకీయాలను ఎండగట్టారు. ఆ తర్వాత అనంతపురం, కర్నూలు, కోస్తా జిల్లాల్లోనూ షర్మిల బస్సుయాత్ర కొనసాగింది.
ఎమ్మెల్యేల రాజీనామాల బాట
రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా పార్టీ అధినేత వైఎస్ జగన్ సూచన మేరకు జూలై నెలాఖరులోనే 16మంది వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్‌లోనే రాజీనామా లేఖలు రాసి ఆయన కార్యాలయానికి ఫ్యాక్స్ పంపారు. ఎమ్మెల్యే పదవులను తృణప్రాయంగా వదిలి సమైక్య ఉద్యమంలోచురుగ్గా పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ శ్రేణుల ఉద్యమపథం
‘సమైక్య’ డిమాండ్‌తో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు అలుపెరుగని పోరాటం చేశారు. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు సమగ్ర కార్యాచరణతో సమైక్య పోరాటాన్ని ఉధృతం చేశారు. సీమాంధ్ర జిల్లాల్లో వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టారు. పార్టీ శ్రేణులకు తోడుగా సమైక్యవాదులు ఊరూ వాడా ర్యాలీలు, మానవహారాలు, రాస్తారోకోలు, ఆందోళనలు, జాతీయ రహదారుల దిగ్బంధనం చేపట్టడంతో సీమాంధ్ర ఓ దశలో అట్డుడికింది. ఇక జాతిపిత మహాత్మాగాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2 నుంచి సీమాంధ్ర జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లోనూ సత్యాగ్రహాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్య ఉద్యమప్రభంజనం సృష్టించింది. కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పార్టీ సమన్వయకర్తలు నిరాహార దీక్షలు చేపట్టారు.
రాష్ట్రపతి, ప్రధానిలకు లేఖలు.. వినతిపత్రాలు
విభజన తీరును గర్హిస్తూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ విజయమ్మలు పలుమార్లు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌లకు లేఖలు రాశారు. ఢిల్లీ వెళ్లి వినతిపత్రాలు సమర్పించారు. ఏకాభిప్రాయం లేకుండా ఎలా విభజిస్తారంటూ కేంద్రహోం మంత్రి షిండేకు వైఎస్ విజయమ్మ లేఖ రాశారు. అదే లేఖను ఆ తర్వాత ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు ఫ్యాక్స్ ద్వారా పంపారు. ఆ తర్వాత వైఎస్ జగన్, వైఎస్ విజయమ్మలు ఢిల్లీ వెళ్లి ప్రధాని, రాష్ట్రపతిలను స్వయంగా కలిసి వినతిపత్రాలు అందజేసి రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి హెదరాబాద్‌కు వచ్చినప్పుడు ఆయన్ని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. తాము విభజనకు వ్యతిరేకమంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా సమైక్యంపై తీర్మానం చేసేందుకు అసెంబ్లీని సమావేశపరచాలని రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను జగన్ సెప్టెంబర్ 30వ తేదీన కలిశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును పెట్టొద్దంటూ స్పీకర్ మీరాకుమార్‌కు లేఖ రాశారు.