రాజీనామాపై సీఎం ఊగిసలాట
హైదరాబాద్: రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టిన దరిమిలా సీఎం కిరణ్ కుమార్ తన రాజకీయ మార్గాన్ని అన్వేషించుకునే పనిలో పడ్డారు. ఈ రోజు సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశమైన కిరణ్ పలు విషయాలను చర్చించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సమైక్యవాదిగా నిరూపించుకోవాలని ఉబలాటపడుతున్నా, నేతల నుంచి పూర్తి స్థాయి హామీ లభించకపోవడంతో కొంత డోలాయమానంలో కొట్టుమిట్టాడుతున్నారు.
కొత్త పార్టీ అంశంపై ఎమ్మెల్యేల నుంచి మిశ్రమ స్పందనలే లభించడంతో రాజీనామా చేసేందుకు వెనుకడుగువేస్తున్నారు. తాను చేపట్టబోయే భవిష్య కార్యాచరణపై ఒక్కొక్కరి నుంచి అభిప్రాయాలు తీసుకున్నా.. ఆ సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తం కాలేదు. రాజీనామాను ఎప్పుడో చేయాల్సిందని కొంతమంది నేతలు చెప్పగా, ఇప్పుడు చేసినా ఏమీ లాభం ఉండదని మరికొందరు సీఎంకు తెలిపారు. కాగా, రాజకీయ నాయకుడిగా మిగలాలంటే..రాజీనామానే సరైన మార్గమని సీఎం భావిస్తున్నట్లు సమాచారం.