ఎవరూ నోరెత్తొద్దు: సోనియాగాంధీ
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: తెలంగాణపై తాము తీసుకున్న నిర్ణయంపై వెల్లువెత్తుతున్న వ్యతిరేకత కాంగ్రెస్ అధిష్టానానికి గుబులు పుట్టిస్తోంది. ముఖ్యంగా విభజనను నిరసిస్తూ సీమాంధ్రలో ఉధృతంగా సాగుతున్న ఆందోళనతో పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, దానికి వీలైనంత త్వరగా అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. తనను కలిసేందుకు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఇటీవల ప్రయత్నించినా అందుకామె ససేమిరా అన్నట్టు తెలుస్తోంది.
ఏమున్నా పార్టీపరంగా వేసిన ఏకే ఆంటోనీ కమిటీకే చెప్పుకోవాలని కూడా మేడమ్ కుండబద్దలు కొట్టినట్టు సమాచారం. విభజన నిర్ణయాన్ని రాష్ట్ర నేతలందరికీ ముందే చెప్పినా, ఇప్పుడు సీమాంధ్ర నేతలు భిన్న వైఖరి తీసుకున్నారంటూ ఆమె ఆగ్రహిస్తున్నారని ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో పార్టీ వైఖరిని వారికి మరోసారి ‘స్పష్టం’ చేయాల్సిందిగా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌కు ఇప్పటికే అధిష్టానం సూచించిందంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయానికి వ్యతిరేకంగా ఉమ్మడిగా ఎలాంటి స్వరమూ విన్పించడం లేదని ఏఐసీసీ వర్గాలంటున్నాయి. ‘‘సీమాంధ్ర నేతలంతా విభజన నిర్ణయాన్ని వాయిదా వేయాలంటున్నారే తప్ప వెనక్కు తీసుకోవాలని కోరడం లేదు. బహుశా వారి ప్రాంతంలో ప్రజాగ్రహం కారణంగా, ప్రజల భావోద్వేగాలను తృప్తి పరిచే ఉద్దేశంతో నేతలు ఇలా వ్యవహరిస్తూ ఉండవచ్చు. కానీ ఆ క్రమంలో అధిష్టానాన్ని ఇబ్బంది పెట్టడాన్ని మాత్రం సహించేది లేదు’’ అని అవి స్పష్టం చేశాయి. విభజనపై సీమాంధ్ర నేతలెవరూ బహిరంగ ప్రకటనలు చేయరాదని దిగ్విజయ్‌సింగ్ సూచించారు. ఎలాంటి అభ్యంతరాలున్నా ఏకే ఆంటోనీ కమిటీకి చెప్పుకోవాలన్నారు.
తెలంగాణపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీదే అంతిమ నిర్ణయమని, దానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడరాదని సోమవారం కొన్ని చానళ్లతో మాట్లాడుతూ ఆయన కుండబద్దలు కొట్టారు. రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లో విడిపోయే ప్రసక్తే లేదని సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ ఎంపీ ఒకరు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా పై విధంగా స్పందించారు. ‘విభజనపై సీడబ్ల్యుసీ నిర్ణయం ప్రకటించినందున ఎవరేం మాట్లాడినా అసంబద్ధమే. నేతలంతా సీడబ్ల్యుసీ నిర్ణయానికి కట్టుబడాలి’ అన్నారు. తెలంగాణ ఏర్పాటును కేంద్ర హోం శాఖ చూసుకుంటుందని, విభజనతో వచ్చే సమస్యలను ఎలా పరిష్కారించాలో మాత్రమే ఆంటోనీ కమిటీ సూచిస్తుందని వెల్లడించారు.