సీఎంకు సీమాంధ్ర నేతల ఝలక్!
హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన దరిమిలా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏం చేయనున్నారు? బిల్లు భవితవ్యం సోమ, మంగళవారాల్లో తేలిపోయేలా కన్పిస్తుండటంతో వారంతా భావి కార్యాచరణపై దృష్టి సారించారు. రెండు రోజులుగా తనను కలుస్తున్న వారికి కిరణ్ ఇదే మాట చెబుతున్నారు. ‘ఇంకా పదవిలో ఉండాలని నాకు లేదు. రాజీనామా చేయాలనే ఉంది. కానీ అందరం కలిసే నిర్ణయం తీసుకుందాం. సమష్టిగా ముందుకు వెళ్దాం’ అంటున్నారు.
ఇప్పటికే పలువురు సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కిరణ్ దఫదఫాలుగా మంతనాలు జరిపారు. ఆదివారం కూడా సీఎం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో సీమాంధ్ర నేతలు గైర్హజరయ్యారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి 25 మంది ఎమ్మెల్యేలు, 6గురు మంత్రులు మాత్రమే హాజరైయ్యారు. సీమాంధ్ర ప్రాంత్రంలో కాంగ్రెస్ పక్షాన ఉన్న 83 మందిలో 52 మంది సమావేశానికి హాజరు కాకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ రోజు జరిగిన సమావేశంలో పాల్గొనని నేతలంతా కిరణ్ కు దూరంగా ఉండేందుకు సిద్ధమవుతున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి.